Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్లాస్టిక్‌తో ఉద్యోగాల ప్యాకేజీ

మనం నిత్యం వినియోగించే వస్తువుల్లో ఎక్కువ భాగం ప్లాస్టిక్‌వే ఉంటున్నాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ విభాగంలో నిపుణుల అవసరం కూడా అలాగే ఉంది. సంబంధిత కోర్సు పూర్తికాగానే ఉద్యోగం అందించే ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ యువతకు మంచి అవకాశం. ఈ కోర్సుల విశేషాలు చూద్దామా?

ప్లాస్టిక్‌, అనుబంధిత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తగిన సాంకేతిక శిక్షణ, సమర్థత కలిగిన అభ్యర్థులను తయారు చేసి, త్వరితగతిన వారిని పరిశ్రమల్లో ఉద్యోగం పొందటానికి వీలుగా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను రూపొందించింది.
సిపెట్‌కు దేశవ్యాప్తంగా 32 కేంద్రాలున్నాయి. ఇందులో 5 ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ కళాశాలలు, 24 నైపుణ్య, సాంకేతిక సహాయక కేంద్రాలు, 3 ఆధునిక పరిశోధన కేంద్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్‌లలో సిపెట్‌ కేంద్రాలున్నాయి.
వీటిలో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా సిపెట్‌-జేఈఈను నిర్వహిస్తున్నారు. దీనికి ఆన్‌లైన్‌లోనూ (http://eadmission.cipet.gov.in) దరఖాస్తు చేయాలి. జులై ఒకటో తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈకి హాజరయ్యేవారు మూడు కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో తమకు దగ్గరగా ఉన్న కేంద్రంలో పరీక్ష రాసుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు 60 ఇస్తారు. పరీక్షా సమయం గంట.
ఏయే కోర్సులు?
విజయవాడ సిపెట్‌ మూడు రకాల కోర్సులను అందిస్తోంది.
1) పీజీ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రోసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ (పీజీడీ-పీపీటీ): ఏడాదిన్నర కోర్సు ఇది. బీఎస్సీ (ఒక సబ్జెక్టు రసాయనశాస్త్రంతో మూడేళ్ల డిగ్రీ) ఉత్తీర్ణులు అర్హులు.
2) డిప్ల్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డీపీఎంటీ): మూడేళ్ళ కోర్సు ఇది. పదోతరగతి ఉత్తీర్ణత పొందినవారు అర్హులు.
3) డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ): మూడేళ్ళ కోర్సు. పదోతరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు.
ఒక్కో కోర్సులో 60 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత రెండేళ్లు విద్యార్థుల నుంచి స్పందన తక్కువగా ఉండడం, కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాల కావడంతో ఎలాంటి పరీక్ష లేకుండానే ప్రవేశాలు కల్పించారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక్కడ అభ్యర్థులు తక్కువగా ఉన్నందున పుణె, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ్‌బంగ, ఒడిషా, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ ప్రవేశాలు పొందారు.
హైదరాబాద్‌ సిపెట్‌లో పై మూడిటితోపాటు ఇంకో రెండు కోర్సులున్నాయి.
1) పీజీ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెస్టింగ్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ (పీజీడీ-పీటీక్యూసీ): ఏడాదిన్నర కోర్సు. బీఎస్‌సీ (ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లతోపాటు కెమిస్ట్రీ) ఉత్తీర్ణులు అర్హులు.
2) పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌ క్యాడ్‌/ క్యామ్‌ (పీడీ-పీఎండీ విత్‌ క్యాడ్‌ /క్యామ్‌): ఏడాదిన్నర కోర్సు. మూడేళ్ళ డిప్లొమా ఉన్నవారు అర్హులు. వివరాలకు సిపెట్‌ వెబ్‌సైట్‌ చూడవచ్చు.
* సిపెట్‌ జేఈఈ-2018 దరఖాస్తు సమర్పణకు చివరి గడువు: జూన్‌ 27
* దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్ష: జులై 1
