Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కనిపించని జీవులపై అలుపెరుగని పరిశోధన!

* కెరియర్‌ గైడెన్స్‌ మైక్రోబయాలజీ

అతి చిన్న సూక్ష్మజీవి కరోనా వైరస్‌.. భూగోళాన్ని గడగడలాడిస్తోంది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. మందులు లేని రోగాన్ని సృష్టించి అందరికీ సవాలు విసురుతోంది. తగిన మెడిసిన్‌, వ్యాక్సిన్‌ కనుక్కునే ప్రయత్నాల్లో ఇప్పుడు ప్రపంచంలోని శాస్త్రజ్ఞులంతా నిమగ్నమై ఉన్నారు. వారిలో ప్రధాన భాగస్వాములు మైక్రోబయాలజిస్టులు. వీరు కరోనాలాంటి వైరస్‌లపైనే కాకుండా బ్యాక్టీరియా, ప్రొటోజోవా వంటి సూక్ష్మజీవులపైనా పరిశోధనలు చేస్తుంటారు. మానవాళి సంక్షేమానికి పరిశ్రమిస్తుంటారు. ఇలాంటి చాలెంజింగ్‌ కెరియర్‌లోకి ప్రవేశించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

సూక్ష్మజీవులు మనలో ఉంటాయి. మన చుట్టూ ఉంటాయి. మొక్కలు, జంతువులు సహా అన్ని జీవులపైనా వీటి ప్రభావం ఉంటుంది. కొన్ని మంచికి ఉపయోగపడితే ఇంకొన్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందుకే వాటిపై నిరంతరం పరిశోధనలు జరుగుతుంటాయి. సాధారణంగా కంటికి కనిపించని ఈ జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మైక్రోబయాలజీ. బ్యాక్టీరియా, ఆర్కియా, వైరస్‌లు, ఫంగీ, ప్రొటోజోవా, ఆల్గే మొదలైనవాటిని మైక్రోబ్స్‌ అంటారు. న్యూట్రియంట్‌ సైక్లింగ్‌, బయో డీగ్రేడేషన్‌, వాతావరణ మార్పులు, ఆహారం పాడవడం, వ్యాధులు రావడం వీటి వల్ల కలిగే ప్రతికూల ఫలితాలు. ప్రాణాలు కాపాడే ఔషధాల్లో, బయోఫ్యూయల్‌ తయారీలో, కాలుష్యాన్ని నివారించడంలో, ఆహార పదార్థాల ప్రాసెసింగ్‌లో సాయపడడం అనుకూల అంశాలు. మామూలు కంటికి కానరాని ఆర్గానిజమ్స్‌, ఇన్ఫెక్షువస్‌ ఏజెంట్ల గురించి అధ్యయనం చేసే ఈ శాస్త్రవేత్తలను మైక్రోబయాలజిస్టులు (సూక్ష్మజీవ శాస్త్రవేత్తలు) అంటారు. వీరు సూక్ష్మజీవుల లక్షణాలను, అవి ప్రాణుల జీవన విధానాలపై చూపే ప్రభావాలను పరిశీలిస్తారు. ఆహార భద్రత, గ్రీన్‌ టెక్నాలజీల అభివృద్ధి, వ్యాధుల నివారణ, వాతావరణ మార్పుల్లో సూక్ష్మజీవుల పాత్రను గుర్తించడం వీరి విధుల్లో భాగం. ఇందులో బ్యాక్టీరియాలజీ, వైరాలజీ, మైకాలజీ, పారాసైటాలజీ వంటి ప్రత్యేక విభాగాలుంటాయి. వ్యవసాయం, వాతావరణం, ఆహారం, వైద్యం మొదలైన వాటిల్లోనూ స్పెషలైజేషన్లు ఉన్నాయి.

