Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సులువుగా.. సీఏ సీపీటీ

సీఏ కోర్సుకి ప్రవేశపరీక్ష అయిన సీఏ-సీపీటీ పరీక్ష జూన్‌ 18న జరగనుంది. ప్రణాళిక ప్రకారం ఈ మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫలితం పొందవచ్చు. ఈ తరుణంలో సన్నద్ధతను ఎలా వేగవంతం చేసుకోవాలి?
సీపీటీని రెండు విభాగాలుగా నిర్వహిస్తారు:
ఉదయం 10.30 గం. నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకు- అకౌంట్స్‌ (60 మార్కులు), ఎం. లా (40 మార్కులు)
మధ్యాహ్నం 2.00 గం. నుంచి సాయంత్రం 4.00 వరకు- ఎకనామిక్స్‌ (50 మార్కులు), క్యూటీ (50 మార్కులు)
అంటే ఒకేరోజు 200 మార్కులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

ఏ సబ్జెక్టు? ఎలా?
అకౌంట్స్‌: 60 మార్కులు
* అకౌంట్స్‌ సబ్జెక్టు సీపీటీలోనే కాకుండా ఐపీసీసీ, సీఏ ఫైనల్‌లోనూ చాలా ముఖ్యమైంది.
* ఈ సబ్జెక్టులో జర్నల్‌ ఎంట్రీస్‌ ప్రధానం. ప్రతి చాప్టర్‌లోనూ ఇవి ఉంటాయి.
* ఎంట్రీస్‌ విషయంలో విద్యార్థులు తప్పు సమాధానాలను రాసే అవకాశం ఉంది. కాబట్టి సమాధానం రాసే ముందే ప్రతీ ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాతే సమాధానాన్ని గుర్తించాలి.
* జర్నల్‌ ఎంట్రీస్‌ అన్నీ పుస్తకంలో ఒకేచోట రాసుకోగలిగితే పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడే పునశ్చరణ తేలికవుతుంది.
* అకౌంట్స్‌లోని ఏ అంశాన్నీ బట్టీ పట్టవద్దు. ప్రతి అంశం పట్ల తార్కిక ఆలోచనా దృక్పథాన్ని అలవరచుకోవాలి.
* థియరీపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎంసీక్యూస్‌ ఆన్‌ థియరీ, ఎంసీక్యూస్‌ ఆన్‌ ప్రాబ్లమ్స్‌ను కూడా బాగా సాధన చేయాలి.
* ఈ సబ్జెక్టులో ముఖ్యమైన అధ్యాయాలు- పార్ట్‌నర్‌షిప్‌ అకౌంట్స్‌, కంపనీ అకౌంట్స్‌ అండ్‌ అకౌంట్‌ ఆన్‌ ఇంట్రడక్షన్‌, ఫైనల్‌ అకౌంట్స్‌, కన్‌సైన్‌మెంట్‌ అకౌంట్స్‌

ఎం.లా: 40 మార్కులు
* ఇది ఇంటర్‌ చదివిన అన్ని గ్రూపులవారికీ కొత్త సబ్జెక్టే. పరీక్షల్లో ప్రతీ ప్రశ్ననూ ఎటువంటి డొంకతిరుగుడూ లేకుండా నేరుగా అడుగుతారు.
* సబ్జెక్టుపరంగా వివాదాస్పద అంశాలు ఎక్కువ కాబట్టి చదువుతున్న పుస్తకం మినహా వేరే వాటిని పరీక్షల ముందు చదవకూడదు.
* సీపీటీ పాస్‌/ ఫెయిల్‌ నిర్ధారించే సబ్జెక్టుగా ఎం.లా కు పేరు.
* సీపీటీ పరిధిలో సెక్ష¹న్‌ నంబర్లు, కేస్‌ స్టడీస్‌, రచయితల (ఆథర్‌) పేర్లు, నిర్వచనాలను గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదు.
* అన్ని చాప్టర్లలోనూ identify the correct/ incorrect/ all of the above/ none of the above questions ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు చదివి సమాధానం పెట్టాలి.
* ఈ సబ్జెక్టులో ముఖ్యమైన చాప్టర్లు- ఇండియన్‌ పార్ట్‌నర్‌షిప్‌ యాక్ట్‌, సేల్స్‌ ఆఫ్‌ గూడ్స్‌ యాక్ట్‌

