Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సివిల్స్‌ మెయిన్స్‌కు... ఏమేం ప్రధానం?

ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ దగ్గరపడు తున్నాయి.ఈ ప్రధానపరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో కాకుండా వ్యాసరూపంలో జరుగుతుంది. లిఖిత రూపంలో అభ్యర్థుల భావ వ్యక్తీకరణకు ఇది సవాలులాంటిది. దీని సన్నద్ధతను నిర్దిష్టంగా, ప్రభావశీలంగా మలుచుకోవాలంటే ఏమేం గమనించాలి? ఆచరించాలి?

సివిల్స్‌ ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. దాదాపుగా 13,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు, అక్టోబరులో జరిగే మెయిన్స్‌ పరీక్షను రాయబోతున్నారు. వారికింకా తగినంత సమయం కూడా లేదు. అర్హత సాధించని మెజారిటీ అభ్యర్థులు వచ్చే సంవత్సరం నిర్వహించబోయే పరీక్షల వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ వారు వచ్చే ఏడాది ఈ పరీక్షలో అర్హత సాధించినా, వారికి తక్కువ సమయం ఉన్నట్లుగా భావించే అకాశముంది. కాబట్టి వారు ఇప్పటినుంచే మెయిన్స్‌కు సన్నద్ధమవడం మేలు. నిజానికి వారు ప్రిలిమినరీలో అర్హత సాధించినట్లుగా భావించి, మెయిన్స్‌కు సన్నద్ధత ప్రారంభించడం మంచిది. ఈ ఆలోచన ఆచరణీయమేనా అనిపించొచ్చు కానీ, అమలుపరిస్తే వచ్చే ఏడాది విజయం సాధించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ప్రిలిమినరీ సిలబస్‌లోని అంశాలు మెయిన్స్‌ సిలబస్‌లో 75% కలుస్తున్నాయి. కరంట్‌ అఫైర్‌ నుంచి జీకే, జాగ్రఫీ... ఇలా రెండు పరీక్షలకూ చదవాల్సిన అంశాలున్నాయి. వాటి జాబితాను ఇక్కడ చూడండి.

మెయిన్స్‌ సన్నద్ధత ప్రిలిమ్స్‌తో పోల్చినపుడు ఏవిధంగా భిన్నం?
మెయిన్స్‌కూ, ప్రిలిమ్స్‌కీ సన్నద్ధతకు సంబంధించిన పునాది ఒకేలా ఉంటుంది. కాన్సెప్టులను అర్థం చేసుకోవడం ముఖ్యం. కాన్సెప్టులను అర్థం చేసుకున్నాక ప్రిలిమ్స్‌ సన్నద్ధతలో వాస్తవాధారిత అంశాలుండాలి. అదే మెయిన్స్‌కు అయితే వాస్తవాలు, అభిప్రాయాలు, విశ్లేషణలను జోడించాలి.
అయినప్పటికీ చాలామంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలున్నాయి. అవి..
* మెయిన్స్‌ సన్నద్ధత ప్రిలిమ్స్‌తో పోల్చినపుడు ఏవిధంగా భిన్నం?
* ఒక అంశాన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లకు చదవడం ఎలా? వాటిని ఎలా అనుసంధానించి చదవాలి?
* మెయిన్స్‌లో పరిశీలించేవేమిటి? సమాధానాలను ఎలా రాయాలి?
* వీటికి తగిన సమాధానాలను అన్వేషిస్తే నిశ్చింతగా పరీక్షకు సిద్ధం కావొచ్చు.

ఒక అంశాన్ని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లకు చదవడం ఎలా? వాటిని ఎలా అనుసంధానించి చదవాలి?
ప్రాథమికాంశాలను పూర్తిచేశాక అభ్యర్థి సహజంగానే ముఖ్యమైన అంశాల చిత్రాన్ని మనసులోనే రూపొందించుకోవాలి. అది వర్తమాన వ్యవహారాలవైపునకు దారి తీస్తుంది. నిజానికి ప్రశ్నలు వర్తమాన వ్యవహారాల ఆధారంగానే ఉంటాయి. ఒకసారి టాపిక్‌లను ఎంపిక చేసుకుంటే సన్నద్ధత ప్రారంభించవచ్చు.
* ఉదాహరణకు- ఇటీవల వార్తాపత్రికల్లో ఆర్టికల్‌ 35-ఏ గురించి చదువుతున్నాం.
ఈ అంశంపై కింది ప్రశ్నలు వేసుకుని, వాటికి సమాధానాలను వివరంగా సేకరించాలి.
* ఆర్టికల్‌ 35-ఏ ఏమిటి? ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది?
* జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి దాని ప్రాముఖ్యం ఏమిటి?
* ఈ ఆర్టికల్‌ ఎందుకు చర్చనీయాంశమవుతోంది?
* దీన్ని మార్చడానికి వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
* ఈ సమాచారంలో వాస్తవాధారిత ప్రాథమికాంశాలు ప్రిలిమ్స్‌కు ఉపయోగపడతాయి. మిగిలిన అంశాలైన కాలక్రమానుగత పరిణామాలూ, వివిధ సంస్థల అభిప్రాయాలూ, చర్చలూ... ఇవన్నీ మెయిన్స్‌ పరీక్ష కోణంలో ముఖ్యమైనవి.

