Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పట్టు వదల్లేదు.. గురి తప్పలేదు!

     కోట్ల మంది చూపు.. లక్షల మంది కల.. సివిల్‌ సర్వీసెస్‌... సాధించింది అతికొద్ది మందే... వాళ్లేం ఆకాశం నుంచి వూడిపడ్లేదు! మన మధ్యలోంచి వచ్చినవాళ్లే... నిన్నటివరకూ భుజంభుజం రాసుకొని తిరిగినవాళ్లే... ఇప్పుడు సమాజం మెచ్చిన హీరోలు.. కాబోయే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు.. విజయం వారినే ఎందుకు పలకరించింది? అందరిలోనూ వీళ్లే ప్రత్యేకం ఎందుకు?? కొందరు విజేతలతో మాట కలిపింది ఈతరం. వాళ్ల అనుభవ పాఠాలకు తోడు కెరీర్‌ నిపుణుడి విశ్లేషణ ఇదిగో...
ప్రతి విజయం వెనక దృఢమైన పునాది, సకారాత్మక చర్య ఉంటుందంటాడు పికాసో. కానీ అది వూరికే అందదు. కష్టాల సంద్రాలు ముందుంటాయ్‌. ఒడుపుగా దాటాలి. అవాంతరాల తుఫాన్లు తరుముతాయ్‌. పరుగెత్తాలి. అవరోధాల సునామీలు వెనక్కి లాగుతాయ్‌. జడవొద్దు. అప్పుడుగానీ శిఖరాగ్రం చేరి విజయనాదం చేయలేం. సివిల్స్‌ విజేతలు ఇలాంటి అవాంతరాలెన్నో దాటి వచ్చినవాళ్లే. వాళ్లు చెబుతున్న స్వీయ అనుభవాలివి.

విజేతల లక్షణాలివే..
తొమ్మిదిన్నర లక్షలమంది పోటీపడితే సర్వీసు సాధించింది పన్నెండు వందల మందే. కొందరినే ఎందుకు విజయం వరించింది? అంటే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కెరీర్‌ కౌన్సిలర్‌, ప్రొ.బి.రాజశేఖర్‌ తేడాలు చెప్పారిలా.
* విజేతల్లో చివరివరకూ పోరాడేతత్వం ఉంటుంది. పరాజితులు అత్యాశతో సాధన ప్రారంభిస్తారు. తొందరగా ఫలితాలు ఆశిస్తారు.

* విజేతలు కష్టపడటానికి ఇష్టపడతారు. దగ్గర దారులు వెతికేవాళ్లు పరాజితులు.

* వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు విన్నర్లు. పరాజయానికి సాకులు వెతుకుతారు వైఫల్యం చెందినవాళ్లు.

* కష్టమైనా ఒక్కో మెట్టే ఎక్కుతారు మొదటివారు. ఒక్క ఉదుట్న విజయాన్ని అందుకోవాలనే ఆశ వెనుక వరుస వాళ్లది.

* విజయం, అపజయం రెంటికీ బాధ్యత తీసుకుంటారు విజేతలు. తప్పించుకునే తత్వం పరాజితులది.

* గమ్యమే కాదు, వెళ్లేదారిలో ప్రతి అడుగునీ ఆస్వాదిస్తారు విజేతలు. పరాజితులు లక్ష్యం చేరాక దక్కే ఫలితాలు, లాభాల గురించే పగటి కలలు కంటుంటారు.

తొలి అడుగు: వైఫల్యాలకు వెరవరు
ఈ యేటి సివిల్స్‌ విజేతల్ని గమనించండి. ఒక్కొక్కరిది రెండు, మూడో ప్రయత్నం. కొందరిదైతే ఐదు. గమ్యం చేర్చే బస్సు కోసం అరగంట ఎదురుచూడాలంటేనే చిరాకు. మరి ఏళ్లకేళ్లు పుస్తకాలతో కుస్తీ ఎలా? ఇదేమాట వాళ్లనడిగితే 'సిసలైన విజేతలు చేసే పనిని కష్టంగా భావించరు. వారి దృష్టిలో వైఫల్యం కూడా ఓ విజయమే. చేసిన తప్పు తెలుసుకోగలిగినపుడే లక్ష్యానికి దగ్గరవుతాం కదా' అంటారు. తమ జీవితాన్ని ఉన్నతస్థితిలో నిలిపే లక్ష్యం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తారు. పడ్డచోటే మరింత వేగంగా పరుగు మొదలుపెడతారు.