ఎకనామిక్స్‌: 50 మార్కులు
* పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల్లో 15 నుంచి 20 ప్రశ్నలు తేలికగా, నేరుగా అడిగేవిగా ఉంటున్నాయి.
* ఎకనామిక్స్‌లోని అన్ని చాప్టర్లకీ సమప్రాధాన్యం ఇచ్చి చదవాలి.
* డయాగ్రమ్‌లు, నిర్వచనాలు, ఆథర్‌ పేర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
* మైక్రో ఎకనామిక్స్‌లో ప్రాబ్లమ్స్‌ వస్తే తికమకకు గురవకుండా ఒకటికి రెండుసార్లు ప్రశ్నను చదివి, సమాధానం గుర్తించాలి.
* మైక్రో ఎకనామిక్స్‌లో డయాగ్రమ్‌లు ఉన్నాయి. డయాగ్రమ్‌లను విశ్లేషణ చేయగలగాలి.
* మాక్రో ఎకనామిక్స్‌లో ఫాక్ట్స్‌, ఫిగర్స్‌ (సంవత్సరాలు, పర్సంటేజీలకు సంబంధించిన సమాచారం) చాలా ముఖ్యమైనవి.
* మైక్రో ఎకనామిక్స్‌లో ముఖ్యమైన చాప్టర్లు- థియరీ ఆఫ్‌ కన్సూ్యమర్‌ బిహేవియర్‌, కాస్ట్‌ అనాలిసిస్‌, ప్రొడక్షన్‌ అనాలిసిస్‌, ప్రైస్‌ అండ్‌ అవుట్‌పుట్‌ డిటర్మినేషన్‌.
క్యూటీ మేథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌: 50 మార్కులు

మేథమేటిక్స్‌: ఈ సబ్జెక్టులోని సూత్రాలు చాలా ముఖ్యం.
* సీఈసీ విద్యార్థులు తప్పకుండా ఎంసీక్యూలను ఎక్కువసార్లు సాధన చేసుకోవాలి.
* ఎక్కువ ఎంసీక్యూలు పొడవుగా ఉంటాయి. అందుకని పునశ్చరణ సమయంలో ఎక్కువసార్లు ఈ తరహా వాటిని సాధన చేయాలి.
* అన్ని చాప్టర్లకు సంబంధించిన సూత్రాలన్నింటినీ ఒకచోట రాసిపెట్టుకుంటే పునశ్చరణ తేలికవుతుంది.
* ప్రతీ చాప్టర్‌లోని సమస్యలను సాధన చేసిన తర్వాత ఆ సమస్యలకు సంబంధించిన సూత్రాలను చూడకుండా రాస్తే మంచిది.
* పెద్దవిగా ఉన్న, కష్టమనిపించిన ఎంసీక్యూలకు చివర్లో సమాధానాలను రాయాలి.
* కాలిక్యులేటర్‌ను వేగంగా ఉపయోగించేలా సాధన చేయాలి.
* అన్ని చాప్టర్ల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. నిడివిగా ఉన్న చాప్టర్ల కంటే సులభంగా తక్కువ పరిమాణంలో ఉండే చాప్టర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు.
* ఈ సబ్జెక్టులో ముఖ్యమైన అధ్యాయాలు- లిమిట్స్‌, డెరివేటివ్స్‌, ఇంగ్రేషన్స్‌, పర్మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్స్‌, మేథమేటిక్స్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌.

