Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఏ... సీఎంఏలకు రూట్‌ మ్యాప్‌

* ఏడాదికి రెండు సార్లు పరీక్షలు
* ఐదు నెలల ముందే నమోదు

ఆధునిక కార్పొరేట్‌ ప్రపంచంలో కామర్స్‌ ప్రొఫెషనల్స్‌కు ఎంతో గిరాకీ! భారతీయ సీఏ, సీఎంఏలకు విదేశాల్లోనూ పేరుంది. సీఏ తర్వాతి ప్రాధాన్యంగా అందరూ భావించే సీఎంఏకు జీఎస్‌టీ నేపథ్యంలో ప్రాముఖ్యం పెరిగింది. పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ విశ్లేషణ నైపుణ్యాలు చూపించేవారు వీటిలో బాగా రాణిస్తారు. ఈ కామర్స్‌ వృత్తులపై ఆసక్తి ఉన్నవారు సంబంధిత కోర్సులైన సీఏ, సీఎంఏలకు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే తరుణం దగ్గరవుతోంది. దీనికెలా ముందడుగు వేయాలో చూద్దాం!

కామర్స్‌ కోర్సులు చదివితే ఉద్యోగమైనా చేయొచ్చు; సొంతంగా ప్రాక్టీస్‌ లేదా వ్యాపారం కూడా మొదలుపెట్టవచ్చు. కామర్స్‌ ప్రొఫెషనల్స్‌కి గిరాకీ ఉన్న ఈ తరుణంలో చాలామంది సహజంగానే సీఏ, సీఎంఏ కోర్సుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.

సీఏ, సీఎంఏ కోర్సులు చాలా కష్టమనీ, అందుకే ఎక్కువమంది చదవలేకపోతున్నారనీ అపోహలు చాలామందిలో కనిపిస్తుంటాయి. ఒక నిర్దిష్ట ప్రణాళిక, లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే ఎలాంటివారైనా ఈ కోర్సులు చదవొచ్చు.

సీఏ కోర్సులో అర్హత మార్కులు సాధిస్తే సరిపోతుంది. సీఏ కోర్సును ఐసీఏఐ (ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) నిర్వహిస్తుంది. దీనిలో సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్‌ అనే 3 దశలు ఉంటాయి.

సీఏ ఫౌండేషన్‌
సీఏ కోర్సుకి ఫౌండేషన్‌ను ప్రవేశపరీక్షగా చెప్పొచ్చు. దీన్ని పూర్తిచేసినవారే సీఏ కోర్సు చదవడానికి అర్హులు. ఈ పరీక్షలో 50% డిస్క్రిప్టివ్‌గా 50% మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. పరీక్షను ఏటా రెండుసార్లు- మే, నవంబరు నెలల్లో నిర్వహిస్తారు.

ఇంటర్మీడియట్‌/ 10+2/ తత్సమాన పరీక్ష రాసినవారు ఎవరైనా సీఏ ఫౌండేషన్‌ కోర్సుకి ఐసీఏఐ వారి వద్ద నమోదు చేయించుకోవచ్చు. ఆపై 4 నెలలకు సీఏ ఫౌండేషన్‌ కోర్సు రాయవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.9200 (ప్రాస్పెక్టస్‌తో కలిపి).

సీఏ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ (నమోదు) గడువు
* మే పరీక్ష రాసేవారికి: అంతకుముందు ఏడాది డిసెంబరు 31
* నవంబరు పరీక్ష రాసేవారికి: జూన్‌ 30

సీఏ ఫౌండేషన్‌ పరీక్ష 4 పేపర్లుగా, ఒక్కో పేపర్‌ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులతో ఉంటుంది. దీనిని నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. పేపర్‌-1, 2లకు డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో జరుగుతాయి. పేపర్‌-3, 4లు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటాయి. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు విద్యార్థుల విశ్లేషణాత్మక శక్తి పెరుగుదలకూ, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెరగడానికీ తోడ్పడతాయి. ఐసీఏఐ వారి పరీక్ష ఫీజు రూ.1500.

* సాధారణంగా మేలో పరీక్ష రాయాలనుకునేవారు ఫిబ్రవరి నెలాఖరులోగా, నవంబరులో రాయాలనుకునేవారు ఆగస్టు చివరిలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.

