Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప‌రీక్షా ప‌ర్ చ‌ర్చా - విద్యార్థుల‌కు ప్రధాని మోదీ చెప్పిన మెల‌కువ‌లు

> దేశంలోని పిల్లలంతా... రాజకీయ నాయకులే!

* మన దేశంలోని పిల్లలంతా.. పుట్టుకతోనే రాజకీయ నాయకుల వంటివారు. తమకు కావాల్సిందేమిటి, దాన్ని సాధించుకోవటమెలాగన్న విద్య వాళ్లకు బాగా తెలుసు!
మీకు పరీక్షలు ఎప్పుడో ఏడాదికి ఒకసారి వస్తాయి. మాకు అలా కాదు. 24 గంటలూ పరీక్షలే. దేశంలో ఎక్కడో మారుమూల ఉన్న ఒక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోతే ‘మోదీకి ఎదురు దెబ్బ’ అంటూ మీడియా మొత్తం బ్రేకింగ్‌ న్యూసులు వేసేస్తుంటుంది.
* మీరు ఫలితాల గురించి భయపడటం మానేసి.. శక్తి వంచన లేకుండా చదువుకుంటూ ఉండండి. దృష్టి మొత్తం నేర్చుకోవటం మీదే పెట్టండి.. మీలోని అంతశ్శక్తులకు వీలైనంత ఎక్కువగా పదును పెట్టుకోండి. చదువుకోవటమనేదాన్ని ఒక ధర్మంగా పాటించండి. ఈ లక్ష్యంతో ముందుకు సాగుతుంటే.. మార్కులు, ఫలితాల వంటివన్నీ ఆ దారిలో అవే వస్తాయి... నేను రాజకీయాల్లో ఇదే సిద్ధాంతాన్ని ఆచరిస్తా!
* నా సమయం, శక్తిసామర్ధ్యాలన్నీ ప్రజా సంక్షేమం కోసమే వినియోగించాలనే చూస్తుంటాను. ఎన్నికలనేవి వస్తుంటాయి, పోతుంటాయి. మన దారిలో తగిలే బహుమతుల్లాంటివి అవి!
* ఎప్పుడూ ఆశ వదులుకోవద్దు. ఎన్నడూ నిరాశలో కూరుకోవద్దు. పట్టువదలకుండా పరిశ్రమించటంలోనే ఉంటుంది విజయరహస్యం
దేశవ్యాప్తంగా పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న బాలబాలికల్లో ఒత్తిడిని పారదోలి.. ఉత్తేజాన్ని నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన స్ఫూర్తిమంతమైన సూచనలవి!
శుక్రవారం దిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో విద్యార్ధులతో ఆయన ‘పరీక్షా పర్‌ చర్చా’ కార్యక్రమంలో ముచ్చటించారు. వివిధ టీవీ ఛానెళ్లు, మొబైల్‌ యాప్‌, మైగావ్‌ వెబ్‌సైట్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది విద్యార్థులతో ఆయన ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అడిగిన రకరకాల ప్రశ్నలకు గంటన్నర పాటు ఆయన విపులంగా జవాబులిచ్చారు.
పక్కా మీ మిత్రుడిని!
‘‘టెన్షన్‌ పడుతున్నారా ఏంది? ఈ దేశ ప్రధానితో మాట్లాడుతున్నామన్న విషయాన్ని కొద్దిసేపు మీరంతా మర్చిపోండి.
నేను మీ స్నేహితుడ్ని... పక్కా మీ మిత్రుడిని... ఒక రకంగా ఈ రోజు పరీక్ష మీకు కాదు... నాకు! చివర్లో పదికి నాకు ఎన్ని మార్కులేస్తారో మీరే వెయ్యండి..!!
