Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కేంద్ర బలగాలు కొలువు మార్గాలు

* సీఏపీఎఫ్‌ టెన్త్‌, డిగ్రీలతో అవకాశాలు
* శారీరక సామర్థ్య, రాత పరీక్షల ద్వారా ఎంపిక

రక్షించాలి అనుకుంటే చాలు.. గుప్పెడు గుండెలో కొండంత ధైర్యం వచ్చి చేరుతుంది. అదే ఒక మెషిన్‌ గన్‌ మన చేతికి ఇచ్చి కాపలా కొలువును అప్పగిస్తే కంటికి రెప్ప కూడా పడదు. సరిగ్గా అలాంటి ఉద్యోగాలనే అందిస్తున్నాయి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌. పదోతరగతి, డిగ్రీ అర్హతలతో వీటిని సాధించుకోవచ్చు. ఇటీవల కేంద్రప్రభుత్వం 2.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించబోతున్నట్లు ప్రకటించింది. అందులో కేంద్ర బలగాల కొలువులు లక్షకు పైగా ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే ఇప్పటి నుంచే సన్నద్ధత మొదలుపెట్టాలి.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల మాదిరిగానే సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) ల్లో ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. పదో తరగతి విద్యార్హతతో ఇవన్నీ కలిసి ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్‌ ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. డిగ్రీ అర్హతతో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు సైతం ఉమ్మడి పరీక్ష ద్వారానే నియామకాలు జరుగుతున్నాయి. ఈ రెండు పరీక్షలూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సీఏపీఎఫ్‌ల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు యూపీఎస్‌సీ ఏటా ప్రకటన విడుదలచేస్తుంది. మరికొన్ని పోస్టులకు ఆయా సంస్థలు నేరుగా ప్రకటనలు వెలువరిస్తున్నాయి. రాతపరీక్ష, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)ల్లో కానిస్టేబుల్‌, ఎస్సై, ఏఎస్సై ఖాళీలను ఎస్సెస్సీ నిర్వహించే సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో విడతలో యాభై వేలకు పైగా కానిస్టేబుల్‌, 3000కు పైగా ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాలు లభిస్తున్నాయి. అసిస్టెంట్‌ కమాండెంట్‌ (ఏసీ) పోస్టు నియామకాలు యూపీఎస్‌సీ ద్వారా జరుగుతాయి. ఏటా 400 వరకు ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ ప్రకటనలు ప్రతి సంవత్సరం వెలువడుతున్నాయి. వీటితోపాటు అసిస్టెంట్‌ కమాండెంట్‌లో స్పెషలిస్టు ఉద్యోగాలతోపాటు కొన్ని ప్రత్యేక పోస్టులకు ఆయా సంస్థల వారీ ప్రకటనలు వెలువడుతున్నాయి.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా...
కానిస్టేబుల్‌ (జీడీ): పదో తరగతి ఉత్తీర్ణులు పరీక్ష రాసుకోవచ్చు. మహిళలూ అర్హులే. వయసు 18-23 మధ్య ఉండాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ...అదనం.
పరీక్ష ఇలా: జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ / హిందీ ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 90 నిమిషాల్లో వీటిని పూర్తిచేయాలి. పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో వస్తాయి. పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో పూర్తిచేయాలి.
ఎస్‌ఐ, ఏఎస్‌ఐ: బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఐటీబీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీల్లో ఎస్‌ఐ పోస్టులతోపాటు సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ఉమ్మడి పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. దిల్లీ పోలీస్‌ విభాగంలో ఎస్సై పోస్టుల నియామకాలూ ఈ పరీక్షతోనే చేపడుతున్నారు. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 25 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు, పర్సనాలిటీ టెస్టు, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైనవారికి రూ.35,400 మూలవేతనం అందుతుంది. ఏఎస్సై లకు రూ.29,200 చెల్లిస్తారు.
పరీక్ష ఇలా: జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 200 మార్కులకు పేపర్‌-2 ఉంటుంది. అర్హులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు.

యూపీఎస్‌సీ...
అసిస్టెంట్‌ కమాండెంట్స్‌: అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. ఏసీపీ /డీఎస్‌పీలతో సమాన హోదా అసిస్టెంట్‌ కమాండెంట్లకు ఉంటుంది. డిగ్రీ అర్హతతో పాతికేళ్లలోపు వయసు వాళ్లు ఈ ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. వీటికి మహిళలూ అర్హులే. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టు, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా అసిస్టెంట్‌ కమాండెంట్‌ (ఏసీ) పోస్టులను రూపొందించారు. ఇది గ్రూప్‌ ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం. ఈ పరీక్ష ద్వారా ఎంపికైనవారు బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌ పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో ఎందులోనైనా అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తారు. భవిష్యత్తులో వీరు సంబంధిత విభాగానికి అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) స్థాయికి చేరుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి ఏడాదిపాటు శిక్షణనిస్తారు. అభ్యర్థి ఎంపికైన విభాగం వీరికి శిక్షణ అందిస్తుంది. శిక్షణ అనంతరం ఆయా విభాగాలకు అవసరమైన సేవలు అందిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు.
పరీక్ష ఇలా: పేపర్‌ -1 జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ అంశాల్లో 250 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పేపర్‌-2 జనరల్‌ స్టడీస్‌, ఎస్సే, కాంప్రహెన్షన్‌ నుంచి 200 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. రాతపరీక్షలో అర్హులకు ఫిజికల్‌ స్టాండర్డ్‌ / ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది..
వెబ్‌సైట్లు: https://ssc.nic.in , http://www.upsc.gov.in

