Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
భవితకు ప్లాస్టిక్‌ భరోసా!

ప్లాస్టిక్‌, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) కళాశాలలను ఏర్పాటు చేసింది. వీటిల్లో పదోతరగతి, డిగ్రీ అర్హతలతో కోర్సులు ఉన్నాయి. కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లకు ఉమ్మడి ప్రవేశపరీక్ష (సిపెట్‌ జేఈఈ-2019) నోటిఫికేషన్‌ విడుదలైంది.

దేశాభివృద్ధిలో తయారీ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వాలు సైతం ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రజలు విరివిగా వినియోగిస్తున్న అనేక వస్తువులు ప్లాస్టిక్‌ ఆధారితంగా తయారైనవే. ఇవి తక్కువ ధర, ఎక్కువ మన్నికతో లభించడం వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడింది. అందుకు తగ్గట్టే నిపుణుల డిమాండు కూడా ఎక్కువైంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌, దాని అనుబంధ రంగాలకు గుర్తింపునిస్తూ అందులో మరిన్ని ప్రయోగాలను ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) కళాశాలలను ఏర్పాటుచేసింది. ఈ కళాశాలలు ప్లాస్టిక్‌ రంగంలో కొత్త ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు చేసేలా మానవ వనరులకు శిక్షణ ఇస్తున్నాయి.

భారత దేశంలో సుమారు 30 వేలకుపైగా ప్లాస్టిక్‌ ఆధారిత పరిశ్రమలున్నాయి. దాదాపు 4 కోట్ల మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతి చేసిన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విలువ దాదాపు 3.47 బిలియన్‌ డాలర్లు. ఈ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన డిప్లొమా కోర్సులు అందిస్తున్న సిపెట్‌ 2019 సంవత్సరానికి ప్రవేశాలకు సిపెట్‌జేఈఈ-2019 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత పౌరులతో పాటు విదేశీయులూ ఈ పరీక్ష రాయవచ్చు.

కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధీనంలో సిపెట్‌ ఉంటుంది. ప్లాస్టిక్‌ తయారీ రంగంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశోధనాత్మక నైపుణ్యాలను మెరుగుపర్చడమే దీని లక్ష్యం. సిపెట్‌ వివిధ విభాగాల్లో డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. సిపెట్‌ కళాశాలలు దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఉన్నాయి.

కోర్సులు - అర్హత
డిప్లొమా కోర్సులు: సిపెట్‌లో రెండు రకాల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ). పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఈ కోర్సు కాలపరిమితి మూడు సంవత్సరాలు.
పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌ కాడ్‌/ కామ్‌ (పీడీ-పీఎండీ విత్‌ కాడ్‌/ కామ్‌): మెకానికల్‌, ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ, టూల్‌/ ప్రొడక్షన్‌/ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, మెకాట్రానిక్స్‌, టూల్‌ అండ్‌ డై మార్కెటింగ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా లేదా సిపెట్‌ నుంచి డీపీఎంటీ/ డీపీటీ ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సు చేయడానికి అర్హులు. దీని కాలపరిమితి 18 నెలలు.
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ (పీజీడీ -పీపీటీ): కెమిస్ట్రీ సబ్జెక్టుగా సైన్స్‌ గ్రూప్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీని కాలపరిమితి 18 నెలలు.
ఎంపిక విధానం: దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశపరీక్ష రాస్తుంటారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఎంచుకున్న కోర్సు సిలబస్‌, జనరల్‌ నాలెడ్జ్‌ కలిపి మొత్తం 60 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు ఎంచుకున్న ప్రాంతాల్లో సీటు కేటాయించడానికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సిపెట్‌ కేంద్రాలు హైదరాబాద్‌, విజయవాడల్లో ఉన్నాయి. విజయవాడ సిపెట్‌లో పీడీ - పీఎండీ కోర్సు లేదు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: జూన్‌ 30
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: జులై 07

పూర్తి సమాచారం కోసం....
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, సీఐడీఏ ఫేజ్‌- II, చర్లపల్లి, హెచ్‌సీఎల్‌ పోస్ట్‌, హైదరాబాద్‌ - 500051, తెలంగాణ. ఫోన్‌- 040-27263750,
ఈమెయిల్‌: cipethyderabad@yahoo.co.in
వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/centres/olc-cipet-hyderabad/introduction.php,
https://eadmission.cipet.gov.in/

ఉద్యోగ అవకాశాలు
డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్లాస్టిక్‌ తయారీ సంస్థలే కాకుండా ఫార్మా రంగంలో కూడా ప్లాస్టిక్‌ పదార్థాలను వినియోగిస్తున్నారు. వాటిలోనూ ఉద్యోగాలు లభిస్తాయి. ల్యాబ్‌లు, రిసెర్చ్‌ సెంటర్లు, పెట్రో ఆధారిత పరిశ్రమలు సైతం వీరిని తీసుకుంటున్నాయి. సొంతంగా కూడా ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. వారికి బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు ఇస్తున్నాయి.


Back..

Posted on 30-04-2019