పిల్లల్లో పిల్లాడిలా.. ఓ స్నేహితుడిలా మారిపోయిన ప్రధాని మోదీ.. వారిలో స్ఫూర్తిని నింపారు. పట్టుదలను రగిలించారు. ఆశలను రేకెత్తించారు. ఆత్మీయంగా అనునయించారు. మొత్తానికి... తన అనుభవాన్నంతా రంగరించి.. చదువులు, పరీక్షల కోసమే కాదు.. జీవితానికి అవసరమైన ఎన్నో మెలకువలు చెప్పారు!
పరీక్షల భయాన్ని ఎదుర్కొనేదెలా?
పరీక్షలకు ఎంత ఆత్మవిశ్వాసంతో తయారైనా భయం వీడటం లేదు.. దాన్నెలా ఎదుర్కోవాలన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. ఇది కచ్చితంగా మంచి ప్రశ్నే. మనం తక్కువేం కష్టపడం. మనతోపాటు తల్లిదండ్రులు, టీచర్లు కూడా ఎంతో శ్రమిస్తారు. అయినా భయంగా ఉంటోందంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని అర్థం. అది లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మనం పరీక్షకు కూర్చున్నప్పుడు ఏదో పదం అవసరమవుతుంది. అది ఏ పాఠంలో, ఏ పేజీలో... ఎన్నో ఫంక్తిలో ఉందో గుర్తుకొస్తుంటుందిగానీ.. ఆ పదం గుర్తుకు రాదు. అవునా...? (అవునంటూ పిల్లలు పెద్దగా చప్పట్లు) వివేకానందులు ‘అహం బ్రహ్మాస్మి’ అని చెబుతుంటారు. మిమ్మల్ని మీరు తక్కువగా అనుకోవద్దు, నేనే బ్రహ్మరూపం అనుకోండనేవారు. అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. ఆయన చెప్పిన మరో గొప్ప మాట... ముక్కోటి దేవతలు మీపై ఆశీర్వచనాలు కురిపించినా... మీలో ఆత్మవిశ్వాసం లేకపోతే నిష్ఫలమే. ఆత్మవిశ్వాసం లేనివారిని దేవతలు కూడా ఏమీ చేయలేరు...
ఆత్మవిశ్వాసం అన్నది మందో, మూలికో కాదు. సుదీర్ఘ ప్రసంగాలు విన్నంత మాత్రాన ఆత్మవిశ్వాసం వస్తుందని చెప్పలేం. ప్రతి క్షణం మనం కష్టాన్ని నమ్ముకోవాలి. ఎప్పుడైనా మూడంతస్తులు ఎక్కాల్సి వస్తే అందరికంటే ముందు ఎక్కినవాడికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎక్కలేనివాడికి అప్పటికి రాకపోయినా మరుసటి రోజు మళ్లీ ప్రయత్నిస్తాడు. మనం ప్రయత్నం చేసేకొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఇప్పుడే ఓ వార్త నన్ను హత్తుకుంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్‌ జరుగుతున్నాయి. అందులో కెనెడా యువకుడు మార్క్‌ కాంస్య పతకం గెలుచుకున్నాడు. నిజానికి అతనికి శిక్షణ సమయంలో 15, 20 గాయాలయ్యాయి. 11 నెల్ల పాటు కోమాలోకి వెళ్లాడు. అయినా కాంస్యం గెలుచుకున్నాడు. అతను తన ఫేస్‌బుక్‌ పేజీలో- కోమాలో ఉన్న ఫోటో, కాంస్యం అందుకుంటున్న ఫోటో పక్కపక్కనే పెట్టి.. ‘ధన్యవాద్‌ జిందగీ’ అని రాసుకున్నాడు. ఎంత పెద్ద ఆత్మవిశ్వాసం!
మనం పరీక్ష రాస్తున్నామనీ, మనకు ఎవరో మార్కులు వేస్తున్నారన్న భావనను మనసులోంచి తీసేయండి. నాకు నేనే నాకు ఎగ్జామినర్‌ అనుకోండి. నా భవిష్యత్తు నిర్దేశకుడిని నేనే అనుకోండి. అప్పుడు చూడండి. ఆత్మవిశ్వాసం మీదవుతుంది.
సచిన్‌ ఏం చెప్పారు...