భవిష్యత్తులో మైక్రోబయాలజిస్టుల అవసరం 8% పెరుగుతుందని ఒక అంచనా ఉంది. కొవిడ్‌-19 కారణంగా ఈ శాతం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ఏ రంగంపై ఎలాంటి ప్రభావం?
కొన్ని ప్రధాన రంగాలపై సూక్ష్మజీవులు ఎలాంటి ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నాయో గమనిస్తే ఎలాంటి ఉపాధికి, ఉద్యోగాలకు అవకాశం ఉందో అర్థమవుతుంది.
వైద్యరంగం: జలుబు, ఫ్లూ తదితరాలకు వైరస్‌లు కారణమవుతాయి. బ్యాక్టీరియాల వల్ల టీబీ లాంటివి వస్తాయి. సూక్ష్మజీవుల తీరుతెన్నులను అధ్యయనం చేయడం ద్వారా అవి సృష్టించే సమస్యలకు మైక్రో బయాలజిస్టులు పరిష్కారాలను కనుక్కుంటారు. ఆ పరిజ్ఞానంతో రోగం రాకుండా చూడటం లేదా నయం చేయడం, కొత్త టెక్నాలజీలను రూపొందించడం వంటివి చేస్తారు.
పర్యావరణం, వాతావరణ మార్పులు: భూమిపై ఎక్కువ మీథేన్‌ విడుదలకు సూక్ష్మజీవులు కారణమవుతున్నాయి. వీటివల్ల భూతాపం ఏర్పడుతోంది. ఇది మానవాళికి ఒకరకంగా నష్టమే. కానీ ఆ మీథేన్‌ ఆధారంగానే బయోఫ్యూయల్‌ను తయారు చేస్తున్నారు. వాతావరణంలో ప్రతికూల మార్పులు కలిగించే ఇంధనాలకు ప్రత్యామ్నాయ వనరుగా ఈ ఫ్యూయల్‌ ఉపయోగపడుతోంది. మొక్కల న్యూట్రియెంట్‌ సైకిల్స్‌లోనూ సూక్ష్మజీవులది ప్రధాన పాత్రే. వీటిపైనే ఆధారపడి కార్బన్‌, నైట్రోజన్‌ సైకిల్స్‌ ఉంటాయి. కలుషితమైన నేల, నీరు, ఆయిల్‌ లీకేజీలను తొలగించడంలోనూ ఇవి తోడ్పడుతున్నాయి. సూక్ష్మజీవుల జన్యువును పరిశీలించడం, మార్పులు చేయడం, వాటి పనితీరును గమనించడం ద్వారా మైక్రోబయాలజిస్టులు వాటిని మానవాళికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు.
వ్యవసాయం, ఆహార భద్రత: సూక్ష్మజీవుల సాయంతో రూపొందే ఆహారానికి ప్రధాన ఉదాహరణ పెరుగు. ఇదేకాదు బ్రెడ్‌, చీజ్‌, చాక్లెట్‌ వంటి ఎన్నోరకాల ఆహార పదార్థాల తయారీలోనూ అవి సాయపడతాయి. పెస్ట్‌ కంట్రోల్‌, పంట దిగుబడి పెరుగుదలలోనూ ఉపయోగపడుతూ ఆహారభద్రతకు తోడ్పడుతున్నాయి.

