Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఏ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌

ఇటీవలే సీఏ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. దీనిలో నెగ్గినవారు ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ (ఆర్టికల్‌ షిప్‌), పారిశ్రామిక శిక్షణలతో అనుభవజ్ఞానం సంపాదించుకోవాల్సి వుంటుంది. వీటిలో మొదటిది తప్పనిసరి. రెండోది ఐచ్ఛికం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థిని తయారు చేస్తూ స్టైపెండ్‌ అందించటం ఈ శిక్షణల ప్రత్యేకత.సీఏ కోర్సు పూర్తయ్యేనాటికి పరిశ్రమకు తగ్గట్టుగా తమను తాము తీర్చిదిద్దుకునేందుకు విద్యార్థులకు ప్రాక్టికల్‌ శిక్షణ మంచి వేదిక. సీఏ వృత్తికి కావాల్సిన నైపుణ్యాలు అలవడటంతోపాటు, భవిష్యత్తులో చేయబోయే ప్రాక్టీసు/ఉద్యోగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. భావవ్యక్తీకరణ నైపుణ్యాలనూ పెంచుకోవచ్చు.
అందుకే ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ను ఉద్యోగానికి మొదటి మెట్టుగా భావిస్తున్నారు. సీఏ పూర్తిచేసినవారు ఉద్యోగానికైనా వెళ్ళవచ్చు. సొంతంగా ప్రాక్టీసు కూడా ప్రారంభించవచ్చు. దేనికైనా ఆర్టికల్‌షిప్‌ మెలకువలు ఉపయోగపడతాయి.
సీఏ ఇంటర్‌లోని మొదటి, రెండు గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపు పూర్తిచేసినవారు లేదా రెండు గ్రూపులూ పూర్తిచేసినవారు సీఏ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే 4 వారాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు- యాన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ (ఐసీఐటీఎస్‌ఎస్‌) అనే కంప్యూటర్‌ కోర్సును పూర్తిచేయాలి. తర్వాత ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌. దీన్ని రెండున్నర ఏళ్ళలో పూర్తిచేశాక, సీఏ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే నాలుగు వారాల అడ్వాన్స్‌డ్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ (ఐసీఐటీఎస్‌ఎస్‌) అనే కంప్యూటర్‌ కోర్సు చేయాలి. ఆపై సీఏ ఫైనల్‌ పరీక్ష రాయవచ్చు.
ఎక్కడ చేయాలి?: ఐపీసీసీ కోర్సులో రెండు గ్రూపులు లేదా ఏదైనా ఒక గ్రూపు పూర్తిచేసిన విద్యార్థి ఒక ప్రాక్టీసింగ్‌ సీఏ దగ్గరగానీ, ఆడిట్‌ సంస్థలోగానీ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్‌ చేయించాలా?: ఐపీసీసీ రెండు గ్రూపులు పూర్తిచేసినవారు లేదా ఏదైనా ఒక గ్రూపు పూర్తిచేసినవారు ఐసీఏఐ ద్వారా నమోదు చేయించుకోవాలి. ప్రాక్టికల్‌ శిక్షణ ఎవరి దగ్గర తీసుకోబోతున్నారో, ఎప్పటినుంచి ప్రారంభించారో ఐసీఏఐకి ముందుగానే తెలియజేయాలి.

సీఏలో పారిశ్రామిక శిక్షణ
ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ పొందుతున్న విద్యార్థులు ఎవరైనా భవిష్యత్తులో పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో స్థిరపడాలన్నా, సీఏ పూర్తయ్యాక సొంత పరిశ్రమ స్థాపించాలన్నా పారిశ్రామిక శిక్షణ ఉపయోగకరం.
ఎప్పుడు తీసుకోవాలి: మూడో సంవత్సరం ప్రాక్టికల్‌ శిక్షణకు బదులుగా వేరే పరిశ్రమలో పారిశ్రామిక శిక్షణను కూడా తీసుకోవచ్చు. మూడు నెలల ముందే తను ఆర్టికల్‌షిప్‌ చేస్తున్న ప్రధాన ఆడిటర్‌కి తన శిక్షణ గురించి చెప్పి అనుమతి పొందాలి. 9 నెలలకు తగ్గకుండా 12 నెలలకు మించకుండా తీసుకోవలసి ఉంటుంది.
సీఏ ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థి, ప్రాక్టికల్‌ శిక్షణ మరో సంవత్సరంలో ముగుస్తుందనగా ఈ పారిశ్రామిక శిక్షణ తీసుకోవచ్చు.
ఉద్యోగ అవకాశాలు: ఒక సంస్థలో పారిశ్రామిక శిక్షణ తీసుకుంటే సహజంగా అదే కంపెనీ అతడు అర్హత పొందాక మంచి వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటుంది. ఇతర సంస్థల నుంచీ ఉద్యోగ అవకాశాలు రావొచ్చు. సీఏ పూర్తయ్యాక సొంతంగా ఒక సంస్థను నెలకొల్పాలనుకునే ఔత్సాహికులకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుంది.
- మోహన్‌, మాస్టర్‌మైండ్స్‌

ఎలాంటి సంస్థను ఎంచుకోవాలి?
చాలామంది పెద్ద సంస్థల్లో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటేనే పరిజ్ఞానం, ఎక్స్‌పోజర్‌ వస్తుందని భావిస్తుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ఏ ఆడిట్‌ సంస్థలో చేరినా విద్యార్థి వ్యవహరించే విధానం, తపనను బట్టి పరిజ్ఞానం వస్తుందని మరచిపోకూడదు. బీ చేరాలనుకుంటున్న ఆడిట్‌ సంస్థలో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసిన సీనియర్లతో, కొనసాగిస్తున్నవారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది.
అసెస్‌మెంట్‌ టెస్ట్‌లు: ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ పొందుతున్న విద్యార్థులు నూతన విధానం ప్రకారం సీఏ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే అసెస్‌మెంట్‌ టెస్ట్‌లు రాయాల్సి ఉంటుంది. శిక్షణలో ఏ అంశాలు నేర్చుకున్నారు, ఎంతవరకు అనుభవం సాధించారో తెలుసుకునేందుకే వీటిని నిర్వహిస్తారు.

 

Back..

Posted on 11-8-2018