Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మౌఖిక వ్యూహం!

* సివిల్స్‌లో తుది ఘట్టానికి మెలకువలు

సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రధాన పరీక్ష (మెయిన్స్‌)లో అర్హత సాధించినవారు పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)ను త్వరలో ఎదుర్కొనబోతున్నారు. అభ్యర్థి ప్రవర్తన, తీరు, విలువ ఆధారిత అంశాలను అంచనా వేసేలా ఇంటర్వ్యూ బోర్డు ప్రశ్నలను అడుగుతోంది. మౌఖిక పరీక్ష పద్ధతినీ, మెలకువలనూ తెలుసుకుని తగ్గట్టుగా తయారైతే.. అత్యుత్తమ సర్వీసును సొంతం చేసుకున్నట్టే!

సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియలో పర్సనాలిటీ టెస్ట్‌ చివరి దశ. మెయిన్స్‌లో అర్హత సాధించినవారిలో 40%కుపైగా అభ్యర్థులను దీనికి ఎంపికవుతుంటారు. మిగిలినవారు మళ్లీ సర్వీస్‌ సాధించాలంటే.. తిరిగి ప్రారంభం నుంచి మొదలుపెట్టాల్సిందే. వైకుంఠపాళిలో పాము-నిచ్చెన లాంటి ఈ ఎంపిక ప్రక్రియలో నిశ్చయంగా విజేతగా నిలవాలంటే.. ఇంటర్వ్యూలో గరిష్ఠ మార్కుల సాధనపై దృష్టి పెట్టాలి.

సివిల్‌ సర్వీసెస్‌ మౌఖిక పరీక్షలో అడిగే అంశాలను స్థూలంగా చెప్పాలంటే... అభ్యర్థి ప్రాథమిక వివరాలు, నేపథ్యం, వర్తమాన అంశాలపై అతడి/ఆమె అవగాహన. ఈ ప్రశ్నలను ఆరు విభాగాలుగా విభజించుకోవాలి. అపుడే సన్నద్ధతకు సరైన ప్రణాళిక వేసుకున్నట్లు అవుతుంది.

1) వ్యక్తిగతం: అభ్యర్థి పేరు, తన జిల్లా/ గ్రామం, అక్కడి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు సంబంధించినవి ఇందులోకి వస్తాయి. ప్రభుత్వ సర్వీసునే కెరియర్‌గా ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నలనూ అడగొచ్చు.

ఉదా: సాయి చరణ్‌ తేజస్వి.. ఐపీఎస్‌గా ఎంపికైన అభ్యర్థి. సివిల్స్‌ ఇంటర్వ్యూలో అతను ఎదుర్కొన్న మొదటి ప్రశ్న- ‘మీ పేరులో మూడు పేర్లు కలిసున్నాయి. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మేం ఏమని పిలవాలని ఆశిస్తున్నారు?’ అని. మిమ్మల్ని కూడా ఇలాగే మీ పేరుకున్న అర్థం, ఇంకెవరైనా ఇదే పేరున్నవారున్నారా అని అడగవచ్చు

2) విద్యా సంబంధం: ప్రాథమిక విద్యార్హతలకు సంబంధించినది. విద్యాభ్యాసానికీ, ఇంటర్వ్యూకీ మధ్య చాలా విరామం ఉన్నప్పటికీ గ్రాడ్యుయేషన్‌ కోర్‌ అంశాలను చదువుకుని ఉండటం మంచిది. ఆప్షనల్‌ను తమ రంగానికి సంబంధించింది కాకుండా వేరేదాన్ని ఎంచుకున్నవారు తమ విద్యకు సంబంధించిన అంశాలకు బాగా సిద్ధమై ఉండాలి. అంతేకాకుండా మంచి అర్హతలుండి, ప్రముఖ విద్యాసంస్థల నుంచి డిగ్రీ పూర్తిచేసినా.. ‘సివిల్‌ సర్వీసెస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు? ఇది ప్రతిభకు అన్యాయం చేసినట్లు కాదా?’ అనే ప్రశ్నలను ఎదుర్కొనే అవకాశముంది.

