Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
రాయబోతే గుర్తే రాదు!

అంతా చదివేశా డాడీ... ఎగ్జామ్స్‌ సూపర్‌ రాసేస్తా! కోతలు కోసిన కిరణ్‌కి యావరేజ్‌ మార్కులే వచ్చాయి. బాగా చదివా మమ్మీ... కానీ పరీక్ష రాస్తుంటే ఏం గుర్తుకు రాలేదు! వీడో మతిమరుపు మాస్టర్‌... తేల్చేశారు ఇంట్లో. కిరణ్‌ ఇగో దెబ్బతింది. సిలబస్‌ అంతా తన తప్పు లేకుండా కవర్‌ చేశాడు. రాసేటప్పుడు సరిగా జ్ఞాపకం రాకపోతే తానేం చేయాలి? కోపం... అయోమయం... నిరుత్సాహం! చాలామంది విద్యార్థుల్లో ఇప్పుడు ఇదే కనిపిస్తోంది. తల్లిదండ్రులు కూడా పిల్లల సమస్య తెలుసుకొని పరిష్కరించకుండా ఒత్తిడికి గురి చేస్తున్నారు.

చదివింది గుర్తుపెట్టుకోవడం ఒక పని. మెదడుతో చేసే పని. ఒకే రకమైన శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ మనం ఒక జిమ్నాస్టు లేదా క్రీడాకారుడిలాగా చేయలేం. ఎందుకంటే వాళ్లు తమ శరీరానికి కావాల్సినంత శిక్షణ ఇస్తారు. అద్భుతాలు చేస్తారు. ఒక స్పెల్‌బీ విజేత, శాస్త్రవేత్త, అవధాని.. వీళ్లెవరూ ప్రత్యేక శక్తులతో పుట్టరు. శిక్షణతోనే తమ సామర్థ్యాన్ని అసాధారణంగా ప్రదర్శిస్తారు.
ఒక కొత్త టాపిక్‌ను అర్థం చేసుకొని, గుర్తుంచుకొని తర్వాత ఎప్పుడైనా సొంతమాటల్లో తిరిగి రాయగలిగితే ఆ విషయంపై ఏ ప్రశ్నలు అడిగినా మనం తేలిగ్గా సమాధానం ఇవ్వగలం. అప్పుడు మరచిపోవడం అనే సమస్య ఉండదు. అదే చదువులో మనం ఉపయోగించాల్సిన టెక్నిక్‌.
అసలు సమస్య నేర్చుకునే పద్ధతితోనే మొదలవుతుంది. గైడ్లలోని ప్రశ్నలు-జవాబులను చదివి వాటిని యథాతథంగా పరీక్షలో రాయాలనుకుంటేనే మరచిపోవడం అనే ఇబ్బంది ఎదురవుతుంది. అర్థం చేసుకొని సొంతవాక్యాల్లో రాయాలనుకుంటే ఆ సమస్య తలెత్తదు.
లాజిక్‌ ఏదీ?
మానస జవాబు పత్రాన్ని పరిశీలించిన తండ్రి మార్కులు వేయడంలో మాస్టారు వివక్ష చూపాడని పోట్లాటకు వచ్చాడు. స్కూల్లో ఆ ప్రశ్నకు ఇచ్చిన జవాబును యథాతథంగా తన కూతురు రాసిందనీ, అయినా మార్కులు తక్కువ వేశారనీ ఆయన గొడవ. అడిగిన ప్రశ్నలో ఉన్న చిన్న మెలికను అర్థం చేసుకోకుండా జవాబు రాసిందని, అందుకే తక్కువ మార్కులు వచ్చాయని సర్దిచెప్పేసరికి మాస్టారు మూడు గ్లాసుల నీళ్లు తాగాల్సి వచ్చింది.
అసలు ప్రశ్న ఏమిటి? దానికి మనం రాస్తున్న సమాధానం సరైనదేనా? అనే లాజిక్‌ను విద్యార్థులు విస్మరిస్తున్నారు. బట్టీ పెట్టడంపైనే దృష్టి పెట్టడంతో సొంతమాటల్లో జవాబు రాసే ప్రయత్నం చేయడం లేదు.
ఈ పరిష్కారం గురించి ఆలోచించే ముందు జ్ఞాపకశక్తి ఏ విధంగా పని చేస్తుందో చూద్దాం.
