Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సివిల్స్‌ గమ్యం చేరే దారి!

సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) ఇటీవలే జరిగింది. ఈ ప్రశ్నపత్రం ఏ తీరులో ఉంది? విశ్లేషిస్తే ఏయే అంశాలను గ్రహించవచ్చు? వచ్చే ఏడాది ఈ పరీక్ష రాయబోయేవారు గమనించాల్సిన విషయాలేమిటి?
‘జనరల్‌ స్టడీస్‌ను చదవటం అనవసరం. ముఖ్యభాగాల నుంచి ఒక్క ప్రశ్నా రాలేదు. మౌలికాంశాలపై పుస్తకాలు చదివి, గంటలకొద్దీ సమయం వృథా చేశాం’
‘కిందటి సంవత్సరం ప్రభుత్వ పథకాల మీద అత్యధికంగా దృష్టిపెట్టారు. ఈసారీ అదే రకంగా వస్తాయనుకుంటే అలా జరగలేదు’
‘కోచింగ్‌ సంస్థల్లో బోధించిన ప్రశ్నలేవీ రాలేదు’
‘అంత కఠినమైన పేపర్‌ వస్తే జవాబులు బాగా రాయగలమని ఎవరు మాత్రం ఆశిస్తారు?’
ఇటీవల జరిగిన సివిల్స్‌ ప్రిలిమినరీ రాసిన అభ్యర్థుల్లో కొందరి స్పందనలివి! పరీక్షపై ఒక్కో అభ్యర్థికి ఒక్కో సొంత అభిప్రాయం ఉండొచ్చు గానీ, అందరూ ఏకగ్రీవంగా చెపుతున్న మాట... ‘పేపర్‌ కిందటి సంవత్సరం కంటే చాలా కష్టంగా ఉంది’ అని. అనూహ్యంగా ప్రశ్నపత్రాలను రూపొందించటంలో యూపీఎస్‌సీకి పేరుంది కాబట్టి ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందీ ఏమీ లేదు.
2015 నుంచీ పేపర్‌-2 (సీశాట్‌) ను అర్హతకు మాత్రం పరిమితం చేశారు. దీనిలోని ఇంగ్లిష్‌ అంశాల కారణంగా ఆశలు కోల్పోయిన గ్రామీణ విద్యార్థులకు ఈ పరిణామం కొత్త వూపిరినిచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విజేతల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
సీశాట్‌ అర్హతకే పరిమితం అయ్యాక... 5 లక్షలమందికి పైగా అభ్యర్థుల నుంచి 15 వేల మందిని 100 ప్రశ్నల ద్వారా ఎంపిక చేయటం యూపీఎస్‌సీకి క్లిష్టంగా మారింది.
అభ్యర్థుల సంఖ్యను గణనీయంగా వడపోత పోయటానికి ప్రశ్నలను రూపొందించాల్సిన బాధ్యత ఇస్తే మీరేం చేస్తారు? ఈ నాలుగు అంశాల్లో శ్రద్ధ తీసుకుంటారు బహుశా.
1) సిలబస్‌ పరిధిలోనే ప్రశ్నలను తయారుచేస్తారు. దాంతో ఎవరూ అభ్యంతరాలతో ఫిర్యాదు చేయరు. 2) పరీక్ష తిరిగి రాసే ‘రిపీటర్లు’ ముందస్తు ప్రణాళిక ద్వారా లబ్ధి పొందకుండా ప్రశ్నల సమ్మేళనాన్ని మారుస్తారు. 3) కోచింగ్‌ సంస్థలు వూహించని రీతిలో ప్రశ్నలను రూపొందిస్తారు. 4) బట్టీ పట్టే జవాబులకు కాకుండా విశ్లేషణకు ప్రాముఖ్యం ఇచ్చేలా ప్రశ్నలను ఇస్తారు.
జూన్‌ 18న నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష కూడా ఈ నాలుగంశాల కలయికగా ఉంది. ప్రతి ఒక్కరూ ...ఆశావహులూ, రేపటి అభ్యర్థులూ, తల్లిదండ్రులూ, అధ్యాపకులూ అందరినీ ఈ ప్రశ్నల తీరు ఆశ్చర్యపరిచింది. సివిల్‌ సర్వీస్‌ పరీక్ష ప్రత్యేకతల్లో ఇదొక లక్షణం!

