Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొత్తవి తెలియాలి.. కలిపి చదవాలి!

* సివిల్స్‌ మెయిన్స్‌-2019 విశ్లేషణ

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్ష ఇటీవలే ముగిసింది. మెయిన్స్‌ జనరల్‌ స్టడీస్‌-2లో పాలిటీ, గవర్నెన్స్‌ల తాజా పరిణామాలకు ప్రాముఖ్యం లభించింది. ఎప్పటిలాగే గవర్నెన్స్‌, కానిస్టిట్యూషన్‌, పాలిటీలకూ, ఎథిక్స్‌లో థియరీ ప్రశ్నలకూ వెయిటేజీ ఎక్కువ ఇచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపటి అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతూనే మెయిన్స్‌పై దృష్టిపెట్టాల్సివుంటుంది. రెండు పరీక్షల్లోని ఒకే అంశాలను కలిపి చదివితే సమగ్రత... సమయం ఆదా!

సివిల్స్‌ మెయిన్‌ పరీక్షల్లో ఇచ్చిన జనరల్‌ ఎస్సేలు కిందటి సంవత్సరంతో పోలిస్తే సులువుగా ఉన్నాయి. జనరల్‌ ఎస్సే పేపర్లో ఎప్పటిలాగే రెండు విభాగాలున్నాయి. విభాగం-ఎలో 4 అంశాలు, విభాగం-బిలో 4 అంశాలు ఇచ్చారు. ప్రతి విభాగం నుంచీ ఒకటి ఎంచుకుని, ఒక్కో వ్యాసాన్ని 90 నిమిషాల వ్యవధిలో 1000- 1200 పదాల్లో రాయమని అడిగారు. ఒక్కో వ్యాసానికి 125 చొప్పున రెండు వ్యాసాలకూ మొత్తం 250 మార్కులు కేటాయించారు. వీటిలో ఎక్కువమంది ఎంచుకుని రాసిన వ్యాసం, పార్ట్‌-బిలోని Neglect of primary health care and education in India are reasons for its backwardness.

జనరల్‌ ఎస్సే మొదటి విభాగానికి సుదీర్ఘకాలం తయారవ్వాలి. రెండో విభాగమైన వర్తమాన సంబంధిత సామాజిక అంశాల కోసం తాజా పరిణామాలను తెలుసుకుంటూవుండాలి. వాటిపై ఏ ప్రశ్నలు రావొచ్చో అంచనా వేసుకుంటూవుండాలి. వర్తమాన అంశాలపై, సమాజం ఎదుర్కొనే ప్రస్తుత సమస్యలపై అవగాహన తప్పనిసరి. అవసరమైన గణాంకాలు కూడా సేకరిస్తుండాలి.

జీఎస్‌ పేపర్ల సంగతి?
తాజాగా ముగిసిన సివిల్స్‌ మెయిన్స్‌లో మార్కుల పరంగా వెయిటేజి పొందిన అంశాలేమిటో అభ్యర్థులు గమనించాలి. వచ్చే ఏడాది కచ్చితంగా ఇదే తీరులో ఉంటుందని కాదు. కానీ అవసరమైతే నిర్దిష్ట అంశాలకు ఇంకా ప్రాధాన్యం ఇచ్చి ప్రిపరేషన్‌ మెరుగుపరుచుకోవచ్చు కదా? జీఎస్‌ ఒక్కో పేపర్‌కు 250 మార్కులు.
* జీఎస్‌ పేపర్‌-1: జాగ్రఫీ, సొసైటీలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ వచ్చాయి.(100+75 = 175 మార్కులు). సామాజిక సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. వివిధ అంశాలను అనుసంధానం చేసి ప్రశ్నలు అడిగారు. ఇండియన్‌ కల్చర్‌ అండ్‌ హిస్టరీకి 75 మార్కుల వెయిటేజి లభించింది.
* జీఎస్‌ పేపర్‌-2: ప్రశ్నల్లో పాలిటీ, గవర్నెన్స్‌లకు సంబంధించి కొత్త పరిణామాలకు ప్రాముఖ్యం ఇచ్చారు. కాన్‌స్టిట్యూషన్‌ను కలుపుకుని ఈ అంశాల నుంచి 120 మార్కులకు ప్రశ్నలు వచ్చాయి. సోషల్‌జస్టిస్‌కు 80, ఇంటర్నేషనల్‌ ఇష్యూస్‌కు 50 మార్కులు కేటాయించారు.
* జీఎస్‌ పేపర్‌-3: ఈ పేపర్లో ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌పై ఎక్కువ ప్రశ్నలు (100 మార్కులు) అడిగారు. సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు 65 మార్కులు, టెక్నాలజీకి 60 మార్కులు, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్‌లకు 25 మార్కులు కేటాయించారు.
* జీఎస్‌ పేపర్‌-4: గత సంవత్సరాలతో పోలిస్తే... ఈ పేపర్‌ సరళంగా ఉంది. ప్రశ్నలన్నీ నేరుగానే వచ్చాయి. కేస్‌ స్టడీస్‌ కూడా సులువుగా ఉన్నాయి. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిజ్ఞానం ఉన్నవారు తేలిగ్గా జవాబు రాయగలిగేలా ఇచ్చారు. థియరీ ఆధారిత ప్రశ్నలను 140 మార్కులకూ, కేస్‌ స్టడీస్‌ (ప్రాక్టికల్‌) ప్రశ్నలను 110 మార్కులకూ అడిగారు.

