Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సత్తా ఉంటే.. మీరూ కావొచ్చు కలెక్టర్‌!

* విజేత కావాలంటే అకుంఠిత దీక్ష చాలు

‘‘ నీ మార్గం నువ్వు మార్చుకోవచ్చు.. నిరంతర పోరాట పటిమతో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవచ్చు. మీరు తలచుకుంటే ఏమైనా కావొచ్చు. కలలు కనండి.. వాటి సాకారానికి నిరంతరం శ్రమ జీవనం ద్వారా లక్ష్య సిద్ధిని చేరుకోండి.’’ - ఏపీజే అబ్దుల్‌ కలాం

‘‘ కొండలు పిండికాని.. మంచు రగిలి మంటలు రాని.. సముద్రాలన్ని ఏకం కాని.. మిన్ను విరిగి మీద పడని.. ఓ వీరుడా, శురుడా.. ఆదరకు.. బెదరకు.. ఆత్మ విశ్వాసం చెదరనివ్వకు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. అంతిమ విజయం అందుకో.’’ - ప్రపంచ గతిని మార్చిన స్వామి వివేకానంద చెప్పిన ఈ సూక్తి ఎంతోమందిని విజయతీరాలకు చేర్చింది.

ప్రతిభ నీ ఆస్తి అయితే... పట్టుదల నీ ఆకలిగా మారితే.. కసిని రగిలించు... ఒడిదొడుకులతో ఆడుకో.. ఎందుకు సాధించలేనని నిన్ను నువ్వే ప్రశ్నించుకో.. చివరకు విజయం నిన్ను ఎత్తుకొని ముద్దాడుతుంది...
అమరావతి: గడచిన ఐదేళ్లలో ఐఐటీ.. సివిల్స్‌ పరీక్షా ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే కడు పేదస్థాయిలో ఉన్నవారి కొడుకులు, కూతుళ్లు అత్యున్నతస్థాయిలో మెరుస్తున్నారు. చదువుల తల్లినే నమ్ముకొని... పేదరికాన్ని తరిమేస్తున్నారు. ఇప్పటివరకు పెద్ద కొలువలు, అత్యున్నత శిఖరాలు అంటే ఉన్నతవర్గాలకు.. శిక్షణ అద్భుతంగా తీసుకున్న వారికే అన్న పాత నానుడిని పక్కన పెడుతున్నారు. యూపీపీఎస్సీ గత దశాబ్దపు నివేదికల్లోని మొదటి 100 ర్యాంకులను పరిశీలిస్తే దాదాపు 35 శాతం మంది పేదిరికం నుంచే అత్యున్నత ఉద్యోగాలు సాధించినట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా, పలాసకు చెందిన గోపాళకృష్ణ ఎలాంటి శిక్షణ లేకుండానే.. ఇంగ్లిషు రాకుండానే సివిల్స్‌ను జాతీయస్థాయిలో మెరిసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.

ప్రాథమిక అవగాహన..
21 ఏళ్ల వయసు కలిగి... సాధారణ డిగ్రీ ఉత్తీర్ణులైన ఏ భారతీయ పౌరుడైనా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) ఏటా నిర్వహించే సివిల్స్‌ పరీక్షలను రాయవచ్చు. మొదటిదశలో వడపోత పరీక్ష అయిన ప్రిలిమినరి ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దూరవిద్య ద్వారా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు కూడా పరీక్ష రాయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను బట్టి మెయిన్స్‌ పరీక్షకు ప్రిలిమ్స్‌ నుంచి ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో వ్యాసరూప విధానంలో రెండు ఐచ్ఛిక పేపర్లు, రెండు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, చరిత్ర, అర్థశాస్త్రం, భూగోళ శాస్త్రం, దేశ.. ప్రపంచ రాజకీయ వ్యవస్థలు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, సమకాలీన సామాజిక సమస్యలు.. పరిష్కారాలు, భావవ్యక్తీకరణ అంశాలను పరీక్షిస్తారు. మూడోదశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులోనూ ప్రతిభను పరిగణనలోకి తీసుకుని విజేతలను సివిల్స్‌ ద్వారా భర్తీచేసే 20 అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో పాఠ్యాంశం పట్ల లోతైన అవగాహన, జీవన నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ, భావప్రసార నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఎంపికైన తర్వాత ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో శిక్షణ ఉంటుంది.
* 21 నుంచి 31 ఏళ్లలోపు సివిల్స్‌ ప్రాథమిక పరీక్షను ఓసీలు ఆరుసార్లు రాయవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 37 సంవత్సరాల వయోపరిమితి ఉంది. వారు ఎన్నిసార్లయినా రాయవచ్చు. బీసీలకు 35 ఏళ్లు వయోపరిమితి ఉంది.
* ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ తర్వాత అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి ఎక్కువమంది అభ్యర్థులు సివిల్స్‌కు ఎంపికవుతున్నారు.