ఒకసారి నేను ‘మన్‌ కీ బాత్‌’లో సచిన్‌ టెండూల్కర్‌తో మాట్లాడుతుంటే ఓ పిల్లాడి ప్రశ్నకు ఆయనిలా జవాబిచ్చాడు. ‘నేను ఆడేటప్పుడు అంతకుముందు ఎలాంటి బాల్‌ వచ్చింది, దాన్ని కొట్టానా? లేదా? పరుగులు తీశానా లేదా? అన్నది మనసులో పెట్టుకోను... అలాగే తర్వాత బాల్‌ ఎలా వస్తుంది? దాన్ని ఫోర్‌ కొట్టాలా? సిక్స్‌ కొట్టాలా? అన్నదీ ఆలోచించను... అప్పుడు రాబోయే బంతి గురించే ఆలోచిస్తాను... మిగతావన్నీ మరిచిపోతాను’ అని చెప్పారు. అది పద్ధతి అంటే. వర్తమానంలో జీవించే అలవాటు చేసుకోవాలి.
* చాలామందికి నీటి రుచి తెలిసి ఉండదు.. కారణం గటగటా తాగడమే. అలాకాకుండా నిదానంగా తాగుతూ దాని రుచి ఆస్వాదించండి... దాన్నే శ్రద్ధ అంటారు. మన జీవితాన్ని మనమే మలచుకోవచ్చు.
భావోద్వేగ సమతౌల్యానికి (ఈక్యూ) జీవితంలో పెద్ద పాత్ర ఉంటుంది. అది స్ఫూర్తినిస్తుంది. రిస్క్‌ తీసుకొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఓ ఉపాధ్యాయుడు పిల్లల జన్మదినం రోజు తల్లిదండ్రులతో కలిసి ఏదో ఒక అనాథాశ్రమానికో, ఆసుపత్రికో వెళ్లిరావాలన్న షరతు పెట్టాడు. దానివెనుక ఉన్న తర్కమేంటి? అని ఓసారి ఆయన్ను అడిగాను. అందుకు ఆయన సమాధానమిస్తూ పిల్లల ఐక్యూ పెంచడానికి స్కూల్లో నావంతు ప్రయత్నం చేస్తా. కానీ భావోద్వేగ బంధాలు.. ఎమోషనల్‌ బాండింగ్‌.. అర్థం కావాలంటే పిల్లలను కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులున్న చోటికి తీసుకువెళ్లాలన్నారు. దానివల్ల పిల్లలు ఆ బాధలతో సహానుభూతి పొందుతారు. ఇది అందరూ చేయాలి.
* ఒకే టైం టేబుల్‌ 365 రోజులు పనికి రాదు. సమయానుకూలంగా మారాలి. ఒక్కోసారి అనుకోకుండా వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు రెండింటి మధ్య సమయం సర్దుబాటు చేసుకోవాలి తప్పితే... కొత్తగా వచ్చిపడినది చేయాలా? వద్దా? అన్న సంఘర్షణ రాకూడదు.
ఎప్పుడూ ఆఫ్‌లైన్లో వద్దు!
ముందు పుస్తకం పెట్టుకొని చదుకుంటున్నా మనం ఆఫ్‌లైన్‌లో ఉంటే ఫలితం ఉండదు. అందువల్ల మనం ఏ పనిచేస్తుంటామో దానిపై పూర్తిగా దృష్టిపెట్టాలి. ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండాలి.
డాక్టరో... ఇంజనీరో కావాలనుకునప్పుడు.. అది కాలేకపోతే... నిరాశకు గురవుతారు. ‘క్రయింగ్‌’ అనేది ‘ట్రయింగ్‌’ కావాలి. ఏడుస్తూ కూర్చోకూడదు. అందువల్ల ఏదో కావాలని కాకుండా ఏదో ఒకటి చేయాలని లక్ష్యంగా పెట్టుకొండి. అది చేయడం మొదలుపెట్టిన తర్వాత మీకు సంతృప్తి కలగడం ప్రారంభమవుతుంది.
తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకునేదెలా?
పరీక్షల్లో 90% మార్కులు సాధించినా తల్లిదండ్రులు సంతృప్తిపడటం లేదు.. ‘వాళ్లకు క్లాస్‌ తీసుకోమని’ చాలామంది అడుగుతున్నారు. కానీ మనం తల్లిదండ్రుల ఉద్దేశాన్ని అనుమానించకూడదు. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం కోసం వాళ్లు జీవితాన్ని అర్పిస్తారు. వాళ్లు మన కోసమే ఆలోచిస్తున్నారు కదా అనుకుంటే వారిని అర్థం చేసుకోవడానికి మనసు తెరుచుకుంటుంది. లేదంటే నాన్న ఆఫీసు నుంచి వచ్చే టైం అయింది కాబట్టి బుక్కు తీసుకొని కూర్చుందాం అనుకుంటాం. అలాంటి వాతావరణం మంచిదికాదు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల శక్తిసామర్థ్యాలను తెలుసుకోకుండానే తమ ఆశలను, తీరని కోరికలను వారి మీద రుద్దే ప్రయత్నం చేసే మాట వాస్తవమే. ఇప్పుడు చదువు సామాజిక హోదా అయిపోయింది. శుభకార్యాలకు వెళ్లినప్పుడు పిల్లలేం చేస్తున్నారో మాట్లాడుకోవడం తల్లిదండ్రులకు అలవాటైంది. వాళ్ల పిల్లలు అక్కడికెళ్లారు... వీళ్ల పిల్లలు అది చేస్తున్నారు.. నేను మావాడు ఏం చేస్తున్నాడో చెప్పలేని పరిస్థితి దాపురించిందని ఇంటికొచ్చి పెద్దలు బాధపడుతుంటారు. ఆ సమయంలో ఎదురుపడ్డామో చచ్చామే! ఖేల్‌ఖతం!! కాబట్టి మనసువిప్పి మీ ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకోండి. వాళ్లు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు చెప్పండి! ఈ మాట మన దేశంలోని పిల్లలకు నేను చెప్పాల్సిన పని లేదనుకోండి.. ఎందుకంటే మన పిల్లలంతా పుట్టుకతోనే పెద్ద రాజకీయ నాయకులు! ఇంట్లో ఏ పని ఎవరితో చెబితే అవుతుందో వాళ్లకు బాగా తెలుసు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే పిల్లలు ఎంతస్థాయికైనా ఎదుగుతారు. పిల్లలపై ప్రేమ చూపండి... ఒత్తిడి చేయొద్దు. మార్కులు రాకపోతే ప్రపంచం మునిగిపోదు. ఒక పరీక్షే జీవితం అవుతుందా? అబ్దుల్‌ కలాంను చూడండి. ఆయన తొలుత పైలట్‌ కావాలనుకొని విఫలమయ్యాడు. అంతమాత్రాన ఆయన జీవితం అయిపోయిందా... గొప్ప శాస్త్రవేత్త కాలేదా? ఉత్తమ రాష్ట్రపతిగా పేరు తెచ్చుకున్నారు.
మనసు లగ్నం ఎలా?
చాలామంది పిల్లలు ఎంత అనుకున్నా చదువుపై మనసుపెట్టలేకపోతుంటారు. నిజానికి శ్రద్ధ పెట్టడం అంటే అదేదో ప్రత్యేక పద్ధతేమో అనుకుంటుంటారు. అదేం కాదు. మీరు ప్రతి రోజూ ఏదో పని శ్రద్ధతో చేసుకుంటూ ఉంటారు. అదేమిటో గుర్తించండి. పాటలు వింటున్నప్పుడు దాని వీడియో కూడా మనసులో మెదలుతుంటుంది. ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడుతుంటే.. పాటలూ, చివరికి అమ్మ పిలుపులు కూడా వినపడవు. ఇలా మీరు ఏయే అంశాలపై మనసు పెట్టి పనిచేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో విశ్లేషించుకోండి. అదే కారణాలను అన్నింటికీ అన్వయించుకుంటూ నిదానంగా శ్రద్ధ పెరుగుతూ పోతుంది. కొన్ని మాటలు మనకు పదేళ్ల తర్వాతా గుర్తుంటాయి కదా! దాన్ని బట్టి మనకు జ్ఞాపకశక్తిలో లోపం లేదన్నది సుస్పష్టం. మనసును హత్తుకున్నవాటిని మరిచిపోలేం. మనస్సు, బుద్ధి, శరీరం, హృదయం, ఆత్మ అన్నింటినీ ఒకతాటిపైకి తెచ్చినప్పుడు శ్రద్ధ సాధ్యమవుతుంది. అది మీరు సాధన చెయ్యాలి.
