Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సాటిలేని సర్టిఫికేషన్‌లు..!

ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, కంపెనీల్లో ఉన్నత స్థాయులకు చేరుకోవడానికి సర్టిఫికేషన్‌లు చాలా ఉపయోగపడతాయి. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, రెడ్ హ్యాట్, తదితర అగ్రశ్రేణి కంపెనీలు అందించే సర్టిఫికేషన్‌లకు ఆయా రంగాల్లో చాలా విలువ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌కు ప్రవేశ స్థాయి నుంచి అసోసియేట్ స్థాయి వరకు ఉపయోగపడే సర్టిఫికేషన్‌ల వివరాలు...

* మైక్రోసాఫ్ట్ (ఎంసీఎస్‌డీ)
ఐటీ పరిశ్రమలు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్‌లకు చాలా ప్రాధాన్యం ఇస్తాయి. డెవలపర్ల కోసం ప్రవేశస్థాయిలో మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ (ఎంటీఏ), మాధ్యమిక స్థాయిలో మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ డెవలపర్ సర్టిఫికేషన్‌లను అందిస్తోంది. మాధ్యమిక స్థాయిలో విండోస్ స్టోర్ ఆప్స్, వెబ్ అప్లికేషన్స్, షేర్‌పాయింట్ అప్లికేషన్స్, అప్లికేషన్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో సర్టిఫికేషన్‌లను అందిస్తోంది. వీటి కోసం మూడు లేదా నాలుగు స్థాయుల్లో మల్టిపుల్ ఛాయిస్ పరీక్షలు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.

* మైక్రోసాఫ్ట్ (ఎంటీఏ)
ఉన్నత పాఠశాల, కాలేజీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ (ఎంటీఏ). ప్రోగ్రామింగ్, డెవలపర్ కెరియర్‌లలో కొత్తగా ప్రవేశించినవారికి కూడా ఉపయోగపడుతుంది. విండోస్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మొబైల్, గేమింగ్, తదితర అంశాల్లో మీకు ఇష్టమైనవాటిలో సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు.

* అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్ సర్టిఫైడ్ డెవలపర్ - అసోసియేట్ లెవెల్)
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా డిజైన్, బిల్డ్, రన్ అప్లికేషన్స్ విభాగాల్లో డెవలపర్ల కోసం ఉద్దేశించిన సర్టిఫికేషన్ ఇది. ఏడబ్ల్యుఎస్ ప్రాథమిక భావనలు, క్లౌడ్ ఆధారిత డిజైనింగ్, డెవలప్‌మెంట్, సెక్యూరిటీ, డీబగ్గింగ్, తదితర అంశాల్లో మల్టిపుల్ ఛాయిస్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. 40 నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 80 నిమిషాలు ఉంటుంది.

* ఒరాకిల్ (అపెక్స్)
డేటాబేస్ సాప్ట్‌వేర్‌లకు ప్రసిద్ధి చెందిన సంస్థ ఒరాకిల్. సర్వర్లు, స్టోరేజ్ సిస్టమ్స్, క్లౌడ్ సొల్యూషన్స్ సేవలతోపాటు సమగ్ర సర్టిఫికేషన్‌లను కూడా ఒరాకిల్ అందిస్తోంది. డెవలపర్ల కోసం ప్రత్యేకంగా ఒరాకిల్ అప్లికేషన్ ఎక్స్‌ప్రెస్ డెవలపర్ సర్టిఫైడ్ ఎక్స్‌పర్ట్ (ఒరాకిల్ అపెక్స్) సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. అభ్యర్థులు 150 నుంచి 220 ప్రశ్నలుండే మల్టిపుల్ ఛాయిస్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

* ఒరాకిల్ (ఓసీపీ, ఓసీఎం, ఓసీఈ)
అసోసియేట్, ప్రొఫెషనల్ (ఓసీపీ), మాస్టర్ (ఓసీఎం), ఎక్స్‌పర్ట్ (ఓసీఈ) స్థాయుల్లో ఒరాకిల్ సర్టిఫైడ్ జావా సర్టిఫికేషన్‌లను ఒరాకిల్ అందిస్తోంది. అభ్యర్థులు ప్రొఫెషనల్ స్థాయి సర్టిఫికేషన్ పరీక్షలు రాయాలంటే ఓసీపీ జావా ప్రోగ్రామర్ లేదా సన్ సర్టిఫైడ్ జావా ప్రోగ్రామర్ సర్టిఫికేషన్ ఉండాలి. పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. కొన్ని ప్రశ్నలను విభిన్న పరిస్థితుల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించే విధంగా రూపొందిస్తారు. ఇచ్చిన అంశాన్ని బట్టి కనీస ఉత్తీర్ణత స్కోరు ఆధారపడి ఉంటుంది.
మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ సర్వర్ల కోసం అప్లికేషన్‌లు తయారుచేసే అభ్యర్థుల కోసం ఒరాకిల్ మైఎస్‌క్యూఎల్ డెవలపర్ సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తోంది. మైఎస్‌క్యూఎల్ అప్లికేషన్స్, ఆర్కిటెక్చర్, సింటాక్స్, డిజైన్, మోడిఫికేషన్, తదితర అంశాలకు సంబంధించి 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఒకేపరీక్ష ఉంటుంది. పరీక్షవ్యవధి రెండున్నర గంటలు. ఉత్తీర్ణులడానికి కనీసం 64శాతం స్కోరు సాధించాలి.

