Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఊహలకు రెక్కలు తొడిగే ఉద్యోగాలు!

* కెరియర్‌ గైడెన్స్‌ విజువల్‌ ఆర్ట్స్‌

సముద్రం ఒడ్డున చార్మినార్‌ .. మన ఊళ్లోనే మధుర మీనాక్షి దేవాలయం.. మళ్లీ కళ్ల ముందుకు మాహిష్మతీ రాజ్యం.. కర్నూలు కొండారెడ్డి బురుజు హైదరాబాద్‌లో ప్రత్యక్షం.. ఇవన్నీ సెట్‌ డిజైనర్ల మాయలు. అమెరికాలో అనకాపల్లిని.. అనకాపల్లిలో అమెరికాని సృష్టించేస్తారు. విజువల్‌ ఆర్ట్స్‌లో కోర్సులు చేస్తే ఇలాంటి మ్యాజిక్‌లు చేయవచ్చు. వీళ్లు ఉన్నది ఉన్నట్లు చూపిస్తారు. ఊహలకు అద్భుతమైన రూపాన్నీ ఇస్తారు. ఎంతపెద్ద ఎగ్జిబిషన్‌ అయినా సందర్శకులు ఎలాంటి ఇబ్బంది పడకుండా నిర్మిస్తారు. డిజిటల్‌ గేమ్‌లు డిజైన్‌ చేస్తారు. అలాంటి వాటిపై ఆసక్తి, అభిరుచి ఉన్నవాళ్లకు ఈ రంగం అవకాశాలతో ఆహ్వానం పలుకుతోంది.

ఊహ, సృజనాత్మకత, ఆవిష్కరణ... ఈ మూడూ కలగలసిన ఉద్యోగంలో స్థిరపడాలనుకునే యువతకు ‘విజువల్‌ ఆర్ట్స్‌’ స్వాగతం పలుకుతోంది. చిత్రకళ, సాంకేతిక పరిజ్ఞానం కలబోతగా రూపుదిద్దుకున్న ఈ రంగం ప్రస్తుతం యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఒకప్పుడు చిత్రాలు గ్యాలరీలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఆ సరిహద్దులు దాటుకొని సాంకేతిక సొగసులను అద్దుకుంటున్నాయి. చిత్రకళ, డిజైన్‌, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం ద్వారా త్రీడీ మోడల్స్‌తో ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ జరుగుతోంది.

గతంలో ఏవైనా వేడుకలు జరిగినప్పుడు రంగురంగుల విద్యుద్దీపాలతో వేదికను అలంకరించేవారు. ఇప్పుడు ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ రాకతో వేడుకల స్వరూపం పూర్తిగా మారిపోతోంది. వేదికను ఇష్టమైన ఆకృతిలోకి మార్చేస్తున్నారు. ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ ద్వారా ఒక భవనాన్ని మనిషి ముఖంలా, పెద్ద ఓడలా చూపిస్తున్నారు. సందర్భాన్ని బట్టి ఇష్టమైన రూపాలను సృష్టిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే త్రీడీ మాయాజాలంతో సృష్టికి ప్రతిసృష్టి చేసి ప్రేక్షకులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నారు. చూస్తున్నది కలో, నిజమో తెలియని పరిస్థితిని కల్పిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో ‘ఇండియా జాయ్‌’ కార్యక్రమాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తూ యానిమేషన్‌, గేమింగ్‌ పరిశ్రమకు తెలంగాణ ప్రధాన కేంద్రం అవుతోందన్నారు. ‘గేమింగ్‌, యానిమేషన్‌ రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.3 బిలియన్‌ యాక్టివ్‌ గేమర్లు ఉన్నారు. ఏడాదికి 25 శాతం వృద్ధిని గేమింగ్‌ ఇండస్ట్రీ నమోదు చేస్తోంది’ అని తెలిపారు. గేమింగ్‌ విభాగం నుంచి రూ.250 కోట్ల ఆదాయం ఉండగా ఇది 2020కి మూడు రెట్లు అవుతుందని అంచనా. హైదరాబాద్‌ నగరంలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఇమేజ్‌ టవర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. రెండు మూడేళ్లలో ఇవి ప్రారంభమవుతాయి. ఈ పరిణామాలతో విజువల్‌ ఆర్ట్స్‌ అభ్యర్థులకు అవకాశాలు పెరగనున్నాయి.