డీఫోకస్‌ నేర్వండి!
మీరు దేనిమీదైనా దృష్టి పెట్టాలనుకుంటే.. ఫోకస్‌ పెట్టాలనుకుంటే ముందు ‘డీఫోకస్‌’ ఎలాగో నేర్చుకోండి. పాతవి ఖాళీ కాకపోతే పాత్రలో కొత్తవి పట్టవు. మనం పంచభూతాలతో అనుసంధానమై ఉంటామో అప్పుడు మనలో కొత్త శక్తి వస్తుంది. ఒట్టి కాళ్లతో మట్టిపై పరుగెత్తినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించండి. నిరంతరం ఫోకస్‌ పెట్టాలనుకోవడం పెద్ద తప్పు. అలాచేస్తే గానుగెద్దుకు గంతలు కట్టినట్లు అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి మనకొద్దు. మనకు మనం నచ్చినట్లు ఉందాం. సంతోషం కల్గించేది చేద్దాం. మనం డీఫోకస్‌ కావడం నేర్చుకున్నప్పుడే ఫోకస్‌ పెట్టడం సాధ్యమవుతుంది. దానివల్లే ఫలితాలు వస్తాయి.

పోలిక పోటీలు మనకెందుకు!
యుద్ధంలో కూడా శత్రువులను మన చోటికి తీసుకొచ్చి చంపాలంటారు! స్నేహితులతో పోటీలకు దిగొద్దు. ఎవరి ఆలోచనలు వారివి.. ఎవరి శక్తిసామర్థ్యాలు, కుటుంబ పరిస్థితులు, కలలు వారివి. ముందు మీ శక్తి మీరు తెలుసుకోండి. దాని ప్రకారం లక్ష్యం నిర్దేశించకోండి. దాన్ని సాధించడానికి అంతా సాయం చేస్తారు. క్రీడల్లో రాణించే వారిని ఎవరైనా డిగ్రీ గురించి అడుగుతారా? వీడికేమీ చదువురాదని తోటి మిత్రులెవరైనా అంటారా? చదువుపెద్దగా రాకపోయినా టెన్నిస్‌తో ప్రపంచస్థాయికి ఎదిగినవారులేరా? అతను తనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి ఆదారిలో వెళ్లడంవల్ల పైకి ఎదిగాడు. కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలి. రెండోది... పోటీకి దిగినప్పుడు ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మనల్ని మనం చూడకుండా ఎదుటివాడిపై దృష్టిపెడతాం. అతను నాలుగు గంటలు చదువుతున్నాడని తెలిస్తే... నేనూ నాలుగు గంటలు చదవాలనుకుంటాం. మనకు తెలియకుండా అతడే మనకు మార్గదర్శిగా తయారవుతాడు. నిన్నటికంటే ఈ రోజు రెండడుగులు ముందుకెళ్లానా? లేదా? అన్నది డైరీలో రాసుకోండి. అలా ఒకసారి ముందుకెళ్లడం నేరిస్తే... మన లోపలి నుంచి శక్తితన్నుకొస్తుంది! అందరూ ప్రతిస్పర్థను వదిలేసి అనుస్పర్థను నేర్చుకోండి.
