Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఒకే తరహా సబ్జెక్టులు... ఉమ్మడి వ్యూహం

బ్యాంకు రాత పరీక్షల్లో చదివే సబ్జెక్టులే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల్లో, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షల్లోనూ ఉన్నాయి. కానీ మన అభ్యర్థులు కొన్ని అపోహలతో కొన్ని పరీక్షలకు దరఖాస్తు కూడా చేయటం లేదు. వాటిని తొలగించుకుని, జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే ఒకే సన్నద్ధతతో ఈ పరీక్షలన్నిటినీ బాగా రాయొచ్చు. విజయావకాశాలను మరింతగా పెంచుకోవచ్చు!
ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని పీవో, క్లర్క్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి రాతపరీక్షల కేలండర్‌ను ఐబీపీఎస్‌ విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లోని వివిధ రకాల పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (సీజీఎల్‌) పరీక్షకు ప్రకటన కూడా ఇప్పటికే విడుదలయింది. వీటి రాత పరీక్షల్లో దాదాపు ఒకే తరహా సబ్జెక్టులున్నాయి.
సాధారణంగా ఉత్తర భారతదేశంతో పోల్చితే దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు బ్యాంకు పరీక్షల పట్లనే ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉంటారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలపై ఆసక్తి తక్కువ ప్రదర్శిస్తుంటారు.
దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. పరీక్షల పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణం. ఉద్యోగాలు ఉత్తర భారతదేశం ముఖ్యంగా ఢిల్లీలోనే ఉంటాయన్న అపోహ మరొకటి.
అయితే కేవలం ఢిల్లీలోనే కాకుండా కేంద్రప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఏ ప్రాంతంలోనైనా నియమిస్తారు. ప్రారంభంలో ఒకవేళ ఢిల్లీలోనే నియామకం జరిగినా బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్ళవచ్చు. జీవితాంతం అక్కడేవుండాల్సి ఉంటుందని ఆందోళనపడాల్సిన అవసరం లేదు.
అయినా సాంకేతికత బాగా అభివృద్ధి చెంది ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో అటువంటి అభిప్రాయం సరికాదు. ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు సిద్ధపడాలి.
కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్ష గతంతో పోల్చితే సరళంగానే ఉంది. గతంలో రెండంచెల రాతపరీక్షతో పాటు మౌఖిక పరీక్ష వుండేది. అయితే ఈ సంవత్సరం నిర్వహించే పరీక్షలో మౌఖిక పరీక్షను మినహాయించారు. అదేవిధంగా రెండంచెల్లో నిర్వహించే రాతపరీక్షలు కూడా డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో కాకుండా రెండూ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి.
సబ్జెక్టులు- సన్నద్ధత
బ్యాంక్‌ పీఓ, క్లర్క్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పరీక్షలు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ- సీజీఎల్‌ పరీక్షల్లో ఉండే సారూప్యత ఒకే తరహా సబ్జెక్టులు. అందుచేత ఈ రెండు పరీక్షలూ రాయడానికి ఉండే అదనపు ప్రయోజనం- ఒకటే సన్నద్ధత సరిపోవడం.
బ్యాంక్‌ పీవో, క్లర్క్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పరీక్షల్లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంకా కంప్యూటర్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టులుంటాయి. ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ ఫేజ్‌-1 పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటలిజెన్స్‌- రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టులున్నాయి.
వీటిలో కొద్దిపాటి తేడాలు మినహా ఎక్కువ శాతం అంశాలు ఒకే విధంగా వుంటాయి.
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో సీజీఎల్‌ పరీక్షలో 10వ తరగతి స్థాయిలో ఉండే ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగొనామెట్రీలు అదనం.
* రీజనింగ్‌లో బ్యాంక్‌ పరీక్షల్లో వెర్బల్‌ రీజనింగ్‌ మాత్రమే ప్రశ్నలుండగా సీజీఎల్‌లో నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి.
* జనరల్‌ అవేర్‌నెస్‌లో సీజీఎల్‌లో తాజా పరిణామాలతో పాటు భారతదేశం, దాని పొరుగుదేశాలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళికత, ఆర్థిక సంబంధ విషయాలు మొదలైనవి అదనం.
