Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తరతరాల సంపదను కాపాడే కొలువులు!

* కెరియర్‌ గైడెన్స్‌ మ్యూజియాలజీ

వర్తమానానికీ.. భవిష్యత్తుకూ గతమే పునాది. ఆ పురాతన విజ్ఞానాన్నీ, సంస్కృతీ సంప్రదాయాలను తర్వాతి తరాలకు చేరవేయడమే పురావస్తు ప్రదర్శనశాలల ప్రధాన లక్ష్యం. పూర్వికుల జీవన విధానం ఎలా ఉండేది అనే అంశం అందరికీ ఆసక్తి కలిగించేదే. ఆ విశేషాలు తెలుసుకుంటున్న కొద్దీ ఉత్సాహం అనిపిస్తుంది. అలాంటి ప్రాచీనతపై మంచి అభిరుచి ఉంటే దాన్నే కెరియర్‌గా మార్చుకునే వీలుంది. కొంచెం భిన్నమైన దారి అయినప్పటికీ ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

కాలగర్భంలో కలిసిపోయిన పూర్వికుల చరిత్ర, వారి జీవన విధానాలూ, అభిరుచుల తీరును వివిధ అవశేషాలు, చిహ్నాలు, వస్తువుల రూపంలో మనకు సురక్షితంగా అందించేవి పురావస్తు ప్రదర్శన శాలలు (మ్యూజియాలు). వాటిని తరతరాలుగా భద్రపరచడం ద్వారా నాటి విశేషాలను తెలుసుకునే, పరిశోధించే వీలు కల్పిస్తున్నాయి. సామాజిక, విద్యాసంబంధమైన అవసరాల దృష్ట్యా వీటికీ ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే వీటిని ఆర్ట్‌, హిస్టరీ, ఆర్కియోలాజికల్‌, సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌, మారిటైం, మిలిటరీ.. మొదలైన రకాలుగా వర్గీకరించారు.

మ్యూజియాలను నిర్వహించేవారు మ్యూజియాలజిస్టులు. మ్యూజియాల నిర్వహణ, సేకరణ, డాక్యుమెంటేషన్‌, పరిశోధన, ప్రదర్శన, సంరక్షణ మొదలైవన్నీ వీరి పనిలో భాగం. విశ్లేషించే మనస్తత్వంతోపాటు చరిత్ర, సంస్కృతులపై ఆసక్తి ఉన్నవారు దీన్ని కెరియర్‌గా ఎంచుకోవచ్చు. చరిత్రను దగ్గరగా చూసి తెలుసుకునే అవకాశం ఈ వృత్తిలో దొరుకుతుంది. దీనికి పురాతత్వశాస్త్రం (ఆర్కియాలజీ)తో దగ్గరి సంబంధం ఉంటుంది.

ఇతర ఆర్ట్స్‌ సబ్జెక్టులతో పోలిస్తే దీనిపై విద్యార్థులకు అవగాహన కొంచెం తక్కువనే చెప్పవచ్చు. కానీ మల్టీడిసిప్లినరీ సబ్జెక్టులతో ఉపాధిపరంగా మంచి అవకాశాలను అందుకునే వీలుంది. కెరియర్‌గా ఎంచుకున్నవారికి దేశవ్యాప్తంగా మంచి అవకాశాలున్నాయి.

ఏయే కోర్సులు ?
డిగ్రీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియాలజీ), పీజీ (మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ మ్యూజియాలజీ, ఎంఎస్‌సీ- మ్యూజియాలజీ), పీజీ డిప్లొమా (పీజీ డిప్లొమా ఇన్‌ మ్యూజియాలజీ), పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ మ్యూజియాలజీ అండ్‌ కన్జర్వేషన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ మ్యూజియాలజీ అండ్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్స్‌), అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా (అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియాలజీ), సర్టిఫికేషన్‌, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
* డిగ్రీ కోర్సులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. డిగ్రీ స్థాయిలో చాలా తక్కువ కోర్సులు ఉన్నాయి.
* పీజీ కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సుల కాలవ్యవధి ఏడాది. ఆంత్రపాలజీ, ఆర్ట్స్‌, బోటనీ, జియాలజీ, హిస్టరీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, విజువల్‌ ఆర్ట్స్‌, అగ్రికల్చర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, మెరైన్‌ సైన్స్‌, ఎర్త్‌ సైన్స్‌, జువాలజీల్లో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులను సాధించి ఉండటం తప్పనిసరి.
* సర్టిఫికేషన్‌ కోర్సులకూ అర్హత డిగ్రీ. కోర్సుల కాలవ్యవధి మూడు నుంచి ఆరు నెలలు.
* పీహెచ్‌డీ కోర్సులకు పీజీ స్థాయిలో మ్యూజియాలజీ లేదా సంబంధిత కోర్సులు చేసినవారు అర్హులు.