ఒక విషయం మనకు గుర్తుండాలంటే మూడు నియమాలున్నాయి.
1) ఆ విషయం మనకు అర్థం కావాలి. దాని వూహాచిత్రం మనసులో ఏర్పడాలి. రాజు గుర్రం మీద అడవికి వెళ్లాడు అనే వాక్యాన్ని మనం వూహించుకోగలం. కానీ ఎక్స్‌, వై మీద ప్రయాణిస్తూ జెడ్‌కి వెళ్లాడు అంటే కళ్ల ముందు కదలదు. మొదటి వాక్యం తేలిగ్గా గుర్తుంటుంది. రెండోది కష్టం.
2) శబ్దానికీ, రూపానికీ సంబంధించి స్పష్టత ఉండాలి. అర్థమైనా కాకపోయినా సినిమా పాటలూ, ప్రార్థనా శ్లోకాలూ చాలామందికి గుర్తుంటాయి. కారణం వాటి శబ్దం స్పష్టంగా ఉండటమే. అలాగే సినిమా డాన్స్‌లు సులభంగా వేసేస్తారు. శాస్త్రీయ నృత్యాలు గుర్తుండవు. కారణం సినిమా స్టెప్స్‌ విడివిడిగా స్పష్టంగా ఉంటాయి. భరతనాట్యం లాంటి శాస్త్రీయ నృత్యాల్లో స్టెప్స్‌ కలిసిపోయి, సంక్లిష్టంగా ఉంటాయి.
3) మనకు చదివే అంశం మీద ఆసక్తి ఉండాలి. అది ఉంటే అర్థం చేసుకోవడం, స్పష్టత ఏర్పరచుకోవడం సాధ్యమవుతాయి. ఆసక్తి వల్ల ఆయా శబ్దాలు, దృశ్యాలు మెదడులో బలంగా ముద్రితమవుతాయి.
అంకెలూ, పేర్లు, ఫార్ములాలు...
సాధారణ విద్యార్థులకు ఎదురయ్యే మరో ప్రధాన సమస్య జవాబుల్లో భాగంగా వచ్చే అంకెలూ, పేర్లూ, ఫార్ములాలూ గుర్తుంచుకోవడం. చిన్న అలవాటుతో ఆ సమస్యను అధిగమించవచ్చు. ఒక చిత్తు పుస్తకం, నలుపు లేదా ఎరుపు స్కెచ్‌ పెన్ను కావాలి. మనం చదివే జవాబులో గుర్తుంచుకోవాల్సిన సంఖ్య, దానికి సంబంధించిన పేరు లేదా పదాన్ని రాసుకోవాలి.
‘1757లో జరిగిన ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిషర్ల ప్రత్యక్ష రాజ్యాధికారానికి నాంది పలికింది’ అనే వాక్యంలో 1757, ప్లాసీ యుద్ధం అనే మాటలు ముఖ్యమైనవి. చిత్తు పుస్తకంలో పెద్దపెద్ద అక్షరాలతో ఈ రెండు పదాలనీ రాసుకోవాలి. దానివైపే చూస్తూ పదిసార్లు పైకి ఉచ్చరించాలి. మళ్లీ స్కెచ్‌తోనే రాయాలి. ఇలా ఒకటికి రెండుసార్లు చేస్తే ఆ సంఖ్య, పేరు మీకు తప్పకుండా గుర్తుంటాయి. ఇదే పద్ధతిలో సైన్సులో శాస్త్రీయ నామాలు, ఫార్ములాలు గుర్తుంచుకోవచ్చు.
ఏకాగ్రత తప్పనిసరి
ఏకాగ్రత అంటే చేసే పని మీద మనసు లగ్నం కావడం. చదివేటప్పుడు వేరే ఆలోచనలు మనసులోకి వస్తుంటే చదివింది గుర్తుండదు. అంతరాయాల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ కింది విధానాలు పాటించవచ్చు.
* ఏకాంతాన్ని ప్రకటించడం: ‘ఈ గంట సమయం నన్ను పలకరించ వద్దు. నేను చదువుకుంటున్నాను’ అని ప్రకటించాలి.
* ఫోన్లు, టీవీలు వద్దు: సెల్‌ఫోన్లు, టీవీలు స్విచ్ఛాఫ్‌ చేయాలి.