స్టాటిస్టిక్స్‌: ఈ సబ్జెక్టులో సూత్రాలు చాలా ముఖ్యం. వీటి పునశ్చరణకు రోజూ కొంత సమయం కేటాయించాలి.
* ఈ సబ్జెక్టులోని సూత్రాలన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తే తప్ప వీటి మధ్య తేడాలను గుర్తించలేరు.
* చాలామంది విద్యార్థులు పరీక్షల్లో సరైన సూత్రాలు గుర్తుకురాక మార్కులను పోగొట్టుకుంటారు. ఈ సబ్జెక్టులో ప్రాబ్లమ్స్‌కే కాకుండా థియరీకి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఇంటర్‌లో మేథ్స్‌ సబ్జెక్టు చదవని విద్యార్థులకు సీపీటీలో స్టాటిస్టిక్స్‌ చాలా ముఖ్యం.
* పరీక్షల్లో 30 నుంచి 40% ఎంసీక్యూలను థియరీ మీదే అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధవహించాలి.
* ప్రతి అధ్యాయానికీ సన్నద్ధమయ్యేటపుడు ప్రాధాన్యం ఉన్న అంశాలు, సూత్రాలను హైలైట్‌ చేసుకోవాలి.
* ఈ సబ్జెక్టులో ముఖ్యమైన అధ్యాయాలు- ప్రాబబిలిటీ, థియరిటికల్‌ డిస్ట్రిబ్యూషన్స్‌, శాంప్లింగ్‌, స్టాటిస్టికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ డేటా.

టాపర్‌ సూచనలివిగో!
2017 జనవరి సీపీటీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో మార్కులు (195) సాధించిన టి. హేమంత్‌ కుమార్‌ చెప్తున్న మెలకువలు...
* తెలియని అంశాలను వదిలేసి, తెలిసిన అంశాలను పునశ్చరణ చేయాలి.
* కాగితం, కలంతో రాసే పరీక్ష కాబట్టి తుది పరీక్ష జరిగే సమయంలోనే నమూనా పరీక్షలను రాయాలి.
* నమూనా పరీక్ష రాసిన తరువాత, మొదటగా తెలిసిన ప్రశ్నలు ఎన్నింటికి తప్పు సమాధానాలు గుర్తించారో గమనించాలి. ఆ తప్పులు తర్వాతి పరీక్షలో రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
* తెలియని ప్రశ్నల్లో కూడా సులువుగా నేర్చుకోగల ప్రశ్నలు ఏమున్నాయో తెలుసుకోవాలి. వాటిని అభ్యాసం చేయడానికి ప్రయత్నించాలి.
* వివాదాస్పదమైన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఇలాంటి ప్రశ్నలకు అధ్యాపకులు ఏ సమాధానాన్ని బలపరిచారో దాన్ని అదేవిధంగా తీసుకోవడం మేలు. ప్రశ్నలోని 4 సమాధానాలను సరిగా చదవడం అలవాటు చేసుకోవాలి.
* సమస్య సాధన విధానాన్ని మెరుగుపరచుకోవాలి. అందులో వేగం పెంచుకోవాలి. అది నిరంతర సాధనతోనే సాధ్యమవుతుంది.
* గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. వాటికి సమాధానాలను సంపాదించి, సాధన చేయాలి.
* ప్రతి ప్రశ్న సాధనకూ కాలపరిమితిని విధించుకోవాలి. అలా సాధన చేస్తూ వేగం పెంచుకోవాలి.
* సాధన సమయంలోనే తప్పులను విశ్లేషించుకోవాలి. కష్టంగా అనిపిస్తున్న, వేగాన్ని నియంత్రిస్తున్న విషయాలను గ్రహించి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి.
* తార్కికంగా (లాజికల్‌) ఆలోచించడం నేర్చుకోవాలి. స్టెప్పులవారీగా జవాబు ఉండేలా సాధన చేయాలి. ఆ రకంగా ఆలోచన కూడా ఉండాలి. అనవసరమైన ఆలోచనలను వెంటనే తుంచేయాలి.


Back..

Posted on 12-06-2017