Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మౌఖికంలో మెలకువలు

సీఏ ఫైనల్‌ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైనవారికి వివిధ కెరియర్‌ ఆప్షన్లు ఉన్నాయి. వీరు కార్పొరేట్‌ ప్రపంచంలో అడుగుపెట్టాలంటే మౌఖికపరీక్షల్లో విజయం సాధించాల్సి వుంటుంది. నూతన సీఏలకు ఈ సందర్భంగా ఉపకరించే మెలకువలు ఇవిగో...!

సీఏ పూర్తిచేసినవారు కార్పొరేట్‌ ఉద్యోగంలో చేరటంగానీ, ప్రైవేటు ప్రాక్టీసు చేయటం గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు ప్రాక్టీసుపై ఆసక్తి ఉన్నవారు ఐసీఏఐ నుంచి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ (సీఓపీ) తీసుకోవాలి. ఆపై దేశంలోని ఏ పట్టణం/నగరంలోనైనా, విదేశాల్లోనైనా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. ఈ సీఏలు తమ క్లయింట్లకు అకౌంటింగ్‌, ఆడిట్‌, టాక్సేషన్‌ వంటి అంశాల్లో సేవలు అందిస్తారు.
కొత్తగా పాసైన సీఏల్లో 90 శాతం మంది కార్పొరేట్‌ ఉద్యోగాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. ఉత్పత్తి, సేవల రంగం, బ్యాంకింగ్‌, బీమా, స్టాక్‌మార్కెట్లు, ఫైనాన్షియల్‌, ఐటీ, కేపీవో మొదలైనవాటిలో వీరు ప్రవేశిస్తున్నారు.

సీఏ ఉత్తీర్ణత పొందినవారు కార్పొరేట్‌ కంపెనీల వెబ్‌సైట్లూ, జాబ్‌పోర్టల్స్‌ గమనించి మౌఖికపరీక్షలకు హాజరు కావొచ్చు. ఐసీఏఐ వారు క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు ఆగస్టు- సెప్టెంబరు నెలల్లో దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహిస్తారు. వీటికి హాజరై ప్రతిభ నిరూపించుకుని ఉద్యోగం సంపాదించవచ్చు.

* దరఖాస్తు చేసుకున్నపుడు రెజ్యూమేను జాగ్రత్తగా తయారుచేసుకోవాలి. దీనిలో కెరియర్‌ ఆబ్జెక్టివ్‌తో పాటు తమ బలాల గురించి ప్రస్తావించాలి.

* ప్రాక్టికల్‌ శిక్షణలో నేర్చుకున్న విషయాలతో పాటు విద్యాపరమైన విజయాలను రెజ్యూమేలో ప్రస్తావించాలి.

* బృంద చర్చలో చలాకీగా పాల్గొనాలి.

* ఈ చర్చల్లో సభ్యులను కలుపుకుంటూ చెప్పదల్చుకున్న విషయాలను స్పష్టంగా చెప్పగలగాలి. భావవ్యక్తీకరణ, భాషపై పట్టు పెంచుకుంటే సులువుగా విషయాలను చెప్పవచ్చు. నాయకత్వ లక్షణాలు, చొరవ, నిర్వహణ నైపుణ్యం ఉన్నవారికి మార్కులు ఎక్కువ వస్తాయి.

* దీనితర్వాత జరిగే మౌఖిక పరీక్షలో అభ్యర్థి నైపుణ్యాలనూ, తాజా అంశాల పరిజ్ఞానాన్నీ గమనిస్తారు.

* రెజ్యూమేలోని ప్రతి అంశంపై స్పష్టంగా చెప్పగలగాలి.

* 3 ఏళ్ళ ప్రాక్టికల్‌ శిక్షణలో నేర్చుకున్న విషయాల గురించి అడగవచ్చు.

* ఇంటర్వ్యూను నిర్వహించే కంపెనీ వెబ్‌సైట్‌ను ఒక్కసారి పరిశీలిస్తే... కంపెనీ తీరు, సాధించిన విజయాలను గ్రహించవచ్చు. ఫలితంగా ఇంటర్వ్యూలో సంబంధిత ప్రశ్నలకు ధీమాగా జవాబులు చెప్పే అవకాశముంటుంది.

సీఏ విద్యార్థిగా మొదలైన పయనం సీఏ పూర్తికాగానే వృత్తినిపుణుడిగా పరిణమించేలా చేస్తుంది. నిబద్ధత, అంకితభావాలతో కృషి చేస్తే కెరియర్‌లో ఉన్నతస్థానానికి చేరుకునే వీలుంటుంది.


Back..

Posted on 15-08-2016