Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మర మెప్పునకు మీరు సిద్ధమా!

* కెరియర్‌ ట్రెండ్స్‌ 2020

అప్లై చేసిన అయిదు నిమిషాల్లో రిప్లై వచ్చేస్తుంది. సోషల్‌ మీడియాలో మన తీరును స్కాన్‌చేసి సమాధానం చెప్పేస్తుంది. అసలు.. నకిలీ అభ్యర్థులను ఇట్టే పసిగట్టేస్తుంది. మొబైల్‌లో దరఖాస్తు చేసిన వెంటనే ఫోన్‌ చేసి ఇంటర్వ్యూ చేసేస్తుంది. ఇవన్నీ.. ఇరవై ఇరవైలో ఉద్యోగార్థులకు ఎదురవ్వబోయే అనుభవాలు. ఆటోమేషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, వెబ్‌ బోట్స్‌ సాయంతో సంస్థలు నియామకాల తీరును మార్చేస్తున్నాయి. రోబోలే రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్లుగా మారుతున్నాయి. ఈ నయా ట్రెండ్‌పై అందరూ అవగాహన పెంచుకోవాలి. మరలను మెప్పించేందుకు మనం సిద్ధం కావాలి.

సంస్థ అభివృద్ధి మానవ వనరుల నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన అభ్యర్థులను ఎంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నాయి. 2020లో ఈ విధానాలు మరింత విస్తృతం కానున్నాయి. అలాగే ఉద్యోగార్థులూ ముఖ్యంగా మిలేనియల్స్‌.. అధిక వేతనాలకు, పనికీ జీవితానికీ సమతూకం, నచ్చిన కెరియర్‌లో రాణించడానికి ప్రాధాన్యమిస్తున్నారు.

ఆటోమేషన్‌
నియామక ప్రక్రియ కోసం సంస్థలు ఎక్కువ సమయం వెచ్చించడంతోపాటు, ఒత్తిడినీ ఎదుర్కొంటున్నాయి. ఎంత పకడ్బందీగా ముందుకెళ్లినప్పటికీ మానవ తప్పిదాలకు అవకాశం ఉంటోందని ఉద్యోగుల ఎంపికలో సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాయి. సమర్థ మానవ వనరులను ఆకర్షించి, వాళ్లు నియామకాల్లో భాగస్వాములు కావడానికి రిక్రూట్‌మెంట్‌ మార్కెటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ (ఆర్‌ఎంఎస్‌)ను ఉపయోగిస్తున్నాయి. దరఖాస్తుల పరిశీలనకు అప్లికేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఏటీసీ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. రోబోలు, బోట్స్‌, టూల్స్‌ కారణంగా నియామక ప్రక్రియ వేగంగా, సులువుగా, కచ్చితత్వంతో పూర్తవుతోంది.

ఇన్‌క్లూజివ్‌ హైరింగ్‌
నియామక ప్రక్రియ ఎక్కువ సమయాన్ని తీసుకుంటే దరఖాస్తుదారులు అలసిపోతారు. వారి సమయమూ విలువైనదని గుర్తించి నియామక పద్ధతులు మార్చడం ఇన్‌క్లూజివ్‌ హైరింగ్‌ కిందకు వస్తుంది. మొబైల్‌ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే విధంగా ఆటో ఫంక్షనింగ్‌ టూల్స్‌ వినియోగించడం, వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమతూకానికి అనుకూల విధానాలను అనుసరించడం, నిర్ణీత వ్యవధుల్లో ఉద్యోగికి ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వడంలాంటి ఇన్‌క్లూజివ్‌ పద్ధతులు ఉద్యోగార్థులకు అనువుగా ఉంటాయి. అలాంటి సంస్థల్లో చేరడానికి చాలామంది ముఖ్యంగా మిలేనియల్స్‌ ఇష్టపడుతున్నారు.