కోర్సుల వివరాలు
మైక్రోబయాలజీ విభాగంలో బ్యాచిలర్‌, మాస్టర్స్‌, పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తున్నారు.
* డిగ్రీస్థాయిలో బీఎస్‌సీ, బీటెక్‌ ఉన్నాయి. బీఎస్‌సీలో మైక్రోబయాలజీ, మెడికల్‌ మైక్రోబయాలజీ, అప్లయిడ్‌ మైక్రోబయాలజీ, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బ్యాచిలర్‌ ఇన్‌ ఫుడ్‌ టెక్నాలజీ, బీఎస్‌సీ క్లినికల్‌ మైక్రోబయాలజీ కోర్సులున్నాయి. కాలవ్యవధి మూడేళ్లు. బీటెక్‌ ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ ఉంది. కాలవ్యవధి నాలుగేళ్లు. బీఎస్‌సీ కోర్సులకు ఇంటర్‌లో బైపీసీని కనీసం 60% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు. బీటెక్‌కు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్‌సీలోకి ఎక్కువశాతం సంస్థలు మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. బీటెక్‌లోకి రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్‌ ఇస్తారు.
* పీజీలో ఎంఎస్‌సీ ఉంది. ఇందులో మైక్రోబయాలజీ, అప్లయిడ్‌ మైక్రోబయాలజీ, మెడికల్‌ మైక్రోబయాలజీ, మైక్రోబల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బయోఇన్ఫర్మేటిక్స్‌ విభాగాలు ప్రముఖమైనవి. కాలవ్యవధి రెండేళ్లు. డిగ్రీ స్థాయిలో సైన్స్‌ కోర్సులు.. బోటనీ/ జువాలజీ/ బయోకెమిస్ట్రీ/ హోమ్‌సైన్స్‌/ హ్యూమన్‌ జెనెటిక్స్‌/ బయోటెక్నాలజీ/ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌/ మైక్రోబయాలజీ/ డెయిరీ సైన్సెస్‌/ అగ్రికల్చర్‌/ హార్టీకల్చర్‌/ పబ్లిక్‌ హెల్త్‌ వంటి కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. యూనివర్సిటీలు, సంస్థలు ప్రత్యేకమైన ప్రవేశపరీక్షల ఆధారంగా ప్రవేశాలు జరుపుతున్నాయి. కొన్నిచోట్ల గ్రూప్‌ డిస్కషన్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూలనూ నిర్వహిస్తున్నారు.
* ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులకు ఎంఎస్‌సీ పూర్తిచేసినవారు అర్హులు.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు
రానున్న కాలంలో మైక్రోబయాలజిస్టుల అవసరం బాగా పెరగనుందని అంచనా. పరిశ్రమ ఉత్పత్తుల్లో ఏర్పడే సమస్యల ప్రాథమిక పరిశోధన, పరిష్కారానికి వీరి అవసరం ఉంటుంది. మందులు (ఉదాహరణకు- యాంటీబయాటిక్స్‌, వ్యాక్సిన్ల రూపకల్పన), కొత్త తరహా ట్రీట్‌మెంట్లలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ సంస్థల్లో డ్రగ్‌ డెవలప్‌మెంట్‌కూ మైక్రోబయాలజిస్టుల సేవలు అవసరం. వీరికి ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలోనూ అవకాశాలున్నాయి. అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్లు, కెమికల్‌ పరిశ్రమలు, బెవరేజెస్‌, ఆహార పరిశ్రమ, ఎన్విరాన్‌మెంటల్‌ ఏజెన్సీస్‌, రిసెర్చ్‌ సంస్థలు, ప్రైవేటు ఆసుపత్రులు, లేబొరేటరీలు, విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యూటికల్‌ సంస్థలు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలు వీరిని నియమించుకుంటాయి. విదేశాల్లోనూ ఈ నిపుణులకు మంచి ఉద్యోగాలున్నాయి.
సాధారణంగా వీరిని రిసెర్చ్‌ అసిస్టెంట్‌, బయోమెడికల్‌ సైంటిస్ట్స్‌, ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌, ఫార్మకాలజిస్ట్‌, క్లినికల్‌ అండ్‌ వెటర్నరీ మైక్రోబయాలజిస్ట్స్‌, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజిస్ట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మైక్రోబయాలజిస్ట్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌, ఫుడ్‌, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజిస్ట్‌, సేల్స్‌/ టెక్నికల్‌ రిప్రజెంటేటివ్స్‌, సైంటిఫిక్‌ లేబొరేటరీ టెక్నీషియన్‌, రిసెర్చ్‌ సైంటిస్ట్‌, మైక్రోబయాలజిస్ట్‌ హోదాలకు తీసుకుంటారు.
ఎంపికైన హోదా, సంస్థలనుబట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. ప్రారంభ వేతనం నెలకు రూ.12,000 నుంచి 25,000 వరకూ ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ జీతభత్యాల్లో మెరుగుదల ఉంటుంది.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌
* ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
* ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌
* శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
* శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
* మధురై కామరాజ్‌ యూనివర్సిటీ, మధురై
* మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొట్టాయం
* కర్ణాటక యూనివర్సిటీ
* అమిటీ యూనివర్సిటీ, నోయిడా
* దిల్లీ యూనివర్సిటీ

Back..

Posted on 06-05-2020