* కాపలా పెట్టుకోవాలి: లాండ్‌లైన్‌ ఫోను వచ్చినా, కాలింగ్‌ బెల్‌ మోగినా, బయట నుంచి ఎవరైనా పిలిచినా స్పందించడానికి మీ కుటుంబ సభ్యులను లేదా మీ స్నేహితులను కాపలా పెట్టుకోవాలి.
* బోర్డు పెట్టుకోవాలి: మీరు ఏం చదవబోతున్నారో చాప్టర్‌, సమయం వివరాలు బోర్డు మీద రాసి ఎదురుగా పెట్టుకోవాలి.
* కౌంట్‌డౌన్‌ టైమర్‌ పెట్టుకోవాలి: మీరు చదవడానికి నిర్ణయించిన సమయాన్ని గుర్తుచేయడానికి కౌంట్‌డౌన్‌ టైమర్‌ పెట్టుకోవాలి.
కచ్చితంగా అనుకున్న పని చేయాలన్న సంకల్పం ఏకాగ్రతకు మూలం. చేయాల్సిన, చేయగలిగిన పని మీద దృష్టి ఉంచడం మానేసి చేయలేకపోయిన పనులు, వృథా అయిన కాలం గురించి ఆందోళన చెందితే ఏకాగ్రత దెబ్బతింటుంది. ధ్యానం, ప్రార్థనల వల్ల ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దాంతో ఏకాగ్రత కుదిరి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆందోళన, మరచిపోతామనే భయం, త్వరగా ముగించేయాలనే కంగారు జ్ఞాపకశక్తికి ప్రతికూలాంశాలు.

పెద్ద జవాబును ముక్కలు చేయండి!
పేజీలకు పేజీలు ఉండే పెద్ద జవాబులను గుర్తుంచుకోవడం కష్టమే. అయితే దానికి సాధారణ కారణం ప్రతికూల దృక్పథమే. దీన్ని అధిగమించడానికి పెద్ద జవాబులను సాధ్యమైనన్ని చిన్న పేరాలుగా విడగొట్టుకోవాలి. ఒక్కో పేరా మీద దృష్టి పెట్టి అంతవరకే చదవాలి. అవసరమనుకుంటే ఒక్కో పేరాను విడిగా చిత్తు పుస్తకంలో రాసుకోవాలి. అది వచ్చిన తర్వాత దాని కింద మిగతా పేరాలు వరుసగా రాసుకొని చదవాలి.
బిట్లు మరచిపోతున్నారా?
ప్రతి పరీక్షలో బిట్లు లేదా మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు తప్పకుండా ఉంటాయి. అయితే బిట్లను గుర్తుంచుకోవడం అంత తేలిక కాదు. గుర్తున్నట్లే అనిపించినా అవసరమైన సమయంలో జ్ఞాపకం రాకపోవడం వీటి ప్రత్యేకత.
అందుకే బిట్‌పేపర్‌ అంటే అదృష్టం అనే అభిప్రాయం కొంతమంది విద్యార్థుల్లో ఏర్పడింది.
మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల్లో నాలుగు జవాబులు అక్కడే ఉన్నా కూడా సరైన సమాధానం గుర్తురాకపోతే చాలా చికాకుగా ఉంటుంది. దీనివల్ల పరీక్షలో విజయావకాశాలకు నష్టం జరుగుతుంది. బిట్లు స్పష్టంగా గుర్తుంచుకోవడానికి కథా పద్ధతి, సమూహపద్ధతి అని ఉన్నాయి.
కథా పద్ధతిలో ఆ బిట్టుకు సంబంధించిన పూర్వాపరాలను కలిపి ఒక కథ తయారు చేసుకుంటారు. మొత్తం కథను గుర్తుంచుకొని దాన్ని బిట్లుగా మార్చుకొని జవాబులు ఇచ్చుకుంటారు.
ఉదాహరణకు ‘ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757’ అనేది ఒక బిట్టు. దీనికి కథాపద్ధతి అనుసరిస్తే...
‘1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్‌ క్లైవ్‌ నాయకత్వంలోని బ్రిటిష్‌ సైన్యాలు, బెంగాలు నవాబు సిరాజుద్దౌలాను ఓడించాయి. అప్పటి నుంచి బెంగాలులో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాధికారాన్ని ఆంగ్లేయులు, బెంగాలు నవాబుతో కలిసి పంచుకోవడం ప్రారంభమైంది.’