మిలటరీ, పారా మిలటరీ తేడా
ఒకే విద్యార్హతతో ఉన్న ఉద్యోగాలకు మూలవేతనం మిలటరీ, పారా మిలటరీ రెండు చోట్లా సమానమే. ఉదాహరణకు పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేసే పోస్టులకు రూ.21,700 మూల వేతనం చెల్లిస్తారు. అయితే మిలటరీ (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌)లో మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) ఉంటుంది. సాధారణ పోస్టులకు రూ.5200, ఆఫీసర్‌ పోస్టులకు రూ.15,500 చొప్పున ప్రతి నెలా చెల్లిస్తారు. ఈ సౌలభ్యం పారా మిలటరీలో లేదు. సీఏపీఎఫ్‌ ఉద్యోగులకు ఎంఎస్‌పీ మాదిరి ప్రత్యేకంగా సర్వీస్‌ పే చెల్లించాలనే విన్నపం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అలాగే మిలటరీలో ఆయా పోస్టులను బట్టి 15 లేదా 20 ఏళ్లు సర్వీస్‌లో కొనసాగి పదవీ విరమణ చేసినవారు జీవితకాలపు పెన్షన్‌కు అర్హత సాధిస్తారు. పారా మిలటరీలో మధ్యలో వైదొలిగినవారికి పెన్షన్‌ సౌలభ్యం లేదు.సెలవుల్లోనూ స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.పారా నియామకాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయి.

నేరుగా నియామకాలు...
కొన్ని పోస్టులకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ... విడిగా ప్రకటనలు జారీ చేస్తున్నాయి.
స్టాఫ్‌ నర్సు (ఎస్సై హోదా), ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, లేబొరేటరీ టెక్నీషియన్‌, రేడియోగ్రాఫర్‌, స్టెనోగ్రాఫర్‌ (ఇవన్నీ ఏఎస్సై హోదా), హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) కానిస్టేబుల్‌ మోటార్‌ మెకానిక్‌, కానిస్టేబుల్‌ పయనీర్‌ (ప్లంబర్‌/ ఎలక్ట్రీషియన్‌/ కార్పెంటర్‌/ మాసన్‌/ బ్లాక్‌ స్మిత్‌/ వెల్డర్‌/పెయింటర్‌), కానిస్టేబుల్‌ డ్రైవర్‌, కానిస్టేబుల్‌ టెలికాం/ టెలికమ్యూనికేషన్‌, కానిస్టేబుల్‌ యానిమల్‌ ట్రాన్స్‌పోర్టు, కానిస్టేబుల్‌ డ్రెస్సర్‌ వెటర్నరీ, కానిస్టేబుల్‌ (ఫాలోవర్స్‌) కుక్‌/ వాటర్‌ క్యారియర్‌/ బార్బర్‌/ వాషర్‌మెన్‌/ సఫాయీ కర్మాచారీ, కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌) టైలర్‌/ కోబ్లర్‌/ గార్డెనర్‌, కానిస్టేబుల్‌ క్రూ, హెడ్‌ కానిస్టేబుల్‌ (ఎడ్యుకేషన్‌ అండ్‌ స్ట్రెస్‌ కౌన్సెలర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌ వైఫ్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (ఇంజిన్‌ డ్రైవర్‌, వర్క్‌షాప్‌, మాస్టర్‌, మోటార్‌ మెకానిక్‌, డ్రెస్సర్‌ వెటర్నరీ, టెలికమ్యూనికేషన్‌), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఓవర్‌ సీర్‌, టెలికమ్యూనికేషన్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌) ఇన్‌స్పెక్టర్‌ (ఎడిటర్‌, లైబ్రేరియన్‌), అసిస్టెంట్‌ కమాండెంట్‌ (ఇంజినీర్‌, వెటర్నరీ, జడ్జ్‌ అటార్నీ)...తదితర పోస్టులను సీఏపీఎఫ్‌లు విడిగా భర్తీ చేస్తున్నాయి.
దాదాపు ఏటా ఈ ప్రకటనలు వెలువడుతున్నాయి. పోస్టు ఏదైనప్పటికీ ఫిజికల్‌ ఎఫిషియన్సీ, ఫిజికల్‌ స్టాండర్డ్‌, రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సంబంధిత విభాగాల్లో కోర్సులు పూర్తిచేసినవాళ్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.


Back..

Posted on 01-02-2019