Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సివిల్స్‌ వయా గ్రూప్స్‌

రెండు పడవలపై కాళ్లెందుకు.. ఒక లక్ష్యానికే గురిపెట్టి సరిపెట్టుకుందాం అనుకుంటారు చాలామంది. అలా నిరాశపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు నిర్వహించే గ్రూప్‌-1 ని టార్గెట్‌ చేసుకుంటే సివిల్స్‌ కూడా సాధించొచ్చని చెబుతున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ కొత్త సిలబస్‌ సివిల్స్‌కి దగ్గరగా ఉండటమే అందుకు కారణం.

ఐఏఎస్‌ సాధించాలనే ఏకైక లక్ష్యం ఉన్నవారు గమనించాల్సింది...ఆశావహుల్లో 0.05 శాతం మంది మాత్రమే ఐఏఎస్‌ను పొందగలుగుతున్నారు. 0.2 శాతం మంది మాత్రమే సివిల్స్‌ తుది జాబితాలో ఉంటున్నారు. 2015 నుంచీ సివిల్స్‌ ప్రశ్నపత్రం అంచనాలకు అందకుండా తయారవుతోంది. దీంతో 2.85 శాతం మంది మాత్రమే ప్రిలిమ్స్‌ను నెగ్గగలుగుతున్నారు. ఈ అనిశ్చితి వల్ల నష్టపోకుండా ఉండటానికి ఇతర ప్రభుత్వ పరీక్షలపై... ముఖ్యంగా గ్రూప్‌-1పై కూడా దృష్టి పెట్టటం ఆచరణీయం. గ్రూప్‌-1 సర్వీస్‌కూ, సివిల్‌ సర్వీస్‌కూ హోదా పరంగా చాలా తేడా ఉంది, నిజమే. అయితే గ్రూప్‌-1లోని ముఖ్యమైన డిప్యూటీ కలెక్టర్‌/ డీఎస్‌పీ పోస్టుల్లో చేరితే సగటున పదేళ్లలో కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌/ఐపీఎస్‌ అవ్వొచ్చు. గ్రూప్‌-1 ద్వారా సొంత రాష్ట్రంలో విధులు నిర్వహించవచ్చు.

గ్రూప్స్‌ రాయాలనుకుంటే సివిల్స్‌కు అవసరమైన ఏకాగ్రత దెబ్బతింటుందేమోనని కొందరు అనుమానిస్తుంటారు. నిజానికి గ్రూప్స్‌ కోసం చదవటం సివిల్స్‌ సన్నద్ధతను బలోపేతం చేస్తుంది. రెండు పరీక్షలకూ సిలబస్‌ చాలావరకూ ఒకే రకం. రాష్ట్రానికి సంబంధించిన నిర్దిష్ట అదనపు అంశాలతో స్టేట్‌ సిలబస్‌ ఉంటుంది. అవి అవగాహన చేసుకోలేనంత కష్టమైనవీ కావు.

అనుసంధానం ఎలా?
రెండు పరీక్షల సిలబస్‌లను పోల్చి, సివిల్స్‌ అభ్యర్థులు రెండు పరీక్షల కోసం ఉమ్మడి సన్నద్ధత ఎలా సాగించాలో పరిశీలిద్దాం. సివిల్స్‌ పేపర్‌-1లో సోషల్‌ జస్టిస్‌, ఇండియాస్‌ ఫారిన్‌ పాలసీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీలు లేవు. ఇవి గ్రూప్‌-1లో ఉన్నాయి.

కరంట్‌ అఫైర్స్‌: రెండు పరీక్షల్లోనూ జాతీయ అంతర్జాతీయ అంశాలు ఉమ్మడిగా ఉన్నాయి. అయితే ప్రాంతీయ స్థాయి అంశాలపై అదనంగా దృష్టిపెట్టాలి.
ఏం చేయాలి: గత ఏడాది నుంచి స్థూలంగానూ, జనవరి 2019 నుంచి నిర్దిష్టంగానూ (స్పెసిఫిక్‌) ప్రాంతీయ వర్తమాన అంశాలు గమనించాలి. సాధారణంగా ఈ ప్రశ్నలు నేరుగానే ఉంటాయి. జాతీయ ఆంగ్ల దినపత్రికల్లో మొదటిపేజీలో వచ్చే వార్తలు ఇలాంటివాటికి ఆధారంగా ఉంటాయి.