సీఏ ఇంటర్‌
సీఏ ఫౌండేషన్‌ పూర్తిచేసినవారు దీనికి అర్హులు. సీఏ ఇంటర్‌ను ఏడాదికి రెండుసార్లు - మే, నవంబర్‌లలో నిర్వహిస్తారు. డిగ్రీ పూర్తిచేసినవారు (కామర్స్‌ గ్రాడ్యుయేట్స్‌/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు అయితే 55% మార్కులు, ఇతర గ్రాడ్యుయేట్లు/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు అయితే 60% మార్కులు సాధించి ఉండాలి) కూడా సీఏ ఫౌండేషన్‌తో సంబంధం లేకుండా సీఏ ఇంటర్మీడియట్‌కు నేరుగా నమోదు చేసుకోవచ్చు. ఐసీఏఐ వారికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 18,000.

సీఏ ఇంటర్‌ రిజిస్ట్రేషన్‌ గడువు
* మే పరీక్ష రాసేవారికి: అంతకుముందు ఏడాది సెప్టెంబరు 31
* నవంబరు పరీక్ష రాసేవారికి: మార్చి 1

సీఏ ఇంటర్మీడియట్‌ 8 పేపర్లతో రెండు గ్రూపులుగా (గ్రూపుకి 4 పేపర్లు) ఒక్కో పేపర్‌ను 100 మార్కులకు నిర్వహిస్తారు. సీఏ ఇంటర్‌ పూర్తిచేసినవారు మూడేళ్ల ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ వారి పరీక్ష ఫీజు రెండు గ్రూపులకు రూ.2700, ఒక గ్రూపునకు రూ.1500.

* మేలో పరీక్ష రాసేవారు ఫిబ్రవరి నెలాఖరులోగా, నవంబర్‌లో రాసేవారు ఆగస్టు చివర్లోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాక్టికల్‌ శిక్షణ: సీఏ ఇంటర్‌ పూర్తిచేసినవారు ఒక ప్రాక్టీసింగ్‌ సీఏ వద్దగానీ, ఆడిట్‌ సంస్థలోగానీ మూడేళ్లపాటు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ను పొందాలి. సీఏ ఇంటర్‌లో రెండు గ్రూపులు లేదా ఏదైనా ఒక గ్రూపు (గ్రూప్‌-1/ గ్రూప్‌-2) పూర్తి చేసినవారికి ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పొందడానికి అర్హత కల్పిస్తారు. సీఏ విద్యార్థులకు ఇది కలిసొచ్చే అంశం. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ సమయంలోనే ఒక ఏడాది ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ముగిశాక సీఏ ఫైనల్‌ పరీక్ష రాసేలోగా సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి నాలుగు వారాల అడ్వాన్స్‌డ్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ (ఏఐసీఐటీఎస్‌ఎస్‌) శిక్షణ కూడా విద్యార్థి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పొందుతున్న సమయంలోనే విద్యార్థి తాను శిక్షణ తీసుకుంటున్న ప్రాంతాన్ని బట్టి రూ.2000- రూ.7000 వరకు స్టైపెండ్‌ లభించే అవకాశముంది.

సీఏ ఫైనల్‌
సీఏ ఇంటర్‌ పూర్తిచేసి, రెండున్నరేళ్ల ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్‌ పరీక్ష రాయడానికి అర్హులు.

సీఏ ఫైనల్‌ రిజిస్ట్రేషన్‌ గడువు
* మే పరీక్ష రాసేవారికి: పరీక్షలకు ముందు ఎప్పుడైనా
* నవంబరు పరీక్ష రాసేవారికి: పరీక్షలకు ముందు ఎప్పుడైనా
చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 22,000.

సీఏ ఫైనల్‌లో రెండు గ్రూపులుంటాయి. మొత్తం 8 పేపర్లు రెండు గ్రూపులుగా (గ్రూపుకి 4 చొప్పున) ఒక్కో పేపర్‌ 100 మార్కులకు మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థి వీలునుబట్టి 8 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపును విడివిడిగా రాయొచ్చు. ఐసీఏఐ వారి పరీక్ష ఫీజు: రెండు గ్రూపులకు రూ.3,300.00.

* ఒక గ్రూపునకు రూ.1,800 మేలో పరీక్ష రాయాలంటే ఫిబ్రవరి నెలాఖరులోగా, నవంబరులో పరీక్ష రాయాలంటే ఆగస్టు చివరిలోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సీఎంఏ కోర్సు సంగతి?
కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (సీఎంఏ) సంబందిత వ్యవహారాలను సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) పర్యవేక్షిస్తుంది. కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌లు పెట్టుబడి, ప్రణాళికల విషయంలో, లాభాల ప్రణాళికలో, ప్రాజెక్ట్‌ నిర్వహణలో నిర్వాహక నిర్ణయం తీసుకోవడం వంటి విషయాల్లో సేవలు అందిస్తుంటారు. ఈ కోర్సు సీఎంఏ ఫౌండేషన్, సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్‌ అనే మూడు దశలుగా ఉంటుంది.

