Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆపదల వేళ.. అభయ హస్తాలు!

* కెరియర్‌: విపత్తు నిర్వహణ

అంపన్‌ అలా వెళ్లిందో లేదో నిసర్గ వచ్చింది. రేపు మరొకటి రాకూడదని లేదు. ఎందుకంటే తుపాన్లూ, ప్రకృతి వైపరీత్యాలూ భారత్‌ లాంటి దేశాలకు సర్వసాధారణం. భూకంపాలు..సునామీలు.. విషవాయువుల లీకేజీ.. అగ్ని కీలలు.. వరదలు. ఘోర ప్రమాదాలు... దుర్ఘటనలేమైనా కావచ్చు; ఆపద్బాంధవుల్లా రక్షించడంలో ముందుంటారు డిజాస్టర్‌ నిపుణులు.పెరుగుతోన్న ప్రమాదాల దృష్ట్యా విపత్తు నిర్వహణకు ప్రాధాన్యం పెరిగింది. అందుకే దీన్ని కెరియర్‌గా మలచుకుంటే కష్టకాలంలో కర్తవ్యాన్ని నిర్వర్తించిన సంతృప్తితోపాటు చక్కని వేతనాన్నీ అందుకోవచ్చు!

మన దేశ భౌగోళిక స్వరూపం, జనాభా, విస్తీర్ణపరంగా ఎక్కువ విపత్తులకు అవకాశాలున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాలకు అయితే వరదలు, లేదంటే కరవు తప్పడం లేదు. ఉత్తర, ఈశాన్య భారతానికి భూకంప ముప్పు ఎక్కువ. వాయవ్య ప్రాంతం కరవుకు నిలయం. ఎటుచూసినా ఎడారి మయం. తుపాన్లకు చిరునామా తీరప్రాంతం. ఇలా మొత్తంగా చూసుకుంటే భారతదేశం విపత్తు పొంచివుండే ప్రాంతం కిందికే వస్తుంది. కొండచరియలు విరిగిపడడం, అడవుల్లో అగ్నికీలలు, రహదారి ప్రమాదాలు, పరిశ్రమల నుంచి విషవాయువులు...ఇవన్నీ మన దగ్గర సాధారణం. ఇన్ని ప్రతికూలతల దృష్ట్యా మన దేశానికి సమర్థ విపత్తు నిర్వహణ నిపుణులు ఎంతో అవసరం. ఈ దిశగా ఏర్పాటు చేసిందే నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ).దీనికి అనుబంధంగా రాష్ట్రాలవారీ ఎస్‌డీఎంఏలు ఉంటాయి. విపత్తు ఎలాంటిదైనా మార్గదర్శకాలు, సేవలు వీటిద్వారానే అందుతాయి.

నిర్వహణ ఇలా...
సహజంగా వచ్చే విపత్తులు కొన్నైతే, మానవ చర్యల ఫలితంగా ఏర్పడేవి మరికొన్ని. తుపానులు, సునామీల్లో మానవ ప్రమేయం ఉండదు. పరిశ్రమల నుంచి విషవాయువులు వెలువడడం, రహదారి, రైలు ప్రమాదాలు లాంటివి మానవ తప్పిదాల కారణంగా జరుగుతున్నాయి. విపత్తు నిర్వహణ నిపుణులు ఆపద ఉన్నచోట ప్రత్యక్షమై, తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో పూర్తిచేస్తారు. తుపానుల విషయంలో ముందుగా కొంత ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభావిత ప్రాంతంలోనివారిని సురక్షిత స్థావరాలకు తరలించే బాధ్యతను డిజాస్టర్‌ నిపుణులు తీసుకుంటారు. ఆ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలన్నీ పాటించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత తక్కువకు పరిమితం చేస్తారు.ఎవరైనా నీటిలో మునిగిపోతే కాపాడడానికి వాటర్‌ ప్రూఫ్‌ జాకెట్లు, చిన్న బోట్లు లేదా పడవలు లాంటివి సిద్ధం చేసుకుంటారు. రహదారులపై చెట్లు కూలితే వాటిని తొలగించడం, ఇళ్లు నీటమునిగితే అందులోనివారిని రక్షించడం, విద్యుత్తు స్తంభాలు, సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవడం....ప్రమాదాలు ఎదుర్కోవడానికి వీరి దగ్గర ఆచరణీయమైన ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ప్రమాదానికి ముందు, ప్రమాద వేళలో, ప్రమాదం తర్వాత అనే 3 విధాల ప్రణాళికతో చాకచక్యంగా వ్యవహరిస్తారు.

అవకాశాలు
భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రాధాన్యం పెరుగుతోంది. అందువల్ల భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.టీచింగ్, రిసెర్చ్, కన్సల్టెన్సీ, డాక్యుమెంటేషన్, ట్రైనింగ్‌ ఆర్గనైజర్, ఫీల్డ్‌ ట్రైనర్, మాక్‌ డ్రిల్లర్‌ ఎక్స్‌పర్ట్‌ తదితర సేవలు వీరు అందిస్తారు. ఎన్జీవోలు, వరల్డ్‌ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి, యునెస్కో, రెడ్‌ క్రాస్‌ మొదలైన సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి. జాతీయ విపత్తు నిర్వహణకు చెందిన సంస్థలు, విభాగాల్లో వీరి సేవలు కీలకం. ప్రభుత్వ, కార్పొరేట్‌ సంస్థలు డిజాస్టర్‌ విభాగాల్లో వీరిని నియమించుకుంటున్నాయి.

