Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తొలి పోటీకి దీటైన వ్యూహం

ఉత్సాహభరితమైన తాజా ఫలితాల నేపథ్యంలో ఈ ఏడాది సివిల్స్‌ అభ్యర్థులు సానుకూల ధోరణిలో ప్రాథమిక పరీక్షకు సిద్ధమవుతున్నారు. పరీక్ష తేదీ (జూన్‌ 18) వేగంగా చేరువవుతోంది. ఈ కొద్దిరోజుల్లో ఏ అంశాలపై దృష్టిపెట్టాలి?
సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష వివిధ సబ్జెక్టుల ప్రాథమికాంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. దీంతో పాటు ఆ పరిజ్ఞానాన్ని వర్తమాన అంశాలకు అనుసంధానం చేయగల సామర్థ్యాన్నీ పరిశీలిస్తుంది. ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై అభ్యర్థి ఎంత సున్నితంగా స్పందిస్తున్నాడనేదీ, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకునే చర్యలూ కూడా పరీక్ష కోణంలో ముఖ్యమే.
ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ప్రతి పేపరుకూ 200 మార్కుల చొప్పున కేటాయించారు. మొదటి పేపర్‌లో 100 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానానికి 2 మార్కులు. రెండో పేపర్లో 80 ప్రశ్నలు. సరైన సమాధానానికి రెండున్నర మార్కులు. ప్రతి తప్పు జవాబుకూ 0.33 మార్కు కోత పడుతుంది.
రెండో పేపర్‌ అర్హత కోసం మాత్రమే. 200 మార్కుల్లో కనీసం 33 శాతం.. అంటే 67 మార్కులు తెచ్చుకుంటేనే వారి పేపర్‌-1ను మూల్యాంకనం చేస్తారు.
పేపర్‌-1లో అత్యధిక స్కోర్లను బట్టే మెరిట్‌ జాబితా తయారవుతుంది.

వర్తమాన ప్రాముఖ్యం
జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1కు సంబంధించి గత ఆరు సంవత్సరాల ప్రశ్నపత్రాలను పోల్చిచూస్తే... వర్తమాన అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోందని అర్థమవుతుంది. నిజానికి 2016లో అత్యధికంగా దీనిపై 42 ప్రశ్నలు రావటం విశేషం.
గత ఏడాది పేపర్‌ను పరిశీలిస్తే ఏం తెలుస్తోంది? వర్తమాన అంశాలకు ప్రాధాన్యం పెరగబోతోంది. ఈ కరంట్‌ అఫైర్స్‌లోనూ ఏ భాగానికి ప్రాముఖ్యం ఉంటుందనే ప్రశ్న సహజం. గత ఏడాది జరిగిన పోటీ పరీక్షలన్నీ విశ్లేషించుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించదని స్పష్టమవుతుంది. వీటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.

వచ్చే ఆరు రోజుల్లో...
సన్నద్ధత పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై దృష్టిపెట్టాలి. తర్వాత..
ఏడాదిగా వార్తల్లో ఉన్న అంశాలు: జనవరి 2016 నుంచి మొదలుపెట్టి గత సంవత్సరంలోని ముఖ్య సంఘటనలను జాబితాగా రాసుకోవాలి. వీటిని అక్టోబరు 2016కు ముందు; అక్టోబరు 2016 తర్వాత అని రెండు భాగాలు చేసుకోవాలి.
అక్టోబరు 2016కు ముందు సంఘటనలు: ఇండియా ఇయర్‌బుక్‌ లాంటి ప్రభుత్వ ప్రచురణల నుంచి జాబితా తయారు చేసుకోవాలి.వాటిలో ముఖ్యమైనవి పునశ్చరణ చేసుకోవాలి.
అక్టోబరు 2016 తర్వాత సంఘటనలు: వీటిపై గరిష్ఠంగా శ్రద్ధపెట్టాలి.అతి ముఖ్యమైన వాటిని జాబితా రాసుకోవాలి. ఆపైన కింది ప్రశ్నలకు జవాబులు అన్వేషించాలి.
* ప్రధానమంత్రి ప్రసంగాల్లో చారిత్రక సంఘటనలుగా పేర్కొన్నవి ఏవి?
* ముఖ్యమైన ఏ బిల్లులను ప్రవేశపెట్టారు? ఏ చట్టాలు వచ్చాయి? రాజకీయంగా ఏ వివాదాలు సంభవించాయి?
* ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలు ఏమిటి? వాటి ప్రయోజనాలేమిటి? మనదేశపరంగా ప్రాధాన్యమున్న ప్రత్యేక ఆవిష్కరణలు ఏమైనా ఉన్నాయా?
* అత్యంత ప్రాముఖ్యమున్న కార్యక్రమాలేవైనా ప్రభుత్వం ఆరంభించిందా? వాటి ప్రాథమికాంశాలేమిటి? వాటిపై స్పష్టత పెంచుకోండి.
* భౌగోళికపరంగా నలుగురి దృష్టినీ ఆకర్షించిన సంఘటనలేమిటి? ప్రధానమంత్రి ఏ దేశాలు పర్యటించారు? వాటి వల్ల సంభవించిన ఫలితాలేమిటి?
* అంతర్జాతీయంగా, దేశీయంగా పర్యావరణపరంగా ప్రధాన సంఘటనలు ఏం జరిగాయి?
వీటన్నిటినీ చదివేవున్నప్పటికీ మరోసారి పునశ్చరణ చేసుకోవడం మేలు.
కనీసం 40-45 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మొదటి గండాన్ని దాటారన్న హామీ దొరికినట్లే. కానీ, రుణాత్మక మార్కులను దృష్టిలో పెట్టుకుని... మరో 15-20 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయ గలిగితేనే సురక్షితంగా ఉన్నట్లు.

