Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉత్తీర్ణతా సోపానాలపై ధీమాగా!

సీఏ, సీఎంఏ, సీఎస్‌లు పూర్తి చేయాలంటే ఆ కోర్సులు నడుపుతున్న ఇన్‌స్టిట్యూట్ల పరీక్షల్లో ఉత్తీర్ణత అవసరం. ఆ పరీక్షల్లో వైఫల్యం చెందకుండా జాగ్రత్తపడితేనే కార్పొరేట్‌ సంస్థల్లోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టటానికీ, భవితను తీర్చిదిద్దుకోవటానికీ వీలవుతుంది. అందుకు విద్యార్థులు ఏ అంశాలపై దృష్టిపెట్టాలి?
కామర్స్‌ రంగంలోని వృత్తివిద్యాకోర్సులైన చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (సీఎంఏ), సీఎస్‌ (కంపెనీ సెక్రటరీ)లలో మూడు స్థాయుల్లో (లెవల్స్‌) పరీక్షలుంటాయి. అర్హత పరీక్ష మొదటిదైతే మిగిలిన రెండూ... మధ్యమ, తుది స్థాయి పరీక్షలు.
సీఏలో సీపీటీ, ఐపీసీసీ, ఫైనల్‌; సీఎంఏలో ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌; సీఎస్‌లో ఫౌండేషన్‌, ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌గా వీటిని వ్యవహరిస్తారు. వీటిని ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు.
విద్యార్థులు ఒక్కో కోర్సులో ఉండే రెండు లెవెల్స్‌లో రెండు గ్రూపులు ఒకేసారి లేదా ఒక్కొక్క గ్రూపు రాసి ఉత్తీర్ణత పొందవచ్చు. ఒక్కొక్క గ్రూపులో మూడు లేదా నాలుగు పేపర్లుంటాయి.
ప్రతి పేపర్లో 40 శాతం, అగ్రిగేట్‌గా 50 శాతం మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. ఏ ఒక్క పేపర్లో 40 శాతం రాకపోయినా, మొత్తమ్మీద 50 శాతం మార్కులు రాకపోయినా గ్రూపు మొత్తం మళ్ళీ రాయాలి. మధ్యమ, తుది లెవెల్స్‌లో పరీక్ష రాసిన 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఫలితాలను ప్రకటిస్తారు.

పరీక్షల నేపథ్యం
ఈ మూడు వృత్తివిద్యాకోర్సులనూ సంబంధిత ఇన్‌స్టిట్యూట్ల దగ్గర రిజిస్టర్‌ చేయించుకుని పరీక్షలు రాయాల్సివుంటుంది. దూరవిద్య (కరస్పాండెన్స్‌) కోర్సులు కాబట్టి విద్యార్థులు సొంతంగా చదువుకోవాలి.ప్రైవేటు శిక్షణ కూడా అన్ని లెవెల్స్‌లో తీసుకోవచ్చు.
సాధారణ అకడమిక్‌ కోర్సులు కానందున వీటిని చాలామంది విద్యార్థులు కష్టంగా భావిస్తుంటారు. దీనికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా మధ్యమ లెవెల్‌ పరీక్షలో సగటు ఉత్తీర్ణత 15 నుంచి 20 శాతం ఉంది. తుది పరీక్షలో ఇది 8 నుంచి 15 శాతం. ఈ కోర్సులను ఎంచుకున్నవారు ఎంత శ్రద్ధగా అధ్యయనం చేయాలో దీన్నిబట్టి గ్రహించవచ్చు.