రేపటి అభ్యర్థులు ఏం చేయాలి?
* ప్రిలిమ్స్‌కు సిద్ధమై రాయనివారూ, ప్రిలిమ్స్‌ను రాసినా క్వాలిఫై కానివారూ ఏం చేయాలి? వీరు ప్రిలిమ్స్‌లో నెగ్గివుంటే మెయిన్స్‌ను రాసేవాళ్లే కదా? అందుకని 3 గంటల సమయం పెట్టుకుని, పరీక్ష పరిస్థితుల్లో మెయిన్స్‌ ప్రశ్నపత్రాలకు జవాబులు రాసిచూడండి. ప్రిపరేషన్లో మీరెక్కడున్నారో స్పష్టత పెంచుకోవటానికి ఈ కసరత్తు తోడ్పడుతుంది. (ప్రిలిమ్స్‌ అవగాహన క్లిష్టమైన దశ.దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు).
* నిపుణులతో మీ జవాబులను దిద్దించుకోండి. ఏ అంశాల్లో సరిగా రాయలేకపోయారో తెలుస్తుంది. వాటిని మెరుగుపరుచుకోండి. ఈ క్రమంలో తెలిసిన కొత్త పాయింట్లు ప్రిలిమినరీకీ ఉపయోగం.
* ఆప్షనల్‌లో జవాబులు రాయటం సాధన చేయండి. వాటిని సంబంధిత సబ్జెక్టు నిపుణులకు చూపించండి. వారి సూచనలు ఆ సబ్జెక్టులో మీరు పట్టు పెంచుకునేలా చేస్తాయి.
* వివిధ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఇటీవల నిర్వహించిన పేపర్లను సేకరించి, దానిలో ముఖ్యమైన టాపిక్స్‌పై పాయింట్లు రాయండి. ఈ టాపిక్స్‌ను ప్రిలిమ్స్‌నూ, మెయిన్స్‌నూ దృష్టిలో పెట్టుకుని చదవండి.
* ఎథిక్స్‌లో థియరీ ప్రశ్నలను రాయటం సాధన చేయండి. దీనివల్ల కేస్‌స్టడీస్‌లో కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ‘బోర్‌’గా ఉంటాయనే కారణంతో థియరీ ప్రశ్నలను చదవకుండా వదిలేయబుద్ధేస్తుంది. కానీ ఈ ఏడాది ప్రశ్నలను గమనిస్తే... థియరీ ఆధారిత ప్రశ్నల్లో స్కోరింగ్‌ స్వభావం కనిపిస్తుంది. వాటిలో కేవలం పాయింట్లు రాస్తే మార్కులు ఇట్టే వచ్చేస్తాయి.
* ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో ఉమ్మడిగా ఉండే అంశాలను అనుసంధానం చేసుకుని చదవండి. ఇది చాలా ముఖ్యం!


Back..

Posted on 07-10-2019