* అయితే బ్యాంకు పరీక్షల్లో బ్యాంకింగ్‌ రంగ ప్రశ్నలు అదనంగా ఉంటాయి. అన్ని పరీక్షల్లోనూ సామాన్యంగా ఉండే ఉమ్మడి టాపిక్స్‌ అధ్యయనం పూర్తిచేసుకుని ఆయా పరీక్షల్లో ఉండే ఇతర అంశాలకు తదనుగుణంగా సన్నద్ధమవ్వాలి. చదవాల్సిన విషయాలు ఉమ్మడిగా ఉన్నప్పటికీ ఆఫీసర్‌, క్లర్క్‌ పరీక్షల్లో ప్రశ్నల స్థాయిలో భేదముంటుంది.
రైల్వే పరీక్షలకు కూడా...
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) నిర్వహించే నాన్‌ టెక్నికల్‌ పోస్టుల పరీక్షలో కూడా ఇవే సబ్జెక్టులున్నాయి. దానిలో అరిథ్‌మెటిక్‌, జనరల్‌ ఇంటలిజెన్స్‌- రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టులున్నాయి. ఇవన్నీ ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌లో ఉండే సబ్జెక్టుల మాదిరివే. అదే తరహా ప్రశ్నలు కొద్దిగా తక్కువ స్థాయిలో వుంటాయి.
ఒకే తరహాలో సబ్జక్టులుండే ఈ పరీక్షలకు అవి జరిగే తేదీలను అనుసరించి ఒక ప్రణాళికతో చదివితే తక్కువ శ్రమతో అన్నింటికీ బాగా సన్నద్ధమవ్వచ్చు.
ఈ పరీక్షలన్నింటికీ వాటి స్థాయి, నిర్వహించే తేదీలను అనుసరించి ఒక ప్రణాళికతో సన్నద్ధమయితే ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసిన లేదా చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగిగా మారే అవకాశం ఉంది.
బ్యాంకు పరీక్షల్లో జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి ఫైనాన్స్‌, ఎకానమీ, బ్యాంకింగ్‌లపై అధిక దృష్టిపెట్టాలి. బ్యాంకు, సీజీఎల్‌ (టైర్‌-1) పరీక్షల్లో ప్రతి ప్రశ్నకూ స్వల్ప సమయం మాత్రమే సగటున ఉంటుంది కాబట్టి జవాబులను వేగంగా సాధించడం చాలా కీలకం.
వేల సంఖ్యలో పోస్టులు
ఐబీపీఎస్‌ నిర్వహించే ఉమ్మడి పరీక్షల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 20-22 వేల పీఓ పోస్టులు, 30 వేలకు పైగా క్లర్క్‌ పోస్టులు, 5 వేలకు పైగా స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ అవుతున్నాయి.ఎస్‌బీఐ ద్వారా 3, 4 వేల పోస్టులు భర్తీ అవుతున్నాయి.గత ఏడాది ఎస్‌ఎస్‌సీ నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్ష ద్వారా దాదాపు 8500 పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ సంవత్సరం కూడా సుమారుగా అంతే సంఖ్యలో భర్తీ అయ్యే అవకాశం వుంది. అంటే మౌఖిక పరీక్ష లేని క్లర్కు పరీక్షలు సుమారు 40 వేలు, మౌఖిక పరీక్ష ఉన్న అధికారి పోస్టులు దాదాపు 25-30 వేల పోస్టులు ఈ ఏడాది భర్తీ అవుతాయి. ఈ కారణం వల్ల... శ్రద్ధగా సన్నద్ధమయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఉద్యోగం పొందే అవకాశం వుంది.
ఎలా సంసిద్ధమవ్వాలి?
ప్రతి సబ్జెక్టులోనూ అన్ని పరీక్షల్లో ఉండే టాపిక్స్‌ను ముందుగా నేర్చుకోవాలి. ఆ తర్వాత నిర్దిష్ట పరీక్షలకు మాత్రమే పరిమితమైన అంశాలను విడిగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టులవారీగా ఎలా చదవాలో తెలుసుకుందాం...
రీజనింగ్‌: బ్యాంకు పరీక్షల్లో వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తున్నాయి. సీజీఎల్‌లో వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌లు సాధన చేయాల్సిందే. ఆర్‌ఆర్‌బీలో కూడా వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలుంటాయి.
