Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఏ పరీక్షలకు.. పక్కా వ్యూహం

సీఏ కోర్సుకు సంబంధించి కీలక పరీక్షల తరుణం దగ్గరపడుతోంది. నవంబరు నెలలో సీఏ-ఐపీసీసీ, సీఏ ఫైనల్‌ పరీక్షలు జరగబోతున్నాయి. వాటికి విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలి, సబ్జెక్టుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పునశ్చరణ విధానం, పాటించాల్సిన మెలకువలు తెలుసుకుందామా?

సీఏ కోర్సులోని అన్ని దశల్లోనూ ఐపీసీసీ కీలకమని చెప్పాలి. ఐపీసీసీ వరకూ పూర్తిచేసినా (లేదా) దానిలోని మొదటి గ్రూపు పూర్తిచేసినా మంచి ఉద్యోగాలు లభించే అవకాశముంది. సీఏ ఫైనల్‌ గురించి చెప్పాలంటే.. ఐపీసీసీ పూర్తిచేశాక ఆర్టికల్‌షిప్‌ సమయంలో సమయాన్ని సరిగా వినియోగించుకుని ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్న అంశాలను ఆకళింపు చేసుకోగలిగితే సీఏ ఫైనల్‌లో సగం విజయం సాధించినట్లే.

ఐపీసీసీ సబ్జెక్టులు- జాగ్రత్తలు
అకౌంటింగ్‌
* అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ తప్పనిసరిగా చదవాలి.
* ప్రతి చాప్టర్‌లో ఒక ప్రాథమిక సమస్యను ఎంచుకుని సాధన చేయాలి. మిగతా సమస్యల్లోని ప్రముఖ అంశాలను (కీ అడ్జస్ట్‌మెంట్లు) హైలైట్‌ చేసుకోవాలి. ఇది పునశ్చరణకు బాగా ఉపయోగం.
* ప్రతి అంశాన్ని చదువుతున్నప్పుడు కాన్సెప్టుకే ప్రాధాన్యమివ్వాలి.
* వీలైనంతవరకూ ప్రతిరోజూ ఒక అకౌంటింగ్‌ స్టాండర్డ్‌ను చదవాలి, నేర్చుకోవాలి.
* చిన్న చిన్న అధ్యాయాల మీద (సెల్ఫ్‌ బాలెన్సింగ్‌ లెడ్జర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్స్‌ మొదలైనవి) ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.
* సమయం ఉంటే అమాల్గమేషన్‌ చాప్టర్‌కి కూడా ప్రాధాన్యమివ్వాలి.
* పరీక్ష రాసే సమయంలో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడానికి సమయం సరిపోకపోవచ్చు. కాబట్టి వీలైనంత వేగంగా పరీక్ష రాస్తే మంచిది.

బిజినెస్‌ లాస్‌, ఎథిక్స్‌, కమ్యూనికేషన్‌
* ముందుగా కమ్యూనికేషన్‌, ఎథిక్స్‌ కాన్సెప్టులను పూర్తిచేయాలి.
* కంపెనీ లాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండే అంశాలైన షేర్‌ కాపిటల్‌, జనరల్‌ మీటింగ్‌, ప్రాస్పెక్టస్‌ వంటివి బాగా చదవాలి.
* పరీక్ష రాసేటప్పుడు సరిగా తెలిస్తే సెక్షన్‌ నంబర్లను మిళితం చేసి రాయాలి.
* కమ్యూనికేషన్‌, ఎథిక్స్‌లకు సంబంధించి పాత ప్రశ్నపత్రాల్లో తరచూ ఇస్తున్న ప్రశ్నలను చదవాలి.
* కంపెనీ లాలో కూడా చిన్న చిన్న అధ్యాయాలను బాగా చదవాలి.
* ఇతర లా (పీఎఫ్‌, గ్రాట్యుటీ, బోనస్‌ యాక్ట్‌) ప్రొసీజర్‌పై శ్రద్ధవహించాలి.
* ఎన్‌ఐ యాక్ట్‌కు సమయం లేకపోతే ఫీచర్స్‌, డాక్యుమెంట్స్‌ గురించి చదివితే చాలు.

కాస్ట్‌ అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌లోని థియరీని చదవాలి.
* సమస్యలను బాగా సాధన చేయాలి.
* ఈ సబ్జెక్టుల్లో సమయపాలన ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి సమయాన్ని సరిగా వినియోగించుకోవాలి.
* ఫార్ములాలను గుర్తుపెట్టుకోవాలి.
* ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో కాపిటల్‌ బడ్జెటింగ్‌, వర్కింగ్‌ కాపిటల్‌ మేనేజ్‌మెంట్‌, రేషియో అనాలిసిస్‌లకూ, కాస్ట్‌ అకౌంటింగ్‌లో మార్జినల్‌ కాస్టింగ్‌, స్టాండర్డ్‌ కాస్టింగ్‌, ప్రాసెస్‌ కాస్టింగ్‌లకూ ప్రాధాన్యమివ్వాలి.
* పరీక్ష రాసేటప్పుడు థియరీని సరళమైన భాషలో రాయాలి. ప్రాబ్లమ్స్‌ చేసేటప్పుడు ప్రొసీజర్‌ను అర్థవంతంగా రాస్తూ, వర్కింగ్‌ నోట్స్‌ను తప్పనిసరిగా రాయాలి.

