Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పౌరసేవకు..అటవీ సర్వీసుకు..

* సివిల్స్‌ + ఐఎఫ్‌ఎస్‌
* సన్నద్ధత వ్యూహం ఒకటే

రెండు అత్యున్నత సర్వీసుల పరీక్షలకు సన్నద్ధత ఒకచోట నుంచే మొదలవుతుంది. సరైన వ్యూహంతో సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏ దశలో ఏం చదవాలో నిర్ణయించుకోవడం.. దాన్ని అమలు చేయడంలోనే అందరు అభ్యర్థుల నుంచి విజేతలు వేరవుతారు. రెండు పడవలపై కాళ్లు పెట్టవద్దనేది పాత సామెత. కానీ ఇక్కడ రెండు పరీక్షలకూ హాజరవడమే కాదు మూడో ఎగ్జామ్‌పై కూడా దృష్టిపెట్టమంటున్నారు నిపుణులు.
పోటీ పరీక్షల్లో గెలవటమనేది ‘పాప్‌కార్న్‌’ తయారీ ప్రక్రియలాంటిదే! పాప్‌కార్న్‌ యంత్రాన్ని మీరెప్పుడైనా గమనించారా? అందులో వేసిన విత్తులు వేడెక్కటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆపై అకస్మాత్తుగా ఒక కార్న్‌ పేలి, చిట్లుతుంది. అంతే...వరసగా అన్నీ వేగంగా పేలుతూ పాప్‌కార్న్‌ తయారవుతుంది. యూపీఎస్‌సీ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పోటీపరీక్షల్లో విజయం కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తుంది. ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు కొంత సమయం తీసుకుంటుంది. ఇక అలాంటి గెలుపే ఇతర పరీక్షల్లోనూ పునరావృతమవుతుంటుంది. నిర్విరామంగా చేసిన సాధన... అభ్యర్థిని సాన పెట్టటమే దీనికి కారణం!
పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య ఈసారి పెరుగుతుందని అంచనా. దాదాపు 4 లక్షల మంది రాయవచ్చు కాబట్టి ప్రిలిమ్స్‌లో పోటీ తీవ్రంగా ఉంటుంది. 4 లక్షల నుంచి 12 వేలమంది అంటే... కేవలం 3 శాతం మందే మెయిన్స్‌కి ఎంపికవుతారని గ్రహించాలి. పోటీ ఆ స్థాయిలో ఉంటుంది.

పరీక్ష ఎలా ఉంటుంది?
ప్రిలిమినరీలో రెండు పేపర్లుంటాయి. జనరల్‌స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌స్టడీస్‌ పేపర్‌-2. అర్హత పరీక్ష అయిన పేపర్‌-2లో కనీసం 33 శాతం (67 మార్కులు) తెచ్చుకుంటేనే పేపర్‌-1ను మూల్యాంకనం చేస్తారు.
* ప్రిలిమ్స్‌ సిలబస్‌ను యూపీఎస్‌సీ స్పష్టంగా ఇచ్చింది. హిస్టరీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌, ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌, జనరల్‌ సైన్స్‌, ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, ఇండియన్‌ అండ్‌ వరల్డ్‌ జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంటల్‌ ఎకాలజీ, కరంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌... ఉంటాయి. అయితే సిలబస్‌ చాలా విస్తృతం. ఏ అంశన్నైనా ప్రశ్నలుగా అడగవచ్చు.
* దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అభ్యర్థి స్పందన తీరు, ప్రభుత్వ దృక్కోణంపై అవగాహనలను పరీక్షిస్తారు.
* వివాదానికి తావు లేని జవాబులుండే ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతి కాబట్టి ఆధికారిక సమాచారంపై ఆధారపడిన వాస్తవాలపై మాత్రమే ప్రశ్నలుంటాయి. అంటే ఎన్‌సీఈఆర్‌టీ లాంటి ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, ప్రభుత్వ వెబ్‌సైట్లపై నుంచి ప్రశ్నలుంటాయి.
* వర్తమాన అంశాలపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. కరంట్‌ అఫైర్స్‌లో కూడా ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు అధిక ప్రాముఖ్యం ఇవ్వాల్సివుంటుంది.
* ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రభుత్వ పథకాల సమాచారం పరీక్షల కోణంలో ముఖ్యం.

