Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మానేసినా.. మరో ఛాన్స్‌!

* రెండో ఇన్నింగ్స్‌కు వివిధ సంస్థల ప్రత్యేక ప్రోగ్రామ్‌లు

అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగ జీవితంలో కొంత విరామం వస్తుంది. ఆ దశ దాటి, తిరిగి కెరియర్‌ను కొనసాగించాలని వుంటుంది. ఎలా ముందుకు సాగాలో తెలియదు. ఇలాంటి దశను ముఖ్యంగా యువతులు ఎదుర్కొంటుంటారు. ఒక్క అవకాశం వస్తేనా.. అని ఎదురుచూస్తుంటారు. ‘కెరియర్‌ను పునః ప్రారంభించాలనుకున్నవారికి ఆ అవకాశం మేమందిస్తాం’ అంటున్నాయి కొన్ని సంస్థలు. వాటి వెబ్‌సైట్‌లను తరచూ గమనిస్తూ ప్రకటన వచ్చినపుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటివారి నుంచి మౌఖికపరీక్ష ద్వారా కొందరిని ఎంపిక చేసుకుని, శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఉత్సాహంగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాలనుకుంటున్నవారిని ప్రోత్సహిస్తున్నాయి!

స్మిత.. బీటెక్‌ పూర్తయ్యాక రెండేళ్లపాటు ఉద్యోగం చేసింది. ఆపై బాబు ఆలనాపాలనా చూసుకోవడానికి కెరియర్‌ను పక్కన పెట్టింది. అలా ఆరేళ్లు గడిచాక తిరిగి తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంది. ఆరు నెలల్లో కార్పొరేట్‌ ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టింది.

ఈ ఉదాహరణ వింటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ‘జాబ్‌ మార్కెట్‌లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఏటికేడాది నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు మారిపోతున్నాయి. అలాంటిది ఆరేళ్ల తరువాత కోరుకున్న ఉద్యోగంలోకి అడుగుపెట్టడం ఎలా సాధ్యం?’ అని! అది సాధ్యమేనంటూ అవకాశాలిస్తున్నాయి కొన్ని సంస్థలు.

కెరియర్‌ను మగవారితో సమానంగా ప్రారంభించినా ఏదో ఒకదశలో కామా పెట్టడం యువతులకు తప్పనిసరి. పెళ్లి, మెటర్నిటీ, స్థలమార్పిడి వంటివి ఇందుకు ప్రధాన కారణాలవుతున్నాయి. కొంతకాలం విరామం తరువాత తిరిగి కెరియర్‌ను ప్రారంభించాలనుకున్నా కొందరి విషయంలో అది ఆచరణలోకి రావటంలేదు. సెంటర్‌ ఫర్‌ టాలెంట్‌ ఇన్నొవేషన్‌ (సీటీఐ) నివేదిక ప్రకారం దేశంలో 36% మంది వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ విరామం తీసుకుంటుంటే వారిలో 58% మంది మాత్రమే తిరిగి ఫుల్‌టైం ఉద్యోగాల్లో చేరగలుగుతున్నారు.

చాలామంది తమ అర్హతలకు తగిన వాటిని పొందలేకపోతున్నారు. కుటుంబానికి ఆర్థిక ఆసరా అవసరమైతే పరిస్థితులకు సర్దుకుపోతున్నవారూ ఉన్నారు. ఒక చిన్న విరామం ప్రతిభకు అవరోధం కాకూడదనే ఉద్దేశంతో కొన్ని సంస్థలు మహిళలకు తిరిగి ఉద్యోగంలో చేరేలా ప్రత్యేక ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఏదైనా సంస్థలో సంబంధిత రంగంలో కనీస అనుభవం ఉన్నవారిని ఎంచుకుని, కొంత శిక్షణనిచ్చి, ఉద్యోగానికి తిరిగి సిద్ధం చేస్తున్నాయి. పైగా వయఃపరిమితి లేదు. చాలావరకూ ప్రోగ్రామ్‌ సమయంలో వేతనం చెల్లిస్తున్నాయి కూడా!