* సేల్స్ ఫోర్స్
కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం) సాఫ్ట్‌వేర్‌తోపాటు ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ కంప్యూటింగ్, అప్లికేషన్స్‌కు ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. ప్రవేశస్థాయిలో సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ డెవలపర్ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది.
సేల్స్ ఫోర్స్ ప్లాట్‌ఫామ్ ఆధారిత అప్లికేషన్ డిజైన్, డేటా మోడలింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్, లాజిక్, డేటా మేనేజ్‌మెంట్, రిపోర్టింగ్, ఎనాలసిస్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి. కనీసం 68 శాతం స్కోరు సాధిస్తే సర్టిఫికేషన్ లభిస్తుంది. బిల్డింగ్ అప్లికేషన్స్, విజువల్ ఫోర్స్‌లో శిక్షణ ద్వారా ఈ పరీక్షను సమర్థంగా ఎదుర్కోవచ్చు.
ఈ సర్టిఫికేషన్ ఉన్నవారు సేల్స్ ఫోర్స్ సర్టిఫైడ్ అడ్వాన్స్‌డ్ డెవలపర్ సర్టిఫికేషన్ పరీక్ష రాయవచ్చు. దీని ద్వారా అపెక్స్, విజువల్ ఫోర్స్ అప్లికేషన్స్‌లో సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ డెవలపర్ పరీక్షలో మల్టిపుల్ చాయిస్ పరీక్ష, ప్రోగ్రామింగ్ అసైన్‌మెంట్, ఎస్సే ఎగ్జామ్ అనే మూడు దశలు ఉంటాయి.

* క్లౌడ్ ఎరా (సీసీడీహెచ్)
అపాచె హడూప్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సర్టిఫికేషన్‌లను ఈ సంస్థ అందిస్తోంది. అధిక స్థాయిలో డేటా సెట్స్ నిర్వహణ కోసం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు ఈ సర్టిఫికేషన్ ఉన్న నిపుణుల అవసరం ఉంటుంది. క్లౌడ్ ఎరా సర్టిఫైడ్ డెవలపర్ ఫర్ అపాచె హడూప్ సర్టిఫికేషన్ ద్వారా సంబంధిత ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణ, ఆప్టిమైజేషన్‌లో నైపుణ్యం సాధించవచ్చు. 50 నుంచి 55 ప్రశ్నలు ఉండే పరీక్ష ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. పరీక్షలో హడుప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా మేనేజ్‌మెంట్, జాబ్ మెకానిక్స్, తదితర అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. కనీసం 70 శాతం స్కోరు వస్తే సర్టిఫికేషన్ లభిస్తుంది.

* పపెట్ ల్యాబ్స్
సిస్కో, జింగా, తదితర అగ్రశ్రేణి సంస్థలతోపాటు వేలకొద్ది మధ్యశ్రేణి సంస్థలు పపెట్ ఐటీ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి పపెట్ ల్యాబ్స్ పపెట్ డెవలపర్లు అవసరం. ఈ సర్టిఫికేషన్ పొందడానికి ఒకే పరీక్ష ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలుంటాయి. పపెట్ ఫ్యాక్ట్స్, ఫంక్షన్స్, టైప్స్, ప్రొవైడర్లు, రిపోర్ట్ యాక్సెసరీలు, ఫేసెస్, టెస్టింగ్, ఇంటెగ్రేషన్, ఎంకలెక్టివ్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

* రెడ్ హ్యాట్
ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అందించడంలో అగ్రగామి సంస్థ రెడ్ హ్యాట్. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 90 శాతంపైగా కంపెనీలు రెడ్ హ్యాట్ సొల్యూషన్లను ఉపయోగిస్తున్నాయి. రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ జేబాస్ డెవలపర్ (ఆర్‌హెచ్‌సీజేడీ) సర్టిఫికేషన్ ద్వారా ఇందులో సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ (జేఈఈ) అప్లికేషన్స్‌లో మీ సామర్థ్యాలకు ఈ సర్టిఫికేషన్ ద్వారా విలువ పొందవచ్చు.
ఈఎస్‌బీ, క్యామెల్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యాలను సూచించే సర్టిఫికేషన్‌లను కూడా రెడ్ హ్యాట్ అందిస్తోంది. నాలుగు గంటల వ్యవధి ఉండే ఒకే పరీక్ష ఉంటుంది. సంబంధిత ప్రాజెక్టులు, సీడీఐ, పోజో/ జేఈఈ కాంపోనెంట్స్, ఏపీఐ, వెబ్/ జేఎస్ఎఫ్ కాంపోనెంట్‌లు, వెబ్ నేవిగేషన్ అంశాల్లో అవగాహనను పరీక్షిస్తారు.

Back..

Posted on 29-10-2016