ఇది ఈ బిట్టుకు సంబంధించిన చిన్న కథ. దీనిలో ఆ యుద్ధానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన బిట్లకు జవాబులు కూడా ఉన్నాయి.
ఈ కథను బట్టీ పట్టకూడదు. మనకు కావాల్సిన పేర్లనూ, సంవత్సరాలను పైకి ఉచ్చరిస్తూ ఒకటికి రెండుసార్లు ఎవరికైనా చెప్పాలి. సొంతమాటలతో చెబితే ఇంకా మంచిది. అప్పుడు బిట్లన్నీ గుర్తుంటాయి.
సమూహ పద్ధతిలో ప్లాసీ యుద్ధం, బక్సారు యుద్ధం, మొదటి మహారాష్ట్ర యుద్ధం, రెండో మహారాష్ట్ర యుద్ధం, మొదటి మైసూరు యుద్ధం ఇలా బ్రిటిషర్లు తమ రాజ్యవిస్తరణ కోసం భారతదేశంలో చేసిన యుద్ధాలకు సంబంధించి సంవత్సరం, జరిగిన ప్రదేశం, భారతీయ రాజు, బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌, ఫలితం తదితరాలను ఒకచోట కాలక్రమంలో రాసుకోవాలి. ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ వాటిలోని భేదాలనూ, కామన్‌ పాయింట్లనూ మననం చేసుకోవాలి. ఇలాంటి సాధన వల్ల ఒకే రకమైన బిట్లకు మధ్య తలెత్తే అయోమయాన్ని నివారించవచ్చు. బాగా గుర్తుంచుకోవచ్చు.
ముచ్చటగా మూడు అలవాట్లు
గుర్తుంచుకోవడానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలను తెలుసుకుంటే, వాటిని చదువులో ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. అందుకు విద్యార్థులు మూడు అలవాట్లను నేర్చుకోవాలి.
ప్రశ్నా, జవాబూ రెండూ చదవాలి
ప్రశ్న ఒకసారి చదివి జవాబు వందసార్లు చదవడం సాధారణంగా విద్యార్థులు చేసే పొరపాటు. జవాబు చదివే ప్రతిసారీ ప్రశ్న కూడా చదవడం వల్ల ఈ రెండిటికీ మధ్య ఉన్న సంబంధం మనసులో స్థిరపడుతుంది.
అంతరాయం లేకుండా!
ఒకసారి ప్రశ్న-జవాబు చదవడం ప్రారంభిస్తే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకూ ఆపకుండా, తలెత్తకుండా చదవాలి. సగంలో దిక్కులు చూడకూడదు. పక్కవారితో మాట్లాడకూడదు. అత్యవసరంగా అలా చేయాల్సి వస్తే ప్రశ్నను మళ్లీ మొదటి నుంచి చదవాలి.
ప్రతి పదమూ, అక్షరమూ పైకి చదవాలి
కొత్త ప్రశ్నలు సగం వచ్చిన తర్వాత సగం చూసి, సగం కళ్లు మూసుకొని చదవడం, కొన్ని పదాలనూ, అక్షరాలను పైకి పలకకుండా మింగివేయడం చాలామంది విద్యార్థులకు అలవాటు. దీన్ని మానుకోవాలి. చదవేటప్పుడు చూసే చదవాలి. అప్పచెప్పేటప్పుడు పూర్తిగా చూడకుండా చెప్పాలి. అన్ని పదాలూ సరిగ్గా ఉచ్చరించాలి.
ఈ మూడు అలవాట్లూ చేసుకుంటే ప్రశ్నలు- జవాబులు త్వరగా నేర్చుకోవచ్చు. పరీక్ష సమయంలో జవాబు సగం రాశాక మరచిపోవడం ఉండదు.

- డాక్ట‌ర్ టి.ఎస్‌. రావు, కౌన్సెలింగ్ సైకాల‌జిస్ట్‌
మానసిక ప్రశాంతతో జ్ఞాపకశక్తి - అబ్రహాం లింకన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు
ఏ విషయాన్నయినా... ముఖ్యంగా చదివింది గుర్తుంచుకోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే మెదడు పూర్తిస్థాయిలో పని చేస్తుంది. దాంతో జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.


Back..

Posted on 07-11-2017