Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అర్హతపై అశ్రద్ధా?

సివిల్స్‌ పరీక్షలో ఎక్కువమంది జనరల్‌ స్టడీస్‌, ఆప్షనల్‌ల మీదనే దృష్టిపెడతారు. మాతృభాష (తెలుగు)లో తప్పనిసరి పరీక్ష ఉందన్న విషయాన్ని పక్కన పెడతారు. ‘పరీక్ష ముందు చూసుకుంటే చాలులే’ అనుకుంటారు. కానీ తప్పనిసరి పరీక్షను అశ్రద్ధ చేస్తే అర్హత కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంటున్నారు డా. ద్వా.నా. శాస్త్రి.

తెలుగులో అర్హత పరీక్షపై కొంతమందికి అతి నమ్మకం. ‘ఆ మాత్రం మార్కులు రావా?’ అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. ఈ అర్హత పరీక్ష పదోతరగతి తెలుగు స్థాయిలో ఉంటుంది. 8, 9, 10 తరగతుల్లో చదివిన అంశాల నుంచి ఎక్కువగా వస్తాయి. దీనిపై శ్రద్ధ ఎందుకవసరమంటే..
* సివిల్స్‌లో అభ్యర్థులు ఎక్కువమంది ఆంగ్లమాధ్యమంలో చదివిన వారుంటారు.
* తెలుగు రాయడమనే అలవాటు పూర్తిగా లేకపోవడమో, మర్చిపోవడమో జరిగే అవకాశముంది.
* ఆంగ్లం నుంచి తెలుగుకూ, తెలుగు నుంచి ఆంగ్లానికీ అనువాదం ఆషామాషీ కాదు- అభ్యాసం అవసరం.
* అర్హత పరీక్షకి ప్రత్యేకమైన మెటీరియల్‌ దొరకదు, శిక్షణా ఇవ్వరు. అందుకని ఎవరికివారు స్వయంగా అధ్యయనం, అభ్యాసం చేయవలసి ఉంటుంది.

తెలుగులో వ్యాసరచన (ఎస్సే రైటింగ్‌) ఉంటుంది. నాలుగు అంశాలను ఇచ్చి ఒక అంశంపై జనరల్‌ ఎస్సే వంటిది రాయమంటారు. దీన్ని 600 పదాల్లో రాయమంటారు. ఇన్ని పదాలు అన్నపుడు వాటిని లెక్కపెడుతూ కూర్చోకూడదు. ఉజ్జాయింపుగా ఓ పది, ఇరవై మాటలు అటోఇటోగా రాయవచ్చు. కానీ మరీ ఎక్కువ పదాలు లేదా మరీ తక్కువ పదాలు ఉండకూడదు. ప్రతి వ్యాసానికీ విషయ విభజన ముఖ్యం.
* ఇచ్చిన అంశంపై వివరణ ఉండాలి.
* స్వరూప స్వభావాలు, సమకాలీనత
* లోపాలు, వైఫల్యాలు ఉంటే చెప్పి సూచనలు ఇవ్వాలి.
* చివరగా ముగింపులో అభ్యర్థి పరిశీలన లేదా అవగాహన, సారాంశం ఉండాలి.

ప్రతికూల అంశాలకు ప్రాధాన్యం ఇస్తే సమర్థించగలిగి ఉండాలి. అయితే అనుకూల అంశాలను ఫోకస్‌ చెయ్యాలి. మంచీ- చెడూ విశ్లేషణ ఉన్నపుడే మార్కులు ఎక్కువ వస్తాయి. అంటే వ్యాసరచన.. అభ్యర్థి పరిజ్ఞానంతోపాటు అవగాహన, ప్రజెంటేషన్‌, స్వీయ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని తెలుసుకోవాలి.

ఒక విషయభాగం (పేరా) ఇచ్చి, దాని ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సామాన్యంగా అయిదు నుంచి ఆరు ప్రశ్నలు ఇస్తారు. మార్కులు బాగా ఎక్కువ (60). ఒక్కోసారి ఇచ్చిన ఖండికలోని కొన్నింటికి గీటు గీచి (అండర్‌లైన్‌) అర్థాలు రాయమని కూడా అడుగుతుంటారు
(ఉదా: ఉపేక్షించి= ఉదాసీనత వహించి, అశ్రద్ధ వల్ల; నియంత్రణ= నియమం, అడ్డగించు).

