Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వైరస్‌లనే వణికిస్తారు వీళ్లు!

* కెరియర్‌ గైడెన్స్‌ వైరాలజిస్టులు

కరోనా... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌. అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడూ ఏదో ఒక వైరస్‌ లేదా బ్యాక్టీరియాలు ప్రజలపై దాడికి పాల్పడుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేయడానికి.. అరికట్టడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. ఒకదాన్ని ఎదుర్కొనేలోపు.. ఇంకొకటి పుట్టుకొస్తోంది. ఇలా తరచూ దేశాలను గడగడలాడించే వైరస్‌లకే దడపుట్టించే వాళ్లూ ఉన్నారు. వాటి గుట్టువిప్పి, కట్టడి చేసి జనానికి రక్షణ కల్పిస్తారు. వాళ్లే వైరాలజిస్టులు. అందరి ఆరోగ్యాన్ని కాపాడే అలాంటి ఉద్యోగాల్లో చేరాలంటే కొన్ని కోర్సులు చేయాలి. పలు సంస్థలు, విశ్వవిద్యాలయాలు వైరాలజీ విభాగంలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి.

శత్రు మూకలు దేశంపై దండెత్తకుండా సరిహద్దుల్లో సైన్యం మనల్ని కాపాడుతున్నట్లుగానే వైరస్‌లు మానవ జీవితాలను నాశనం చేయడకుండా రక్షించేందుకు వైరాలజిస్టులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. సరిహద్దుల్లో శత్రువు రాకను అంతో ఇంతో ముందే పసిగట్టి సమర్థంగా ఎదుర్కోవడానికి వీలవుతుంది. కానీ వైరస్‌తో అలా కుదరదు. ఇది కంటికి కనిపించదు. ప్రభావాన్ని గుర్తించేలోపే పరిధిని విస్తరించుకుంటుంది. ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తుంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ తక్కువ వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షల మందిపై ప్రభావాన్ని చూపుతోంది. వేల మంది మరణానికి కారణమవుతోంది. గజగజ లాడించిన హెచ్‌ఐవీ, పోలియోలకూ వైరస్‌లే కారణం. విస్తృత పరిశోధనలు జరగడంతో కొన్నింటికి వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్నింటిని వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ వైరాలజిస్టుల పరిశోధనల ఫలితాలే. మనుషులే కాదు జంతువులు, పక్షులపైనా వైరస్‌ దాడి చేస్తుంది. వాటిని వెటర్నరీ వైరాలజిస్టులు రక్షిస్తారు. ఇలాంటి కీలకమైన ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉంటే కొన్ని కోర్సులు చేయాలి.

దాడిచేసిన వైరస్‌ ఏ రకమైనదో గుర్తించడం ఒక సవాలు. దాని వ్యాప్తిని అడ్డుకోవడం మరో కఠిన పరీక్ష. వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో నిర్ధారించడం, ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా చూడటం, వైరస్‌ సోకినవారికి మెరుగైన వైద్యం అందించడానికి కొత్త ఔషధాలు, వ్యాక్సీన్ల విషయంలో సూచనలు చేయడం వైరాలజిస్టుల విధులు. వీరు ఎక్కువ సమయం మైక్రోబయాలజీ లేదా వైరాలజీ ప్రయోగశాలల్లో గడుపుతారు. కొన్నిసార్లు భిన్న ప్రయోగశాలల్లో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. కొత్త రకం వైరస్‌ వ్యాప్తిచెందినప్పుడు దాని జన్యు లక్షణాలు తెలుసుకోవడానికి మరింత శ్రమించాలి. వైరాలజిస్టుల సలహాలు వైద్యరంగంలోని ఇతరులకూ చాలా అవసరం. అందువల్ల వారితో కలిసిపనిచేస్తారు. కొన్నిసార్లు ఆసుపత్రులకు వెళ్లి రోగులను కలుస్తారు. కరోనా లాంటి కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ కలిసి పనిచేయాల్సి వస్తుంది.

మొక్కలు, చెట్లు, పాడిపంటలతోపాటు సమస్త జీవరాశికీ వైరస్‌తో ముప్పు ఉంటుంది. దాని తీవ్రతను తగ్గించడం, సమర్థంగా తిప్పికొట్టడమే వైరాలజిస్టుల కర్తవ్యం.

