Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నచ్చిన కొలువులో నెగ్గుకొద్దామిలా...!

చదువు పూర్తికావడం ఆలస్యం... క్యాంపస్‌ సెలక్షన్లలో ఉద్యోగాలు వచ్చేస్తోన్న రోజులివి. ఇష్టపడిన రంగం, కోరుకున్న జీతం... ఇక్కడితోనే ప్రయాణం ఆగిపోకూడదు కదా... అంచెలంచెలుగా ఎదగాలి. మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి. అందులోనే ఉంటుంది అసలైన కిక్‌. ఆ గెలుపును అందుకోవాలంటే...ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే కొన్ని నైపుణ్యాలు మన సొంతం కావాలి.

* ప్రణతికి బీ.టెక్‌ అయిన వెంటనే ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె అక్కడ ఇమడానికి మాత్రం చాలా రోజులే పట్టింది. సహోద్యోగులూ, కార్యాలయ వ్యవహారాలు ఓ పట్టాన అర్థంకాక... అయోమయానికి గురైంది.
* దివ్య మార్కెటింగ్‌ సంస్థలో ఉద్యోగి. 0చిన్న వయసులోనే ఉద్యోగం అందుకున్నా తను చేస్తోన్న పనికి సరైన గుర్తింపు రావడం లేదని అసంతృప్తిగా ఉంటోంది. ఎందుకిలా...
వీళ్లనే కాదు... చాలామందికి ఎదురయ్యే సమస్యలే ఇవి. నిజమే... ఉద్యోగంలో చేరగానే సరిపోదు. దాన్ని ఎంత సమర్థంగా నిర్వర్తిస్తున్నామనేదీ ముఖ్యమే. కొన్ని నైపుణ్యాలు పెంచుకోకపోవడం, ముఖ్యమైన విషయాలు తెలుసుకోకపోవడం, మొహమాటం, ఇతరులతో పోల్చినప్పుడు వెనకపడిపోవడం, బృందస్ఫూర్తి లేకపోవడం... ఇవన్నీ ఉన్నతి మెట్లు ఎక్కడానికి ఆటంకంగా మారతాయి. దాంతో క్రమంగా పనిపై ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగజీవితం అయితే యాంత్రికంగా మారుతుంది. లేదా విపరీతంగా ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఎదురవుతుంది. వాస్తవానికి పైన చెప్పిన సమస్యలు పెద్దవేం కావు. కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకుంటే... మనంతట మనమే వాటిని పరిష్కరించుకోవచ్చు. అది సాధ్యం కావాలంటే...
అవగాహన రావాలి...
ముందు ఆ సంస్థ పనితీరూ, వ్యవహారాలన్నింటినీ వీలైనంత త్వరగా అర్థం చేసుకోగలగాలి. చేరిన కొత్తల్లో ఎవరికీ పనితెలియకపోవచ్చు. కానీ నేర్చుకోవడంలో వేగం ఉండాలి. ఫాస్ట్‌లెర్నర్లుగా మారాలి. అలా నేర్చుకోవడం కూడా ఓ సవాలే కాబట్టి... పనివేళలకు పరిమితులు పెట్టుకోకుండా అవసరం అనుకుంటే ఎక్కువగంటలు కష్టపడగలగాలి.ఉద్యోగంలో చేరిన మొదటి రోజే మీకంటూ కొన్ని లక్ష్యాలను రూపొందించుకోవడం తప్పనిసరి. అవి ఉన్నతంగా, ఆచరణీయంగా ఉండేలా చూసుకోవాలి. వీటిల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు రెండూ ఉంటే మరీ మంచిది. వాటికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకోవడం, అవసరాన్ని బట్టి మార్పు చేర్పులకు సిద్ధంగా ఉండటం వంటివన్నీ మిమ్మల్ని లక్ష్యానికి చేరువ చేస్తాయి.
ఇక, పనివాతావరణంలో ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరికొన్ని ఉంటాయి.
సాయం అడగడం: ఆఫీసులో చేరిన మొదట్లో కొంత బెరుకు సహజం. క్రమంగా ఆ పరిసరాలకు మీరు అలవాటు పడతారు. ముందు అక్కడి వాతావరణాన్ని గమనించండి. కొత్తగా చేరిన మీకు అన్ని విషయాలూ తెలియకపోవచ్చు. అందుకు బాధపడకూడదు. భయపడకూడదు. మీకు తెలియని వాటిని మీ సహోద్యోగులనూ, అధికారులనూ, స్నేహితులను అడిగి తెలుసుకోవాలి. అలాగే సహోద్యోగినో, ఉన్నత స్థానంలో ఉన్న మరో ఉద్యోగినో మెంటార్‌గా ఎంచుకోవాలి.
ప్రశ్నలు అవసరమే: మనకు ప్రశ్నించేతత్వం ఉన్నప్పుడే ఈ పరుగుల ప్రపంచంలో ముందుకు వెళ్లగలం. ఎవరేం చెప్పినా అడ్డుచెప్పకుండా సాంతం విని, అవసరమైనంత మేరకే తీసుకోవాలి. సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకోవాలి. అలానే సంస్థ అభివృద్ధికి మీవైపు నుంచి కూడా కొన్ని సలహాలూ, సూచనలను ఎప్పటికప్పుడు పై అధికారికి నివేదించండి.
