Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సుస్థిర ఉపాధి!

* కెరియర్‌ గైడెన్స్‌ రియల్‌ ఎస్టేట్‌

భారత ఆర్థిక వ్యవస్థకు రియల్‌ ఎస్టేట్‌ వెన్నెముక లాంటిది. దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోన్న రంగాల్లో ఇదొకటి. విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉండటంతో నిర్మాణ రంగం జోరు పెరిగింది. 2022 నాటికి రియల్‌ ఎస్టేట్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 7.5 కోట్ల మంది ఉద్యోగాలు పొందుతారని అంచనా. ప్రస్తుతం ఇందులోని కోర్‌ విభాగంలో 40 లక్షల మంది నిపుణుల కొరత ఉంది. 2025 నాటికి దేశ జీడీపీలో స్థిరాస్తి వాటా 13 శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఈ రంగం మార్కెట్‌ విలువ 2030 నాటికి ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లకు విస్తరించనుంది.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టడం, స్మార్ట్‌ సిటీల నిర్మాణం, కొత్త కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను నెలకొల్పడం, సొంత గూడు ఉండాలని ఎక్కువ మంది కోరుకోవడం, తక్కువ వడ్డీకి సులువుగా రుణాలు లభించడం.. తదితర కారణాలతో స్థిరాస్తి రంగం బాగా ఎదుగుతోంది.

ఎన్నో హోదాలు
ఈ రంగంలో ప్రధానంగా రెండు భాగాలు. అవి రెసిడెన్షియల్‌, కమర్షియల్‌. రెసిడెన్షియల్‌లో గృహాలు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు మొదలైనవి నిర్మిస్తారు. కమర్షియల్‌లో వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, కర్మాగారాలు లాంటివి ఉంటాయి. అర్బన్‌ ప్లానింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌ ప్లానింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌ ఇవన్నీ స్థిరాస్తి పరిధిలోకే వస్తాయి. సివిల్‌ ఇంజినీర్లు, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లు, కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్లు, ప్రాపర్టీ అసెసర్లు, లీగల్‌ అడ్వైజర్లు, ల్యాండ్‌ సర్వేయర్లు, ఆర్కిటెక్ట్‌లు, టౌన్‌ ప్లానర్లు, సేల్స్‌ మేనేజర్లు...ఇలా పలు రకాల హోదాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఎల‌్రక్టీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, వెల్డర్లు, గార్డెనర్లు, బ్రిక్‌లేయర్లు, ఆన్‌సైట్‌ ఇంజినీర్లు, ఇంటీరియర్‌ డిజైనర్లు, క్వాలిటీ సర్వేయర్లు, ఫెసిలిటీ మేనేజర్లు, ఎల‌్రక్టికల్‌ ఇంజినీర్లు..ఇలా వివిధ రకాల నిపుణుల సేవలూ అవసరమవుతాయి. ఈ విభాగంలో కోర్‌, నాన్‌-కోర్‌, స్పెషలైజ్డ్‌ ప్రొఫెషన్లతోపాటు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌-స్కిల్డ్‌ అభ్యర్థులు సేవలందిస్తారు. స్థిరాస్తి రంగానికి అవసరమైన మానవ వనరులను అందించడానికి పలు సంస్థలు వెలిశాయి. వీటిలో వివిధ కోర్సులను అందిస్తున్నారు.

రకరకాల విభాగాల్లో..!
* నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌, హైదరాబాద్‌; అయిదో తరగతి, ఎనిమిది, పది, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్హతలతో వివిధ కోర్సులను అందిస్తోంది. వాటిలో ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.
వెబ్‌సైట్‌: https://nac.edu.in/
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్మార్‌) ఈ విభాగంలో పేరున్న సంస్థ. దీనికి పుణె, హైదరాబాద్‌, దిల్లీ, గోవాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వాటిలో రెండేళ్లు, ఏడాది వ్యవధితో పలు రకాల రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తిచేసినవారు, ఆఖరు సంవత్సరంలో ఉన్నవారు అర్హులు.
వెబ్‌సైట్‌: https://www.nicmar.ac.in/
* అమెటీ యూనివర్సిటీకి చెందిన ఆర్‌ఐసీఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ - ఎంబీఏ: రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ ఎకనమిక్స్‌ అండ్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌; బీబీఏ: రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌; పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ జరుగుతోంది.
వెబ్‌సైట్‌: https://www.ricssbe.org/
* అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ భారతీయ విభాగం చార్టర్డ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రొఫెషనల్‌ పేరుతో సర్టిఫికేషన్‌ కోర్సు నిర్వహిస్తోంది.
* టెరీ యూనివర్సిటీలో ఎంబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎంటెక్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులున్నాయి.
* నిరెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌, అన్సాల్‌ యూనివర్సిటీల్లో పలు స్థిరాస్తి కోర్సులు ఉన్నాయి.