ఆక్సెంచర్‌- కెరియర్‌ రీబూట్‌
కెరియర్‌ బ్రేక్‌ తరువాత తిరిగి ఉద్యోగంలోకి చేరడానికి అవసరమైన నైపుణ్యాలను మెంటర్ల ఆధ్వర్యంలో అందిస్తారు. ఇందులో భాగంగా పరిశ్రమ నిపుణులు, వాటి లీడర్‌షిప్‌ టీమ్‌లతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తారు. వీరు కెరియర్‌ పునరుద్ధరణకు అవసరమైన నైపుణ్యాలు, చిట్కాలు అందిస్తారు. ఆరు నెలలపాటు ఈ ప్రోగ్రామ్‌ సాగుతుంది. నచ్చిన విభాగం/ రంగాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్‌- అకౌంటింగ్‌, బీపీఓ నేపథ్యం వారికి ఇది అనుకూలం. రెజ్యూమెను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతోపాటు అవసరమైన వివరాలను అందించాల్సి ఉంటుంది. సంస్థ ప్రతినిధులు అభ్యర్థిని సంప్రదించి, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
https://www.accenture.com/in-en/careers/career-reboot

కాప్‌జెమినీ- కాప్టివేట్‌
వృత్తి నిపుణులై ఉండి, తిరిగి ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించాలనుకునేవారికి సాయం అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండి, కనీసం ఏడాదిపాటు విరామం తీసుకున్నవారు దీనికి ప్రయత్నించవచ్చు. వెబ్‌సైట్‌లో తమ అనుభవానికి తగ్గవాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక నైపుణ్యాలు, గత ఉద్యోగ హోదా, నిర్వహించిన బాధ్యతలు మొదలైనవాటిని పరిశీలిస్తారు. అర్హత గలవారిని టెక్నికల్‌, మేనేజీరియల్‌ ఇంటర్వ్యూ నిమిత్తం పిలుస్తారు. అవసరమైన శిక్షణ, నైపుణ్యాలను అందిస్తారు. మెంటరింగ్‌, నిపుణులతో సంప్రదింపులు జరిపే అవకాశాన్ని కల్పిస్తారు. టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలవారు దీనికి ప్రయత్నించవచ్చు.
https://www.capgemini.com/in-en/

హిందుస్థాన్‌ యూనిలీవర్‌- కెరియర్‌ బై చాయిస్‌
మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, సప్లై చెయిన్‌, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ల్లో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. పని గంటలు, దినాలను ఎంచుకునే వీలును కల్పిస్తున్నారు. ఎంపికైనవారికి ఇన్‌ హౌజ్‌ ట్రైనింగ్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌, వివిధ రంగాల నిపుణులతో కలిసి పనిచేయడం వంటి మూడు విధానాల్లో శిక్షణనిస్తారు. అభ్యర్థి అర్హతలనుబట్టి ప్రాజెక్టులను కేటాయిస్తారు. వీరితోపాటు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేలా, కలిసి పనిచేసేలా ఒక మెంటర్‌ను కేటాయిస్తారు. వీరు అభ్యర్థికి అవసరమైన మెలకువలను నేర్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు రెజ్యూమెను సంస్థ మెయిల్‌ ఐడీకి పంపాల్సి ఉంటుంది. ముంబయిలో మాత్రమే ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.
https://www.hul.co.in/careers/professionals/career-by-choice/

టాటా- ఎస్‌సీఐపీ
టాటా- సెకండ్‌ కెరియర్స్‌ ఇన్‌స్పైరింగ్‌ పాసిబిలిటీస్‌ (ఎస్‌సీఐపీ). నచ్చిన చోట, నచ్చిన దానిలో, నచ్చిన సమయంలో, వీలైన వేగంతో పనిచేయడం అనే కాన్సెప్ట్‌తో పనిచేస్తోందీ ప్రోగ్రామ్‌. ప్రాజెక్టులు (3-6 నెలలు), కన్సల్టెంట్‌ (6-12 నెలలు), ఫుల్‌ టైంల్లో అభ్యర్థి తనకు నచ్చినదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం వరుసగా రెండేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. ఒక నెల నుంచి ఏళ్లపాటు విరామం తీసుకున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం ఖాళీగా ఉండాలి. కెరియర్‌ డొమైన్లు- మార్కెటింగ్‌, లీగల్‌, కార్పొరేట్‌ ప్లానింగ్‌, అడ్వర్టైజింగ్‌/ కమ్యూనికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఇంజినీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌, రిటైల్‌, సేల్స్‌, డిజైన్‌, సీఎస్‌ఆర్‌, ఫైనాన్స్‌/ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర కార్పొరేట్‌ ఫంక్షన్స్‌. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అందుబాటులో ఉన్నవాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైనవారిని సంస్థ ప్రతినిధులు సంప్రదిస్తారు.
http://www.tatasecondcareer.com/index.asp