ఎలాంటి ఉద్యోగాలు?
విజువల్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చేసినవారికి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి.
స్పేస్‌మేకర్స్‌ అండ్‌ క్రియేటివ్‌ త్రీడీ టెక్నాలజిస్ట్‌లు: వీరు తమ ఆలోచనలకు త్రీడీ టెక్నాలజీ సహాయంతో సరికొత్త రూపాన్నిస్తారు. కల్పిత పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. మెకానికల్‌, ఇండస్ట్రియల్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ ఆర్కిటెక్చర్‌ డిజైన్లుచేసి త్రీడీ టెక్నాలజీలో రాణించవచ్చు.
ఎగ్జిబిషన్‌ డిజైనర్లు: ఎగ్జిబిషన్‌లోని ప్రతి భాగాన్ని ఆలోచించి డిజైన్‌ రూపొందిస్తారు. సందర్శకుల కదలికలను ఊహించి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. ఎగ్జిబిషన్‌ డిజైనర్లు లేఅవుట్‌ డిజైన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. అవసరమైన డిజైన్‌ను అభివృద్ధి చేయడం, తగిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం తదితర విధులను వీరు నిర్వహిస్తారు.
డిజిటల్‌ గేమ్‌ డిజైనర్లు అండ్‌ డెవలపర్లు: వీడియో గేమ్‌ డెవలపర్లనే వీడియో గేమ్‌ ప్రోగ్రామర్లు అంటారు. గేమ్‌ తయారీకి అవసరమైన స్కెచ్‌ ఐడియాలు, డైనమిక్స్‌ అండ్‌ మెకానిక్స్‌ను డిజైనర్ల నుంచి తీసుకుని వీడియో గేమ్‌కు తుది రూపం ఇస్తారు. డిజిటల్‌ గేమింగ్‌ డెవలపర్‌గా స్థిరపడాలంటే సృజనాత్మకత అవసరం.
ప్రోగ్రామర్లు: సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేయడం, కోడ్‌లను రాయడం వీరి ప్రధాన విధులు. అల్గారిథమ్‌లను విశ్లేషించడం, అమలుచేయడం, డేటా స్ట్రక్చర్లను అర్థం చేసుకోవడం, తార్కిక సమస్యలను పరిష్కరించడం లాంటివి చేయాల్సి ఉంటుంది.
విజువల్‌ ఆర్ట్‌ కన్సల్టెంట్లు: ఈ ఉద్యోగంలో చేరాలంటే చిత్రకళకు సంబంధించిన పరిజ్ఞానం అవసరం. బొమ్మలను వేయడంలో నైపుణ్యంతోపాటు భాష మీద మంచి పట్టూ ఉండాలి. కచ్చితమైన విద్యార్హతలు అవసరం లేదు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత అదనపు అర్హత.
ఇన్‌స్టలేషన్‌ ఆర్టిస్ట్‌: ఇదొక కళాత్మక విభాగం. ఇన్‌స్టలేషన్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలుండాలి. శిల్పకళ, పెయింటింగ్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను పూర్తిచేయాలి. సినిమా కథకు అనుగుణంగా చక్కని వాతావరణాన్ని సృష్టించడానికీ¨, సెట్టింగులు వేయడానికీ ఈ ఆర్టిస్టుల సేవలు అవసరం.
సెట్‌ డిజైనర్లు: ఒక నేపథ్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా లైటింగ్‌, ఇతర ఆధారాలను సృష్టించడం సెట్‌ డిజైనర్ల ప్రధాన విధి. డైరెక్టర్లు, ప్రొడక్షన్‌ సిబ్బందితో కలసి పనిచేసి సెట్‌ డిజైనర్లు ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తారు. దాంట్లో స్థలం, కాలం ముఖ్యమైనవి. దీని కోసం అభ్యర్థులు అనేక రకాల నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.

