Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సలహాలరావుకు స్వాగతం!

తర్వాత ఏంటి..? ప్రతి ఒక్కరి జీవితంలో తరచూ ఎదురయ్యే ప్రశ్న ఇది. విద్య, ఉద్యోగాలకు సంబంధించి అందరూ తప్పకుండా తర్జనభర్జన పడే సమస్య కూడా. అయితే దీనికి సరైన సమాధానాన్ని పొందడం అంత తేలిక కాదు. మనకు ఏం కావాలి.. ఏది సరిపోతుంది.. ఏ కోర్సులో చేరాలి.. ఎలాంటి ఉద్యోగం వస్తుంది? ఈ ప్రశ్నలకు రెండు దారుల్లో జవాబులు చెప్పవచ్చు. మొదటిది ఏం కావాలి నుంచి మొదలవుతుంది. రెండోది ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారోతో ప్రారంభమవుతుంది. ఇదంతా చెప్పేందుకు ఉన్నారు కొందరు సలహాలరావులు. ఆధునిక అవకాశాల వివరాలు, మార్కెట్‌ సమాచారంతో సదా సన్నద్ధంగా ఉండే కెరియర్‌ కౌన్సెలర్లు వీళ్లే. ఈ కౌన్సెలింగ్‌ ఇప్పుడో వృత్తిగా వేగంగా ఎదుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

కోర్సు పూర్తయింది. ‘తర్వాత ఏంట’నేది ప్రశ్న. ఎక్కువమంది చెప్పే సమాధానం... ఉన్నత విద్య లేదా మంచి ఉద్యోగం. కానీ ఎక్కడ? ఎలా? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహవిద్యార్థులు, చుట్టాలు, మనచుట్టుపక్కలవారు ఇలా ఎందరి అభిప్రాయాలో మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడే మనకి ఏది సరైందో అర్థంకాక చాలా సందర్భాల్లో తప్పటడుగులు వేస్తుంటాం. అలా జరగకుండా చూసేందుకూ, మనకు నప్పే కెరియర్‌ను తేలిగ్గా ఎంచుకునేందుకూ సహాయపడేవారే కెరియర్‌ కౌన్సెలర్లు. మార్కెట్‌లో పెరుగుతున్న ఆధునిక అవకాశాలు, విద్యాసంస్థల్లో కొత్త తరహా కోర్సుల నేపథ్యంలో ఇప్పుడీ వృత్తికి ప్రాధాన్యం పెరుగుతోంది.

సరైన నిర్ణయం, సరైన దిశలో తీసుకుంటున్నామా లేదా అనే సందేహం చాలామంది విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఉంటుంది. విద్యార్థి తన శక్తియుక్తులకు అనుగుణంగా రాణించడానికి ఉపయోగపడేదే కెరియర్‌ కౌన్సెలింగ్‌. ఏ స్ట్రీమ్‌ను తీసుకోవడం ద్వారా ఎలాంటి ఉద్యోగం చేస్తామో ముందుగానే తెలుసుకుని భవిష్యత్తు ప్రణాళికను వేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఇది వ్యక్తిగత ఎదుగుదలకు ఎవరికేది మంచిదో తెలియచేసి అందుకు కావాల్సిన విద్యా, వృత్తిపర సమాచారాన్ని అందిస్తుంది.

ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల మంది గ్రాడ్యుయేషన్‌ని పూర్తిచేస్తుంటే 20% మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. అదే సమయంలో తగిన దరఖాస్తుదారులు లేక వేలాది ఉద్యోగాలూ ఖాళీగా ఉంటున్నాయి. సమాచారలోపం, మార్గదర్శకత్వం లేకపోవటం వల్ల ఈ అంతరం ఏర్పడుతోంది. దీన్ని సుశిక్షితులైన కెరియర్‌ కౌన్సెలర్లు మాత్రమే పూరించగలరు.