3) ఐచ్ఛికం (ఆప్షనల్‌): ఆప్షనల్‌ పరిజ్ఞానాన్ని అభ్యర్థి ఇప్పటికే మెయిన్స్‌లో నిరూపించుకుని ఉంటాడు. కాబట్టి, సాధారణంగా దీనిలో లోతైన ప్రశ్నలు అడగరు. కానీ ఆప్షనల్‌ ఎంపికపై ప్రాథమిక ప్రశ్నలను ఆశించవచ్చు. ఉదా: గత ఏడాది ఇంటర్వ్యూలో ఓ అభ్యర్థినిని ఆంత్రపాలజీని ఆప్షనల్‌గా ఎందుకు ఎంచుకున్నారని అడిగారు. దానికి ఆమె.. ‘సైన్స్‌, హ్యూమానిటీస్‌ల సమ్మేళనం కాబట్టి, ఆంత్రపాలజీని ఎంచుకున్నా’ అని సమాధానమిచ్చారు.

4) వర్తమాన అంశాలు: స్థానిక, జాతీయ, అంతర్జాతీయ విషయాలన్నీ దీనికిందకే వస్తాయి. వివిధ పత్రికల ఎడిటోరియల్స్‌ చదివి, వాటి ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు. మీ భావాలను వాస్తవాలతో ప్రమాణీకరించుకునేలా సిద్ధమవ్వాలి.

5) హాబీలు: ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారని ఇంటర్వ్యూ బోర్డు అడిగే అవకాశముంది. ఏ వ్యాపకమూ లేకపోతే నిజాయతీగా చెప్పండి. ఒకవేళ ఉంటే ఆ హాబీలపై కొన్ని ప్రాథమిక ప్రశ్నలకైనా సంసిద్ధమై ఉండాలి.

6) పని అనుభవం: గతంలో పని చేసి ఉన్నా, పని చేస్తూ ఉన్నా ఆ రంగానికి సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. వాటికి తయారుగా ఉండాలి. అలాగే మీ రంగంలో నైపుణ్యం సమాజానికి ఏవిధంగా సాయపడుతుందో కూడా చెప్పగలగాలి.

ఏం చేయాలి?
* అందుకున్న సమ్మరీ షీట్‌ను పూర్తిచేయాలి. నిపుణుల సలహాతో పూర్తిచేస్తే ఇంకా మంచిది. మరీ ఎక్కువ సంఖ్యలో ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ ఆక్టివిటీస్, ఎక్కడా లేని వ్యాపకాలు నమోదు చేస్తే వ్యతిరేక అభిప్రాయం ఏర్పడవచ్చు.
* యూపీఎస్‌సీకి సమర్పించిన సమాచారాన్ని పక్కన పెట్టుకుని, దాని ఆధారంగా ఏ ప్రశ్నలను అడిగే వీలుందో అంచనా వేసుకోవాలి. ఒకవేళ మీవల్ల కాకపోతే సీనియర్ల సాయం తీసుకోవచ్చు.
* ప్రశ్నలు, వాటి సమాధానాలను రాసిపెట్టుకోవాలి. ప్రశ్నలకు ఎలా సమాధానాలను చెప్పాలో ఆలోచించుకోవడం కాదు, వాటిని రాయడం ప్రధానం. రాయడం ద్వారానే స్పష్టత వస్తుంది. రాస్తున్నపుడు దానిలో ఏ మార్పులు అవసరమన్నదీ అర్థమవుతుంది. మీ సమాధానం మీకే ఎన్నిసార్లు నచ్చట్లేదో అర్థమవుతుంది. అలాంటిది సన్నద్ధతేమీ లేకుండా నేరుగా వెళితే ఇంటర్వ్యూయర్‌కు ఎలా అనిపిస్తుందో మీరే ఊహంచుకోవచ్చు.
* నమూనా ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి. ఫీడ్‌బ్యాక్‌ నమోదు చేసుకోవాలి. ఇంటర్వ్యూ నిర్వహించినవారు సూచించిన అంశాలను మెరుగుపరుచుకుని మళ్లీ వారి దగ్గరకే ఇంటర్వ్యూకు వెళ్లాలి. మెరుగుదల ఉందో లేదో గమనించుకోవాలి.
* ఒకే అంశంపై వివిధ వార్తాపత్రికల ఎడిటోరియళ్లను చదవాలి. మేగజీన్లలో వారానికోసారి వచ్చే కథనాలను చదవాలి. ఆ ఆర్టికల్స్‌లో ఏ అంశమైనా సమగ్రంగా ఉండే అవకాశం ఉంది.

