Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పారిశ్రామిక శిక్షణ ప్రాముఖ్యమెంతో!

పారిశ్రామిక శిక్షణ వల్ల సీఏ విద్యార్థులకు వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని వారు తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి. ఈ శిక్షణ పొందినవారికి ఉద్యోగ నియామకాల్లో కూడా ప్రాధాన్యం లభిస్తుంది!
సీఏ, ఐపీసీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఒక ప్రాక్టీసింగ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర ఆర్టికల్‌షిప్‌కు పేరు నమోదు చేసుకుని 3 సంవత్సరాలపాటు ఆర్టికల్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఈ మూడేళ్ళ ఆర్టికల్‌షిప్‌ సమయంలో ఒకవేళ కావాలనుకుంటే విద్యార్థి చివరి 12 నెలలు అంటే మూడో సంవత్సరం ఆర్టికల్‌షిప్‌కు బదులుగా వేరే పరిశ్రమలో పారిశ్రామిక శిక్షణ (ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌) తీసుకోవచ్చు.
నేటి పారిశ్రామిక అవసరాలకు సరిపడే నైపుణ్యాలు కలిగిన సీఏలను తయారుచేయాలన్న ఉద్దేశంతో సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు పారిశ్రామిక శిక్షణ విధానం ప్రవేశపెట్టారు. ఈ శిక్షణ వల్ల విద్యార్థి తన కెరియర్‌కు అవసరమైన కొత్త నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు, ప్రావీణ్యాన్ని పెంపొందించుకుంటారు. దీంతోపాటు భవిష్యత్తులో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు.

శిక్షణ ఎక్కడ?
సీఏ- ఐపీసీసీ పూర్తిచేసిన విద్యార్థి ఆర్టికల్‌షిప్‌ మరో సంవత్సరంలో ముగుస్తుందనగా ఈ పారిశ్రామిక శిక్షణ తీసుకోవచ్చు. కనీసం కోటి రూపాయలకు పైబడిన స్థిరాస్తులు కలిగిన వాణిజ్య, వ్యాపార పరిశ్రమల్లోగానీ, పది కోట్ల రూపాయలకు పైబడిన టర్నోవర్‌ కలిగిన సంస్థల్లోగానీ, 50 లక్షల రూపాయలకు పైగా చెల్లింపు మూలధన వాటాలు కలిగిన సంస్థల్లోగానీ, కౌన్సిల్‌ వారి ఆమోదం పొందిన సంస్థల్లో గానీ పారిశ్రామిక శిక్షణ పొందవచ్చు.
కాలపరిమితి: పారిశ్రామిక శిక్షణను 9 నెలలకు తగ్గకుండా 12 నెలలకు మించకుకండా (సెలవులను కలుపుకుని) తీసుకోవాల్సి ఉంటుంది.

శిక్షణనిచ్చే వారి అర్హత:
* సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి ఆమోదం పొందిన సంస్థల్లో పనిచేసే చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ మాత్రమే సీఏ విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణను ఇవ్వడానికి అర్హులు.
* సీఏ ఇన్‌స్టిట్యూట్‌ పరిధిలో కనీసం 3 సంవత్సరాలపాటు అసోసియేట్‌ మెంబర్‌ (ఏసీఏ)గా ఉన్న చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఒక విద్యార్థికి పారిశ్రామిక శిక్షణను అందించవచ్చు.
* ఫెలోషిప్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (ఎఫ్‌సీఏ) అయితే ఇద్దరు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణను అందించవచ్చు.

నియమ నిబంధనలు
* విద్యార్థి పారిశ్రామిక శిక్షణ తీసుకోవాలనుకుంటున్న రోజుకు మూడు నెలల ముందే తను ఆర్టికల్‌షిప్‌ చేస్తున్న ప్రధాన ఆడిటర్‌ (ప్రిన్సిపల్‌ ఆడిటర్‌)కు తన పారిశ్రామిక శిక్షణ గురించి చెప్పి అనుమతి పొందాలి.
* ప్రస్తుత ప్రధాన ఆడిటర్‌ వద్ద నుంచి శిక్షణ మార్గదర్శి (ట్రెయినీ గైడ్‌)లో సూచించిన శిక్షణ నివేదికతోపాటు ఫారం నెం. 109 గానీ, ఫారం నెం. 114 (ఏది వీలైతే అది) పొందాలి/ తీసుకోవాలి.
* అప్రెంటిస్‌షిప్‌ డీడ్‌ను ఫారం నెం.104 ప్రకారం- నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌మీద గానీ, ప్రాంతీయ స్టాంప్‌ ధరలను అనుసరించి తయారు చేసిన, ప్రత్యేకంగా అంటించిన స్టాంపు పేపర్‌ మీదగానీ తయారుచేసి దానికి నకలును జతచేయాలి. శిక్షణ అందించే సంస్థ ద్వారా శిక్షణ ప్రారంభమయ్యే 30 రోజుల ముందుగా సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారికి పంపాలి.

చదువు, సంపాదన ఒకేసారి:
‘చదువుతూనే సంపాదన’ అనే విధానం సీఏ పారిశ్రామిక శిక్షణ చేసేటపుడు, పారిశ్రామిక శిక్షణలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చదువుతోపాటే విద్యార్థికి సంపాదన కూడా ఉంటుంది. పారిశ్రామిక శిక్షణకి చేరిన సంస్థవారు ఐసీఏఐ నిబంధనల ప్రకారం స్టైపెండ్‌ కూడా ఇస్తారు. ఈ స్టైపెండ్‌ను ఉపయోగించుకుని తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చదువుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాదు, డబ్బు విలువ కూడా చదువుకునే సమయంలోనే తెలుస్తుంది. ఈ విధానంలో ఉన్న గొప్ప విషయమదే.

శిక్షణ- ఉద్యోగావకాశాలు
* సంస్థలు ఉద్యోగ నియమాలు జరిపేటపుడు తమ సంస్థలో పారిశ్రామిక శిక్షణ తీసుకుంటున్నవారికే ప్రథమ ప్రాధాన్యమిస్తాయి. అలాగే సీఏ చదువుతున్నవారికి కూడా వారు ఎక్కడ శిక్షణ తీసుకుంటున్నారో అక్కడే ఉద్యోగపరంగా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
* ఒకసారి ఒక సీఏ విద్యార్థి ఒక సంస్థలో పారిశ్రామిక శిక్షణ తీసుకుంటే సహజంగా అదే సంస్థ అతను సీఏ అర్హత పొందాక మంచి వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటుంది. శిక్షణ తీసుకున్న విద్యార్థికి ఇతర సంస్థల నుంచి కూడా ఉద్యోగావకాశాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది.
* సీఏ పూర్తయ్యాక సొంతంగా ఒక సంస్థను నెలకొల్పి వ్యాపార రంగంలోకి/ పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుంది.


Back..

Posted on 10-10-2016