మలి అడుగు: సంతృప్తి చెందేరకం కాదు
కాలేజీ కుర్రాడికి పాకెట్‌మనీ వెయ్యి రూపాయలిస్తే సంతోషం. అతడే క్యాంపస్‌ దాటకుండానే పాతిక వేల ఉద్యోగం సంపాదిస్తే గొప్పే. మరి వాళ్లే లక్షల జీతాన్నీ వదులుకుంటున్నారంటే సంకల్పం ఎంత గాఢంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 21వ ర్యాంకు సాధించిన లక్ష్మికాంత్‌రెడ్డి జీతం రూ.లక్షన్నర. సీఏ చదివిన క్రాంతికుమార్‌ది లక్ష. పింగళి సతీశ్‌రెడ్డి, మైలవరపు కృష్ణతేజలూ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు కొల్లగొట్టినవాళ్లే. మంచి హోదా, సాఫీగా సాగిపోయే కెరీర్‌. ఇవేవీ వాళ్లని సంతృప్తిపరచలేకపోయాయి. ఎందుకంటే వాళ్లకి డబ్బే ముఖ్యం కాదు. సమాజంలో గౌరవం, సామాన్యుల జీవితాల్ని ప్రభావితం చేయగలిగే నిర్ణయాధికారం కావాలి. దానికోసం ఎలాంటి కఠిన పరీక్షలైనా సిద్ధం.

మూడో అడుగు: సగటైనా చాలు
సివిల్స్‌లో నూటికి నూరు మార్కులొచ్చిన వారే రాణిస్తారనుకోవడం అపోహే. తొంభైఏడో ర్యాంకు సాధించిన సతీశ్‌ ఇంజినీరింగ్‌ పూర్తయ్యేదాకా సగటు విద్యార్థే. టెన్త్‌, డిగ్రీల్లో డింకీలు కొట్టినవాళ్లూ గతేడాది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అయ్యారు. ఇక్కడ మార్కులే ప్రామాణికం కాదు. పుస్తకాలతో పాటు సమాజాన్ని చదివే స్పృహ ఉండాలి. ర్యాంకులకి బదులు పక్కవాడి కష్టాలకు స్పందించే గుణముండాలి. వ్యక్తిత్వ పరీక్షలో బోర్డులో సభ్యులు గమనించేవివే. నగరాల్లో పుట్టిపెరిగినోళ్లకే అవకాశాలెక్కువ అనేది మరో అబద్ధం. ముప్ఫయ్యో ర్యాంకర్‌ గంపలగూడెం కుర్రాడు గౌతమ్‌, మలికిపురం మండలం అబ్బాయి సింహాచలం (1212వ ర్యాంకు), పశ్చిమగోదావరి జిల్లా అమ్మాయి లక్ష్మీభవ్య (88వ ర్యాంకు), చిన్న పట్టణం చిలకలూరిపేట నుంచి వచ్చిన కృష్ణతేజ, గిర్మాజీపేట పిలగాడు క్రాంతికుమార్‌.. వీళ్ల నేపథ్యం గ్రామీణం కాక మరేంటి? 'ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక గ్రామీణులు, నగరవాసులు అనే తేడాలేం లేవు. కావాల్సినంత సమాచారం ఆన్‌లైన్‌లో ఉంది. అందరికీ సమాన అవకాశాలు' అంటూ కొత్త పాయింట్‌ లేవదీస్తాడు లక్ష్మీకాంత్‌రెడ్డి. పైపెచ్చు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవారికి సామాజిక సమస్యలపై అవగాహన ఎక్కువ. అత్యుత్తమ సర్వీసులకు వెళ్తే వూరిని, జిల్లాను మార్చగలం అనే కాంక్ష అధికంగా ఉంటుందంటారు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కెరీర్‌ కౌన్సిలర్‌ ప్రొ.రాజశేఖర్‌.

నాలుగో అడుగు: వెనకడుగేయరు
చెడ్డపనికి చీవాట్లు పెట్టేవాళ్లు లేకపోయినా, మంచి పని చేస్తే వెనక్కి లాగే వాళ్లు చాలామందే ఉంటారు. వేళాకోళం, దెప్పిపొడుపు, హితవు.. రూపం ఏదైనా కావొచ్చు. కృష్ణతేజ నాలుగో ప్రయత్నమూ విఫలమైనపుడు 'అసలు నీకుద్యోగం సాధించే సత్తా ఉందా?' అన్నారు దగ్గరి వాళ్లు. సతీశ్‌రెడ్డి వెరిజాన్‌లో ఉద్యోగం వదలి ప్రిపరేషన్‌ మొదలుపెడతానంటే 'రిస్క్‌ తీసుకోవద్ద'న్నారు ఫ్రెండ్స్‌. టాపర్‌ ఇరా సింఘాల్‌ ఐఏఎస్‌ అవుతానంటే మొహం మీదే నవ్వేశారు ఇరుగుపొరుగు. ఇవన్నీ పట్టించుకుంటే వాళ్లు లక్ష్యం చేరేవాళ్లా? తామేంటో, తమ సత్తా ఏంటో వాళ్లకి బాగా తెలుసు. అందుకే వేళాకోళాల్ని గాలికొదిలేసి.. హితవుల్ని సహృదయంతో స్వీకరించి ముందుకెళ్లారు.