నిర్దుష్టమైన ప్రణాళిక
సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగ సాధనకు ఏకైక ఉత్తమ మార్గం నిర్దుష్టమైన ప్రణాళిక. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు గంటల పాటు క్రమం తప్పకుండా ప్రామాణికత కలిగిన దినపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా సమకాలీన అంశాలపట్ల రాజకీయ, ఆర్థిక, సామాజిక, అంతర్జాతీయ విషయాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఆంగ్ల మాధ్యమంలో ఉన్న మ్యాగజైన్లను, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేసే నివేదికలను క్రమం తప్పకుండా అధ్యయనం చేయాలి. విశ్లేషించాలి. ఇలా చేయడం ద్వారా పక్కా ప్రణాళికతో చదవడం ద్వారా 82 శాతం మంది అభ్యర్థులు విజయం సాధించినట్లు వారి ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

విద్యార్థి భూమిక
సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పరిపూర్ణ విశ్వాసమే విజయానికి తొలిమెట్టు. నేను సాధించగలను.. నేను కష్టపడగలను.. నేను ఏదైనా సాధించగలననే నమ్మకమే అద్భుతం. ఆత్మవిశ్వాసంతో.. ప్రయత్నం ద్వారా.. సాధన ద్వారా మీరు విజయం సాధించగలరని నమ్మండి. మీ లక్ష్యాన్ని ఒడిదొడుకులను ఎప్పటికప్పుడు అంతర్మధనం చేసుకుంటూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఎంపికైన వారిని ఇంటర్వ్యూలను.. వారు తయారైన విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు సాగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దు.

గురువుల నుంచి స్ఫూర్తి
ఒక గురువు తన కలను మంచి శిష్యుడిలో చూసుకుంటాడు. వారికి శిష్యుడు పొందిన విజయం ఎంతో అపురూపం. గురువులు బట్టి పట్టే విధానాన్ని మాన్పించి.. విషయాన్ని వారికి చెప్పే విధానంలోకి రావాలి. కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా సామాజిక పరిస్థితులను వివరించాలి. సామాజిక, వర్తమాన విషయాలపై పిల్లల్లో ఆసక్తిని రగిలించాలి. పాఠం చెప్పేటపుడు పిట్టకథలు, కొత్త విషయాలను చెబుతూ ఆసక్తిగా చెబితే చిన్ననాటి నుంచే గురువులు చెప్పే ప్రతిమాట వారికి గుర్తుంటుంది. పిల్లలకు ఒక్కసారి గురువుపై గురి కుదిరితే... వారు చెప్పే ప్రతి మాట వింటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక వారు ఎలా తీర్చిదిద్దితే వారు అలా తయారవుతారు. నిరంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల్లా ఉండాలి. పిల్లలకు గొప్ప దారిని చూపించాలి.

తల్లిదండ్రులు ఏం చేయాలి..?
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గుంటి మార్టిన్‌రావు, హెలెన్‌ దంపతులిద్దరూ ఉపాధ్యాయులే. వారు తమ పెద్ద కుమారుడు ప్రదీప్‌ను అత్యున్నతస్థాయి అధికారిగా చూడాలని అతను బాల్యదశలో ఉన్నప్పటి నుంచే కలలు కన్నారు. అదే విషయాన్ని ప్రదీప్‌కు వివరిస్తూ చదువులో మొదట్నుంచి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఒత్తిడితో కూడిన చదువు కాకుండా ఆత్మవిశ్వాసం.. మంచి భవిష్యత్తుకు, సామాజిక సేవకు అవకాశం ఉన్న ఉద్యోగం సివిల్స్‌ అని వివరించడంతో ఆ యువకుడు స్ఫూర్తి పొందాడు. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేశాడు. ఐపీఎస్‌ అధికారిగా ఎంపికై దేశానికి సేవలందిస్తున్నాడు. ఇదే తల్లిదండ్రుల ప్రోత్సాహం. పిల్లలను వూరికే ఒత్తిడి చేయకుండా.. వారికి స్ఫూర్తి నింపాల్సిన సమయంలో మీ పని మీరు చేయండి. అది వారికి టానిక్‌లా పనిచేస్తుంది.


Back..

Posted on 02-06-2017