ఇవి గమనించండి
దరఖాస్తును వీలైనంత త్వరగా పంపించటం మంచిది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు పరిమిత సీట్ల సామర్థ్యమే ఉంది. ఆలస్యంగా దరఖాస్తు చేస్తే కోరుకున్న సెంటర్‌ దొరక్కపోవచ్చు.
* మొదటిసారి రాసేవారు తాము ఎంచుకునే ఆప్షనల్‌ విషయంలో స్పష్టతతో ఉండాలి. ఒకసారి ఎంచుకున్న తర్వాత మార్చుకోవటానికి వీలుండదు. నిర్ణయానికి ముందు సీనియర్లనూ, ఈరంగంలో నిపుణులైన విద్యావేత్తలనూ సంప్రదించటం మేలు.
* ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను వినియోగించుకోదల్చినవారు ఈ కేటగిరీకి తాము అర్హులమో కాదో నిర్ధారించుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత మార్పు చేయటానికి అవకాశం ఉండదు.
* దరఖాస్తు కాపీనీ, కేటాయించిన నంబరునూ దగ్గరుంచుకోవాలి. తర్వాతి కాలంలో వాటి అవసరం ఉంటుంది.
ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూసీ) 10 శాతం రిజర్వేషన్‌ను తొలిసారి ఈ నోటిఫికేషన్‌నుంచే అమలు చేస్తున్నారు.

గ్రూప్స్‌ రాస్తుంటే..
ఈ ఏడాది రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల నుంచి చాలా నియామక ప్రకటనలు వస్తున్నాయి. వాటికి సివిల్స్‌ అభ్యర్థి హాజరవ్వాలా లేదా అనే ఊగిసలాట చాలామందిలో ఉంది. అనుభవజ్ఞులు నిర్ద్వంద్వంగా చెప్పేదేమిటంటే... ఈ పరీక్షలన్నీ రాయటం చాలా మంచిదని. సిలబస్‌ దాదాపు ఒకేరకంగా ఉన్న పోటీపరీక్షలు రాయటం వల్ల ‘రియల్‌టైమ్‌’ అనుభవం వస్తుంది. పరీక్షలంటే ఉన్న బెరుకు పోతుంది. సమయపాలన అర్థమవుతుంది.
* యూపీఎస్‌సీ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ల సిలబస్‌లో ఉమ్మడి అంశాలు చాలా ఉంటాయి. వాటిని గుర్తించి, వాటికి సిద్ధం కావాలి. ‌
* ఉమ్మడి అంశాల్లో కూడా వర్తమాన అంశాలు అధికంగా ఉండటం గమనించవచ్చు. అందుకే ఈ కరంట్‌ అఫైర్స్‌పై అదనంగా దృష్టిపెట్టాలి. ‌
* ఉమ్మడి అంశాలు పూర్తయ్యాక పరీక్ష తేదీలను బట్టి ప్రాంతీయ అంశాలపై సిద్ధం కావాలి. ఉదాహరణకు... సివిల్స్‌ ప్రిపరేషన్‌కు 8 గంటలు కేటాయించుకుంటే... మరో గంట ప్రాంతీయ అంశాలకు కేటాయించి చదవాలి. ‌
* సివిల్స్‌ నమూనా ప్రశ్నపత్రాలకు తోడు కొన్ని స్టేట్‌ సర్వీస్‌ పరీక్షల పేపర్లు కూడా సాధన చేయాలి. ఇలా రెండు రకాల పరీక్షలకూ తయారవ్వొచ్చు. ఒకరకంగా ఇది ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్టు!
ఈ ఏడాది సివిల్‌ సర్వీసుల్లో ఖాళీలు 896. కిందటి సంవత్సరం కన్నా ఇవి 114 ఎక్కువ.

మార్చి నుంచి ఇలా చదవండి...
మార్చి 1 నుంచి మార్చి 31: మెయిన్స్‌లో మాత్రమే ఉండే ఆప్షనల్‌లాంటివి చదవటం మానేయాలి. ఇతర అంశాలన్నిటినీ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ దృక్కోణంలో చదవాలి. పేపర్‌-2లో బలహీనంగా ఉన్నవారు మార్చి నుంచి ప్రశ్నల సాధన మొదలుపెట్టాలి.
ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 30: జనవరి 1, 2018 నుంచి ఇప్పటివరకూ కరంట్‌ అఫైర్స్‌ను కవర్‌ చేయాలి. 2018 జూన్‌ వరకూ ముఖ్యమైనవి స్థూలంగా చూస్తే చాలు. జులై 1,. 2018నుంచి ఏప్రిల్‌ 2019 వరకూ సవివరంగా చదవాలి. డిసెంబరు 2018 నుంచి ఉన్న వర్తమాన అంశాలను అత్యధిక శ్రద్ధతో గమనించి పట్టు పెంచుకోవాలి.
మే 1 నుంచి మే 25: ప్రాక్టీసు పేపర్లకు జవాబివ్వటం ఆరంభించాలి. ఆ పేపర్లు సమగ్రంగా అన్ని అంశాలూ కవరయ్యేవిగా, యూపీఎస్‌సీ స్థాయిలో ఉండాలి. వీలైతే పరీక్షా పరిస్థితులను ఏర్పాటు చేసుకొని రాయడం మంచిది. ఎవరైనా మాక్‌ టెస్ట్‌లు నిర్వహిస్తే హాజరుకావచ్చు.
తర్వాత ప్రతి ప్రశ్నకూ ఎలా జవాబిచ్చామో విశ్లేషించుకోవాలి. ఒక ప్రశ్నకు సరైన సమాధానం రాసినప్పటికీ దానికి సంబంధమున్న అంశాల అధ్యయనాన్ని విడిచిపెట్టకూడదు. తప్పుగా రాస్తే... అలా ఎందుకు జరిగిందో గమనించి, సంబంధిత అంశాలు చదవాలి. వాటిపై ఏ ప్రశ్నలు రావొచ్చో ఆలోచించాలి. ఈ రకంగా తయారైతే అసలు పరీక్షను విజయవంతంగా రాసేయవచ్చు.
పోస్టుల సంఖ్యకు సుమారు 13 రెట్లు...అంటే ప్రిలిమ్స్‌ ద్వారా 12000 లోపు అభ్యర్థులను ఈసారి మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.