సీఎంఏ ఫౌండేషన్‌
ఇది మొదటి దశ. ఇంటర్‌ ఏ గ్రూపు చదివినవారైనా దీనికి నమోదు చేసుకుని చదవవచ్చు. ఇంటర్‌ ఎంఈసీ విద్యార్థులు అయితే ఇంటర్‌ ఎంఈసీతోపాటు సీఎంఏ ఫౌండేషన్‌ కోర్సుని సమాంతరంగా పూర్తి చేయవచ్చు. దీనిక నమోదు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఇంటర్మీడియెట్‌ (10+2) లేదా తత్సమాన పరీక్ష పాస్‌ అవ్వాల్సి ఉంటుంది.

సీఎంఏ ఫౌండేషన్‌ చదవాలంటే ముందుగా రూ.4వేలు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో ఏదైనా షెడ్యూల్డ్‌ బ్యాంకులో కోల్‌కతా బ్రాంచిలో చెల్లే విధంగా చెల్లించాలి. ఆ డీడీని, రిజిస్ట్రేషన్‌ నిమిత్తం పూర్తిచేసిన దరఖాస్తు ఫారాన్ని సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ - ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏఐ) కోల్‌కతాకు పంపవచ్చు. లేదా అనుబంధ సంస్థల్లోనూ ఇవ్వవచ్చు.

ఈ దరఖాస్తు ఫారాన్ని పొందాలంటే సీఎంఏ శాఖల్లోగానీ, సీఎంఏ ఛాప్టర్‌లోగానీ, సీఎంఏ ఇన్ఫర్మేషన్‌ సెంటర్లలోగానీ రూ.250 చెల్లించి పొందవచ్చు. ఈ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల్లో (హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కొత్తగూడెం, రాజమండ్రి) ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలను https://icmai.in/icmai/index.php లో చూడవచ్చు.

సీఎంఏ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు
* జూన్‌ పరీక్ష రాసేవారికి: జనవరి 31
* డిసెంబరు పరీక్ష రాసేవారికి: జులై 31
ఐసీఎంఏఐ వారి పరీక్ష ఫీజు: రూ.1200.

* జూన్‌లో పరీక్ష రాయాలంటే మార్చి 31లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. డిసెంబరులో పరీక్ష రాయాలంటే సెప్టెంబరు 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.

సీఎంఏ కోర్సులోని మొదటి దశ ఫౌండేషన్‌. దీనిలోని మొత్తం 8 సబ్జెక్టులను 4 పేపర్లుగా విభజించారు. అంటే 2 సబ్జెక్టులు కలిసి ఒక పేపర్‌ అన్నమాట. ఫౌండేషన్‌ పరీక్షను 4 పేపర్లుగా విడివిడిగా (రోజుకో పేపరు చొప్పున) పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి పేపరులో 100 మార్కులకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు.

ఫౌండేషన్‌ పరీక్షను 4 పేపర్లు కలిపి మొత్తం 400 మార్కులకు నిర్వహిస్తారు.

* సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షను జూన్, డిసెంబరు నెలల్లో సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు.

సీఎంఏ ఇంటర్‌
దీన్ని సీఎంఏ ఎగ్జిక్యూటివ్‌ కోర్సు అని కూడా పిలుస్తారు. సీఎంఏ ఫౌండేషన్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఒక సంవత్సరం తర్వాత సీఎంఏ ఇంటర్‌ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారెవరైనా సీఏంఏ ఫౌండేషన్‌ రాయకుండానే నేరుగా సీఎంఏ ఇంటర్మీడియెట్‌ కోర్సుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. శిక్షణ కూడా తీసుకోవచ్చు.

ఫౌండేషన్‌ పరీక్ష పాసైన వారు సీఎంఏ ఇంటర్మీడియెట్‌ రిజిస్ట్రేషన్‌ నిమిత్తం ఐసీఎంఏఐ వారికి రూ.20వేలు చెల్లించవలసి ఉంటుంది. ఇటీవలే సీఎంఏ ఫౌండేషన్‌ పూర్తిచేసి ఇంటర్‌కు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్‌ ఒక వెసులుబాటు కల్పించింది. ఫౌండేషన్‌ పూర్తిచేసినవారు ఇంటర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకునేటప్పుడు చెల్లించాల్సిన రూ.20వేలలో రూ.12వేలు చెల్లించి మిగతా రూ.8వేలు మూడు నెలల తర్వాత చెల్లించేలా వీలు కల్పించారు.

