Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వారికి తెలిసిపోతుంది వాతావరణం!

* కెరియ‌ర్ గైడెన్స్‌ మెటియోరాలజీ

మొన్నటి హుద్‌హుద్, తిత్లీ, ఫని... నిన్నటి అంఫన్, నేటి నిసర్గ తుపానుల బీభత్సాలు అందరికీ తెలిసినవే. అంత పెద్ద విపత్తులను ముందే గుర్తించి ప్రాణ, ఆస్తి నష్టాలను చాలా వరకు తగ్గించే విభాగం ఒకటి ఉంది. అదే వాతావరణ శాస్త్రం (మెటియోరాలజీ). ఇందులోని నిపుణులు ప్రకృతి సృష్టించే ప్రమాదాలను పసిగట్టి పర్యావరణంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. ఇలాంటి ప్రజారక్షణలో భాగస్వాములయ్యే విధుల పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు మెటియోరాలజీ కోర్సులు చేయవచ్చు.

మన దేశంలోని భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌) పరిధిలో ఉండే భారత వాతావరణ విభాగం (ది ఇండియా మెటియోరాలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ - ఐఎండీ) వాతావరణాన్ని అధ్యయనం చేసి ముందస్తు సూచనలు చేస్తుంది. భూకంప సంబంధిత అంశాలనూ పరిశీలిస్తుంది. దీనికి యూఎన్‌ఓ అనుబంధ ప్రపంచ మెటియోరాలాజికల్‌ సంస్థలో సభ్యత్వం ఉంది. హిందూ మహా సముద్రం ఉష్ణమండల ప్రాంతాల్లో తుపానులను, ఇతర వాతావరణ మార్పులను అంచనా వేయడం, తుపానులకు పేర్లు పెట్టడం, తగిన హెచ్చరికలు జారీ చేయడం ఐఎండీ ప్రధాన బాధ్యతలు. ఇతర ప్రభుత్వ విభాగాల మాదిరిగానే ఈ సంస్థ రకరకాల వాతావరణ నిపుణుల కోసం నియామకాలు నిర్వహిస్తుంటుంది. దీంతోపాటు పర్యావరణ కాలుష్య నియంత్రణ కోసం పలు ప్రైవేటు ఆర్గనైజేషన్లు, రక్షణ దళాల ఆపరేషన్లలో, విమానయాన రంగం, మిసైల్‌ లాంచింగ్‌ స్టేషన్లు, నౌకాయానం, అగ్రికల్చరల్‌ ప్లానింగ్‌ డివిజన్‌ తదితర విభాగాల్లోకీ వాతావరణ శాస్త్రం చదివిన వారిని తీసుకుంటారు.

ఏయే కోర్సులు?
వాతావరణ శాస్త్రంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమాకి పదోతరగతి కనీస అర్హత. సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా మెటియోరాలాజీలో డిప్లొమా చేసిన వాళ్లు బీఎస్సీ లేదా బీటెక్‌లో చేరవచ్చు. బీటెక్‌ కోసం అదనంగా జేఈఈలో అర్హత పొంది ఉండాలి. గేట్‌ స్కోరుతో ఎంటెక్‌ లేదా ఎంఎస్సీల్లో ప్రవేశాలు ఉంటాయి. తర్వాత దశలో పీహెచ్‌డీ చేయవచ్చు.

అందిస్తున్న సంస్థలు
ఐఐటీ-దిల్లీ, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటియోరాలజీ-పుణె, ఆంధ్రాయూనివర్సిటీ -విశాఖపట్నం, ఆర్యభట్ట రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్‌ -నైనిటాల్, సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫిరిక్‌ అండ్‌ ఓషనిక్‌ సైన్స్‌ (సీఏఓఎస్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -బెంగళూరు, కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ - కేరళ, శివాజీ యూనివర్సిటీ - కొల్హాపూర్, మహారాష్ట్ర; సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ అండ్‌ అట్మాస్ఫిరిక్‌ సైన్స్‌ - జేఎన్‌టీయూహెచ్, హైదరాబాద్,

ఎలాంటి ఉద్యోగాలు?
సాధారణంగా ఐఎండీ నుంచి టెక్నికల్‌ అసిస్టెంట్, గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బీ ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతుంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్లు టెక్నికల్‌ అసిస్టెంట్, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు అర్హులు. ఎంఫిల్‌ లేదా పీహెచ్‌డీ చేసిన వాళ్లు గ్రూప్‌-ఏ, బీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఎండీ సైంటిస్ట్‌: ఫిజిక్స్‌/మెటియోరాలజీ/ అట్మాస్ఫిరిక్‌ సైన్సెస్‌ లేదా తత్సమాన విభాగాల్లో 60 శాతం మార్కులతో పీజీ ఉన్న వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. డిగ్రీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన డిగ్రీలో అరవై శాతం మార్కులు పొంది ఉండాలి. డిగ్రీ, పీజీ స్థాయుల్లో టీచింగ్‌ తదితర అనుభవాలూ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ఐఎండీ క్యాంపస్‌ల్లో ఒక సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ కోర్స్‌ ఇన్‌ మెటియోరాలజీ చేయాల్సి ఉంటుంది.

ఎస్‌ఎస్‌సీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: ఇది గ్రూప్‌-బీ పోస్టు. ఫిజిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ సబ్జెక్టులతో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ చేసిన వాళ్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు లేదా 6.75 సీజీపీఏ తప్పనిసరి. ఇంటర్మీడియట్‌ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లను చదివి ఉండాలి. ఇటీవల కోర్టు ఉత్తర్వుల మేరకు బీటెక్, బీఈ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. రాత పరీక్ష ఆధారంగా నియామకాలు జరుపుతారు. వయసు పరిమితి 30 సంవత్సరాలు.

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌): మెటియోరాలజీ/ పర్యావరణంలో ఎమ్మెస్సీ లేదా ఎంటెక్‌ చేసిన వాళ్లు అర్హులు. ఆగ్రోమెటియోరాలజీ/అగ్రికల్చరల్‌ ఫిజిక్స్‌/అగ్రానమీ/సాయిల్‌ సైన్స్‌/అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌లో ఎమ్మెస్సీ (అగ్రికల్చర్‌) పూర్తిచేసిన వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ (అగ్రికల్చర్‌) చేసి పీజీలో ఎంసీఏ ఉత్తీర్ణులు, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఎన్వైరాన్‌మెంటల్‌ సైన్సెస్‌లో బీటెక్‌ పాసైన వారూ ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హులే.

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి మెయిన్స్‌ జరుపుతారు. తర్వాత షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

వీటితోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెటియోరాలజిస్ట్, రిసెర్చ్‌ కన్సల్టెంట్, టీచింగ్‌ అసిస్టెంట్, ఇండస్ట్రియల్‌ మెటియోరాలజిస్ట్, ఫిజికల్‌ మెటియోరాలజిస్ట్‌ తదితర ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

Back..

Posted on 09-06-2020