హిస్టరీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌: సిలబస్‌ రెండు పరీక్షలకూ ఒకటే అయినప్పటికీ సివిల్స్‌తో పోలిస్తే అదనంగానే ఉంది. గ్రూప్‌-1 సిలబస్‌లో నిర్దిష్ట అంశాలనూ, ప్రశ్నల సంఖ్యనూ పేర్కొన్నారు.
ఏం చేయాలి: మహాత్మాగాంధీ, ఆయన భావాలు, సర్దార్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, డా. అంబేడ్కర్‌ల ప్రాధాన్యంపై దృష్టిపెట్టాలి. 1947తో ముగించకుండా కనీసం 1956 వరకు చరిత్రను అధ్యయనం చేయాలి.

ఇండియన్‌ పాలిటీ, గవర్నెన్స్‌: సిలబస్‌ దాదాపు ఒకటే. ఏపీ సిలబస్‌ను సివిల్స్‌ నుంచి తీసుకున్నదే.
ఏం చేయాలి: అన్ని అంశాలనూ చదవాల్సిందే. ఫెడరల్‌ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, సవాళ్లపై దృష్టిపెట్టాలి. రాష్ట్ర నిర్దిష్ట అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హక్కుల చట్టాలకు సంబంధించిన అన్ని అంశాలూ చదవాలి.

సోషల్‌ జస్టిస్‌: సివిల్స్‌ ప్రిలిమినరీలో దీన్ని ప్రస్తావించలేదు. గ్రూప్‌-1 సిలబస్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఏం చేయాలి: సివిల్స్‌ మెయిన్స్‌ పేపర్‌-3లో ఉన్న సోషల్‌ జస్టిస్‌లోని అంశాలన్నీ చదవాలి.

ఇండియన్‌ ఫారిన్‌ పాలసీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌: సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో నిర్దిష్టంగా ఇది లేదు. అయితే జనరల్‌ నాలెడ్జ్‌- కరంట్‌ అఫైర్స్‌ కింద ప్రశ్నలు రావొచ్చు.
ఏం చేయాలి: గ్రూప్స్‌లో నిర్దిష్టంగా ప్రస్తావించినందున సివిల్స్‌ మెయిన్స్‌ పేపర్‌-3లో ఉన్న ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ను సంపూర్ణంగా చదవాలి.

ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌: చాలా అంశాలు ఉమ్మడివే. సివిల్‌్్సతో పోలిస్తే గ్రూప్స్‌లో తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ నిర్దిష్టంగా ఉంది.
ఏం చేయాలి: సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు సాధారణంగా చదివేవాటిని పూర్తిచేస్తే చాలు. ప్రాథమికాంశాల (బేసిక్స్‌)ను కేంద్రప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టిపెడుతూ చదవాలి. జాతీయ ఆదాయం, భారతీయ వ్యవసాయ, ఆర్థిక సంస్థలకు ప్రాధాన్యమిచ్చి చదవాలి.

ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ: సివిల్స్‌ సిలబస్‌లో లేదు. ఇది గణాంకాలకు ప్రాముఖ్యమున్న అంశం.
ఏం చేయాలి: అదనంగా చదవాల్సిందే. రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌, గత కొద్ది సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రచురించిన శ్వేతపత్రాలు ప్రధానమైనవి. తాజా శ్వేతపత్రాలు ముఖ్యం. సివిల్స్‌ సిలబస్‌ను పూర్తిచేసి ప్రాంతీయ సమాచారంపై దృష్టి సారించాలి.

ఇండియా, వరల్డ్‌ జాగ్రఫీ: రాష్ట్ర జాగ్రఫీని గ్రూప్స్‌లో ప్రస్తావించారు. గణాంకాలతో సంబంధముండే ఈ అంశం సివిల్స్‌ అభ్యర్థులకు అదనమే.
ఏం చేయాలి: జనరల్‌, ఫిజికల్‌, సోషియో ఎకనామిక్‌ జాగ్రఫీ అంశాలకు సమాన ప్రాముఖ్యం ఇవ్వాలి. సివిల్స్‌ సిలబస్‌ను పూర్తిచేసి ప్రాంతీయ సమాచారంపై జాగ్రత్తగా దృష్టి సారించాలి.

