Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొలువు ఏదైనా.. సిలబస్‌ అదే!

* కేంద్ర పోస్టులకు పక్కా ప్రణాళిక

అవకాశాలు తలుపు తడుతున్నవేళ అన్నిరకాలుగా తయారుగా ఉండాలి. లేకపోతే అవి చేజారిపోతాయి. సర్కారీ ఉద్యోగాలు కూడా ఇంతే! ఇప్పుడు భారీగా కొలువులు ప్రకటిస్తున్న బీఎస్‌ఐఆర్‌ (బ్యాంకింగ్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఇన్సూరెన్స్‌, రైల్వే) నియామక పోటీ పరీక్షలన్నీ కాస్త అటు ఇటుగా ఒకేవిధం! అంటే సబ్జెక్టులు, వాటి సిలబస్‌ దాదాపుగా ఒకటే. పరీక్షా విధానంలోనే కాస్త మార్పు! ఏదైనా ఒక పరీక్షకు సన్నద్ధమైతే 70- 75 శాతం మిగిలిన పరీక్షల ప్రిపరేషన్‌ కూడా పూర్తయినట్లే. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుంటూ ఈ నాలుగు కేటగిరీల్లోని పరీక్షలపై గురిపెడితే... ఎక్కువ ఉద్యోగాలకు పోటీపడవచ్చు! సులువుగా కేంద్రప్రభుత్వోద్యోగం సొంతం చేసుకోవచ్చు!
ఈఏడాదిలోనే దాదాపు 5 లక్షలకు పైగా కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వ సంస్థల్లో రెండున్నర లక్షలు, రైల్వేలో 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంతకుముందే రైల్వేలో దాదాపు 14 వేల జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్‌ విడుదలైంది. రైల్వేలోనే 35277 ఎన్‌టీపీసీ పోస్టుల భర్తీకి గతవారం నోటిఫికేషన్‌ విడుదలయింది.
ఎఫ్‌సీఐలో 4103 జూనియర్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ పోస్టులకు, ఎల్‌ఐసీలో 590 ఏఏఓ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. బ్యాంకుల్లో పీవో, క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌ నిర్వహించే పరీక్షలకు కూడా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఎస్‌ఎస్‌సీ నిర్వహించే సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌లు ఉన్నాయి. వీటికి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలు అదనం.

అన్ని విద్యార్హతలకూ అవకాశాలు
బ్యాంక్‌ పరీక్షలన్నింటికీ గ్రాడ్యుయేట్లకు మాత్రమే అర్హత ఉంది. రైల్వే పరీక్షలు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షల్లో 10వ తరగతి, ఇంటర్మీడియేట్‌ (12వ తరగతి), డిప్లొమా విద్యార్థులకు కూడా అవకాశాలున్నాయి. ప్రస్తుతం విడుదలైన ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌లో ఇంటర్‌ అర్హతతో 10 వేలకు పైగా పోస్టులున్నాయి. 10వ తరగతి అర్హతతో దాదాపు 90 వేలకు పైగా పారామెడికల్‌, మెటీరియల్‌ అండ్‌ ఐసోలేటెడ్‌ పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఈ వారం పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. గత నెలలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ విడుదల చేసిన నోటిఫికేషన్లకు పెద్ద సంఖ్యలో డిప్లొమా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
నిరుద్యోగులు, సాధారణ/ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకోబోతున్న విద్యార్థులకు ఇదొక అద్భుతమైన అవకాశం. వీటిలో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా విద్యార్థులకు కూడా ఉద్యోగావకాశాలున్నాయి. ఈ కేటగిరీలో ఉన్న పరీక్షలన్నింటిలో ఉమ్మడిగా ఉండే సబ్జెక్టులు / టాపిక్స్‌కు సన్నద్ధమైనప్పటికీ అభ్యర్థి తాను రాయబోయే పరీక్షకు మాత్రం ఒక ప్రణాళిక, ప్రత్యేక దృష్టి ఉంచాలి. ఆ పరీక్ష విధానానికి తగినట్లుగా ప్రిపరేషన్‌ ఉండాలి. సబ్జెక్టులు ఒకేవిధంగా ఉన్నప్పటికీ ఆయా పరీక్షల్లో అడిగే ప్రశ్నల స్థాయుల్లో భేదముండవచ్చు. అందుకే గతంలో జరిగిన పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఏ స్థాయిలో ఉంటున్నాయో గమనించి తదనుగుణంగా సన్నద్ధమవ్వాలి. అదేవిధంగా ఆ పరీక్షావిధానానికి తగినట్లుగా సమయాన్ని నిర్దేశించుకుని అనేక మాదిరి పరీక్షలు రాయాలి. ఈ సబ్జెక్టులన్నింటికీ మార్కెట్‌లో అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కూడా విస్తృతమైన మెటీరియల్‌ ఉచితంగానే అందుబాటులో ఉంది. వీటిన్నింటినీ ఉపయోగించుకుని సాధన చేయాల్సి ఉంటుంది.