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలా?
సివిల్స్‌ ఆశావహుల మదిలో ఉన్న కొన్ని సందేహాలను ప్రస్తావించుకుని, వాటిని నివృత్తి చేసుకుందాం.
* వచ్చే సంవత్సరం కూడా పేపర్‌ ఈ తరహాలోనే వస్తుందా?
* ప్రతి సంవత్సరం అభ్యర్థులు అడిగే ప్రశ్నే ఇది. దీనికి జవాబు ‘లేదు’ అనే! ఒకసారి వచ్చిన పేపర్లు అదే రకంగా తర్వాతి సంవత్సరాల్లో ఉండవు. ప్రతి సంవత్సరం ప్రశ్నలు కష్టంగా తయారుచేయాలని సూచించిన అలఘ్‌ కమిటీ, రెండో పాలనా సంస్కరణల కమిషన్‌, నిగవేకర్‌ కమిటీల సిఫార్సులకు అనుగుణమైన తీరిది.
* కిందటి సంవత్సరం ప్రభుత్వ కార్యక్రమాలపై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఎందుకని అది పునరావృతం కాలేదు?
* వచ్చే ఏడాది రావొచ్చేమో! గుర్తుంచుకోండి- అభ్యర్థుల సంఖ్యను తగ్గించే క్లిష్టమైన కార్యం యూపీఎస్‌సీపై ఉంది. అందుకే పునరావృతాలు ఉండవు. అయినా సివిల్స్‌ అభ్యర్థి... ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే పరిజ్ఞానం, నైపుణ్యంతో ఉండాల్సిందే.
* ప్రిలిమ్స్‌ రాసిన నా స్నేహితులు ఏమని భావిస్తున్నారంటే... ‘ఇలాంటి పేపర్‌ వల్ల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి కీలక అంశాలను చదవటం సమయం వృథా అనిపిస్తోంది. కరంట్‌ అఫైర్స్‌ను అనుసరిస్తే సరిపోతుంది’ అని. ఇది సరైన అభిప్రాయమేనా?
* ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను నిర్లక్ష్యం చేసే పొరపాటును ఎప్పుడూ చేయొద్దు. అవి తగిన పునాదిని ఏర్పరుస్తాయి. ఈ కీలకాంశాలను అర్థం చేసుకుంటేనే వర్తమాన అంశాలను బోధపరుచుకోగలమనేది మర్చిపోకూడదు.
* సివిల్స్‌ పరీక్షకు శిక్షణ తీసుకోవటం అవసరమా? కొందరు కోచింగ్‌ ఉపయోగమంటుంటే, మరికొందరు ఆ తరగతుల వల్ల ఒరిగేది పెద్దగా ఉండదని అంటున్నారు...
* కోచింగ్‌ వల్ల ఉపయోగం ఎంత ఉంటుందన్నది ఎవరికి వారు వ్యక్తిగతంగా చెప్పాల్సిన అనుభవం. ఏ పోటీ పరీక్షకైనా శిక్షణ అనేది ప్రధానంగా ప్రాథమిక దశల్లో ఉపయోగకరం. అది చదువుకూ, పోటీ పరీక్షలకూ మధ్య వంతెన వేయటానికి సాయపడుతుంది. అంతకుమించి అభ్యర్థి కృషి మీదా, కొంత అదృష్టం మీదా కూడా విజయం ఆధారపడివుంటుంది.
* నమూనా పేపర్లకు జవాబులు రాయటం ఉపయోగమేనా?
* ఈ మోడల్‌ పేపర్ల సాధన కొంతవరకూ ఉపయోగకరం. మార్కెట్లో ఎన్నో మోడల్‌ పేపర్లు దొరుకుతున్నాయి. అవే ప్రశ్నలు ఎప్పుడూ రావు. ఒకవేళ ఏ ప్రశ్న అయినా పరీక్షలో కనపడితే అది కాకతాళీయం మాత్రమే.
* నేను సరిగా పరీక్ష రాయలేదనే భావనతో ఉన్నా. ఆశించిన కటాఫ్‌ కంటే నా మార్కులు బాగా కింద ఉన్నాయి. ఓ ప్రయత్నాన్ని వృథా చేసుకున్నాననిపిస్తోంది. ఏం చేయాలి నేను?
* పరీక్షపై గౌరవం ఉంచి మీ శక్తిమేరకు కృషిచేసివుంటే ఒక ప్రయత్నం వ్యర్థమయిందనే ఆలోచన రాదు. ఈ ధోరణి సరి కాదు కూడా. పోటీ పరీక్షలకు సన్నద్ధమవటం అనేది ఈత నేర్చుకోవటం లాంటిది. సూత్రాలెన్ని గ్రహించినా సరే... కొలనులోకి దూకకుండా మాత్రం ఎప్పటికీ ఈతను నేర్చుకోలేరు.
* ఈ పరీక్ష నుంచి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
* చిన్న మార్పులను ముందుగా గమనిస్తే అది పెద్ద మార్పులకు తగ్గట్టుగా మనల్ని సిద్ధం చేస్తుంది. 2015లో కరంట్‌ అఫైర్స్‌ నుంచి 15 ప్రశ్నలు వచ్చాయి. కానీ 2012, 2013లలో ఆ విభాగం నుంచి ప్రశ్నలు చాలా తక్కువ. 2016లో ఈ సంఖ్య 42కి పెరిగింది. కానీ 2017కు 32కి తగ్గిపోయింది. భవిష్యత్తులోనూ వర్తమాన అంశాలకు ప్రాముఖ్యం ఉంటుందని ఇది సూచిస్తోంది.