సివిల్‌ సర్వీసెస్, గ్రూప్స్‌ పరీక్షల్లో విపత్తు నిర్వహణ ఓ ముఖ్యాంశం. ఇంటర్‌ ఏ గ్రూపు విద్యార్థులైనా ఈ సబ్జెక్టులో డిగ్రీలో చేరొచ్చు. ఏరకమైన డిగ్రీ చేసినవారైనా దీనిలో పీజీ చేయొచ్చు!

ఇవీ సంస్థలు...
* టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌): డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సు అందిస్తోంది. ఇందులో చేరినవారు డిజాస్టర్‌ పాలసీ అండ్‌ యాక్షన్, డిజాస్టర్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్, టెక్నాలజీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఈ మూడింటిలో ఏదో ఒక స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. కోర్సులో నాలుగు సెమిస్టర్లు. ఒక సెమిస్టర్‌ (మొదటి ఆరు నెలలు) పూర్తి చేసుకుని వైదొలిగితే సర్టిఫికెట్, రెండు సెమిస్టర్లు పూర్తిచేసుకుని వెళ్లిపోతే డిప్లొమా ప్రదానం చేస్తారు. నాలుగు సెమిస్టర్లూ చదివినవారికి పీజీ డిగ్రీ అందుతుంది. కోర్సు మధ్యలో వైదొలిగినవారు అయిదేళ్లలోపు మళ్లీ చేరవచ్చు.
* స్వయం పోర్టల్‌: డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో 12 వారాల కోర్సు
* జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ: ఎంఏ డిజాస్టర్‌ స్టడీస్‌
* ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం: సర్టిఫికెట్, పీజీ డిప్లొమా కోర్సులు
* పంజాబ్‌ యూనివర్సిటీ: ఎంఏ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
* త్రిపుర యూనివర్సిటీ: ఎంఏ/ ఎమ్మెస్సీ జాగ్రఫీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌: పీజీ డిప్లొమా ఇన్‌ నేచురల్‌ హజార్డ్స్‌-డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌
* ఐఐటీ రూర్కీ: ఎంటెక్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (బీటెక్‌ వారికోసం)
* గ్లోబల్‌ ఓపెన్‌ వర్సిటీ: ఎమ్మెస్సీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
* జామియా మిల్లియా ఇస్లామియా: ఎమ్మెస్సీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ సస్టెయినబిలిటీ స్టడీస్‌
* బరోడా వర్సిటీ: పీజీ డిప్లొమా ఇన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
* దేవీ అహల్య వర్సిటీ: ఎంబీఏ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
* భారతీ విద్యాపీఠ్‌: పీజీ డిప్లొమా ఇన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
* గురు గోవింద్‌సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ: ఎంబీఏ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (వీకెండ్‌ ప్రోగ్రాం)

ఏ లక్షణాలు అవసరం?
విపత్తు నిర్వహణను కెరియర్‌గా మల్చుకోవాలంటే ఈ లక్షణాలుండాలి..
* వేగంగా స్పందించే లక్షణం
* ప్రభావంతంగా ఇతరులకు వివరించగలిగే నైపుణ్యం
* సమయ నిర్వహణపై పట్టు
* విపత్కర పరిస్థితుల్లో పనిచేయడానికి సంసిద్ధత
* ఇతరులకు సహాయపడాలనే బలమైన ఆకాంక్ష

ఎన్నో కోర్సులు...
దేశంలో చాలా విశ్వవిద్యాలయాలు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, మాస్టర్స్, రిసెర్చ్‌ స్థాయుల్లో కోర్సులు అందిస్తున్నాయి. ఏ విద్యా నేపథ్యమున్నవారైనా చేరవచ్చు. అయితే సోషియాలజీ, సోషల్‌ వర్క్, ఎకనామిక్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, జాగ్రఫీ, జియాలజీ, మెటియొరాలజీ, అగ్రికల్చరల్‌ స్టడీస్‌ గ్రాడ్యుయేట్లకు విపత్తు కోర్సులు ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి.
పోటీ పరీక్షల్లో.. అందులోనూ ముఖ్యంగా సివిల్‌ సర్వీసెస్, గ్రూప్స్‌ల్లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం ఉంది. ఇంటర్‌ ఏ గ్రూపు విద్యార్థులైనా అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరవచ్చు. ఏదైనా డిగ్రీతో పీజీ కోర్సుల్లోకి అవకాశం ఉంటుంది. కోర్సులో భాగంగా వీరు దేశ నైసర్గిక స్వరూపం, వాతావరణ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటారు. విపత్తులకు కారణాలపై అధ్యయనం చేస్తారు. ప్రమాద సమయంలో తమనితాము రక్షించుకుంటూ బాధితులను ఎలా కాపాడాలి, ప్రమాద తీవ్రతను ఏ విధంగా తగ్గించవచ్చు...మొదలైనవాటిపై వీరికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు.

Back..

Posted on 17-06-2020