కావాల్సిన నైపుణ్యాలు
వివిధ రకాల పరీక్షలు చేయడం, వాటి ఫలితాలను విశ్లేషించడం, ఒక నిర్ణయానికి రాగలగడం వంటి నైపుణ్యాలు అభ్యర్థులకు ఉండాలి. పరీక్షల ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వైద్యులు, ఆరోగ్య సంస్థలు, ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని మెరుగైన సమాచారాన్ని సేకరించాలి. ఇందుకోసం మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అవసరం. ప్రయోగశాల పరికరాలను పూర్తిస్థాయిలో ఉపయోగించడం (మాలిక్యులర్‌ బయాలజీ స్కిల్స్‌) తెలిసి ఉండాలి.

ఎవరు అర్హులు?
బీఎస్సీలో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం ఒకటి లేదా బీవీఎస్సీ లేదా ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుతున్నవారు ఎమ్మెస్సీ వైరాలజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రో బయాలజీ కోర్సులో అంతర్భాగంగా వైరాలజీ ఉంటుంది.
యూజీ స్థాయిలో వైరాలజీని ప్రత్యేక సబ్జెక్టుగా అందించడం లేదు. అందువల్ల భవిష్యత్తులో వైరాలజిస్టులు కావాలనే ఆశయం ఉన్నవాళ్లు డిగ్రీలో మైక్రోబయాలజీని ఒక సబ్జెక్టుగా తీసుకుంటే మంచిది. మైక్రోబయాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ సబ్జెక్టుల్లో నచ్చిన కాంబినేషన్‌ ఎంచుకోవచ్చు. ఎన్‌ఐవీలో చదవడానికి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 60 శాతం మార్కులు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్నవారికి 55 శాతం మార్కులు సరిపోతాయి.

ప్రవేశ పరీక్ష విధానం
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ఎమ్మెస్సీ చేయాలంటే ప్రవేశ పరీక్ష రాయాలి. ఇది 200 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌ల నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 80 ప్రశ్నలు డిగ్రీ స్థాయిలోని బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్‌, మెడికల్‌ సైన్స్‌, లైఫ్‌సైన్స్‌ సబ్జెక్టుల నుంచి ఉంటాయి తప్పుగా గుర్తించిన సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్‌: http://www.niv.co.in/

కోర్సులు అందిస్తున్న సంస్థలు
వైరాలజీపై అధ్యయనం కోసం ఒక ప్రత్యేక సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఆధ్వర్యంలో పుణెలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరోనా అనుమానిత శాంపిల్స్‌ను అక్కడికి పంపుతున్నారు. ఇందులో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ స్థాయుల్లో వైరాలజీ కోర్సులు ఉన్నాయి. సావిత్రీభాయి ఫులే పుణే యూనివర్సిటీకి అనుబంధంగా వీటిని అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సును అందిస్తోంది. ఈ రెండు సంస్థల్లో ప్రవేశాలకు త్వరలో ప్రకటనలు వెలువడనున్నాయి. మణిపాల్‌ సంస్థ ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సును నిర్వహిస్తోంది. మే 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అమితీ సంస్థ నోయిడా క్యాంపస్‌లో వైరాలజీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రకటన వెలువడుతుంది.
విదేశాల్లో: యూఎస్‌లో హార్వర్డ్‌, పెన్సిల్వేనియా, షికాగో, విస్కాన్సిన్‌-మాడిసన్‌, ఓహియో స్టేట్‌, శాన్‌ ఫ్రాన్సిస్‌కో యూనివర్సిటీలు వైరాలజీ చదువులకు ప్రసిద్ధి. కెనడాలో టొరంటో, బ్రిటిష్‌ కొలంబియా, మెక్‌గిల్‌, కాల్గరీ, ఆల్బర్టా, క్యుబెక్‌ విశ్వవిద్యాలయాల్లోనూ ఈ కోర్సులు చదువుకోవచ్చు.

ఉద్యోగాలు ఎక్కడ?
ఫార్మా సంస్థలు, పరిశోధన సంస్థలు, వ్యాక్సీన్‌ తయారీ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రుల్లో వైరాలజిస్టు, రిసెర్చ్‌ అసోసియేట్‌, లేబొరేటరీ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎన్‌ఐవీలో చదువుకున్నవారిని భారత్‌ బయోటెక్‌, యాక్టిస్‌ బయోలాజిక్స్‌, నేషనల్‌ ఎయిడ్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌, నేషనల్‌ రిప్రొడక్టివ్‌ హెల్త్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సెరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, టాటా ఫండమెంటల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హిందూస్థాన్‌ యునీలీవర్‌, వేంకటేశ్వర హ్యాచరీస్‌ మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.

Back..

Posted on 11-03-2020