Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉద్యోగ 'రసాయనిక' విద్య!

* సీట్లు, పోటీ పరిమితం
* మెరుగ్గా ఉద్యోగావకాశాలు

ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుతం ఇంజినీరింగ్ అడ్మిషన్ల కాలం నడుస్తోంది. అందరూ ఏ కోర్సు మంచిది, ఎందులో ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయని కోణంలో ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఐటీ రంగంవైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. అయితే అందులో అందరికీ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయా? అంటే కష్టమే అని చెప్పొచ్చు. అదే సమయంలో ప్రత్యామ్నాయ కోర్సులూ అనేకం అందుబాటులో ఉన్నాయి. అందులో సీట్లు, పోటీ పరిమితంగా ఉండి ఉద్యోగావకాశాలు బాగానే ఉండే కెమికల్ ఇంజినీరింగ్‌నూ ఎంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు సీనియర్ ఆచార్యులు. ఈ కోర్సును పూర్తిచేసే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రారంభంలో కనీస వేతనం తక్కువగానే ఉన్నా అనుభవంతో సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాల్లో కంటే ఎక్కువగా అందుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కోర్సు మంచిదే అయినా... ప్రయోగశాలల ఏర్పాటు, నిర్వహణ, ఇతర అవసరాలకు అధిక వ్యయం చేయాల్సి ఉన్నందున ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు దీనివైపు దృష్టి పెట్టడం లేదంటున్నారు. ఐఐటీల్లో ఉన్న పదిన్నర వేల సీట్లలో 800 మాత్రమే కెమికల్ ఇంజినీరింగ్ సీట్లున్నాయి. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యలో 14 లక్షల వరకూ సీట్లున్నాయి. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానిక, ఇతర కోర్సుల్లో సీట్లు ఐదు లక్షల నుంచి లక్ష మధ్య ఉన్నాయి. ఇదే కెమికల్ ఇంజినీరింగ్‌లో అన్ని రకాల కళాశాలల్లో కలిపి 3వేల సీట్లే అందుబాటులో ఉన్నాయి. డిమాండు ఎక్కువగా ఉన్న కోర్సుల్లో ఒక్కో సీటుకు కొన్ని చోట్ల వంద మంది విద్యార్థులు సైతం పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితి కెమికల్ ఇంజినీరింగ్ విద్యలో లేదని ఆచార్యులు చెబుతున్నారు. ఆంధ్రా, ఉస్మానియా, ఎస్వీయూ, ఎన్ఐటీ వరంగల్, ఇతరచోట్ల ఈ కోర్సులో సీట్లున్నాయి.
దీనిని పూర్తి చేసిన వారికి పెట్రో కెమికల్స్, ఫార్మా, ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, స్టీల్, లెదర్, టెక్స్‌టైల్, న్యూక్లియర్, ఎనర్జీ, క్యాడ్‌బరి ఇండియా, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎల్అండ్‌టీ, ప్రైస్ వాటర్ హౌస్, రిలయన్స్, టెక్ ఇండియా, టీవీ మోటార్స్ కంపెనీ, వొడాఫోన్, ఐబీఎం, ఇతర రంగాలు, సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. ఐఐటీలో (బెనారస్) ఓ కెమికల్ విద్యార్థికి 68 లక్షల రూపాయల్ని వార్షిక వేతనంగా ఖరారు చేశారు. ఐఐటీ మద్రాసు విద్యార్థికి ఏడాది వేతనం కింద 21 లక్షల రూపాయల్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది ఓ సంస్థ. అమెరికాలో ఏడాదికి ఓ విద్యార్థికి 97 వేల డాలర్లను ఇచ్చేందుకు ఓ సంస్థ అంగీకరించింది. కెమికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసిన వారు పెట్రోలియం ఇంజినీరింగ్ నిపుణుడిగానూ రాణిస్తారు. సాధారణంగా పెట్రోలియం ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసినవారు ఈ రంగంలోనే పని చేయాల్సి ఉంటుంది. ఈ రంగాల్లో విద్యను అందించేందుకు వైజాగ్‌లో కొత్తగా ఏర్పడ్డ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీకి (జాతీయ పెట్రోలియం, ఇంధన వనరుల సంస్థ) సంబంధించిన బోర్డులో ఇంధన, రసాయన సంస్థల ప్రతినిధులే ఉన్నారు. ఇక్కడ కోర్సును పూర్తిచేసిన వారికి వెంటనే ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని వారు చెబుతున్నారు.
అందరూ ఆలోచించాలి
కెమికల్ ఇంజినీరింగ్ విద్యలో కోర్సును పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలే ఉన్నాయి. వృత్తిలోకి వచ్చిన తొలినాళ్లల్లో వేతనాలు తక్కువ అనిపించొచ్చు. అనుభవంతో మిగిలిన వారికంటే ముందంజలో ఉంటారు. ఈ కోర్సును పూర్తిచేసే రసాయన పరిశ్రమలో పనిచేయాల్సి ఉంటుందని, అది మంచిది కాదన్న ఆలోచన కొందరిలో ఉంది. ఇప్పుడు సంబంధిత సంస్థలు కార్యకలాపాల నిర్వహణలో తగిన జాగ్రత్తల్ని తీసుకుంటున్నాయి.
         - ప్రొఫెసర్ వీఎస్సాఆర్కే ప్రసాద్ జాతీయ పెట్రోలియం, ఇంధన వనరుల సంస్థ అకడమిక్ సలహాదారు


Back..

Posted on 08-07-2016