ఏం చేయాలి?
1. ప్రిలిమినరీ పరీక్ష రాసినవారు సమయాన్ని ఏమాత్రం వృథా చేసుకోకూడదు. మెయిన్స్‌కు సన్నద్ధతను వెంటనే ఆరంభించాలి. ఫలితం వచ్చేవరకూ ఆగాల్సిన అవసరం లేదు. అత్యవసరమైన పనులున్నా వారానికి మించి విరామం తీసుకోకూడదు.
2. ప్రిలిమ్స్‌కు ముందు ఆప్షనల్‌ చదవటం ఆపేసివుంటారు కాబట్టి దానికి సిద్ధమవటం మొదలుపెట్టాలి. విజేతల్లో ఎక్కువమంది ఆప్షనల్‌లో, మౌఖిక పరీక్షలో అధిక మార్కులు తెచ్చుకున్నవారేనని గమనించాలి. తర్వాత ఎథిక్స్‌ పేపర్‌పై శ్రద్ధ పెట్టాలి. వర్తమాన అంశాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ అవగాహన పెంచుకుంటూ ఉండాలి. ప్రిలిమినరీ ఫలితాలు వచ్చేలోపే ఆప్షనల్‌నూ, ఎథిక్స్‌నూ పూర్తిచేయాలి.
3. ఒకవేళ కటాఫ్‌ కంటే తక్కువ వస్తాయనీ, మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోవచ్చనీ అనిపించినా... నిరాశపడకూడదు. తొలి ప్రయత్నంలో నెగ్గలేకపోవటం చాలామందికి మామూలే. అందుకే సన్నద్ధతను కొనసాగించాలి.
4. ఎక్కడ పొరపాట్లు చేశారో సమీక్షించుకోండి. పరిజ్ఞానం లేకపోవడమా, అతి విశ్వాసమా, పరీక్ష కేంద్రంలో తడబడటమా... కారణాలేవో గమనించండి. చేసిన పొరపాట్లను చిత్తశుద్ధితో సరిచేసుకోండి.
5. ఏడాది సమయం ఉంది కదా అని ఉద్యోగంలో చేరదామనో, స్నేహితుల వ్యాపారంలో సాయం చేద్దామనో... ఇలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దు. ఇలాంటి వ్యాపకమేదైనా అది మీ లక్ష్యాన్నుంచి దారి మళ్ళిస్తుంది. అయినా చదవాల్సిందీ, అవగాహన పెంచుకోవాల్సిందీ ఎంతో ఉంటుంది. స్వల్పవ్యవధిలో ఏదైనా పని చేసి, తిరిగి సివిల్స్‌ సన్నద్ధత కొనసాగించవచ్చనే ఆలోచన ఆచరణీయం కాదు. అదంత సులువూ కాదు.
6. అర్హత ఉన్న ఇతర పరీక్షలన్నీ రాస్తుండాలి. సన్నద్ధత సరైన దారిలో కొనసాగేలా చేస్తుందిది. వచ్చే జూన్‌ వరకూ వేచివుండటం సులభతరమూ అవుతుంది. రాష్ట్రస్థాయి గ్రూప్‌-1, 2 పరీక్షలకు హాజరవ్వటం విలువైన అనుభవాన్ని అందిస్తుంది.


Back..

Posted on 26-06-2017