సాంకేతికతపై పట్టు: అవును. సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటిప్పుడు పెంచుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం కూడా. అవసరమైనవాటిని అందిపుచ్చుకోగలగాలి. అప్పుడే మనం కూడా ఆ పోటీలో నిలబడగలుగుతాం.
ప్రతిభా, వ్యక్తిత్వం: మీరు ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే మొదట దాన్ని ప్రేమించాలి. ఆ తరువాత శోధించాలి. చివరకు సాధించాలి. అది ప్రతిభతోనే సాధ్యం. దాంతోపాటు వ్యక్తిత్వం కూడా ముఖ్యమే. అందరితో స్నేహంగా ఉండాలి. దాంతోపాటూ ఓ పరిధీ గీసుకోవాలి. మీ సానుకూల వైఖరే మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. మీ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వారిని చూడండి. వారు ఆ స్థాయికి ఎలా వచ్చారో తెలుసుకోండి. మీరూ అలా గొప్ప వ్యక్తిలా మారాలని అనుకోవాలి. పత్రికలూ, మ్యాగజైన్లలో వచ్చే ప్రముఖుల కథనాలు చదివి స్ఫూర్తి పొందండి.
బాధ్యతగా, చొరవతో: కొత్తగా చేరా కదా! అని పనిని తేలిగ్గా తీసుకోకూడదు. ఏ కొత్త పని ఇచ్చినా తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ‘నేను కొత్తగా వచ్చా. నాకేం తెలియదు’ లాంటి వాటిని పక్కన పెట్టి పక్కాగా చేయగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పండి. చాలామంది బాస్‌ పురమాయించాడనో, అధికారి ఆదేశించాడనో, సంస్థ చెప్పిందనో పనిచేస్తారు. మీరు ఆ కోవలో ఉండకూడదు. మీరే కొత్త పనులు ఏమైనా ఉన్నాయా అంటూ మీ పై అధికారి వెంటపడండి. మీకు ఇచ్చిన పనిని తక్కువ సమయంలో పరిపూర్ణంగా పూర్తి చేయండి. ఫలానా అమ్మాయికి ఇస్తే ఆ పని త్వరగా పూర్తవుతుందని యాజమాన్యం మీ గురించి అనుకునేలా కష్టపడాలి.
సంస్థలు ఉద్యోగుల విషయంలో ఎలాంటి అంశాలను పరిగణిస్తాయో చూద్దాం.
* ఉద్యోగంలో చేరిన కొత్తలో చాలామంది బృంద చర్చల్లో, సమావేశాల్లో ఏం మాట్లాడకుండా ఉంటారు. అయితే వీరిలో చాలా కొత్త రకాల ఆలోచనలూ, మరెన్నో సందేహాలూ ఉంటాయి. వాటిని అడగొచ్చో లేదో అనుకుంటూ మౌనంగా ఉండిపోతారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా ఉంటే కెరీర్‌లో ఎదగడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి సమావేశం ఎందుకు పెడుతున్నారు... ఏయే అంశాలపైనా చర్చ జరుగుతుంది... తదితర విషయాలను ముందే తెలుసుకుని ఆ అంశంపై పూర్తి కసరత్తు చేసుకుని వెళ్లాలి. దానిపై మీకు వచ్చిన సందేహాలను నిస్సంకోచంగా అడగాలి. ఆ చొరవ ఉండటం తప్పనిసరి. అలాగే ఆలోచనలనీ చెప్పాలి. అలాగే ప్రతి సమావేశానికి ముందు సిద్ధంగా ఉండాలి. మనం అనుకున్న విషయాన్ని ధైర్యంగా బృంద సభ్యుల ముందు ఉంచాలి. దాన్ని వారు పరిగణిస్తారా లేదా అనేది తరువాతి విషయం.
* ఏ సంస్థ అయినా క్రమశిక్షణకే మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. ఉద్యోగులు సమయానికి కార్యాలయానికి వస్తున్నారా లేదా... ఇచ్చిన సమయంలో పని పూర్తి చేస్తున్నారా లేదా వృథా చేసున్నారా... అనే విషయాలనే గమనిస్తుంది. కాబట్టి పనివేళలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.
* కాలేజీల నుంచి క్యాంపస్‌ సెలక్షన్ల ద్వారా కార్యాలయాలకు నేటితరం వెళుతోంది. అయితే కాలేజీలో ఉన్నట్లు కార్యాలయంలో ఉంటామంటే కుదరదు. ఆఫీసులో హుందాగా ఉండటానికి పెద్దపీట వేయాలి. దుస్తులూ, నడకా, మాట్లాడటం ఇలా అన్నీ అలాగే ఉండాలి. ఇది త్వరగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత విషయాలూ, రాజకీయ, సినిమా సంబంధ విషయాలూ, ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇష్టంగా కష్టపడాలి....
సహోద్యగుల్నే గమనిస్తే... వారిలో కొందరు వారం మొత్తంలో 60-70 గంటలు పనిచేసే వారూ ఉన్నారు. త్వరగా వస్తారు. త్వరగా పనులు మొదలుపెడతారు. వారి లక్ష్యాలను అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేస్తారు. సంస్థ అలాంటివారిని ఎప్పుడూ గుర్తిస్తుంది. కొత్త అవకాశాలే కాదు, పదోన్నతలూ ఇచ్చి ప్రోత్సహిస్తుంది.

Back..

Posted on 07-06-2018