గమ్యానికి సహకారం
కెరియర్‌ కౌన్సెలర్లు విద్యార్థులకు తమ సామర్థ్యం, ఆసక్తి, ప్రతిభ, వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేసుకోవడానికి సహాయం చేస్తారు. తద్వారా వారి వాస్తవిక విద్యా, ఉద్యోగ లక్ష్యాలను అభివృద్ధి చేస్తారు. వారి ఇష్టాలు ఎంతవరకు తమ నిర్ణయాలతో ఏకీభవిస్తున్నాయో తెలుసుకుని వారికివారే తమ ఆశయాలను అర్థం చేసుకునేలా కౌన్సెలింగ్‌ ఇస్తారు.
* వ్యక్తులకు వారికి కావాల్సిన ఉద్యోగ, విద్యా సంబంధ సమాచారాన్ని, పరిజ్ఞానాన్ని అందిస్తారు.
* సొంత ఆసక్తులు, విలువలు, సామర్థ్యాలు, వ్యక్తిత్వ శైలికి అనుగుణంగా ఉండే వృత్తిని ఎంచుకోవడంలో విద్యార్థులకు సహకరిస్తారు.
* ఉద్యోగాన్వేషణలో వ్యక్తులకు వ్యూహాలనివ్వడం, కెరియర్‌లో మార్పులు, పరివర్తనలు, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన కౌన్సెలింగ్‌ అందిస్తారు.
* విద్యార్థులకు సలహాలిచ్చేటప్పుడు కౌన్సెలర్లు ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్‌ సెషన్లు, టెస్టుల లాంటి అనేక రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. ఇందుకోసం కెరియర్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్లు, వృత్తి విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కళాశాల వివరాలు, అడ్మిషన్‌, ప్రవేశపరీక్షలు, ఆర్థిక సహాయం గురించి సలహా ఇస్తారు. ఉద్యోగాన్వేషణకు సంబంధించి రెజ్యూమేను తయారు చేసుకోవడం, ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వడం, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం లాంటి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు.

ఎవరు అర్హులు?
ఈ వృత్తిలో ఎక్కువగా మనస్తత్వానికి సంబంధించిన సలహాలివ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటర్‌ పూర్తయ్యాక సైకాలజీ, సోషియాలజీ, సోషల్‌వర్క్‌తో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయాలి. తర్వాత కౌన్సెలింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తే మంచిది. గైడెన్స్‌, కౌన్సెలింగ్‌కి సంబంధించిన కోర్సుల్లో దాదాపు కెరియర్‌ కౌన్సెలింగ్‌కి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందొచ్చు. అలాగే ఎక్కువకాలం ఉపాధ్యాయులుగా పనిచేసినవారు కూడా దీనివైపు రావచ్చు.
పీజీ పూర్తిచేసినవారు డిప్లొమా ఇన్‌ కౌన్సెలింగ్‌ కోర్సు చేయొచ్చు.
కోర్సు వ్యవధి: 1-2 సంవత్సరాలు. డిగ్రీలో సైకాలజీ చేసినవారు పీజీ డిప్లొమా కోర్సు చేయొచ్చు. కరస్పాండెన్స్‌లోనూ ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

నైపుణ్యాలు
కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, సహనం, శ్రద్ధగా వినడం, భావోద్వేగాలను నియంత్రించుకునే గుణం, పరిణతి చెందిన లక్షణాలు, మంచి గ్రహణశక్తి, సంబంధిత రంగానికి చెందిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా జోడించుకోవడం, ఒక వ్యక్తిని తన గమ్యంవైపు ప్రోత్సహించగల సామర్థ్యం కెరియర్‌ కౌన్సెలర్‌కు ఉండాలి.

ఉపాధి అవకాశాలు
భిన్న సంస్కృతి, కుటుంబాలు, వయసులకు చెందిన ప్రజలతో కెరియర్‌ కౌన్సెలర్లు పనిచేస్తారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక నైపుణ్యాలు, కొత్త అవకాశాల కల్పనతో కెరియర్‌ నిర్ణయం ఏ వయసులోనైనా మారవచ్చు. కాబట్టి, ఆధునిక కాలంలో వీరికి గిరాకీ పెరుగుతోంది. వీరు ఎక్కువగా పాఠశాలలు, కెరియర్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో పనిచేస్తారు. అలాగే కెరియర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాములు, రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు, ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ కౌన్సెలింగ్‌ సెంటర్లలోనూ వీరికి అవకాశాలు ఉంటాయి. విదేశీ విద్య, విదేశాల్లో పెరిగిన ఉద్యోగావకాశాల కారణంగా వారికి ఉండే అనేక సందేహాలను తీర్చడానికి సాయపడతారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి కౌన్సెలర్ల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

గైడెన్స్‌, కౌన్సెలింగ్‌ కోర్సులు అందిస్తున్న సంస్థలు
* నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ - న్యూదిలీ) www.ncert.nic.in
* రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌, తమిళనాడు (ఎంఏ కెరియర్‌ కౌన్సెలింగ్‌) www.rgniyd.gov.in
* ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ (ఇగ్నో) - www.ignou.ac.in
* అమిటీ యూనివర్శిటీ, నోయిడా - www.amity.edu
* జ్ఞాన ప్రబోధిని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకాలజీ (జేపీఐపీ) పుణె - www.jpip.org
* జామియ మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం, దిల్లీ - www.jmi.ac.in
* అన్నామలై యూనివర్సిటీ, తమిళనాడు - annamalaiuniversity.ac.in
ఏ స్ట్రీమ్‌ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఉద్యోగం చేస్తామో ముందుగానే తెలుసుకుని భవిష్యత్తు ప్రణాళికను వేసుకోవడానికి కెరియర్‌ కౌన్సెలర్‌ సాయపడతారు.


Back..

Posted on 06-03-2019