ఆల్ఫబెట్‌, నంబర్‌ సిరీస్‌, అనాలజీ, క్లాసిఫికేషన్‌ మొదలైన అంశాలను వెర్బల్‌ నుంచీ; సిరీస్‌ కంప్లీషన్‌, వెన్‌ డయాగ్రమ్స్‌, ఎంబెడెడ్‌ ఫిగర్స్‌, మిరర్‌-వాటర్‌ ఇమేజెస్‌ మొదలైనవి నాన్‌ వెర్బల్‌ నుంచీ చూసుకుంటే అన్ని పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను సాధించడానికి వీలవుతుంది.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: బ్యాంకు పరీక్షల్లో సాధారణంగా ఈ విభాగంలోని ప్రశ్నలు సింప్లిఫికేషన్స్‌, నంబర్‌ సిరీస్‌, డేటా సఫిషియన్సీ మొదలైనవీ; అరిథ్‌మెటిక్‌ అంశాలైన నంబర్‌ సిస్టమ్‌, నిష్పత్తి-అనుపాతం, సగటు, శాతాలు, లాభం-నష్టం మొదలైనవీ; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యతల నుంచి ప్రశ్నలు వస్తాయి. సీజీఎల్‌ పరీక్షకు అరిథ్‌మెటిక్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌తో పాటు శుద్ధ గణితానికి సంబంధించిన ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగొనామెట్రీ మొదలైనవి పదోతరగతి స్థాయిలో చదవటం అవసరం.
సమయం ఎక్కువ పట్టే విభాగం కాబట్టి ప్రాథమికాంశాలు నేర్చుకున్న తర్వాత వివిధ రకాల ప్రశ్నలు వీలైనన్ని సాధన చేయాలి. అలాగే త్వరగా జవాబులు సాధించగలిగే షార్ట్‌కట్‌ పద్ధతులూ నేర్చుకోవాలి. కాల్‌క్యులేషన్స్‌ వేగంగా చేయగలిగే మెలకువలపై పట్టు పెంచుకోవటం మేలు.
జనరల్‌ ఇంగ్లిష్‌- కాంప్రహెన్షన్‌: అభ్యర్థికి ఆంగ్లభాషను అర్థం చేసుకునే సామర్థ్యం ఏమేరకు ఉందో ఈ విభాగం పరీక్షిస్తుంది. స్పాటింగ్‌ ఎరర్స్‌, సెంటెన్స్‌ కంప్లీషన్‌, ఇడియమ్స్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ మొదలైనవాటితో పాటు కాంప్రహెన్షన్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ వ్యాకరణంపై పట్టు పెంచుకుంటే వీటిన్నిటినీ తేలిగ్గా సాధించగలుగుతారు. అలాగే వేగంగా చదివి, అవగాహన చేసుకునే సామర్థ్యం పెంచుకుంటే... ఎక్కువ సమయం పట్టే కాంప్రహెన్షన్‌ ప్రశ్నలకు త్వరగా జవాబు గుర్తించవచ్చు.
జనరల్‌ అవేర్‌నెస్‌: తనచుట్టూ రోజువారీగా జరుగుతున్న సంఘటనలూ, పరిణామాలూ... అవి వ్యవస్థపై చూపే ప్రభావాలను అభ్యర్థి ఎంతవరకూ తెలుసుకుంటున్నాడో ఈ విభాగం పరీక్షిస్తుంది. బ్యాంకు పరీక్షల్లో ఫైనాన్స్‌, ఎకానమీ, బ్యాంకింగ్‌లపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ పరీక్షలో దేశం, పొరుగుదేశాల చరిత్ర, సంస్కృతి, భౌగోళిక ఆర్థిక సంబంధ అంశాలు ముఖ్యం. పుస్తకాలూ- రచయితలూ, అవార్డులూ, ముఖ్యమైన తేదీలూ, వార్తల్లోని వ్యక్తులూ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మొదలైనవి పట్టించుకోవాలి.
బ్యాంకు, సీజీఎల్‌ (టైర్‌-1) పరీక్షల్లో ప్రతి ప్రశ్నకూ స్వల్ప సమయం మాత్రమే సగటున ఉంటుంది కాబట్టి జవాబులను వేగంగా సాధించడం చాలా కీలకం. వీలైనంత సాధన తప్పనిసరి!

Posted on 01-03-.2016