జనరల్‌ సైన్స్‌: ఇది గ్రూప్‌-1 పేపర్‌-2లో ఉంది. సిలబస్‌ దాదాపు సమానమే. సివిల్స్‌ సిలబస్‌ ఆచరణ కోణాన్ని ప్రస్తావిస్తే... గ్రూప్‌-1 సిలబస్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రాముఖ్యమిచ్చింది.
ఏం చేయాలి: సివిల్స్‌ మెయిన్స్‌లో ఉన్న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సంబంధిత అంశాలన్నీ చదవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లోని ఆచరణ కోణంపై దృష్టి పెట్టాలి.

ఎన్విరాన్‌మెంటల్‌ ఎకాలజీ: విద్యాపరంగానే కాకుండా సామాజికంగానూ చాలా ప్రాధాన్యమున్న అంశమిది. సిలబస్‌ దాదాపు సమానమే. గ్రూప్‌-1 సిలబస్‌ మరింత నిర్దిష్టంగా ఉంది. ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. రాష్ట్రంలోని పర్యావరణ అంశాలపై కూడా ప్రశ్నలు రావొచ్చు.
ఏం చేయాలి: సివిల్స్‌ సిలబస్‌ను పూర్తి చేయాలి. దాంతోపాటు ప్రాంతీయ అంశాలపై దృష్టి సారించాలి.

- వి. గోపాలకృష్ణ, డైరెక్టర్‌, బ్రెయిన్‌ ట్రీ

ఇవీ ప్రయోజనాలు
సివిల్స్‌ ఆశావహులు రాష్ట్రస్థాయి సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు కూడా రాస్తే కలిగే ఉపయోగాలు:
1) సమయ నిర్వహణ ప్రాముఖ్యం తెలుస్తుంది.
2) పరిజ్ఞానం సంపాదించి దాన్ని ఏ పరీక్షలోనైనా నెగ్గేలా సమర్థంగా వినియోగించగలుగుతారు.
3) ఏ పొరపాట్లు చేయగలమో, చేయకూడదో తెలుస్తుంది.
4) ముఖ్యంగా కోచింగ్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా క్రమశిక్షణతో స్వీయ ప్రయత్నం చేయటం అలవడుతుంది.
ఇవన్నీ అనుభవపూర్వకంగా గ్రహిస్తే సివిల్స్‌లో 60 శాతం విజయానికి దగ్గరైనట్లే!
సివిల్స్‌లోనూ, గ్రూప్‌-1లోనూ మొదట రాసేది ప్రిలిమినరీ పరీక్ష. సివిల్స్‌లో పేపర్‌-2 అర్హత కోసం మాత్రమే. దానికి విద్యార్థులు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వరు. కానీ గ్రూప్‌-1లో మాత్రం పేపర్‌-2 మార్కులను మెయిన్స్‌కు ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకుంటారు. పైగా ఇది పేపర్‌-1 కంటే ఎక్కువ స్కోరింగ్‌కు అవకాశమున్నది. కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సివుంటుంది.

సివిల్స్‌ పేపర్‌-2
* కాంప్రహెన్షన్‌ గానీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ గానీ గ్రూప్‌-1లో లేదు.
* ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ రెండు పరీక్షల సిలబస్‌లలోనూ ఉన్నాయి. అయితే గత కొద్ది సంవత్సరాలుగా సివిల్స్‌లో దీనిపై ప్రశ్నలేమీ రావటం లేదు. 2010 నుంచి 2013 వరకు సివిల్స్‌ సీశాట్‌ పరీక్షలో ఉన్న ప్రశ్నలను చూసుకుంటే మేలు.
లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ: రెండు పరీక్షల్లోనూ ఉన్నాయి. అయితే గ్రూప్‌-1 సిలబస్‌లో ఎక్కువ నిర్దిష్టం. ప్రశ్నలు తేలిగ్గా వచ్చే అవకాశముంది.
జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ: రెండిట్లోనూ ఉన్న అంశం. గ్రూప్‌-1లో నిర్దిష్టంగా ఇచ్చారు. ప్రశ్నలు సులువుగా రావొచ్చు. నిర్దిష్టంగా ఉన్న అంశాలను గుర్తించి, అధ్యయనం చేయాలి.
బేసిక్‌ న్యూమరసీ: గ్రూప్‌-1లో ఇదే పేరుతో ప్రస్తావించలేదు. కానీ రెండు పరీక్షల్లోనూ ఇది ఉమ్మడి అంశంగానే ఉంది.


Back..

Posted on 30-01-2019