సమస్య... పరిష్కారం
ఈ కోర్సులకు నిర్వహించే పరీక్షల్లో విఫలమయ్యేవారు తమ లోపాలను గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

విద్యార్థికి కెరియర్‌పైనా, కోర్సుపైనా అవగాహన లేకపోవటం
ఏం చేయాలి?: సీఏ, సీఎంఏ, సీఎస్‌లలో చేరే విద్యార్థులు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకోవాలి. కోర్సులోని పాఠ్యాంశాలపై అవగాహన తెచ్చుకోవటం, మధ్యమ, తుది లెవెల్స్‌లో విద్యార్థి నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం ప్రధానం.
ప్రణాళిక లేకుండా పరీక్షలకు సిద్ధమవటం
ఏం చేయాలి?: ప్రతి లెవెల్‌ పరీక్షలో పూర్తిస్థాయి ప్రణాళిక వేసుకోవాలి. ఒక్కసారి అది నిర్దేశించుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. తమకు సెలవులు ఉండవని గ్రహించటంతో పాటు ఎలాంటి ఇతర వ్యాపకాలకూ తావివ్వకుండా జాగ్రత్తపడాలి. ప్రణాళిక ప్రకారం చదివేటపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘వాయిదా’లకు ఆస్కారం ఇవ్వని క్రమశిక్షణ పాటించటానికి ప్రయత్నించాలి.
పరీక్షకు సరైనవిధంగా సన్నద్ధం కాకపోవటం
ఏం చేయాలి?: ఈ లోపం సవరించుకోవాలంటే... కోర్సులో రిజిస్టర్‌ చేయించుకున్న మొదటిరోజు నుంచీ అధ్యయనం సాగించాలి. కాన్సెప్టులను అర్థం చేసుకుంటూ చదవాలే కానీ, బట్టీ పట్టటం చేయకూడదు. ప్రతి పేపర్లోని అన్ని పాఠాలపై దృష్టిపెట్టాలి. చాయిస్‌లో వదిలేద్దామనుకోకూడదు. ఇలాంటి వృత్తివిద్యా పరీక్షల్లో ప్రతి అంశంపైనా ఎంతోకొంత అవగాహన ఉండాల్సిందే.
గ్రూపు మొత్తం కలిపి పాసవ్వాలి కాబట్టి... అన్ని పేపర్లకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. థియరీ పేపర్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా ప్రాబ్లమ్‌ పేపర్స్‌లోని థియరీ కూడా చదవాలి. తుది లెవెల్‌లో పాఠాలపై విశ్లేషణాత్మక ధోరణితో చదివితే ఫలితాలు బాగా వస్తాయి. ప్రతి మోడల్‌ ప్రాబ్లమ్‌, థియరీ ప్రశ్నను చూడకుండా రాయటం అలవాటు చేసుకోవాలి.
ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకోవటం, దాని వాడుక పెంచటం కూడా అవసరం. ప్రతి కొత్త పదం అర్థం తెలుసుకుంటూవుండాలి. చదువుకునేటపుడు ఒత్తిడికి లోనవుతుంటే డీలా పడిపోకూడదు. ఇలాంటపుడు పేపర్లను మార్చి చదవటం (రొటేట్‌) అనుకూల ఫలితమిస్తుంది.
ఇన్‌స్టిట్యూట్‌ వారి స్టడీ మెటీరియల్‌, పూర్వ ప్రశ్నపత్రాలు, రివిజన్‌ టెస్ట్‌ పేపర్లు సాధన చేయాలి. ప్రాబ్లమ్స్‌, థియరీ ప్రశ్నల్లో చేసే పొరపాట్లను గమనించుకుంటూ మళ్ళీ వాటిని చేయకుండా జాగ్రత్తపడాలి. పరీక్షలు ఎదుర్కోబోయేముందు కనీసం మూడు నాలుగుసార్లు పునశ్చరణ (రివిజన్‌) చేసుకోవాలి.
పరీక్షలను సరైన విధంగా ఎదుర్కోలేకపోవటం
ఏం చేయాలి?: పరీక్షలో ఇచ్చే ప్రశ్నలను హడావుడిగా కాకుండా జాగ్రత్తగా చదవాలి. ప్రశ్న అడిగిన కోణంలోనే జవాబు రాయాలి. కేటాయించిన మార్కుల ప్రకారం జవాబు రాయాలి. ప్రెజెంటేషన్‌ పక్కాగా ఉండాలి. సమాధానంలోని ప్రతి వర్కింగ్‌ విడిగా ఉండాలి. చదువుకున్న కాన్సెప్ట్‌ నుంచి కొత్త ప్రశ్న వస్తే ఆలోచించి రాయాలి.
పరీక్ష పూర్తయి, ఫలితాలు వెలువడేవరకూ మూడు నెలల సెలవు తీసుకోవడం
ఏం చేయాలి?: ఈ కామర్స్‌ కోర్సుల్లో విద్యార్థులు సెలవులకు తావు ఇవ్వకూడదు. మూడు నెలల విరామంలో చదవకపోతే ఒకవేళ పాసవకపోతే సమస్యే! మళ్ళీ పరీక్షకు సిద్ధమవాలంటే మిగిలిన మూడు నెలల వ్యవధి సరిపోదు కాబట్టి.
తుది పరీక్ష సన్నద్ధతలో భాగంగా ప్రాయోగిక శిక్షణ వల్ల చదవటానికి సరైన సమయం కేటాయించకపోవటం
ఏం చేయాలి?: ప్రాయోగిక శిక్షణ.. కోర్సులో భాగమే. శిక్షణలో పనిచేసిన అంశాలను పుస్తకాల్లోనివాటితో జోడించి ఎప్పటికప్పుడు చదువుకుంటే పరీక్షలు బాగా రాయటానికి వీలుంటుంది. శిక్షణ మొదలైనప్పటినుంచి రోజుకు మూడు నాలుగు గంటలు చదువుకుంటే కచ్చితమైన ఫలితాలు వస్తాయి.
పరీక్షల్లో వైఫల్యం వల్ల ఇంటర్వ్యూపై ప్రతికూల ప్రభావం, కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగ సాధన కష్టమవడం.
ఏం చేయాలి?: మొదటి ప్రయత్నంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవారికి ఇంటర్వ్యూల్లో ప్రాధాన్యం ఉంటుంది. కార్పొరేట్‌ రంగంలో మంచి హోదాలో స్థిరపడటానికి ఇది ఉపయోగం. పరీక్షల్లో విఫలమై, గ్యాప్‌ వచ్చినపుడు ఇంటర్వ్యూల్లో వివరణ ఇచ్చుకోవల్సిరావచ్చు. ఈ పరిస్థితి ఎదురవ్వకుండా ఎప్పటికప్పుడు పరీక్షల్లో ఉత్తమశ్రేణి సాధించటానికి ప్రయత్నించాలి.