వేగం, కచ్చితత్వం ముఖ్యం
ఈ పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువ. సాధించడానికి తక్కువ సమయం ఉంటుంది. అందువల్ల వేగంగా సరైన జవాబును గుర్తించడం ముఖ్యం.
* బ్యాంక్‌ పరీక్షల ప్రిలిమినరీ పరీక్షలో 100 ప్రశ్నలను 60 నిమిషాల్లో సాధించాలి. అంటే సగటున ఒక ప్రశ్నకు 36 సెకన్ల సమయం.
* ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ మొదటి దశ పరీక్షలో 100 ప్రశ్నలకు 90 నిమిషాల సమయం ఉంటుంది. సగటు సమయం 54 సెకన్లు.
అందుచేత తక్కువ సమయంలో ప్రశ్నను సాధించేలా సాధన చేస్తే మిగిలే సమయంలో పేపర్‌ అంతా చూసుకుని తప్పులేమైనావుంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. వీటిలోని అన్ని పరీక్షల్లో నెగెటివ్‌ మార్కులున్నాయి. ఇవి బ్యాంక్‌ పరీక్షల్లో 1/4 వంతు, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీలో 1/3వ వంతు మార్కులు. అందుకే ఈ పరీక్షల్లో వేగం, కచ్చితత్వం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

అన్నిటిలోనూ ఇవే సబ్జెక్టులు
బీఎస్‌ఐఆర్‌ కేటగిరీల్లోని పరీక్షలన్నింటిలో సాధారణంగా క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ మేథమేటిక్స్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌/ జనరల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ విభాగాలుంటాయి.ఈ విభాగాల్లోని టాపిక్స్‌.. పరీక్షను బట్టి కాస్త అటుఇటుగా ఉంటాయి

మేథమేటిక్స్‌ / క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
వీటిలో అరిథ్‌మెటిక్‌ అంశాలతో పాటు ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగొనామెట్రీలు ఉంటాయి. సింప్లిఫికేషన్స్‌, నంబర్‌ సిరీస్‌, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లు ఉంటాయి.

రీజనింగ్‌
వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌లు రెండూ ఉంటాయి. వెర్బల్‌ రీజనింగ్‌లో సాధారణంగా రీజనింగ్‌ టాపిక్స్‌తో పాటు అనలిటికల్‌/ క్రిటికల్‌ రీజనింగ్‌ టాపిక్స్‌ కూడా ఉంటాయి. (స్టేట్‌మెంట్‌-అసంప్షన్స్‌, పజిల్‌ టెస్ట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌ మొదలైనవి).

జనరల్‌ అవేర్‌నెస్‌/జనరల్‌ స్టడీస్‌
దీనిలో కరెంట్‌ అఫైర్స్‌తో పాటు సోషల్‌ సైన్స్‌ (పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ) జనరల్‌ సైన్స్‌ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ)లు ఉంటాయి.

ఇంగ్లిష్‌
గ్రామర్‌ సంబంధ ప్రశ్నలు, కాంప్రెహెన్షన్‌, వొకాబులరీలు ఉంటాయి. లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌లతో కూడిన డిస్క్రిప్టివ్‌ భాగం కూడా ఉంటుంది
* బ్యాంక్‌ పరీక్షల్లో సోషల్‌ సైన్స్‌, జనరల్‌ సైన్స్‌ ప్రశ్నలు సాధారణంగా ఉండవు. వాటి బదులు బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ ఉంటుంది.
* రైల్వే పరీక్షల్లో సాధారణంగా ఇంగ్లిష్‌ విభాగం ఉండదు.
* ఆర్‌ఆర్‌బీ జేఈ, ఎస్‌ఎస్‌సీ జేఈ లాంటి సాంకేతిక అర్హత ఉన్న పోస్టుల పరీక్షల్లో టెక్నికల్‌ సబ్జెక్టులుంటాయి. ఇలాంటి మార్పులకు అనుగుణంగా ఈ సబ్జెక్టులన్నింటికీ తయారయితే బీఎస్‌ఐఆర్‌ కేటిగిరీలో ఉన్న అన్ని పరీక్షలనూ సమర్థంగా రాసే అవకాశం ఉంది.

- డా.జీఎస్‌. గిరిధర్‌, డైరెక్టర్‌, RACE


Back..

Posted on 04-03-2019