ఒక పిల్లవాడి ప్రశ్న
మాకు పరీక్షలు మీకు ఎన్నికలు..
వచ్చే ఏడాది మనిద్దరికీ పరీక్షలున్నాయి. నాకు 12వ తరగతి బోర్డు పరీక్ష, మీకు సాధారణ ఎన్నికల పరీక్ష... అందుకు మీరు పూర్తి సిద్ధంగా ఉన్నారా?
‘‘నేను మీ టీచర్‌ అయి ఉంటే జర్నలిజంలోకి వెళ్లమని చెప్పేవాడ్ని. ఇలా తిప్పితిప్పి ప్రశ్నలు అడిగే శక్తి పాత్రికేయులకే ఉంటుంది. మీరు చదువుతూనే ఉండండి. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. చదువుపై పూర్తి దృష్టిపెట్టండి. లోపల విద్యార్థికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తిని పెంచుకోండి. ఇదే జీవన ధర్మంగా చేసుకొని ముందుకెళ్లండి. పరీక్షలు, ఫలితాలు.. మార్కులు.. ‘బై ప్రోడక్ట్‌’లు కావాలి. మీరు మీ పనిచేస్తే వచ్చే ఫలితాలు వస్తాయి. మార్కులను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే మనం చేయాలనుకున్నది చేయలేం. రాజకీయాల్లోనూ నేను ఇదే సిద్ధాంతంతో వెళ్తాను. 125 కోట్ల ప్రజల కోసం నాకున్న శక్తిసామర్థ్యాలు, సమయం, తెలివితేటలు అంకితం చేస్తాను. ప్రతీక్షణం... శరీరంలోని కణ కణం... ప్రజల కోసం ధారపోస్తా. ఎన్నికలు వస్తుంటాయి... పోతుంటాయి... అవంతా బై ప్రోడక్ట్‌. మీకు సంవత్సరంలో ఒకసారి పరీక్షలు వస్తాయి. మాకు 24 గంటలూ పరీక్షలే. దేశంలో ఏదో ఒక మూల మున్సిపాల్టీలో ఓడిపోతే అదే బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుంది. మోదీకి దెబ్బ అంటూ ప్రచారం చేస్తారు. ఇంకోటి... రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చాను. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ మానసికంగా రాజకీయాల్లో లేను. నా గుణంలో అది లేదు. ఏదో ఒకటి చేయడమే నా సహజగుణం. గతంలో జన్‌సంఘ్‌పేరుతో ఒక రాజకీయపార్టీ ఉండింది. దాని గుర్తు గోడలపై వేయడానిక్కూడా దాని దగ్గర డబ్బులుండేవి కాదు. గుజరాత్‌ ఎన్నికల్లో అది 103 అభ్యర్థులను నిలబెట్టింది. అందులో 99 మందికి డిపాజిట్లు పోయాయి. రాజకీయాల్లో డిపాజిట్లు పోవడం చాలా దారుణమైన అంశంగా భావిస్తారు. నలుగురికి డిపాజిట్లు దక్కాయి. ఆ నలుగురి డిపాజిట్ల సొమ్ము వెనక్కురావడంతో జన్‌సంఘ్‌ వాళ్లు పెద్ద పార్టీ చేసుకున్నారు. నిరాశపడలేదు, మిఠాయిలు పంచుకున్నారు. ఆ ఆలోచన వల్లే అక్కడి నుంచి ఇక్కడి వరకూ రావటం సాధ్యపడింది. ఓటమిని అంగీకరించండి, ప్రయత్నాన్ని వదలొద్దని అటల్‌జీ అనేవారు. ఆ నినాదం ఎంతో ప్రేరణనిస్తుంది. అది ప్రతి ఒక్కరిలో రావాలి. మీ బోర్డు పరీక్షలకు నేను శుభాకాంక్షలు చెబుతున్నా. నా పరీక్షల కోసం 125 కోట్ల ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. అదే భరోసాతో ముందుకువెళ్తాను.

Back..

Posted on 17-02-2018