ఐపీసీసీకి సన్నద్ధమవండిలా!
* సీఏలో ఇది ముఖ్య దశ కాబట్టి ప్రణాళికాబద్ధంగా చదివితే ఈ కోర్సును మొదటి ప్రయత్నంలోనే సులువుగా పూర్తిచేయవచ్చు.
* శిక్షణలో వివరించే ఉదాహరణలు, చార్టులను తప్పక రాసుకోవాలి.
* పునశ్చరణ సమయంలో రన్నింగ్‌ నోట్స్‌, ప్రాక్టికల్‌ మాన్యువల్‌లను తప్పక చూసుకోవాలి.
* అన్ని సబ్జెక్టులకూ సంబంధించిన పుస్తకాలను ముందుగానే సమకూర్చుకోవాలి (ఉదా: ప్రాక్టీస్‌ మాన్యువల్స్‌, పాత ప్రశ్నపత్రాలు, రివిజన్‌ టెస్ట్‌ పేపర్లు, ఎంటీపీఎస్‌ మొదలైనవి).
* రోజుకు కనీసంగా రెండు సబ్జెక్టులను చదివేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వీలైనంతవరకూ ఆ రెండు సబ్జెక్టుల్లో ఒక థియరీ, మరోటి ప్రాక్టికల్‌ పేపర్‌ ఉండేలా చూసుకుంటే మేలు.
* కీలక పదాలను రాసుకోవడం, మెటీరియల్‌లో అండర్‌లైన్‌ గీసుకోవడం వంటివి చేసుకుంటే పునశ్చరణ సులువవుతుంది.
* మొదటి నుంచీ చదువుతున్న మెటీరియల్‌నే చివరి వరకూ కొనసాగించాలి. ఏడు సబ్జెక్టుల్లో ఏవైనా నాలుగింటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే వాటిల్లో మంచి మార్కులను పొందవచ్చు.

సీఏ ఫైనల్‌- మెలకువలు
ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌
* ఏదైనా ఒక ఆథర్‌ పుస్తకం, ప్రాక్టీస్‌ మాన్యువల్‌లను సమకూర్చుకోవాలి.
* ప్రతి చాప్టర్‌లో ఏదో ఒక ప్రాథమిక సమస్య పరిష్కార విధానాన్ని తెలుసుకుని, మిగతా వాటిల్లోని ముఖ్యమైన అంశాలు (అడ్జస్ట్‌మెంట్స్‌) వరకు సాధన చేస్తే సరిపోతుంది.
* ప్రతి చాప్టర్‌లో కాన్సెప్టులమీద అవగాహన ఏర్పరచుకోవాలి. ఉదా: వాల్యుయేషన్‌ ఆఫ్‌ గుడ్‌విల్‌
* అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ మీద మంచి అవగాహన అవసరం. చిన్నచిన్న అధ్యాయాలనూ చదవాలి. ఉదా: వాల్యూ యాడెడ్‌ స్టేట్‌మెంట్స్‌, ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ మొ॥.
* సమయం అందుబాటులో ఉంటే కన్సాలిడేషన్‌ను కూడా చదవాలి లేదా తక్కువ ప్రాముఖ్యమిచ్చినా సరిపోతుంది.

స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌
* డెరివేటివ్స్‌లో చాలా అంశాలున్నాయి. కాబట్టి వీలైనంతవరకూ దీనికి తుది ప్రాధాన్యమివ్వాలి.
* డివిడెండ్‌ పాలసీ, మెర్జర్స్‌ అండ్‌ అక్విజిషన్‌, బాండ్‌ వాల్యుయేషన్‌ వంటి చిన్న చిన్న అంశాలతో సన్నద్ధత ప్రారంభిస్తే మేలు.
* పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ అనే అంశం కేవలం ఫార్ములాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేయవచ్చు.
* ఆ తరువాత ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌, చివరగా డెరివేటివ్స్‌ను ఎంచుకోవాలి. థియరీకి మాత్రం ప్రాక్టీస్‌ మాన్యువల్‌ సరిపోతుంది.

అడ్వాన్స్‌డ్‌ ఆడిటింగ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌ తప్పనిసరి. ముందుగా ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ను పూర్తిచేయాలి.
* రోజుకో ఆడిటింగ్‌ స్టాండర్డ్స్‌ చొప్పున చదవాలి. వీలైతే ఫ్లో చార్టులు వేసుకోవాలి.
* పరీక్షలో ప్రాక్టికల్‌ ప్రశ్నలనే ఎక్కువగా అడుగుతారు. కాబట్టి వాటిపైనే దృష్టి కేంద్రీకరించాలి.