ఐదో అడుగు: పేదరికం అడ్డుకాదు
లక్ష్మీకటాక్షం లేనిదే కొలువు ప్రత్యక్షం కాదన్నది చాలామంది మాట. ఆంగ్ల మీడియంలో, కార్పొరేటు కళాశాలల్లోనే చదివితేనే సాధన సులువని ఇంకొంతమంది నమ్మకం. మరి తండాలో పుట్టిపెరిగిన అమ్మాయి ఐదొందల ర్యాంకు సాధించిందిగా! ఓయూలో చదువుతున్న ఆటోడ్రైవరు కూతురు ప్రియాంక వెయ్యిమూడు ర్యాంకు కొట్టలేదా? తమిళమ్మాయి, కారు డ్రైవర్‌ కూతురు వన్మతి కలెక్టరు కాబోతుందిగా! ప్రిపరేషన్‌కి డబ్బుల కోసం పాఠాలు చెప్పిన పరిస్థితి కృష్ణతేజది. ఈ సాక్ష్యాలు చాలవా? అత్యుత్తమ కొలువుకు ఐశ్వర్యవంతులు కావాలనే నియమం అక్కర్లేదని. పైగా ఆర్థికంగా లేనివారికి సాయం చేసే సంస్థలు, ప్రభుత్వ కోచింగ్‌ సెంటర్లూ ఉండనే ఉన్నాయి.

కోచింగ్‌ అవసరం లేదు
ప్రముఖ కన్సల్టింగ్‌ కంపెనీ ఉద్యోగిని. ఉద్యోగరీత్యా ప్రభుత్వశాఖలకు చెందిన సీనియర్‌ అధికారులతో తరచూ సమావేశమయ్యేవాణ్ని. ఈక్రమంలో సివిల్స్‌ సర్వెంట్లకున్న గౌరవం, దర్పం నన్నాకట్టుకున్నాయి. వాళ్ల ప్రతి నిర్ణయం జనంపై ప్రభావం చూపడం గమనించా. అది నచ్చి నేనూ అదేబాటలో వెళ్లాలనుకున్నా. ప్యాటర్న్‌ తెలుసుకోవడానికి 2013లో మొదటిసారి రాసి మెయిన్స్‌ వరకొచ్చా. పరీక్ష విధానంపై ఓ అవగాహనచ్చింది. తర్వాత చేస్తున్న ఉద్యోగానికి ఏడాది సెలవుపెట్టి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌ ప్రారంభించా. వందశాతం మనసుపెట్టి సాధన చేశా. ఎంచుకున్న రంగం ఏదైనా విజయానికి దగ్గరి దారులుండవు. ఇష్టంగా, కష్టపడుతూ ముందుకెళ్లడమే. నా ఉద్దేశంలో సివిల్స్‌కి కోచింగ్‌ కూడా అవసరం లేదు. వాళ్లు ముందుకెళ్లడానికి దారి చూపిస్తారే తప్ప నడిపించరు.