ఏయే ఉద్యోగాలు, ఎక్కడెక్కడ?
స్థిరాస్తి రంగంలో కోర్‌ (డొమైన్‌) ఉద్యోగాలతోపాటు మార్కెటింగ్‌, సేల్స్‌, ఫైనాన్స్‌, స్ట్రాటజీ, అడ్మినిస్ట్రేషన్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో పెద్దఎత్తున మానవ వనరుల సేవలు అవసరం. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ కోర్సులు చేసినవారు మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. సివిల్‌ ఇంజినీర్లు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ లేదా కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయడం ద్వారా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లోకి ప్రవేశించవచ్చు. లోథా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌ బిల్డింగ్‌ ఇండియా, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఇలా వందల సంఖ్యలో కార్పొరేట్‌ రియాల్టీ సంస్థలు నైపుణ్యం ఉన్నవారికి ఆకర్షణీయ వేతనాలను అందిస్తున్నాయి. టాటా హౌసింగ్‌, రహేజా యూనివర్సల్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, పంజ్‌ లాయిడ్‌ గ్రూప్‌, 99 యాకర్స్‌, మ్యాజిక్‌ బ్రిక్స్‌, ఇండియా ప్రాపర్టీ, ఇండియా హౌసింగ్‌.. తదితర సంస్థలెన్నో క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. ఈ రంగంలోని వారిని మూడు కేటగిరీలుగా వర్గీకరించవచ్చు.
స్పెషలైజ్డ్‌ ప్రొఫెషనల్స్‌: వాల్యూయర్స్‌, క్వాంటిటీ సర్వేయర్లు, ఫెసిలిటీ మేనేజర్లు, ప్రాపర్టీ మేనేజర్లు, సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పర్టులు. కోర్‌ ప్రొఫెషనల్స్‌: ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్లు.
నాన్‌ కోర్‌ ప్రొఫెషనల్స్‌: మేనేజ్‌మెంట్‌ నిపుణులు, అడ్మినిస్ట్రేటర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, మార్కెటింగ్‌ ప్రొఫెషనల్స్‌, సేల్స్‌ ప్రొఫెషనల్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్లు, ఫైనాన్స్‌ ఎనలిస్టులు, లాయర్లు, ఎల‌్రక్టికల్‌ ఇంజినీర్లు, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు.

ఎవరెవరు.. ఏ విధులు?
రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కన్సల్టెంట్‌: స్థిరాస్తి మార్కెట్‌పై వీరికి పట్టు ఉంటుంది. పెట్టుబడిదారులకు తగిన సలహాలిస్తారు. ప్రాంతాలవారీ ఎంత వెచ్చించవచ్చులాంటి వాటిని తెలియజేస్తారు.
రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌: వీరు ఇళ్లు, ఇళ్ల స్థలాల అమ్మకాలు నిర్వహిస్తారు. అమ్మేవారికీ కొనేవారికీ మధ్య బేరసారాలు జరపడంలో కీలకంగా వ్యవహరిస్తారు. బేరం కుదిరితే కొంత కమీషన్‌ తీసుకుంటారు.
రియల్‌ ఎస్టేట్‌ అప్రయిజర్‌: వీరు ఇళ్లు, ఫ్లాట్లు, వాణిజ్య స్థలాల మార్కెట్‌ విలువను మదింపు చేస్తారు. అప్రయిజల్‌ ఫర్మ్‌లు, బ్యాంకు, ప్రైవేటు ఇన్వెస్టర్ల తరఫున పనిచేస్తారు.
ప్రాపర్టీ మేనేజర్‌: వీరు సంస్థ వైపు నుంచి స్థలం యజమానితో మాట్లాడి, కొంత పెట్టుబడి పెట్టి నిర్మాణం చేపడతారు. దాన్ని లీజు, అద్దెకు ఇస్తారు.
కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌: వీరు వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, కార్యాలయాలకు కావాల్సిన స్థలాలను సమకూర్చడం, అద్దెకివ్వడం; పెద్ద భవనాలను సంస్థలకు అమ్మడం, అద్దెకివ్వడం లాంటి లావాదేవీల్లో పాల్గొంటారు.
ఫెసిలిటీస్‌ మేనేజర్‌: రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్పులు, ఆఫీస్‌లు, బిల్డింగ్‌లు, మాల్స్‌ లాభదాయకంగా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు.వినియోగదారులకు లీజు/ అద్దెకు ఇస్తారు.
ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్‌: వీరు ప్రాజెక్టు పునాది రాళ్ల నుంచి తుది రూపు వచ్చే వరకు అన్ని దశల్లో భాగస్వాములవుతారు. ప్రారంభంలోనే వినియోగదారులను ఆకర్షించి నిర్మాణం పూర్తయ్యేలోగా అమ్ముడుపోయే విధంగా చూస్తారు. బ్లూ ప్రింట్‌ నుంచి ఆఖరు అంకం వరకు అన్ని వ్యవహారాలూ చూసుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌ సంబంధిత కోర్సులు చేసిన వారితోపాటు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ పట్టాలు పొందిన వారూ స్థిరాస్తి రంగంలో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

Back..

Posted on 20-01-2020