Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కోర్సు విలువ పెంచే.. కొత్త మార్పులు

మనదేశంలో చట్టాలు మారినప్పుడల్లా సీఏ లాంటి వృత్తివిద్యాకోర్సుల్లో మార్పులు అనివార్యం. ఇటువంటి నిరంతర ప్రక్రియలో భాగంగా తాజాగా సీఏ కోర్సులో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిని సంస్కరణలుగా అభివర్ణిస్తున్నారు. అవేమిటి? విద్యార్థులపరంగా ఇవి వెసులుబాటునిస్తాయా? ఈ మార్పుల లక్ష్యాలేమిటి? పరిశీలిద్దాం!
వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నప్పుడూ, పారిశ్రామిక అవసరాలు బాగా పెరిగినప్పుడూ, మార్కెట్‌ ధోరణులు భారీగా మారినప్పుడూ ప్ర¾పంచస్థాయిలో ఒడుదొడుకులు ఎదురవుతాయి. ఇటువంటి వాటికి అనుగుణంగా మార్పులు చేయడం సీఏ కోర్సు ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి 68వ వార్షికోత్సవ సభలో సీఏ కోర్సులోని నూతన విధానాన్ని ఆవిష్కరించారు. అంటే, జులై 1, 2017 నుంచి సీఏ కోర్సులోని నూతన విధానం అమల్లోకి వచ్చింది.
కొత్త సిలబస్‌ ప్రకారం మొదటి పరీక్షను మే 2018 నుంచి నిర్వహిస్తారు. సీఏ కోర్సుకి పాత విధానం ప్రకారం నమోదు చేసుకోవడం జూన్‌ 30, 2017తో ముగిసింది. జులై 1 నుంచి నమోదు చేయించుకునేవారు కొత్త విధానం ప్రకారమే సీఏ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు తీసుకువచ్చిన ఈ నూతన విధానాన్ని విద్యావేత్తలూ, ఉపాధ్యాయులూ, విద్యార్థులూ, పారిశ్రామిక నిపుణులూ ఆహ్వానిస్తున్నారు.

