Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

పిల్లలకూ కోడింగ్‌ నైపుణ్యాలు

రాబోయేది ఆటోమేషన్‌ రంగం.. కోడింగ్‌ నిపుణులకు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు రానున్నాయి. కోడింగ్‌ అనగానే ఇంజినీరింగ్‌ విద్యార్థులే గుర్తొస్తుంటారు. అయితే ఆరేళ్ల వయసు నుంచే దీన్ని నేర్చుకుని పట్టు సాధించవచ్చని అంటున్నారు నిపుణులు. అందుకు తగ్గ శిక్షణా లభిస్తోంది.

ఆటోమేషన్‌ రంగ విస్తృత అభివృద్ధి దృష్ట్యా కోడింగ్‌ నిపుణులకు ఆదరణ రానురానూ పెరుగుతోంది. ఎన్నో సంస్థలు వీరిని పెద్ద మొత్తంలో జీతంతో ఇప్పటికే ఎంపిక చేసుకుంటున్నాయి. 2020 నాటికి ఏఐ, రోబోటిక్స్‌ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య 800 మిలియన్లకు చేరనుందనీ నిపుణులు అంచనా వేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘వైట్‌హాట్‌ జూనియర్‌’ అనే అంకుర సంస్థ కోడింగ్‌కు సంబంధించి కొన్ని కోర్సులను రూపొందించింది. వీటికి సంబంధించిన కరిక్యులమ్‌ను ఐఐటీ, ఐఐఎంల పూర్వవిద్యార్థులు రూపొందించారు. వీటిల్లో చేరడానికి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు మాత్రమే అర్హులు. ఆన్‌లైన్‌ బోధన ఉంటుంది. ఇది 1:1 విధానంలో సాగుతుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వీరికి బోధిస్తారు. కోర్సుల్లో భాగంగా కోడింగ్‌ ప్రాథమికాంశాలైన లాజిక్‌, స్ట్రక్చర్‌, సీక్వెన్స్‌, అల్గారిథమిక్‌ థింకింగ్‌ వంటి అంశాలను నేర్పిస్తారు. మొత్తంగా యానిమేషన్‌, ఆప్స్‌ వంటి సృజనాత్మక ఫలితాలను రాబట్టేలా తయారు చేస్తారు.

పిల్లలకే ఎందుకు?
ఆరేళ్ల వయసులో పిల్లలకు సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుందని నాసా అధ్యయనం చెబుతోంది. అందుకని ‘వైట్‌హాట్‌ జూనియర్‌’ వీరిపై దృష్టిసారించింది. కోర్సులో భాగంగా పిల్లలు లాజిక్‌, సీక్వెన్సింగ్‌, స్ట్రక్చర్‌, అల్గారిథమిక్‌ థింకింగ్‌, క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ వంటివి నేర్చుకుంటారు. వీటి ఆధారంగా గేమ్స్‌, ఆప్స్‌ వంటివి రూపొందిస్తారు.

ఏమేం ఉంటాయి?
ప్రయత్నించి చూడాలనుకునేవారికి ఉచిత ట్రయల్‌ క్లాసెస్‌ అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు అనుకూలంగా ఉందని భావిస్తే తరువాతి వాటిలోకి చేరొచ్చు. మొత్తంగా బిగినర్‌, ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌డ్‌, ప్రొఫెషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదానిలో 48 తరగతుల చొప్పున ఉంటాయి. ప్రతి కోర్సులోనూ తిరిగి బేసిక్‌, స్టాండర్డ్‌, ప్రీమియమ్‌ విభాగాలుంటాయి. వారానికి రెండు క్లాసుల చొప్పున నిర్వహిస్తారు. ప్రతిదానికీ నిర్ణీత రుసుం ఉంటుంది.

ఎలా చేరవచ్చు?

ఆన్‌లైన్‌లో సంస్థ వెబ్‌సైట్‌ (www.whitehatjr.com) లో నమోదు చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పేరు, ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబరు, పిల్లల వివరాలతో నమోదు చేయించవచ్చు. ఉపాధ్యాయులూ తమ విద్యార్థులను చేర్పించొచ్చు. సీట్లు పరిమితంగానే ఉంటాయి. వీటిలో చేరాలనుకునేవారి దగ్గర డివైజెస్‌ (డెస్క్‌టాప్‌, లాప్‌టాప్‌, మ్యాక్‌ వంటివి), కెమెరా (హెచ్‌డీ ఎక్స్‌టర్నల్‌ కెమెరా/ హెచ్‌డీ ఇంటిగ్రేటెడ్‌ కెమెరా.. లాప్‌టాప్‌ల్లో ఇది దాదాపుగా ఉంటుంది), మైక్రోఫోన్‌తో కూడిన హెడ్‌సెట్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం తప్పక ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Back..

Posted on 26-06-2019