Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉపాధికి ‘ప్లాస్టిక్‌’ గట్టిదే!

ప్లాస్టిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే సిపెట్‌ జేఈఈ ప్రకటన వచ్చేసింది. ఈ కోర్సుల ప్రాధాన్యం తెలుసుకుని విద్యార్థులు తమ ఆసక్తిమేరకు దరఖాస్తు చేసుకోవచ్చు!
ప్లాస్టిక్‌ లేని వస్తువు, వినియోగించని రంగం ఏది అని అడిగితే?... సమాధానం కోసం వెతుక్కోవాల్సిందే. చివరికి ఏదీ లేదనే జవాబు వస్తుంది. అంతగా మానవ జీవితంలో ప్లాస్టిక్‌ చొచ్చుకుపోతోంది.
అందుకే ఏ పరిశ్రమలో లేనంతగా ప్లాస్టిక్‌ రంగంలో వృద్ధి గణనీయంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఈ పరిశ్రమలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా లేదని భరోసా ఇస్తున్నారు.
అందుకు ఏ కోర్సు చేయాలి? ఎక్కడ చదవాలి? విద్యార్హతలు ఏమిటో వివరాలు కావాలంటే ప్లాస్టిక్‌ రంగంలో అగ్రగామి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) గురించి తెలుసుకోవాల్సిందే. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఇటీవల పరీక్షా ప్రకటన జారీ అయింది.
కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సిపెట్‌ కేంద్ర కార్యాలయం చెన్నైలో ఉంటుంది. దాని పరిధిలో దేశంలో 28 సిపెట్‌ ప్రాంగణాలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ప్రాంగణం ఉంది. ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీలో పరిశ్రమలకు నిపుణులను అందించే లక్ష్యంతో 1989లో ఇక్కడ ప్రాంగణాన్ని స్థాపించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇటీవలే ఏపీలోని విజయవాడ సమీపంలోని కానూరులో సిపెట్‌ ప్రాంగణానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ స్వల్ప కాలిక కోర్సుల్లో మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌ ప్రాంగణంలో మాత్రం డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలున్న వారికి నాలుగు రకాల కోర్సులను అందిస్తున్నారు. వీటిల్లో 80 శాతం సీట్లను సొంత రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేస్తారు.
మానవ వనరులకు గిరాకీ
దేశంలో ప్లాస్టిక్‌ పరిశ్రమలో 20-30 వృద్ధి నమోదవుతోంది. అంటే ప్లాస్టిక్‌ వినియోగం భారీగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికీ భారత్‌లో ప్రతి వ్యక్తీ సగటున ఏడాదికి 9.7 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. భవిష్యత్తులో ఇక్కడా వినియోగం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ రంగంలో మానవ వనరులకు గిరాకీ అధికంగా ఉంది.
వ్యవసాయం, ఆటోమొబైల్‌, విమానయానం, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, వైద్యం, ప్యాకేజింగ్‌, క్రీడలు తదితర ఎన్నో రంగాల్లో ప్లాస్టిక్‌ వాడకం పెరుగుతోంది. దీనివల్ల భారత్‌లో ఏటా 50 వేల మంది నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం ఉండగా దేశంలో ఏటా 5-6 వేల మందే తయారువుతున్నారు. ఈ క్రమంలో ఈ రంగానికి అవసరమైన నిపుణులను అందించేందుకు సిపెట్‌ ప్రాంగణాలను పెంచుతోంది.
తెలంగాణలో హైదరాబాద్‌, ఏపీలో విశాఖపట్టణం, విజయవాడ, అనంతపురం నగరాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి.
కోర్సులు... వివరాలు
1. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డీపీఎంటీ): 3 సంవత్సరాల కోర్సు. పదో తరగతి విద్యార్హత. మొత్తం సీట్లు 90. గరిష్ఠ వయసు: 20 సంవత్సరాలు. ఇంటర్‌ ఒకేషనల్‌ లేదా ఐటీఐ చేసిన విద్యార్థులు నేరుగా ఈ కోర్సులో రెండో ఏడాదిలో (లేటరల్‌ ఎంట్రీ) చేరవచ్చు. వీరికి 20 శాతం సీట్లుంటాయి.
2. డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ): మూడేళ్ల కోర్సు, విద్యార్హత పదో తరగతి. సీట్లు 90. గరిష్ఠ వయసు: 20 సంవత్సరాలు. ఒకేషనల్‌, ఐటీఐ పూర్తి చేసినవారు లేటరల్‌ ఎంట్రీ ద్వారా రెండో ఏడాదిలో చేరవచ్చు. వారికి 20 శాతం సీట్లుంటాయి.
3. పోస్టుగ్రాడ్యుయేట్‌ ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ (పీజీడీ-పీపీటీ): ఏడాదిన్నర కోర్సు. సీట్లు 90. గరిష్ఠ వయసు: 25 సంవత్సరాలు. రసాయనశాస్త్రం ఒక సబ్జెక్టుగా డిగ్రీ విద్యార్హత తప్పనిసరి.
4. పోస్టు డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ (పీడీ-పీఎండీ ... క్యాడ్‌, క్యామ్‌తో కలిపి): ఏడాదిన్నర కోర్సు. సీట్లు 90. గరిష్ఠ వయసు: 25 సంవత్సరాలు. విద్యార్హత... డిప్లొమా ఇన్‌ మెకానిక్స్‌/ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ/ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌/మెకట్రానిక్స్‌/ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌/టూల్‌ అండ్‌ డై మేకింగ్‌/డీపీఎంటీ లేదా డీపీటీ.
గమనిక: ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు అయిదేళ్ల సడలింపు ఇస్తారు.
దేశ, విదేశాల్లో అవకాశాలు : వి. కిరణ్‌కుమార్‌, సంచాలకుడు, సిపెట్‌ - ఈనాడు, హైదరాబాద్‌
సిపెట్‌ పరిశోధనతో కూడిన విద్యాసంస్థ. అందువల్ల ప్రాక్టికల్స్‌పై ఎక్కువ దృష్టి పెడతాం. పరిశ్రమలతో అనుసంధానం వల్ల విద్యార్థులు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. నాలుగు దీర్ఘకాలిక కోర్సులు చేసినవారికి దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. విదేశాల్లో గల్ఫ్‌ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. అంతేకాకుండా ప్రాంగణ నియామకాలకు వివిధ కంపెనీలు వస్తున్నాయి.
డిప్లొమా చేసిన వారు ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు, పోస్టు డిప్లొమా పూర్తి చేసినవారు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం పొందొచ్చు. విదేశాల్లో అయితే రూ.35 వేల నుంచి రూ.55 వేలు ప్రారంభ వేతనం ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు
జూన్‌ 3: దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ
జూన్‌ 26: జాతీయస్థాయిలో ఉమ్మడి పరీక్ష (జేఈఈ)
* స్వయంగా దరఖాస్తు కావాలంటే హైదరాబాద్‌ సిపెట్‌తోపాటు వైజాగ్‌, విజయవాడ, కాకినాడ తదితర ఐటీఐల్లో దొరుకుతాయి.
* దరఖాస్తు ఫీజు: రూ.250, ఎస్‌సీ, ఎస్‌టీలకు రూ.50
సిపెట్‌ హైదరాబాద్‌ చిరునామా: సిపెట్‌, ఐడీఏ పేజ్‌-2, చర్లపల్లి
మరిన్ని వివరాలకు, దరఖాస్తులు దొరికే సంస్థల కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లు: 9959333415, 9959333414
వెబ్‌సైట్‌: http://cipet.gov.in/


Back..

Posted on 14-05-2016