ఖండిక చదివి, అందులోనే సమాధానాలు వెలికితీయడం తేలికగా అనిపిస్తుంది. అయితే సమయం ఎక్కువ తీసుకుంటే ప్రయోజనం ఉండదు. అందుకని ఇచ్చిన భాగాన్ని నాలుగైదుసార్లు చదువుతూ సమాధానాలను గుర్తించాలి. ఇచ్చిన ఖండిక (పార్ట్‌)ను మూడో వంతు పరిమాణానికి తగ్గించడమన్నది మరో ప్రశ్న. ఇటువంటిదే ఆంగ్లంలోనూ ఉంటుంది. ఇలా తగ్గిస్తున్నప్పుడు అసలు విషయాన్ని వదలకూడదు. రెండు వాక్యాలను ఒక వాక్యంగా కుదించవచ్చు. జాతీయాలను వాడటం వల్ల కూడా తగ్గించవచ్చు.

అనువాదంపై రెండు ప్రశ్నలుంటాయి. ఆంగ్లం, తెలుగు భాషాలనుంచి పరస్పర అనువాదాలు చేయమంటారు. ఈ రెండు భాషల్లోనూ పరిజ్ఞానం ఉంటేనే సరిగ్గా అనువదించగలరు. అనువాదం యథాతథంగా మక్కీకిమక్కీగా ఉండకూడదు.
ఉదా: It is too hot to drink దీనికి ‘అది వేడిగా ఉంది తాగడానికి’ అనే అనువాదం సరైంది కాదు. ‘అది తాగలేనంత వేడిగా ఉంది’- ఇది సరైన అనువాదం. అనువాదంలో నుడికారాలు, జాతీయాలు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి.'Much ado about nothing' అన్నది యథాతథంగా తెలుగులోకి రాదు. ‘టీ కప్పులో తుపాను’, ‘ఏదీ లేనిదానికి రాద్ధాంతం’ వంటివి సరైన అనువాదాలవుతాయి. తెలుగు ఆప్షన్‌లో అనువాదంపై ప్రత్యేకమైన అధ్యాయం ఉంటుంది. కాబట్టి సరైన అవగాహన ఆ అభ్యర్థులకు ఉంటుంది.
చివరి ప్రశ్న- తెలుగు భాష సామర్థ్యాన్ని పరీక్షించేది. ఒక్కోసారి ప్రశ్నల తీరులో మార్పు కూడా గమనిస్తాం. సొంత వాక్యాల్లో ప్రయోగించమనడం సర్వసాధారణమైన ప్రశ్న. ఉదాహరణకు-

వానాకాలం చదువు: అంతంత మాత్రమే అని భావం.
‘ప్రభుత్వ పాఠశాలలో వానాకాలం చదువు ఎక్కువ’.
సమానార్థక పదాలపై ఒక ప్రశ్న ఇస్తారు. అర్థం ఒకటే కానీ పదాలు వేరు (సిననిమ్స్‌)
వెన్నెల- జ్యోత్స్న, చంద్రిక
ఆకాశం- గగనం, నింగి, అంబరం
ఒక్కోసారి వీటికి బదులుగా తప్పొప్పులపై ప్రశ్న ఇవ్వొచ్చు. ఒత్తులు ఉండవలసినవి లేకపోవడం, లేనిచోట ఒత్తులుండటం, శ-ష-సలను తారుమారు చేయడం, అందరూ వాడే తప్పును ఇచ్చి సరిదిద్దమనడం వంటివి.
వ్యతిరేక పదాలను రాయమని అడగడమూ ఉంది.

అదృష్టం * దురదృష్టం, ఆశ * నిరాశ
అప్పుడప్పుడూ పదాలకు అర్థాలను అడుగుతారు.
ఇటువంటి భాషా విషయాలకు తొమ్మిది, పది తరగతుల తెలుగు వాచకాలను చూడాలి. పాఠాల చివర ఇలాంటి అంశాలను ఇస్తారు. ఈ వాచకాల కోసం రాసిన గైడ్‌లలో సొంత వాక్యాల ప్రయోగాలుంటాయి. ఏదిఏమైనా లోగడ తెలుసుకున్నవే పూర్తిగా మరిచిపోయే స్థితి ఉంది కాబట్టి, నెలరోజులకు ముందే కొంత అభ్యాసం చేయవలసి ఉంటుంది. పూర్వ ప్రశ్నపత్రాల పరిశీలన తప్పనిసరి.

Posted on 11-9-2017

Back..