* ఫలితాలు: జులై 3
* కౌన్సెలింగ్‌, ప్రవేశాల కాల్‌ లెటర్లు: జులై 9 నుంచి
* తరగతులు: ఆగస్టు 1 నుంచి
బీటెక్‌, పీజీ కోర్సులు..
ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌, పాలిమర్‌ అండ్‌ నానో టెక్నాలజీ, మెటీరియల్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ పాలిమర్‌ సైన్స్‌, బయోపాలిమర్‌ సైన్స్‌లలో ఎంటెక్‌, ఎంఈ, ఎమ్మెస్సీ, బీటెక్‌ కోర్సులు చేయాలనుకుంటే సిపెట్‌ హై లెర్నింగ్‌ సెంటర్స్‌గా పేర్కొనే భువనేశ్వర్‌, కొచ్చి, లఖ్‌నవూ, చెన్నై, అహ్మదాబాద్‌లలో మాత్రమే చదవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు జూన్‌- ఆగస్టుల మధ్య నిర్వహించే పరీక్షలు రాయడం ద్వారా వీటిల్లో ప్రవేశాలు పొందవచ్చు.
వేతనాలు..
ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసినవారికి ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనాలు లభిస్తున్నాయి. ఆ తర్వాత అనుభవం ఆధారంగా వేతనాలు పెరిగే అవకాశం ఉంది. విజయవాడలో సిపెట్‌లో పీజీడీ-పీపీటీ చదివిన 24 మంది విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగాలు లభించాయి.
                                                                            - ఎం. శ్రీనివాసరావు, ఈనాడు, అమరావతి
ఉద్యోగావకాశాలకు కొదవ లేదు
సిపెట్‌లో 10వ తరగతి ఉత్తీర్ణులైనవారి నుంచి డిప్లొమా, బీఎస్‌సీ పాసైన వారికి డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సాధారణ కోర్సులకు భిన్నంగా పాఠాల బోధనతోపాటు ప్రాక్టికల్స్‌ అధికంగా ఉంటాయి. అందుకు పూర్తిస్థాయి ప్రయోగశాలలు, పరికరాలు ఉన్నాయి. వివిధ ప్లాస్టిక్‌ వస్తువుల నాణ్యతను ధ్రువీకరించి ధ్రువపత్రాలు ఇచ్చేది సిపెట్‌ సంస్థే! అందువల్ల విద్యార్థులు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. పరిశ్రమల్లో కూడా స్వయంగా పనిచేస్తూ నేర్చుకుంటారు. అందువల్ల ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. వివిధ కంపెనీలు ప్రాంగణ నియామకాల కోసం సిపెట్‌కు వస్తాయి. ప్లాస్టిక్‌ పరిశ్రమ వృద్ధి ఏటా పెరుగుతోంది. ప్లాస్టిక్‌ అంటే కవర్లు, గ్లాసులు కాదు. ఇప్పుడు ప్లాస్టిక్‌ను ఉపయోగించని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ సంస్థలోని సీట్లలో 80 శాతం తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు కేటాయిస్తాం. ఇంకా అధికంగా ఉంటే తెలుగు విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తాం. పరిశ్రమల నుంచి అధిక గిరాకీ ఉన్నందునే గత ఏడాది కంటే ఈసారి కొన్ని కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచాం. అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తాం. వివరాలకు హైదరాబాద్‌ చర్లపల్లిలోని సిపెట్‌ సంస్థలో సంప్రదించవచ్చు.
                                                    - ఏవీఆర్‌ కృష్ణ, సంచాలకులు, సిపెట్‌, హైదరాబాద్‌
భవిష్యత్తు బాగుంటుంది
సిపెట్‌ కోర్సులు పూర్తికాగానే వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మొదట్లో కొంత తక్కువ వేతనాలున్నా భవిష్యత్తు బాగుంటుంది. ప్రస్తుతం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడేతత్వం ఉంటే చదువుకున్న, నేర్చుకున్న అంశాల ద్వారా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవారికి విదేశాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. దక్షిణాఫ్రికా, దుబాయ్‌, సౌది అరేబియా, ఫిలిప్పీన్స్‌ దేశాల్లోనూ మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి.
                                                        - వి. కిరణ్‌కుమార్‌, సంచాలకులు, సిపెట్‌, విజయవాడ

Back..

Posted on 19-06-2018