ఇవి చాలా ముఖ్యం
కామర్స్‌ వృత్తివిద్యాకోర్సుల విద్యార్థులు చదువుతో పాటు కింది లక్షణాలను అలవరచుకోవాలి.
* తాజా ప్రకటనల కోసం ఇన్‌స్టిట్యూట్ల వెబ్‌సైట్లను తరచూ సందర్శిస్తుండాలి.
* ప్రతినెలా జర్నల్స్‌, వెంచర్స్‌ జర్నల్స్‌ను చదవాలి. తాజా విషయాలపై దీనివల్ల అవగాహన పెరుగుతుంది.
* కామర్స్‌ రంగానికి అవసరమైన సాంకేతిక అంశాలపై (సాఫ్ట్‌వేర్‌, టూల్స్‌) దృష్టిపెట్టాలి. ఇలాంటివి విద్యార్థి దశనుంచే నేర్చుకుంటే ముఖ్యంగా కెరియర్‌ మొదట్లో ఎంతో ఉపయోగం.
* మధ్యమ, తుది స్థాయి పరీక్షలకు తయారయ్యే విద్యార్థులు పరిజ్ఞానం పెంచుకోవటం కోసం రోజూ ఒక వాణిజ్య వార్తాపత్రికను చదివే అలవాటు చేసుకోవటం మేలు.
* భావ వ్యక్తీకరణ, ఇతరులతో సవ్యంగా మెలిగే నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. స్వీయ క్రమశిక్షణ అవలంబించాలి.
ఈ సూచనలు శ్రద్ధగా పాటిస్తే కామర్స్‌ వృత్తివిద్యాకోర్సు విద్యార్థులు కార్పొరేట్‌ ప్రపంచంలో ధీమాగా అడుగుపెట్టటానికి మంచి పునాది ఏర్పడుతుంది!

Back..

Posted on 17-10-2016