ఏ సంస్థలో ఏ ప్రోగ్రామ్‌?
గోద్రెజ్‌- కెరియర్‌ 2.0
ప్రోగ్రామ్‌ వ్యవధి 3 నుంచి 6 నెలల వరకు ఉంటుంది. కనీసం రెండేళ్ల అనుభవం ఉండి, ఆరు నెలలకు పైగా విరామం తీసుకున్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మాన్యుఫాక్చరింగ్‌/ ఇంజినీరింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌, లీగల్‌ అండ్‌ ఆడిట్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, స్ట్రాటజీ/ జనరల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలకు చెందినవారే అర్హులు. ఆసక్తి ఉన్నవారు సంస్థ వెబ్‌సైట్‌లో ఇచ్చిన మెయిల్‌ ఐడీకి తమ రెజ్యూమెను పంపాల్సి ఉంటుంది. అర్హులను గుర్తించి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ప్రాజెక్టులను కేటాయిస్తారు. ప్రాజెక్టులో అభ్యర్థికి సాయపడేలా, కలిసి పనిచేసేలా ఒక మెంటర్‌ను కేటాయిస్తారు. దీని ద్వారా అవసరమైన శిక్షణతోపాటు, నెట్‌వర్కింగ్‌ అవకాశాలనూ పొందొచ్చు.
https://www.godrejcareers.com/careers2.0.aspx

గోల్డ్‌మన్‌ శాక్స్‌- రిటర్న్‌షిప్‌
ప్రోగ్రామ్‌ కాలవ్యవధి 8 వారాలు. రెండు, అంతకుమించిన సంవత్సరాల విరామం తీసుకున్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థలోని వివిధ విభాగాలు, నెట్‌వర్క్‌తో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తారు. గతంలో అభ్యర్థి పనిచేసినప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా ఆధారంగా అవసరమైన నైపుణ్యాలను అందిస్తారు. కొత్త విభాగంలో నైపుణ్యం సాధించే అవకాశం కల్పిస్తారు. ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రకటన విడుదల చేస్తారు. ఆసక్తి ఉన్నవారు మెయిల్‌ ద్వారా సంప్రదించాల్సి ఉంటుంది. అర్హులైనవారిని సంస్థ ప్రతినిధులు సంప్రదిస్తారు.
https://www.goldmansachs.com/careers/professionals/returnship/

ఐబీఎం- టెక్‌ రీ ఎంట్రీ ప్రోగ్రామ్‌
విరామం తీసుకున్న వృత్తి నిపుణుల కోసం రూపొందించారు. కనీసం రెండేళ్ల విరామం తీసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో జాబ్‌ ప్రాజెక్టులు, కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకునే వీలు, మల్టీ డిసిప్లినరీ విభాగాలతో పనిచేసే వీలుంటుంది. క్లౌడ్‌ సేల్స్‌ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి అనుకూలం. ప్రతి ఒక్కరికీ మెంటర్‌ ఉంటారు. వీరు కొత్త టెక్నాలజీలనే నేర్పించడంతోపాటు రియల్‌ టైం ప్రాజెక్టులపై పనిచేసే వీలును కల్పిస్తారు. ప్రోగ్రామ్‌ పూర్తయ్యాక అవసరమైతే ఫుల్‌ టైం ఎంప్లాయ్‌మెంట్‌ అవకాశాలనూ కల్పిస్తారు. ఏడాదిలో నిర్ణీత సమయంలో ప్రకటన విడుదల చేస్తారు. అప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ నిర్వహించి అవకాశం కల్పిస్తారు.
https://www.ibm.com/in-en/employment/techreentry.html


Back..

Posted on 20-08-2019