Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అవకాశాలపై ఆర్థిక అస్త్రం!

ప్రపంచాన్ని, ప్రతి మనిషి మనుగడను శాసించేది డబ్బు. అన్ని రంగాలకూ అదే పెట్టుబడి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ధనం వల్ల అభివృద్ధి కాదంటే అథోగతి. ఈ నేపథ్యంలో అడుగడుగునా అందరి జీవితాలతో ముడిపడిన కరెన్సీ ప్రభావాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తుంది అర్థశాస్త్రం. ఈ విభాగం అర్థమవుతున్న కొద్దీ కిక్‌ అనిపిస్తుంది. ఉత్పత్తి, సరఫరా, వినియోగం, మిగులు, కొరత, షేర్‌ మార్కెట్‌... ఇలా అన్నీ ఆర్థికశాస్త్రం పరిధిలోనివే. వ్యక్తిదైనా, వ్యవస్థదైనా ప్రగతిని పసిగట్టడానికి ఆర్థిక నివేదికలే ఆధారం. ఇంత విస్తృతమైనది కావడం వల్లే ఈ రంగంలో నిపుణులకు ఎప్పటికీ డిమాండ్‌ ఉంటోంది. ఎకనామిక్స్‌పై పట్టు ఉంటే ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్‌ కంపెనీలు, కన్సల్టెన్సీలు, బోధన... తదితర ఎన్నో రంగాలు అవకాశాలతో ఆహ్వానం పలుకుతున్నాయి. వాటిని అందుకోవాలంటే అర్థశాస్త్రంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేయాలి.

ఆసక్తి ఉంటే ఆర్ట్స్‌ కోర్సుల్లోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించే సబ్జెక్టుల్లో ప్రధానమైనది అర్థశాస్త్రం. డిమాండ్‌, సరఫరా సూత్రం ప్రపంచాన్ని నడిపిస్తున్నంత కాలం ఈ శాస్త్రానికి తిరుగులేదు. సోషల్‌, సైన్స్‌ విభాగాల మేలుకలయిక ఇది. ఈ సబ్జెక్టులో పట్టు సాధించినవారు ఐఐటీయన్లకు దీటుగా, కొన్ని సందర్భాల్లో వారిని మించి రాణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ బ్యాంకుతోపాటు ఇతర ప్రఖ్యాత సంస్థలు, రేటింగ్‌ ఏజెన్సీల్లో ఉన్నతస్థాయి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌), ఆర్‌బీఐ ఉద్యోగ పరీక్షలకు హాజరుకావడానికి వీరికి అర్హత ఉంటుంది.
వివిధ విభాగాలు
అర్థశాస్త్రం పరిధి చాలా విస్తృతమైంది. ఇందులో పలు విభాగాల్లో లోతైన అధ్యయనానికి అవకాశం ఉంది. వాటిలో మైక్రో ఎకనామిక్స్‌, మ్యాక్రో ఎకనామిక్స్‌, సెమీమైక్రో ఎకనామిక్స్‌, ట్రేడ్‌, స్టాటిస్టిక్స్‌, మ్యాథమేటిక్స్‌, మార్కెట్‌ అండ్‌ ప్రైస్‌ మెకానిజం, కన్స్యూమర్‌ ఛాయిస్‌, ఎలాస్టిసిటీ, ప్రొడక్షన్‌ ఫంక్షన్‌, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్‌, ఎకనోమెట్రిక్స్‌, ఇన్‌పుట్‌ అవుట్‌పుట్‌ అనాలిసిస్‌, ప్రాజెక్ట్‌ ఎకనామిక్స్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌ మెథడ్స్‌ మొదలైనవి చదువుతారు.
స్పెషలైజేషన్లు
ఎకనామిక్స్‌లో ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌, ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌, లేబర్‌ ఎకనామిక్స్‌, ఇండస్ట్రియల్‌ ఎకనామిక్స్‌, మ్యాథమేటికల్‌ ఎకనామిక్స్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌, బ్యాంకింగ్‌ ఎకనామిక్స్‌, ఎన్వైరాన్‌మెంటల్‌ ఎకనామిక్స్‌, డెవలప్‌మెంటల్‌ ఎకనామిక్స్‌, హెల్త్‌ ఎకనామిక్స్‌, రూరల్‌ ఎకనామిక్స్‌, అనలిటికల్‌ ఎకనామిక్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఎకనామిక్స్‌ ఇలా పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. అభ్యర్థులు తమ అభిరుచుల మేరకు వాటిని ఎంచుకొని అధ్యయనం చేయవచ్చు.
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. ఇంకా పలు ప్రఖ్యాత సంస్థలు రకరకాల స్పెషలైజేషన్లతో అర్థశాస్త్రంపై పీజీ కోర్సులు అందిస్తున్నాయి.