సీఎంఏ ఇంటర్‌ రిజిస్ట్రేషన్‌ గడువు
* జూన్‌ పరీక్ష రాసేవారికి: జనవరి 31
* డిసెంబరు పరీక్ష రాసేవారికి: జులై 31

ఐసీఎంఏఐ పరీక్ష ఫీజు ఒక గ్రూపునకు రూ.1200, రెండు గ్రూపులకు కలిపి అయితే రూ.2400.
* జూన్‌ నెలలో పరీక్ష రాయాలనుకుంటే మార్చి 31లోగా, డిసెంబరులో రాయాలనుకునేవారు సెప్టెంబరు 30లోగా చెల్లించాలి.

సీఎంఏ ఇంటర్‌లో రెండు గ్రూపులుంటాయి. ఒక్కోదానిలో నాలుగేసిపేపర్లుంటాయి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. సీఎంఏ ఇంటర్మీడియెట్‌ కోర్సు నమోదు చేసుకున్న వారు ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్మీడియెట్‌ పరీక్ష రాయవచ్చు.

ప్రాక్టికల్‌ శిక్షణ: సీఎంఏ ఫైనల్‌ పరీక్ష రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్‌ శిక్షణ తప్పనిసరి. సీఎంఏ ఎగ్జిక్యూటివ్‌ (సీఎంఏ ఇంటర్‌) ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించినవారు ప్రాక్టికల్‌ శిక్షణను గుర్తింపు పొందిన సంస్థల్లో నిర్దేశించిన విభాగాల్లో లేదా ప్రాక్టీసింగ్‌ కాస్ట్‌ అకౌంటెంట్‌ దగ్గర ఆర్నెల్లపాటు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా శిక్షణ పొందుతున్న కాలంలోనే విద్యార్థి తాను శిక్షణ పొందుతున్నా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.2000 నుంచి రూ.5000 వరకు స్టైపెండ్‌ పొందొచ్చు. ఈ ప్రాక్టికల్‌ శిక్షణ ద్వారా విద్యార్థి సీఎంఏ వృత్తికి కావాల్సిన నైపుణ్యాన్ని పొందడమే కాకుండా తన కోర్సు పూర్తి చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చు. సీఎంఏ ఫైనల్‌ ఉత్తీర్ణులైనవారు ప్రాక్టీస్‌ గనక చేయదల్చుకుంటే మూడు సంవత్సరాల ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది.

సీఎంఏ ఫైనల్‌ కోర్సు
సీఎంఏ ఎగ్జిక్యూటివ్‌ (ఇంటర్‌) ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించినవారు ఆరునెలలు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసిన విద్యార్థి ఫైనల్‌ పరీక్ష రాయవచ్చు. సీఎంఏ ఇంటర్‌ పూర్తయినవారు ఫైనల్‌ రిజిస్ట్రేషన్‌ నిమిత్తం రూ.17వేలు ఐసీఎంఏఐకి చెల్లించాల్సి ఉంటుంది.

సీఎంఏ ఫైనల్‌ రిజిస్ట్రేషన్‌ గడువు
* జూన్‌ పరీక్ష రాసేవారికి: జనవరి 31
* డిసెంబరు పరీక్ష రాసేవారికి: జులై 31

ఐసీఎంఏఐ పరీక్ష ఫీజు ఒక గ్రూపునకు రూ.1400, రెండు గ్రూపులకు కలిపి రూ.2800.

* జూన్‌లో పరీక్ష రాసేవారు మార్చి 31లోగా, డిసెంబరులో రాసేవారు సెప్టెంబరు 30లోగా ఫీజు చెల్లించాలి.

సీఎంఏ ఫైనల్‌లో కూడా రెండు గ్రూపులు (గ్రూపు 3, గ్రూపు 4) ఉంటాయి. ఫైనల్‌కి అర్హత సాధించాలంటే విద్యార్థి కనీసం ఆరు నెలల ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.

సీఎంఏ ఫైనల్‌ పూర్తిచేసినవారిని ఇన్‌స్టిట్యూట్‌ వారి కంప్యూటర్‌ ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత క్వాలిఫైడ్‌ కాస్ట్‌ అకౌంటెంట్‌లుగా పరిగణిస్తారు. సీఎంఏ ఫైనల్‌ పూర్తి చేసినవారు నేరుగా ఉద్యోగంలో చేరవచ్చు. సొంతంగా ప్రాక్టీసు పెట్టుకోవాలంటే మరో రెండున్నర సంవత్సరాలు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోవాలి (పైన తెలిపిన ఆర్నెల్ల్లకు ఇది అదనం). ఈ ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తిచేసినవారికి ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వారు సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ (సీఓపీ) అందజేస్తారు.

Back..

Posted on 17-12-2018