సీఏ ఫైనల్‌ సన్నద్ధత ఇలా!
* సమస్యలను సాధన చేస్తున్నప్పుడే అనవసరమనుకున్న లెక్కలను తీసేస్తూ వెళ్లడం వల్ల పునశ్చరణ సులువవుతుంది.
* ఫార్ములాలను ఒకచోట రాసి ఉంచుకోవాలి. వీలునుబట్టి ఫ్లో చార్టులను వేసుకోవడమూ మంచిదే.
* గత 5 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే మంచిది.
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌లోకి సమస్యలన్నింటినీ అభ్యాసం చేయాలి. ఇటీవల చేసిన సవరణలను తప్పనిసరిగా చదవాలి.
* ఉన్న ఎనిమిదింటిలో నాలుగు సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే వాటిల్లో ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది.
* ప్రాక్టీస్‌ మాన్యువల్‌లోని ప్రశ్నలకు జవాబులను ఎలా సూచించారో నిశితంగా పరిశీలించాలి.
* మొదటి నుంచీ చదువుతున్న మెటీరియల్‌ను చివరివరకూ కొనసాగించాలి.

ఏమి రాశారన్నదే ముఖ్యం!
సీఏ పరీక్షల్లో అఖిల భారత ర్యాంకులు సాధించినవారు చెపుతున్న సూచనలు ఇవిగో...
* సీఏ కోర్సులో సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచనావిధానం చాలా అవసరం. అలా ఆలోచిస్తేనే పరీక్షల్లో అడిగిన ఎటువంటి ప్రశ్నకైనా సరైన సమాధానం రాసే వీలుంటుంది. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో చదవాలి తప్ప, బట్టీపట్టి చదవకూడదు. పరీక్షలో ప్రశ్నలు ఒకటికి రెండుసార్లు చదివి సమాధానాలను డొంకతిరుగుడు లేకుండా సూటిగా రాయాలి.
* ఎంత రాశారన్న దానికంటే ఏం రాశారు, సమాధాన విధానం ఎలా ఉందన్నదానికే ప్రాధాన్యం!
* చదివేటప్పుడు విశ్లేషణాత్మక, సమయస్ఫూర్తి అనేవి చాలా అవసరం. ఇలాంటి గుణాలను అలవర్చుకుంటే పరీక్షల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చు.
* రోజుకు ఎంతసేపు చదివామని కాదు, అందులో నాణ్యత సమయం ఎంతన్నదే లెక్క. తెల్లవారుజామున చదవడం బాగా ఉపయోగపడుతుంది.
* ప్రతి సబ్జెక్టులో కనీస మార్కులతోపాటు మొత్తంగా చూసినపుడు అగ్రిగేట్‌ పొంది ఉండాలి. అప్పుడే పాస్‌ అయినట్లు. అందువల్ల కనీసం ఒకటి రెండు సబ్జెక్టుల్లో అయినా ప్రదర్శన బాగుండేలా చూసుకోవాలి. అప్పుడే విజయం సులువవుతుంది.
* తేలికగా భావించే సబ్జెక్టుల్లో మంచి మార్కులను సాధించే ప్రయత్నం చేయాలి. అప్పుడు కష్టంగా ఉన్నవాటిల్లో కనీస మార్కులు తెచ్చుకున్నా అగ్రిగేట్‌ దెబ్బతినదు. అంతిమంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
* సీఏ లాంటి వృత్తివిద్యాకోర్సులో ప్రశ్నల కఠినతా శాతం ఎక్కువ. కాబట్టి చదివిన అంశాలనే కనీసం మూడుసార్లు పునశ్చరణ చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
* ఈ కోర్సు పూర్తిచేసినవారికి భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా తప్పనిసరి. కాబట్టి కోర్సు చదువుతున్న సమయంలో సెమినార్లు, వక్తృత్వ పోటీలు వంటి వాటిల్లో పాల్గొనగలిగితే ఈ నైపుణ్యాలు పెంచుకోవచ్చు.
* ఆర్టికల్‌షిప్‌లో లభించే ప్రాక్టికల్‌ విజ్ఞానం సీఏ ఫైనల్‌ కోర్సుకూ, కోర్సు పూర్తయ్యాక చేయబోయే ప్రాక్టీసు, ఉద్యోగాలకూ చాలా అవసరం. కాబట్టి ఆర్టికల్‌షిప్‌ను శ్రద్ధగా, ఆసక్తిగా చేయాలి.
* లా పేపర్‌కు బేర్‌ యాక్ట్‌ చదివితే లాలోని ప్రొవిజన్స్‌ను బాగా అర్థం చేసుకోవచ్చు.
* ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, కాస్టింగ్‌ వంటి పేపర్లకు సన్నద్ధమయ్యేప్పుడు చదవడంకన్నా పెన్‌, పేపర్‌ విధానంలో సాధన తప్పనిసరి.

Posted on 25-9-2017

Back..