అనుకూలాంశాలు
* భారత చార్టర్డ్‌ అకౌంటెంట్‌లకు ప్రపంచస్థాయిలో ఉద్యోగావకాశాలు మరింత పెరగాలి, మన సీఏలు విదేశాల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో కూడా ఈ నూతన విధానాన్ని రూపొందించారు.
* కమ్యూనికేషన్‌ నైపుణ్యాలకు పెద్దపీట వేశారు.
* సీఏ ఫైనల్‌లో ఎక్కువమంది విఫలమవుతున్న ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ కంట్రోల్‌ అండ్‌ ఆడిట్‌ (ఇస్కా) అనే పేపర్‌ను తొలగించారు.
* పాత సిలబస్‌ ప్రకారం ఐపీసీసీ కోర్సులో ఎఫ్‌ఎం, కాస్టింగ్‌ పేపర్లు రెండూ కలిపి కేవలం 100 మార్కులకు ఉండేవి. 100 మార్కులకు రెండు సబ్జెక్టులు సన్నద్ధం కావడమనేది విద్యార్థులకు భారంగా ఉండేది. కానీ నూతన సిలబస్‌లో కాస్టింగ్‌కు 100 మార్కులు, ఎఫ్‌ఎంకు (ఎకనామిక్స్‌తో కలిపి) 100 మార్కులు కేటాయించడం వల్ల సన్నద్ధత, పరీక్షల సమయాల్లో ఏర్పడే భారం కొంత తగ్గినట్లు అయ్యింది.
* సీఏ కోర్సులోని మొదటిదశ అయిన సీఏ- సీపీటీ స్థానంలో ఇప్పుడు సీఏ ఫౌండేషన్‌ను ప్రవేశపెట్టారు. కొత్త కోర్సులో ప్రశ్నలు 50% వ్యాస రూపంలో, 50% ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఇవ్వనున్నారు. దీనివల్ల బట్టీ విధానానికి స్వస్తి చెప్పి, కాన్సెప్టు అర్థం చేసుకుని పరీక్ష రాసే అలవాటు పెంపొందుతుంది.
* పాత సీపీటీ పరీక్ష విధానంలో పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండేది. ఒక ప్రశ్న తప్పైతే మార్కు కోల్పోవడంతోపాటు ప్రతీ 4 తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కు కింద ఒక మార్కు కోల్పోవాల్సి వచ్చేది. కానీ మారిన విధానంలో మొత్తం 4 పేపర్లలో 2 డిస్క్రిప్టివ్‌ పేపర్లు ఉన్నాయి. ఈ విధానంలో విద్యార్థి పరీక్షలో జవాబు తప్పుగా రాసినప్పటికీ జవాబు రాసిన విధానం సరైతే కొంతవరకూ మార్కులు పొందే అవకాశం ఉంది. ఈ పేపర్లలో రుణాత్మక మార్కులకు అవకాశమే లేదు.
* పాత పరీక్ష విధానంలో సీపీటీలోని 4 పేపర్లకు ఒకేరోజు పరీక్ష నిర్వహించేవారు.4 సబ్జెక్టులకు ఒకేరోజు పరీక్ష రాయాల్సి వచ్చేది. కానీ, నూతన విధానంలో సీఏ ఫౌండేషన్‌లోని 4 పేపర్లను నాలుగు రోజులు (ఒక్కోరోజు ఒక్కో పేపర్‌) పరీక్ష నిర్వహించబోతున్నారు. కాబట్టి ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశం ఏర్పడింది.
* నూతన విధానంలో సీఏ ఫైనల్‌లో ఎలక్టివ్‌ పేపర్‌ (స్వయంగా ఒక పేపర్‌ ఎంచుకునే అవకాశం) ప్రవేశపెట్టారు. ఎలక్టివ్‌ పేపర్‌ విధానం అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి తీసుకువచ్చారని చెప్పవచ్చు. దీనివల్ల సీఏలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తయారై విశ్వవిపణిలో మంచి ఉపాధి పొందే అవకాశం ఉంది.
* నూతన విధానం ప్రకారం ‘ఆర్టికల్‌షిప్‌ (ప్రాక్టికల్‌ శిక్షణ)’ లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఒకప్పుడు ఐపీసీసీలో (ఇప్పటివరకూ సీఏ ఇంటర్మీడియట్‌) రెండు గ్రూపులు (లేదా) కనీసం మొదటి గ్రూపు పాస్‌ అయిన వారికే ఆర్టికల్‌షిప్‌కి అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు సీఏ ఇంటర్మీడియట్‌లో రెండు గ్రూపులు లేదా ఏ ఒక్క గ్రూపు పాస్‌ అయినవారికైనా ఆర్టికల్‌షిప్‌లో చేరే అవకాశం కల్పించారు.

పాత విధానంలో పరీక్ష రాసేవారు...
* పాత విధానం ప్రకారం సీపీటీకి జూన్‌ 30, 2017లోపు నమోదు చేయించుకున్న విద్యార్థులు జూన్‌ 2019 వరకు పాత సీపీటీ విధానం ప్రకారమే పరీక్ష రాయవచ్చు. జులై 1, 2017 నుంచి కొత్త విధానం ప్రకారం సీఏ ఫౌండేషన్‌కు నమోదు చేయించుకున్నవారు కొత్త సీఏ ఫౌండేషన్‌ పరీక్షా విధానం ప్రకారం పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
* పాత విధానం ప్రకారం సీఏ -ఐపీసీసీకి జూన్‌ 30, 2017లోపు నమోదు చేయించుకున్నవారు మే 2019 వరకు పాత ఐపీసీసీ విధానం ప్రకారమే పరీక్ష రాయవచ్చు. జులై 1, 2017 నుంచి కొత్త విధానం ప్రకారం సీఏ ఇంటర్మీడియట్‌కు నమోదు చేయించుకున్నవారు కొత్త సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షా విధానం ప్రకారం పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
* పాత విధానం ప్రకారం సీఏ ఫైనల్‌కు జూన్‌ 30, 2017 లోపు నమోదు చేయించుకున్న విద్యార్థులు నవంబరు 2020 వరకు పాత సీఏ ఫైనల్‌ విధానం ప్రకారమే పరీక్ష రాయవచ్చు. జులై 1, 2017 నుంచి కొత్త విధానం ప్రకారం సీఏ ఫైనల్‌కి నమోదు చేయించుకున్న విద్యార్థులు కొత్త సీఏ ఫైనల్‌ పరీక్షా విధానం ప్రకారం పరీక్షలు రాయాల్సి ఉంటుంది.


Back..

Posted on 03-07-2017