Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తొలి అడుగు... ఆర్టికల్‌షిప్‌

సీఏ విద్యార్థులకు పరిజ్ఞానంతోపాటు భవిష్యత్తులో వారు చేయబోయే ఉద్యోగాలకు/ ప్రాక్టీసుకి సంబంధించి తర్ఫీదునిచ్చే వేదిక ఇది. దీని ద్వారా విద్యార్థి అనేక కొత్త విషయాలూ, మెలకువలూ తెలుసుకోవచ్చు! అందుకే దీని ప్రాముఖ్యం గమనించి సద్వినియోగం చేసుకోవాలి.

సీఏ ఉత్తీర్ణుడైన విద్యార్థి ఉద్యోగానికి వెళ్లవచ్చు. సొంతంగా ప్రాక్టీసూ పెట్టుకోవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆర్టికల్‌షిప్‌ ఉపయోగకరమే. ప్రాక్టీసుకు వెళ్లాలనుకుంటే దీని ప్రాముఖ్యం ఇంకా ఎక్కువేనని చెప్పాలి. సీఏ- ఐపీసీసీ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. సీఏ కోర్సులో ఐపీసీసీ దశ పూర్తిచేసినవారు 3 సంవత్సరాల ఆర్టికల్‌షిప్‌ (ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి విద్యార్థికీ తప్పనిసరి. ఒక ప్రాక్టీసింగ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర కానీ, ఒక ఆడిట్‌ సంస్థలో కానీ దీన్ని పూర్తిచేయాలి. ఆర్టికల్‌షిప్‌లోని 3 సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు పూర్తయి మరో ఆరు నెలల్లో ఆర్టికల్‌షిప్‌ సమయం పూర్తవుతుందనగా సీఏ ఫైనల్‌ పరీక్ష రాయవచ్చు.

ఆర్టికల్‌షిప్‌ ప్రాముఖ్యం
* సీఏ చదివేటప్పుడు కోర్సులోని ప్రతి అంశంపై విద్యార్థికి లోతైన అవగాహన అవసరం. ఇది కేవలం తరగతి జ్ఞానంవల్లే రాదు. ఆర్టికల్‌షిప్‌ ద్వారా విద్యార్థి తరగతిలో నేర్చుకున్న అంశాలు నిజజీవితంలో ఎలా అనుసరిస్తారన్నది తెలుసుకుంటాడు. కాబట్టి, సబ్జెక్టుపై మంచి పట్టు సాధించవచ్చు. తద్వారా సీఏ ఫైనల్‌ పరీక్షకు సులువుగా సన్నద్ధమవవచ్చు.
* ఆర్టికల్‌షిప్‌ సమయంలో విద్యార్థి ఆడిటింగ్‌ పనిమీద వేర్వేరు ప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. అక్కడ రకరకాల వ్యక్తులనూ, అధికారులనూ కలిసే వీలుంటుంది. ఆడిటింగ్‌లో భాగంగా రకరకాల అంశాలను పరీక్షించవలసి ఉంటుంది. ఇటువంటి వాటిద్వారా విద్యార్థి తన భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.
* ‘చదువుతూనే సంపాదన’ ఈ ఆర్టికల్‌షిప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆడిట్‌ సంస్థే ఐసీఏఐ నిబంధనల ప్రకారం చేరిన విద్యార్థికి స్టైపెండ్‌ కూడా ఇస్తుంది. దీన్ని విద్యార్థులు తమ చదువుకు ఉపయోగించుకుని, తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండొచ్చు. అంతేకాదు, డబ్బు విలువ కూడా తెలుస్తుంది. ఈ విధానంలో ఉన్న గొప్ప విషయం అదే.

ఇంటర్వ్యూలో విజయం ఎలా?
* కొన్ని ఆడిట్‌ సంస్థలు తమవద్ద ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ పొందాలనుకునే విద్యార్థుల ప్రతిభా పాటవాలను, శక్తిసామర్థ్యాలను మౌఖికపరీక్ష ద్వారా గమనించి ఆర్టికల్‌షిప్‌కి అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని మెలకువలు పాటిస్తే సునాయాసంగా ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు.
* ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు కంగారుపడకుండా సమాధానం చెప్పాలి.
* ధరించే దుస్తులనుబట్టి కూడా అంచనా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రొఫెషనల్‌గా వెళ్లాలి.
* ఇంటర్వ్యూకి వెళుతున్న సంస్థ తాలూకూ పూర్తి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవాలి.
* అడిగిన ప్రశ్నకి సమాధానం తెలియకపోతే నిజాయతీగా ‘తెలియదు’ అని చెప్పాలి.
* ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఐపీసీసీలోని అన్ని సబ్జెక్టులనూ మరోసారి పునశ్చరణ చేసుకోవాలి.