ఐఐటీల్లో!
కొన్ని ఐఐటీలు ఎకనామిక్స్‌ కోర్సును యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో బోధిస్తున్నాయి. నాలుగేళ్ల బీఎస్‌ - ఎకనామిక్స్‌ కోర్సు కాన్పూర్‌లో, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు ఖరగ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు. ఈ రెండింటిలో ప్రవేశం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా లభిస్తుంది. ఐఐటీ రూర్కీ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తోంది. ఐఐటీలు నిర్వహించే జామ్‌ పరీక్ష ద్వారా ఇందులోకి ప్రవేశం లభిస్తుంది. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీని కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మాండి, పట్నా, గాంధీనగర్‌, ఇండోర్‌ ఐఐటీలు అందిస్తున్నాయి.
సెంట్రల్‌ యూనివర్సిటీల్లో!
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఎకనామిక్స్‌ను తమిళనాడు, కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ను రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తున్నాయి. తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీ ఎన్వైరాన్‌మెంటల్‌ ఎకనామిక్స్‌, ఫినాన్షియల్‌ ఎకనామిక్స్‌, యాక్చూరియల్‌ ఎకనామిక్స్‌, జనరల్‌ ఎకనామిక్స్‌, ఎకానామిక్స్‌లలో ఎంఏ కోర్సు అందిస్తోంది. రాజస్థాన్‌, కశ్మీర్‌, హరియాణ, జమ్మూ, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అర్థశాస్త్రంలో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ బీఎడ్‌ కోర్సు అందిస్తోంది. వీటన్నింటిలోకీ సీయూ సెట్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది.
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్‌, ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌ కోర్సులను విడిగా అందిస్తోంది. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఎకనామిక్స్‌ కూడా ఇందులో ఉంది. హెచ్‌సీయూ నిర్వహించే ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది.
బెంగళూరు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (బేస్‌) అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ (ఆనర్స్‌) కోర్సు అందిస్తోంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నమూనాలో దీన్ని రూపొందించారు. ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సీయూ సెట్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది.
క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌
ఎకనామిక్స్‌లో క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందువల్లే చాలా సంస్థలు ఎమ్మెస్సీ క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ పేరుతో కోర్సు నిర్వహిస్తున్నాయి. అయితే ఇందులో రాణించడానికి ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫినాన్స్‌ అంశాలపై పట్టు తప్పనిసరి. ఇది చదివినవారికి కార్పొరేట్‌ ఉద్యోగాలు వరిస్తున్నాయి. ఎమ్మెస్సీ క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ అందించడంలో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) కోల్‌కతా, దిల్లీలను విశిష్ట సంస్థలుగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థల్లో ఎమ్మెస్సీ క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ కోర్సులో చేరినవారికి నెలకు రూ.5000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఏటా క్యాంపస్‌ నియామకాలు జరుగుతున్నాయి. వివిధ సంఘటనలను ఆర్థిక కోణంలో విశ్లేషించగలగడం, భవిష్యత్తుని ఊహించడం క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌తో సాధ్యమవుతాయి. మైక్రో, మ్యాక్రో ఎకనామిక్స్‌, ఎకనామెట్రిక్స్‌, డేటా అనాలిసిస్‌ను ఉపయోగించి ఈ విశ్లేషణలు చేస్తారు. అనలిటికల్‌ పరిజ్ఞానం, తర్కం, సృజన ఉన్నవారు క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌లో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు, బీమా సంస్థలు, సైంటిఫిక్‌ రిసెర్చ్‌, ఆడిటింగ్‌, కన్సల్టింగ్‌ సంస్థల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తాయి. కార్పొరేట్‌ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, బోధన రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఐఎస్‌ఐ విద్యార్థులను గోల్డ్‌మన్‌ శాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లే, క్రిసిల్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, మెకిన్సే, డెలాయిట్‌, జెన్‌ప్యాక్ట్‌, ఐసీఐసీఐ బ్యాంకు మొదలైన సంస్థలు ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. సగటున ఏడాదికి రూ.15 లక్షలకు పైగా ప్యాకేజీతో విద్యార్థులు ఆఫర్‌ లెటర్లు అందుకుంటున్నారు. కొన్ని సంస్థలు ఎంఏ ఎకనామిక్స్‌లో భాగంగా క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, ఎకనోమెట్రిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎంఎస్‌ఈ) ... అప్లైడ్‌ క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్‌, యాక్చూరియల్‌ ఎకనామిక్స్‌, ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌, జనరల్‌ ఎకనామిక్స్‌, ఎన్వైరాన్‌మెంటల్‌ ఎకనామిక్స్‌ అంశాల్లో పీజీ కోర్సులు అందిస్తోంది. అలాగే ఇందులో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎకనామిక్స్‌ కోర్సు కూడా ఉంది.
మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ (ఎంబీఈ)
కొన్ని బీ స్కూల్స్‌ మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ (ఎంబీఈ) పేరుతో కోర్సు అందిస్తున్నాయి. ఉత్పత్తి, శ్రామికులు, క్యాపిటల్‌ మార్కెట్‌ అంశాలను ప్రధానంగా జోడించి ఈ కోర్సు అందిస్తున్నారు. ఎకనామిక్స్‌, కామర్స్‌, ట్రేడింగ్‌ అంశాలు ఇందులో ఉంటాయి. ట్యాక్స్‌ స్ట్రాటజీ, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మొదలైనవి ప్రధాన సబ్జెక్టులు. వీరికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, ఫైనాన్షియల్‌ మేనేజర్‌ హోదాలతో ఉద్యోగాలు లభిస్తాయి. దిల్లీ యూనివర్సిటీ, లఖ్‌నవూ యూనివర్సిటీ, ఐఐఎం అహ్మదాబాద్‌, కొచిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మొదలైన చోట్ల ఈ కోర్సు అందిస్తున్నారు.
జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు
* జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ
* దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, న్యూదిల్లీ
* హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ
* ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోల్‌కతా, న్యూదిల్లీ
* జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, న్యూదిల్లీ
* గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌, పుణే
* మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎంఎస్‌ఈ), చెన్నై
* బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి
* ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌ (ఐజీఐడీఆర్‌), ముంబయి
* సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ (సీడీఎస్‌), తిరువనంతపురం
* బిట్స్‌ - పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాపంస్‌ల్లో ఆనర్స్‌ విధానంలో ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో...
* ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
* ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
* శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
* శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం
* డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ, శ్రీకాకుళం
తెలంగాణలో...
* ఉస్మానియా యూనివర్సిటీ
* కాకతీయ యూనివర్సిటీ
ఈ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న పలు ప్రైవేటు కళాశాలల్లోనూ ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సును బోధిస్తున్నారు. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీ సెట్ల ద్వారా వాటిలోకి ప్రవేశం లభిస్తుంది.
పలు కొలువులు
అర్థశాస్త్ర పరిజ్ఞానం, ఆంగ్ల భాషా సామర్థ్యం ఉంటే బహుళజాతి కంపెనీల్లో కొలువులు సులువుగా సొంతం చేసుకోవచ్చు. పరిశోధకులు, విశ్లేషకులు, ఆర్థిక సలహాదారు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌, ఆడిటర్‌, స్టాక్‌ బ్రోకర్‌, మీడియా విశ్లేషకుడు, బిజినెస్‌ జర్నలిస్ట్‌ తదితర హోదాలతో ఉద్యోగాలు పొందవచ్చు. బోధనా రంగంలో రాణించడానికి ఎకనామిక్స్‌లో బీఏ పూర్తయిన తర్వాత బీఈడీ పూర్తిచేసి సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. ఎంఏ ఎకనామిక్స్‌ అర్హతతో జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా స్థిరపడొచ్చు. యూజీసీ నెట్‌ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ప్రయత్నించవచ్చు. బిజినెస్‌ స్కూళ్లు, ఎంబీఏ కళాశాలల్లోనూ ఎకనామిక్స్‌ పోస్టు గ్రాడ్యుయేట్లకు అవకాశాలుంటాయి. పీహెచ్‌డీ చేసి ఉంటే బోధన, పరిశోధన, కన్సల్టెన్సీ రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్థిక రంగంలో పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఇంజినీరింగ్‌ కంపెనీలు, బీమా సంస్థలు, తయారీ సంస్థలు, ప్రకటనా సంస్థలు, మీడియా, రిటైల్‌... ఇలా భిన్న రంగాలకు చెందిన సంస్థల్లోని పలు విభాగాల్లో అర్థశాస్త్ర నిపుణులకు అవకాశాలు ఉంటాయి.
యూపీఎస్సీ నిర్వహించే ఐఈఎస్‌ పరీక్షకు ఎకనామిక్స్‌, అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌, ఎకనామెట్రిక్స్‌ల్లో ఎందులోనైనా పీజీ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎంపికైనవారు గ్రూప్‌-ఎ ఆఫీసర్‌ గా కేంద్రప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తారు. అలాగే ఆర్‌బీఐలో గ్రేడ్‌-బి ఉద్యోగాల్లో కొన్నింటికి ఎకనామిక్స్‌లో పీజీ చదివినవారే అర్హులు. వీటికి సంబంధించిన ప్రకటనలు దాదాపు ఏటా వెలువడుతున్నాయి.Back..

Posted on 29-05-2018