Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పర్సనాలిటీకి పదునైన పరీక్ష!

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. దీనిలో నెగ్గినవారికి పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)ని త్వరలో నిర్వహించబోతున్నారు. సివిల్స్‌ మొత్తం 2025 మార్కుల్లో ఇంటర్వ్యూ మార్కులు 275 (13.5 శాతం) మాత్రమే. కానీ మెరిట్‌ను నిర్ణయించటంలో దీని ప్రభావం 30 శాతానికి పైగానే! ముఖాముఖిలో అభ్యర్థి వాస్తవ స్వభావాన్ని అంచనా వేసేందుకు పలు రకాల ప్రశ్నలు వేస్తున్నారు. అందుకు తగిన విధంగా సిద్ధం కావడం చాలా అవసరం. సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో చివరిదైన ఈ ఇంటర్వ్యూకు ముందస్తుగా తయారయ్యేందుకు.. ఇవిగో సూచనలు!

టాపర్ల మార్కులను పరిశీలిస్తే వారు మెయిన్స్‌తోపాటు ఇంటర్వ్యూలోనూ అత్యధిక మార్కులు సాధించటం కనిపిస్తుంది. ఇంటర్వ్యూలో కొద్దిపాటి అదనపు మార్కులు కనీసం 10 ర్యాంకుల కంటే ముందుండేలా చేస్తాయి. మరో రకంగా చూస్తే... ఇంటర్వ్యూలో 2-3 మార్కులు తక్కువ వస్తే 3-4 ర్యాంకులు తగ్గి తక్కువ సర్వీసుతో సరిపెట్టు కోవాల్సి రావచ్చు.
ముందస్తు సన్నద్ధత ఎలా?
అభ్యర్థి వ్యక్తిగతమైన, విద్యాపరమైన, సివిల్స్‌ ఆప్షనల్‌కు సంబంధించిన ప్రశ్నలను ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంకా వర్తమాన అంశాలు, అభిరుచులపై ప్రశ్నలను కూడా సంధిస్తారు.
* బయోడేటా ఆధారంగా అడిగే ప్రశ్నలను ఒక కాగితం మీద రాసుకొని, వాటికి జవాబులు సిద్ధం చేసుకోండి. ‘సివిల్‌ సర్వీసుల్లో చేరాలని ఎందుకు కోరుకుంటున్నారు?’ లాంటి ప్రశ్నలకూ; మీ అభిరుచి పుస్తక పఠనమైతే... ‘ఏ పుస్తకం చదివారు?’ లాంటివాటికీ సిద్ధం కావాలి.
* వర్తమానాంశాలను ఒక జాతీయ పత్రిక నుంచీ, మరో ప్రాంతీయ పత్రిక నుంచీ సేకరించండి. జనవరి 2017 నుంచి అత్యంత ముఖ్యమైన పరిణామాలను కాలక్రమానుగుణంగా రాయండి. వార్తాపత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో చర్చలు జరిగిన అంశాలను ఆ జాబితాలోంచి గుర్తించండి.
* ఒక్కో సమస్యను తీసుకుని, దాని అనుకూల, ప్రతికూల కోణాలను రాయండి. తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలు ఊహించి సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించండి.
* బయోడేటాపైనా, వర్తమాన అంశాలపైనా నమూనా ఇంటర్వ్యూలకు హాజరుకండి.
* వాటిలో మీరు మెరుగుపరచుకోవాల్సిన అంశాలను గుర్తించండి.
* వీలైతే- అదే బోర్డు నిర్వహించే నమూనా ఇంటర్వ్యూకు హాజరుకండి. మీ సమాధానాల్లో మెరుగుదల కనిపించిందేమో అడిగి సలహాలు తీసుకోండి.
* రెండు మూడు నమూనా ఇంటర్వ్యూలు సరిపోతాయి.
* సలహాలు తీసుకోవటం గానీ, నమూనా ఇంటర్వ్యూలకు హాజరవడం గానీ వాస్తవ మౌఖిక పరీక్షకు ఐదు రోజుల ముందు ఆపివేయడం మంచిది. ఆపై ప్రశాంత వాతావరణంలో సొంతంగా సిద్ధమవటంపై దృష్టిపెట్టాలి.
తెలుగులో జవాబులు చెప్పొచ్చా?
1. మెయిన్స్‌ ఇంగ్లిష్‌లో రాశాను. ఇంటర్వ్యూ తెలుగులో చేయవచ్చా?
* గతంలో అయితే మెయిన్స్‌ పరీక్షను ప్రాంతీయభాషలో రాసినప్పుడు మాత్రమే ఆ సదుపాయం ఉండేది. కానీ బి.బి. భట్టాచార్య కమిటీ సిఫార్సుల మేరకు 2011 నుంచీ మెయిన్‌ పరీక్షలో రాసిన మీడియంతో సంబంధం లేకుండా ఇంటర్వ్యూ మీడియాన్ని ఎంచుకోవటానికి వీలవుతోంది. కాబట్టి మెయిన్స్‌ను ఇంగ్లిష్‌లో రాసినప్పటికీ ఇంటర్వ్యూను తెలుగులో చేయవచ్చు.
2. కనీస అర్హత మార్కులుంటాయా?
* ఇంటర్వ్యూలో అలాంటివేమీ లేవు. సాధారణంగా అభ్యర్థి ప్రతిభా ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ కనీసం 35 శాతం మార్కులను బోర్డు వేస్తుంటుంది.
3. ఇటీవలికాలంలో సివిల్స్‌ ఇంటర్వ్యూ పద్ధతిలో మార్పు ఏమైనా వచ్చిందా?
* కొద్ది సంవత్సరాలుగా ప్రశ్నల స్వభావంలో మార్పు కనిపిస్తోంది. నిగ్వేకర్‌ కమిటీ సిఫార్సుల ఫలితంగా.. అభ్యర్థి వాస్తవ స్వభావాన్ని వెలికితీసే పదునైన ప్రశ్నలు అడుగుతున్నారు. సాంప్రదాయిక అంశాలతోపాటు అభ్యర్థి స్వభావం, ధోరణి, విలువలను గ్రహించేలా ప్రశ్నలను సంధించి పరీక్షిస్తున్నారు.

- వి. గోపాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్, బ్రెయిన్ ట్రీ

Back..

Posted on 16-01-2018