గమనించాల్సిన అంశాలు
ఆర్టికల్‌ శిక్షణ అందించే సంస్థవారే విద్యార్థులను ఆడిట్‌ చేయడానికి రకరకాల సంస్థలకు పంపుతుంటారు. ఈ సమయంలో విద్యార్థులు ఈ కింది విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి.
సంస్థ లావాదేవీలను ఎలా జరుపుతోందో తెలుసుకోవాలి. వ్యాపార పద్ధతులేంటో గమనించాలి. సంస్థల పుస్తకాలను ఎలా నిర్వహిస్తారో చూడాలి. వ్యాపారసంస్థ మంచిచెడులు, వారి వ్యాపార సూత్రాలు, మెలకువలను గమనించాలి. ఆడిట్‌ ఒక తయారీ సంస్థలో అయితే, తయారీలోని వివిధ దశలు, ముడి పదార్థాలు, పూర్తయిన వస్తువుల జాబితాలను పరిశీలించాలి.

జాగ్రత్తలూ.. సలహాలూ
* సంస్థను ఎంచుకునేటప్పుడు సౌకర్యాలు, భవంతులు వంటివి కాకుండా వృత్తి నైపుణ్యాలు, సంస్థ క్లయింట్స్‌, దాని ప్రతిష్ఠ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఇంతకుముందు నుంచే అక్కడ ఆర్టికల్‌షిప్‌ చేస్తున్న సీనియర్‌ విద్యార్థులతో మాట్లాడి, నిర్ణయం తీసుకుంటే మంచిది.
* ఆర్టికల్‌షిప్‌ పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో అయితే బాగుంటుంది, మంచి ఎక్స్‌పోజర్‌ వస్తుందని కొందరు భావిస్తుంటారు. ఇది కొంతవరకూ నిజమే కానీ, పెద్ద సంస్థల్లో ఒక్కో విభాగానికి ఇంతమంది విద్యార్థులు అని కేటాయిస్తారు. అటువంటి సమయంలో కేవలం కొన్నిరకాల ఆడిట్‌లకే పరిమితమవ్వాల్సి ఉంటుంది. అదే చిన్న, మధ్యతరహా సంస్థలైతే అన్ని రకాల ఆడిట్‌ల గురించీ తెలుసుకునే వీలుంటుంది.
* మరికొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆర్టికల్‌షిప్‌ చేయాలని ఉత్సాహపడుతుంటారు. అయితే ఆ రాష్ట్రాల్లోని అలవాట్లు, మెట్రో కల్చర్‌కి ఆకర్షితులై ఆర్టికల్‌షిప్‌ను కూడా మధ్యలోనే ఆపివేసినవారు ఉన్నారు. ఇలాంటపుడు సీఏ కోర్సు చదవడం కలగానే మిగిలిపోతుంది.
* సరైన ఆడిట్‌ సంస్థను ఎంచుకోకుండా మధ్యలో వేరే సంస్థకు గతంలో మారేవారు. కానీ మారిన నిబంధనల ప్రకారం అలా మారడం ఇకపై చాలా కష్టం.
* ఆర్టికల్‌షిప్‌ సమయంలో చాలామంది అసలు పుస్తకాలే తీయరు. ఇటువంటివారు చివరి ఆరు నెలల్లో హడావుడిగా చదివేసి, పరీక్ష రాసి, ఫెయిల్‌ అవుతుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు.
* రెండున్నర సంవత్సరాల ఆర్టికల్‌షిప్‌ సమయంలో కూడా విద్యార్థులు రోజుకు కనీసం రెండు గంటలైనా ఒకటి లేదా రెండు సబ్జెక్టులు తీసుకుని చదువుతుండాలి. రెండున్నర సంవత్సరాల్లో ఇలా అన్ని సబ్జెక్టులనూ పూర్తిచేయవచ్చు. తప్పనిసరిగా అనుకునే సబ్జెక్టులకు చివరి ఆరు నెలల్లో కోచింగ్‌ తీసుకుంటే సరిపోతుంది.
* ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. రకరకాల క్లయింట్‌ ఆఫీసులకు తిరుగుతూ పనిచేయడం భారంగా భావించకూడదు. చదువుతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ సంపాదించుకోవడానికి చక్కని అవకాశంగా మాత్రమే భావించాలి.
* ఆడిట్‌ సంస్థలో దూసుకుపోయే తత్వాన్ని విద్యార్థులు అలవరచుకోవాలి. అంతేకానీ ఆత్మన్యూనతకు లోనవుతూ తమకుతామే చిన్న, తక్కువని అనుకోకూడదు. అలా అయితే క్లయింట్‌ ఆఫీసులో ఆడిట్‌ తగినరీతిలో చేయలేరు.
గమనిక: కొంతమంది విద్యార్థులు ఆర్టికల్‌షిప్‌ చేయకుండా, చేసినట్లుగా సర్టిఫికెట్లు తీసుకుని సీఏ కోర్సు పూర్తిచేస్తున్నారు. ఇలాచేస్తే సీఏ పాసవొచ్చు గానీ వృత్తినైపుణ్యాలు లేక జీవితంలో రాణించలేరు. కాబట్టి ఆర్టికల్‌షిప్‌కు తగిన ప్రాధాన్యమివ్వాలి.

Back..

Posted on 08.3.2017