పేపర్‌-2ను తక్కువ అంచనా వేయొద్దు
రుణాత్మక మార్కులను దృష్టిలో పెట్టుకుని, నిజాయతీగా వచ్చిన సమాధానాలను మాత్రమే గుర్తించాలి. ఇటీవల ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫలితాల కటాఫ్‌ మార్కులు చాలా తక్కువ గమనించారా! రుణాత్మక మార్కుల ప్రభావాన్ని అభ్యర్థులు సరిగా అర్థం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణం.
* పేపర్‌-1లో కనీసం 120 మార్కులు (60 ప్రశ్నలు సరిగా గుర్తించాలి) సాధించేలా లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఇదెప్పుడూ సురక్షితమే. గత సంవత్సర కటాఫ్‌ 116 మార్కులే.
* పేపర్‌-2ను తేలికగా తీసుకోకూడదు. కటాఫ్‌ కంటే ఎక్కువ మార్కులే సాధించగలమనే ధీమాతో కొన్ని ప్రశ్నలకు మాత్రమే పరిమితం కావొద్దు. అలాగే త్వరగా పేపర్‌ను ముగించేయాలనే ఆతృత కూడా పనికిరాదు. ఈ పరీక్ష కోసం దాదాపుగా ఏడాది/ రెండేళ్లు వేచి ఉండుంటారు. కాబట్టి, రుణాత్మక మార్కులను దృష్టిలో ఉంచుకుని, వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను రాయండి.
* గత కొన్ని సంవత్సరాల్లాగే, ఈసారి కూడా పేపర్‌-2 సిలబస్‌లోని రెండు విభాగాలు- ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, డెసిషన్‌ మేకింగ్‌ నుంచి ప్రశ్నలు రాకపోవడానికి అవకాశం ఉంది.
* జనరల్‌ స్టడీస్‌లోని 100 ప్రశ్నల్లో 40- 45 ప్రశ్నలు దాదాపుగా తేలికగా, 30-35 మధ్యస్థంగా, 20-25 ప్రశ్నలు కఠినంగా ఉండొచ్చని భావన.
* బాగా సన్నద్ధమైన విద్యార్థి తెలివైన వ్యూహాన్ని అనుసరించి కనీసం 40-45 ప్రశ్నలకు సమాధానాలను రాయవచ్చు. ఇలా చేస్తే మొదటి గండాన్ని దాటారన్న హామీ దొరికినట్లే. కానీ, రుణాత్మక మార్కులను దృష్టిలో పెట్టుకుని...మరో సరైన 15-20 ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగితేనే సురక్షితంగా ఉన్నట్లు భావించుకోవచ్చు.
* ఎన్ని ఎక్కువ కఠినమైన ప్రశ్నలు వస్తే, అంత తక్కువ కటాఫ్‌ ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరమేమీ లేదు. బాగా సన్నద్ధమై కూడా సమాధానాలు రాయలేకపోతున్నారు అంటే.. మిగతా వాళ్ల పరిస్థితీ ఇదేనని అర్థం చేసుకోవాలి.
* చివరగా.. పరీక్ష పూర్తవ్వగానే రాగల కటాఫ్‌ను అంచనా వేసే ప్రయత్నం చేయవద్దు. కచ్చితమైన, సముచితమైన కటాఫ్‌ను అంచనా వేయడానికి కనీసం వారం సమయమైనా పడుతుంది. ప్రారంభంలో అందరూ ఎక్కువ స్కోరు వస్తుందనే అనుకుంటారు. తర్వాత అన్ని సమాధానాలనూ సరిచూసుకున్నాక అంత స్కోరేమీ రాదని గుర్తిస్తారు.


Back..

Posted on 12-06-2017