ఏ కోర్సులు.. ఏయే సంస్థలు?
విజువల్‌ ఆర్ట్స్‌లో వివిధ రకాల డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. అవి బ్యాచిలర్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌ (బీవీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడీఈఎస్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు విజువల్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చదవడానికి అర్హులు. డిగ్రీ తర్వాత ఎంఏ, పీహెచ్‌డీ లాంటి ఉన్నత విద్యా కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. ఈ డిగ్రీల్లో యానిమేషన్‌, డిజిటల్‌ కంపోజిషన్‌, గేమ్‌ డెవలపింగ్‌, మల్టీ మీడియా లాంటి స్పెషలైజేషన్లు ఉంటాయి.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ: గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు ఈ కోర్సు చదవడానికి అర్హులు. ప్రవేశపరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. నైపుణ్యాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రవేశపరీక్ష తప్పనిసరి. సంబంధిత నోటిఫికేషన్‌ మేలో విడుదలవుతుంది. జూన్‌/ జులైలో పరీక్ష నిర్వహిస్తారు.
ప్రముఖ సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, న్యూదిల్లీ; బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి; లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌, న్యూదిల్లీ; సర్‌ జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఆర్ట్స్‌, ముంబయి; చిత్రకళా పరిషత్‌, బెంగళూరు; కెన్‌ ఫైన్‌ఆర్ట్స్‌, బెంగళూరు; బెంగళూరు సెంట్రల్‌ యూనివర్సిటీ, బెంగళూరు; గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, చెన్నై; కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, త్రిస్సూర్‌, కేరళ; యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ, తిరువనంతపురం మొదలైనవి.
తెలుగు రాష్ట్రాల్లో: జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌; శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌; శ్రీవేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, హైదరాబాద్‌ (ఇక్కడ ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సు కాల వ్యవధి అయిదేళ్లు); యోగి వేమన యూనివర్సిటీ, కడప. మన రాష్ట్రాల్లో విజువల్‌ ఆర్ట్స్‌ పేరుతో ప్రత్యేకంగా డిగ్రీలు లేవు. ఆ విభాగాలకూ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ డిగ్రీనే ఇస్తున్నారు.
సబ్జెక్టులు: క్రియేటివ్‌ రైటింగ్‌, హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, ఇండియన్‌ కల్చర్‌ ఆర్ట్స్‌, ప్రింట్‌ మేకింగ్‌, ఆర్కిటెక్చర్‌ డ్రాయింగ్‌, స్టిల్‌లైఫ్‌, వెక్టర్‌ గ్రాఫిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ యాక్ట్‌, ఇంటీరియర్‌ సర్వీసెస్‌, డిజైనింగ్‌ ఫర్‌ వెబ్‌, మూరల్‌ డిజైన్‌, కన్వర్‌జేషనల్‌ స్కిల్స్‌, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ డిజైన్‌, త్రీడీ డిజైన్‌, రాస్టర్‌ గ్రాఫిక్స్‌, హెడ్‌ స్టడీ, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ డ్రాయింగ్‌, ఇంటీరియర్‌ సర్వీసెస్‌, ఆటోకాడ్‌, క్రియేటివ్‌ స్కల్‌ప్చర్‌, త్రీడీ డైమెన్షనల్‌ డిజైన్‌, కంపోజిషన్‌, ఇండియన్‌ ఈస్తటిక్స్‌, వెస్ట్రన్‌ ఈస్తటిక్స్‌, హిస్టరీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆర్ట్‌.

అవకాశాలు ఎక్కడ?
టీవీ, సినిమాలాంటి వినోదాత్మక రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌, హిందుస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌, వీడియోకాన్‌, విప్రో, కాగ్నిజెంట్‌, టీసీఎస్‌, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌, మింత్ర, ఫ్లుయెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, తనిష్క్‌, మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ లాంటి ప్రముఖ సంస్థలూ డిజైనింగ్‌కి సంబంధించి వీరిని నియమించుకుంటున్నాయి. ప్రకటనల కంపెనీలు, బొటిక్స్‌, ఆర్ట్‌ స్టూడియోలు, విద్యాసంస్థలు, యానిమేషన్‌, వస్త్ర పరిశ్రమల్లోనూ అవకాశాలు పొందవచ్చు.
జీతభత్యాలు: విజువల్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ, ఇతర అర్హతలు ఉన్నవారిని ఏడాదికి సుమారు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకూ వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. అనుభవం, పనిచేసే సంస్థను బట్టి ఈ మొత్తం పెరుగుతుంది. విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

కష్టానికి తగిన పేరు.. డబ్బు!
ఈ రంగంలో ఎంత క్రియేటివ్‌గా ఆలోచిస్తే అంత విలువ పెరుగుతుంది. ఈ రోజుల్లో యానిమేషన్‌ లేకుండా సినిమాలు పూర్తికావడం లేదు. చదువుకునే రోజుల్లోనే స్కిల్‌ డెవలప్‌ చేసుకునే విద్యార్థులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటోంది. విజువల్‌ ఆర్ట్స్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు డిజైన్‌ స్టూడియోలు, యానిమేషన్‌ సంస్థల్లో పనిచేయడం వల్ల 95 శాతం వరకూ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రాబ్లమ్‌ ఉండదు. మార్కెట్‌కి అనుగుణంగా రెండు, మూడేళ్లకు ఒకసారి సిలబస్‌లో మార్పులు చేస్తున్నాం. ఫైన్‌ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన విద్యార్థులు స్వశక్తితో కష్టానికి సృజనను జోడించి పేరూ, డబ్బూ సంపాదించుకోవచ్చు.

- బి. శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్‌, జేఎన్‌ఏఎఫ్‌ఏ కాలేజీ, హైదరాబాద్‌.


Back..

Posted on 03-12-2019