ఏం చేయొద్దు?
* యూపీఎస్‌సీ పంపిన ఏ పత్రాలనూ నిర్లక్ష్యంగా నింపొద్దు. దేశంలోనే అత్యున్నత స్థాయి ఇంటర్వ్యూకు హాజరవబోతున్నది గుర్తుంచుకోవాలి.
* అసలు ఇంటర్వ్యూకు ఇంకా రెండు నెలల సమయముంది కదా అని నమూనా ఇంటర్వ్యూలను నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత ముందుగా వీటికి హాజరైతే అంత మంచిది. మొదటి నమూనా ఇంటర్వ్యూకు నిపుణులను ఆశ్రయించడం మేలు. వారైతేనే మీ బలాలు, బలహీనతలను బాగా విశ్లేషించగలుగుతారు. వారు మీ బలహీనతలను చెప్పినపుడు స్వీకరించండి. బాగా చేశారని చెప్పడం చాలా సులువు. బలహీనతలను కనిపెట్టారంటే చాలా ఓపిక, ఆసక్తితో వ్యవహరించినట్లే.
* మరీ ఎక్కువ నమూనా ఇంటర్వ్యూలకూ హాజరు కావద్దు. ఫలితాలు రాగానే చాలామంది మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో దిల్లీకి వెళ్లిపోతుంటారు. కానీ అది వారికేం సాయపడదు. నమూనా ఇంటర్వ్యూకు అనుభవమున్న వ్యక్తిని ఎంచుకుంటే సరిపోతుంది. సిద్ధమవ్వకుండా ఎక్కువ ప్రదేశాలకు ప్రయాణిస్తే సమయ వృథానే. ఒకసారి సన్నద్ధమైతే మోడల్‌ ఇంటర్వ్యూను నచ్చినచోట నిర్వహించుకోవచ్చు.
* వార్తాపత్రికలను రోజూ తప్పక చదవాలి. చాలామంది పాత వార్తాపత్రికల నుంచి మొదలుపెడుతుంటారు. మొదట ఈరోజువి చదివాక, తరువాత పాతవాటికి వెళ్లొచ్చు. సాధారణంగా గత రెండు, మూడు నెలలవి సరిపోతాయి.
* చాలామంది సన్నద్ధతకు బృందాలుగా ఏర్పడుతుంటారు. ఒకరి పరిజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవచ్చనేది వీరి ఉద్దేశం.ఇది కొంతవరకూ ఉపయోగకరమే కానీ, పూర్తిగా కాదు. కాబట్టి, ఈ బృంద సన్నద్ధతకు మరీ ఎక్కువ సమయం కేటాయించకండి. కొందరికి తామే గొప్ప అన్న అభిప్రాయం ఉంటుంది. కాబట్టి, వారు సన్నద్ధతను కొంచెం నెమ్మది చేసుకోవచ్చు. ఇంకొందరికి తాము తక్కువ అన్న అభిప్రాయం ఉండొచ్చు. అలాంటివారు కొంత నిరుత్సాహానికి గురవుతుంటారు. ఈ రెండు మనస్తత్వాలూ అంత మంచిది కాదు. ఎవరికి వారే ప్రత్యేకం అని గుర్తుంచుకోండి. బృంద సన్నద్ధత నిజంగానే సాయపడుతోందని భావిస్తే దానికీ పరిమితిని విధించుకోవడం మేలు.

- వి.గోపాలకృష్ణ సివిల్స్‌ శిక్షణ నిపుణులు


Back..

Posted on 20-01-2020