సోషల్‌ మీడియా
సంస్థలు సరైన అభ్యర్థులను అన్వేషించడానికి సోషల్‌ మీడియాను విస్తృతŸంగా వినియోగిస్తున్నాయి. ఖాళీల ప్రచారం- అభ్యర్థుల ఎంపిక.. ఈ రెండు పనులకూ సోషల్‌ మీడియా వేదికగా నిలుస్తోంది. అందుకే అభ్యర్థులు తమ ప్రొఫైల్‌ సోషల్‌ మీడియాలో ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

మల్టిపుల్‌ స్కిల్‌ సెట్‌
పని వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఇప్పటి నైపుణ్యాలు రేపటికి సరిపోకపోవచ్చు. వివిధ అంశాల్లో ప్రావీణ్యం ఉన్నవారైతే కొత్త నైపుణ్యాలను సులువుగా అలవాటు చేసుకో గలుగుతారు. అందువల్ల నియామక సంస్థలు అభ్యర్థుల నుంచి బహుళ నైపుణ్యాలను (మల్టిపుల్‌ స్కిల్‌ సెట్‌) ఆశిస్తున్నాయి. అవసరమైనవాటికే పరిమితం కాకుండా అంతకు మించి నేర్చుకోవడంపై అభ్యర్థులు దృష్టి సారించాలి.

ఇంటి నుంచే పని
ఎక్కువమంది ఉద్యోగులూ, ఉద్యోగార్థులూ ఇంటివద్దే ఉంటూ పనిచేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీనిద్వారా పని, జీవితం మధ్య నిలకడ ఏర్పడుతుందనీ, ఒత్తిడిని ఎదుర్కోవచ్చనీ భావిస్తున్నారు. సంస్థలు వీటిని గుర్తించాయి. వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని విస్తరిస్తున్నాయి.

రిక్రూట్‌మెంట్‌ మార్కెటింగ్‌
ప్రతి ఉద్యోగార్థీ మేటి సంస్థలో కొలువు ఆశిస్తారు. ఆ టాప్‌ జాబితాలో తామూ ఉండాలని సంస్థలు భావిస్తున్నాయి. కెరియర్‌ పేజ్‌, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌, గ్లాస్‌డోర్‌ రివ్యూలు, పరిశ్రమలతో సత్సంబంధాలు, మీడియా వ్యవహారాలు, గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌లో చోటు దక్కించుకోవడం... వంటివాటిపై దృష్టి సారిస్తున్నాయి.

టెక్నాలజీపై పట్టు
ఉద్యోగార్థులకు ప్రస్తుత పరిస్థితులపై పూర్తి అవగాహన తప్పనిసరి. ఉద్యోగానికి ఢోకా లేకుండా కొనసాగడానికి అప్‌ టూ డేట్‌గా ఉండడమే కీలకం. ఇందుకోసం ఎవరికివారే ఉన్న నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకుని, కొత్తవి నేర్చుకోవాలి. సంస్థలు కఠిన పరీక్షలు, సాంకేతికత ద్వారా ఉద్యోగులను అంచనా వేసి అవసరం లేనివారిని తొలగిస్తున్నాయి.

అనలిటిక్స్‌
దరఖాస్తులను విశ్లేషించడానికీ, వివరాలు పూర్తిస్థాయిలో తెలుసుకోడానికీ మానవ వనరుల నిపుణులు టూల్స్‌పై ఆధారపడుతున్నారు. ఇవి అభ్యర్థుల పూర్తి వివరాలను వడపోస్తున్నాయి. సరైన అభ్యర్థులను ఎంచుకోవడంతోపాటు కొనసాగించడానికి, పనితీరును సమీక్షించడానికి, స్కిల్‌ గ్యాప్‌ అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయి.

దివ్యాంగులకు పట్టం
సంస్థలన్నీ దివ్యాంగులను ఉద్యోగంలోకి తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఉద్యోగుల్లో వీరి సంఖ్య పెరిగేలా చేస్తున్నాయి. తమ సామర్థ్యంపై అవగాహన ఉండడం, ఎక్కువ కాలం అదే సంస్థలో కొనసాగడం, నిబద్ధతతో పనిచేయడం, ప్రేరణ పొందడం తదితర లక్షణాలు దివ్యాంగుల్లో ఎక్కువని సంస్థలు నమ్ముతున్నాయి. అందువల్ల భవిష్యత్తు నియామకాల్లో వీరికి ప్రాధాన్యం పెరుగుతుంది.

Back..

Posted on 24-12-2019