- గిరిప్ప లక్ష్మీకాంతరెడ్డి, 21వ ర్యాంకు

మనమేంటో మనకు తెలుసు
నవోదయ విద్యాలయలో చదివా. పుణెలో ఇంటర్‌, డిగ్రీ, సీఏ పూర్తిచేసి ఓ బహుళజాతి కంపెనీలో చేరా. జీతం ఎక్కువైనా ఉద్యోగం పరిధి తక్కువని అర్థమైంది. నవోదయలో చదివేటపుడు విద్యాలయ ఛైర్మన్‌గా ఉండే కలెక్టర్‌ అప్పుడప్పుడు స్కూలుకొచ్చి ప్రసంగించేవారు. అది నాపై బాగా ప్రభావం చూపేది. ఆయన విధులు ఛాలెంజింగ్‌గా అనిపించేవి. ప్రతి ఏడాదీ సివిల్స్‌ విజేతల ఇంటర్వ్యూలు చదువుతూ స్ఫూర్తి పొందేవాణ్ని. రెండేళ్ల కిందట నేనూ ఇటువైపు రావాలనే నిర్ణయానికొచ్చా. అమ్మానాన్నలూ ప్రోత్సహించారు. మొదటి ప్రయత్నం విఫలం. నా సహోద్యోగులేమో కెరీర్‌లో ముందుకెళ్లిపోయారు. కొంచెం నిరాశపడ్డా, సర్వీసు వస్తే కలిగే ఆనందాన్ని వూహించుకుంటూ పట్టుదలగా చదివా. ఈ ప్రయత్నంలో సరదాలు, ఇష్టాలు మాత్రం వదులుకోలేదు. మన బలం, బలహీనతలేంటో అందరికన్నా మనకే ఎక్కువ తెలుసు. దేనికెంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకొని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే దేన్నైనా సాధించొచ్చు

- పాటి క్రాంతికుమార్‌, 50వ ర్యాంకు

అవహేళనలే దీవెనలు
అందరికీ సాయం చేస్తారని తాతకి వూరిలో మంచి పేరు. ప్రభుత్వోద్యోగి అయితే జనాలకు సేవ చేయొచ్చన్నారు నాన్న. అప్పట్నుంచే నా కల, లక్ష్యం ఐఏఎస్‌. బీటెక్‌ అయిపోగానే నాలుగు ఉద్యోగాలకి ఎంపికైనా వాటిని కాదని సివిల్స్‌ ప్రయత్నాలు మొదలెట్టా. మొదటిసారి ప్రిలిమ్స్‌ దాటలేదు. రెండు, మూడోసారి ఇంటర్వ్యూ ముందే ఆగిపోయా. 'సరదాకి రాస్తున్నావా?', 'అసలు నీకుద్యోగమొస్తుందా?' అని అవహేళన చేశారు కొందరు. ఆ మాటలు నాలో కసి పెంచాయి. ఇంతకుముందు సర్వీస్‌ సాధించిన మల్లవరపు బాలలత గారి దగ్గరికెళ్లా. నాలోని బలహీనతలేంటో ఎత్తిచూపి, ఎలా ముందుకు సాగాలో సూచించారామె. అదే సమయంలో తాతయ్య మరణం. మానసికంగా ఆందోళనకి గురైనా, ఇదే చివరి ప్రయత్నం అనుకుంటూ పట్టుదలగా పుస్తకం అందుకున్నా. సినిమాలు, సరదాలు అన్నీ పక్కనపెట్టా. ఫలితం దక్కింది.

- మైలవరపు కృష్ణతేజ, 66వ ర్యాంకు

వ్యక్తిత్వం ముఖ్యం
ఎన్‌ఐటీ వరంగల్‌ విద్యార్థిని. ఇక్కడే చదివి ఐఏఎస్‌ అయిన ముత్యాలరాజు నాకు స్ఫూర్తి. ఖాళీ సమయాల్లో ఎన్జీవో తరపున పనిచేసేవాణ్ని. మారుమూల గ్రామాల్లో తిరుగుతున్నపుడు అక్కడి దుర్భర పరిస్థితులు కదిలించాయి. అప్పుడే అనుకున్నా. ఉద్యోగంతో విదేశీ కంపెనీలకు వూడిగం చేసే బదులు నేరుగా ప్రజల జీవితాలతో మమేకమయ్యే సివిల్స్‌ సాధించాలని. తొలి ప్రయత్నంలో పన్నెండు మార్కుల తేడాతో మెయిన్స్‌ అర్హత కోల్పోయా. కుంగిపోలేదు. లక్ష్యానికి దగ్గరగా వచ్చాననిపించింది. ప్రశ్నలు ఎంచుకోవడం, జవాబులు వేగంగా రాయడం సాధన చేశా. ఇంటర్వ్యూకి ముందు నాన్నకి అనారోగ్యం. ఆందోళనకు గురైనా, చేసేదేం లేకపోవడంతో నాకు నేనే సర్దిచెప్పుకొని మళ్లీ సాధనలో పడిపోయా. రెండో ప్రయత్నం గురి తప్పలేదు. సరైన ప్రణాళిక, పట్టుదల, ఓపిక.. ఉంటే ఏదైనా సాధించొచ్చని అర్థమైంది. వీటితోపాటు మంచి హోదాలో ఉండే వ్యక్తికి వ్యక్తిత్వమూ ముఖ్యమే.

పింగళి సతీశ్‌రెడ్డి, 97వ ర్యాంకు

posted on 10..07.2015