కోర్సుల్లో భాగంగా మ్యూజియానికి సంబంధించి శిక్షణ, పరిజ్ఞానం, అవసరమైన వివిధ నైపుణ్యాలను నేర్చుకుంటారు. పునరుద్ధరణ, వాటి నిర్వహణ, చరిత్ర, సేకరణ యాజమాన్యం, డాక్యుమెంటేషన్‌, ప్రజెంటేషన్‌, ఇంటర్‌ప్రిటేషన్‌, మ్యూజియం ఆర్కిటెక్చర్‌, హిస్టరీ, ఆర్కియాలజీ ఆఫ్‌ ఇండియా, హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌, ఫోక్‌ ఆర్ట్‌ మొదలైన అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. థియరీతోపాటు ప్రాక్టికల్‌ అంశాలూ ఉంటాయి.

సీట్ల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. సాధారణంగా చాలావరకూ విశ్వవిద్యాలయాలు, సంస్థలు ప్రత్యేకంగా ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. వాటి ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంట్రన్స్‌తోపాటు ఇంటర్వ్యూలనూ నిర్వహిస్తున్నాయి.

మ్యూజియాలజీ అంటే?
పురావస్తు ప్రదర్శనశాలలను, వాటి కోసం సేకరించిన వస్తువుల నిర్వహణను అధ్యయనం చేయడమే మ్యూజియాలజీ.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు
ఈ కింది సంస్థల్లో ప్రవేశాలకు సాధారణంగా ఏప్రిల్‌, మేల్లో ప్రకటనలు వెలువడతాయి.
* కలకత్తా యూనివర్సిటీ
* నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ
* బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి
* అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌
* దిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ రిసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
* ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌

ఉద్యోగావకాశాలు
చరిత్ర, వారసత్వ సంపదలను రక్షించాలనే స్పృహ సామాజికంగా బాగా పెరుగుతోంది. దీంతో సంబంధిత నిపుణులకు గిరాకీ ఏర్పడింది. మనదేశంలో కేంద్రప్రభుత్వ, జిల్లా స్థాయి, ట్రస్ట్‌, ప్రైవేటు మ్యూజియాలన్నీ కలిపి వెయ్యికిపైగా ఉన్నాయని అంచనా. దీనిలో మ్యూజియం డైరెక్టర్‌, క్యూరేటర్‌, ఎడ్యుకేటర్‌, ఎగ్జిబిట్‌ డిజైనర్‌, ఆర్కివిస్ట్‌, కన్జర్వేషన్‌ స్పెషలిస్ట్‌ మొదలైన హోదాలుంటాయి.
మ్యూజియాలజిస్టులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ, జాతీయ స్థాయి మ్యూజియాల్లో (ఉదా: నేషనల్‌ మ్యూజియం- న్యూదిల్లీ, ఇండియన్‌ మ్యూజియం- కోల్‌కతా, సాలార్జంగ్‌ మ్యూజియం- హైదరాబాద్‌ మొదలైనవి) పనిచేసేవారు. ఇప్పుడు ఎన్నో ప్రైవేటు సంస్థలూ మ్యూజియాలు (ఉదా: అజీజ్‌ భట్‌ మ్యూజియం- కార్గిల్‌, ఓఎన్‌జీసీ సెకండ్‌ ఆయిల్‌ మ్యూజియం-గువాహటి, సచిన్‌ తెందూల్కర్‌ మ్యూజియం- ముంబయి మొదలైనవి), ఆర్ట్‌ గ్యాలరీల రూపంలో ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వీరికి ఆర్ట్‌, హిస్టరీ, ఆర్కియాలజీ, టెక్స్‌టైల్‌, సంస్కృతి ఫౌండేషన్లు మొదలైనవాటిల్లోనూ అవకాశాలుంటాయి.
యూపీఎస్‌సీ/ ఎస్‌ఎస్‌సీ పరీక్షల ద్వారా ప్రభుత్వ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఆసక్తి ఉంటే సెట్‌/ నెట్‌ పరీక్షల ద్వారా పరిశోధననూ ఎంచుకోవచ్చు.
క్యూరేటర్‌ స్థాయి నుంచి అనుభవంతో డైరెక్టర్‌ స్థాయి వరకూ ఎదగవచ్చు. ప్రారంభ వేతనం ప్రైవేటు విభాగంలో కంటే ప్రభుత్వ విభాగంలోనే తక్కువ. సాధారణంగా ప్రారంభ వేతనం నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకూ ఉంటుంది.

ఈ కెరియర్‌ ఎంచుకోవాలనుకుంటే.!
* చరిత్రపై, పరిశోధనపై ఆసక్తి ఉండాలి.
* దూర ప్రయాణాలు చేయాల్సి రావడం సాధారణం. ఫీల్డ్‌ వర్క్‌లో భాగంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండాలి.
* ఓపిక, అంకిత భావం ఉండాలి.
* కళల పట్ల అవగాహన, ఆసక్తి ఉండాలి.
* విశ్లేషణ నైపుణ్యాలుండాలి.
* ఒకటి నుంచి రెండు విదేశీ భాషలపై అవగాహన ఉంటే మంచిది.
* బృందంతో పనిచేయగలగాలి.
* విభిన్న పట్టణాల్లో విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.

Back..

Posted on 17-03-2020