ఐఎఫ్‌ఎస్‌ సంగతేమిటి?
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) పరీక్షపై అభ్యర్థుల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అంతే కాదు; తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షలో విజయం సాధిస్తున్నవారి సంఖ్య కూడా వృద్ధి చెందుతోంది. ఐఎఫ్‌ఎస్‌ అఖిలభారత సర్వీసే కాబట్టి దీనిక్కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌ మాదిరే అన్ని రకాల సదుపాయాలూ ఉంటాయి. సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షనే 2013 నుంచీ ఈ రెండు పరీక్షల వడపోత పరీక్షగా చేశారు. ఐఎఫ్‌ఎస్‌కు అర్హత ఉన్న అభ్యర్థులందరూ రెండు పరీక్షలకూ ప్రయత్నించటం మేలు.
* మెయిన్‌ పరీక్షలో ఐఎఫ్‌ఎస్‌కు రెండు ఆప్షన్లుంటే సివిల్స్‌కు మాత్రం ఒకే ఆప్షనల్‌ ఉంటుంది. సివిల్స్‌కు నిర్ణయించుకున్న ఆప్షనల్‌నే ఐఎఫ్‌ఎస్‌ రెండు ఆప్షనల్స్‌లో ఒకటిగా ఎంచుకుంటే సన్నద్ధతకు పట్టే సమయం ఆదా చేసుకోవచ్చు.
* సివిల్స్‌ రాసేవారి సంఖ్య కంటే ఐఎఫ్‌ఎస్‌ రాసేవారి సంఖ్య చాలా తక్కువ. అయితే ఐఎఫ్‌ఎస్‌లో ఖాళీల సంఖ్య కూడా తక్కువే.

సివిల్స్‌ కటాఫ్‌ కంటే ఎక్కువే!
పోస్టుల సంఖ్య తక్కువ (90) ఉండటం వల్ల ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే కనీస మార్కులు ఎక్కువే తెచ్చుకోవాలి. ఇవి సివిల్స్‌ కటాఫ్‌ కంటే ఎక్కువే. ‌్ర 2017 పరిస్థితిని గమనిస్తే... జనరల్‌ కేటగిరిలో సివిల్స్‌కు 105.34 మార్కులు, ఐఎఫ్‌ఎస్‌కు 121.34 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఓబీసీ కేటగిరిలో ఇది వరసగా 102.66; 119.34గా ఉంది. ఎస్‌సీ కేటగిరిలో సివిల్స్‌కు 88.6 మార్కులు, ఐఎఫ్‌ఎస్‌కు 106 మార్కులను కటాఫ్‌గా తీసుకున్నారు. ఎస్‌టీ విభాగంలో వరసగా 88.6, 105.34 మార్కులుగా ఉన్నాయి.
* ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే... ఈ పరీక్షకు అధిక ప్రాధాన్యం ఇచ్చి సన్నద్ధమవ్వాలి. ఇలా ఎక్కువ మార్కులు లక్ష్యంగా పెట్టుకుని చదివితే అది సివిల్స్‌కు కూడా ప్రయోజనకరమే.
* ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్ష సివిల్స్‌ పరీక్ష కంటే కొద్ది వారాల ముందు జరుగుతుంది. ఈ పరీక్షకు హాజరవటమంటే... అది ‘రియల్‌ టైమ్‌ ప్రాక్టీస్‌’గా మారి సివిల్స్‌ పరీక్షకు కూడా ప్రయోజనం కల్పిస్తుంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఐఎఫ్‌ఎస్‌లో విజేతలైన చాలామంది అభ్యర్థులు ఈ ఏడాది సివిల్స్‌ ఇంటర్‌వ్యూకు కూడా హాజరవుతున్నారు.

- వి. గోపాలకృష్ణ, డైరెక్టర్‌, బ్రెయిన్‌ ట్రీ


Back..

Posted on 26-02-2019