మెయిన్స్‌లో పరిశీలించేవేమిటి? సమాధానాలను ఎలా రాయాలి?
సివిల్స్‌ ప్రధాన పరీక్షను మూల్యాంకనం చేసేవారు జవాబు పత్రంలో ‘పాయింట్ల’ కోసం చూస్తారు. అది 20 మార్కుల ప్రశ్న అయితే వీలైనన్ని పాయింట్లు ఉండాలని ఆశిస్తారు. దీన్ని ఓ ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇటీవల నాగార్జున సాగర్‌కు 29 కి.మీ. వాయవ్యదిశలో భూకంపం సంభవించింది. దీన్ని జాతీయ జియోఫిజికల్‌ పరిశోధన కేంద్రం (NGRI) జులై 26న కనిపెట్టింది. ఈ పరిణామం రెండు అంశాలను (భారీ రిజర్వాయర్ల వద్ద భూ ప్రకంపనాలను పరిశీలించటం, పెద్ద ఆనకట్టలకు సంబంధించిన పర్యావరణ అంశాలపై దృష్టి పెట్టాలనే భావన) వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రాదగ్గ ప్రశ్న-

Q : 'WHAT ARE THE ECOLOGICAL IMPACTS OF LARGE DAMS ?'
A: Experience from all over the world has shown that large dams have major environmental and ecological impacts. Some of these are listed below:
Upstream (including reservoir) (1) soil erosion; (2) micro-climatic changes; (3) loss of forests, flora, and fauna; (4) changes in floral and faunal density and diversity; (5) changes in fisheries, especially on spawning grounds; (6) chain effects on catchment area due to constructions, displacement, etc.; (7) landslips, siltation and sedimentation; (8) breeding of vectors in reservoir and increase in related diseases; (9) seismicity; (10) loss of non-forest land; (11) water logging around reservoir ; and (12) growth of weeds.
Downstream (including command area); (1) water logging and salinity; (2) reduced water flow and deposition in river, with related impacts on aquatic ecosystem, flora and fauna; (3) micro- climatic changes; (4) flash-floods; (5) salt-water ingress at river mouth; (6) changes in coastal ecosystem (e.g., mangroves); (7) loss of land fertility along river; and (8) vector breeding and increase in related diseases.
ఈ జవాబులో 20 పాయింట్లు ఉన్నాయి కదా! సాధారణంగా ఇది 20 మార్కుల ప్రశ్నగా రావొచ్చు. అంటే పాయింటుకో మార్కు ఉంటుందని వూహించవచ్చు.

రాత సాధన ఎందుకు అవసరం?
సివిల్‌ సర్వెంట్‌ పరిణతిని సూచించేలా రాయగలిగివుండాలి. వ్యాకరణ దోషాలు, అక్షరక్రమ (స్పెలింగ్‌) లోపాలు లేకుండా జాగ్రత్తపడాలి. పదాడంబరం పనికిరాదు. సందర్భ శుద్ధిలేని గణాంకాలను ఏకరువు పెట్టడం తగదు.
సివిల్స్‌కు అవసరమైన పుస్తకాలన్నీ చదివేసి వివిధ అంశాలపై పరిజ్ఞానం సంపాదించినవారు దాన్ని రాతపూర్వకంగానే అది కూడా నియమిత కాలవ్యవధిలో ప్రదర్శించాల్సివుంటుంది. అందుకు రాత సాధన చాలా ముఖ్యం. కొందరు... మొదట అన్ని అంశాల్లో పరిజ్ఞానాన్ని సంపాదించేదాక వేచిఉండి, ఆ తర్వాత రాయడాన్ని సాధన చేయాలని సలహా ఇస్తుంటారు. ఇది అర్థరహితమైన వాదన. అన్ని అంశాల్లో అభ్యర్థికి ‘తగినంత’ పరిజ్ఞానం ఎప్పటికి లభిస్తుంది? మెయిన్స్‌ పరీక్షకు నెలరోజుల ముందా? రెండు నెలల ముందా? అప్పుడైతే రోజుకు 4-5 గంటల రాత సాధన అవసరమవుతుంది. మరి వార్తాపత్రికలు చదవటం, తయారు చేసుకున్న నోట్సు/ పుస్తకాలను పునశ్చరణ చేయటం, నమూనా పరీక్షలు రాయటం.. వీటికి సమయం ఎక్కడ ఉంటుంది?
అందుకే సమాధానాలను రాసే సాధన సన్నద్ధతతోపాటే కొనసాగాలి. అస్పష్టమైన అవగాహన ఉన్న అంశంపైన కూడా కొన్ని పాయింట్లను రాయగలిగేలా తయారు కావాలి. మెయిన్స్‌ పరీక్షలో ఒక రోజు సమయంలో 8000 నుంచి 10,000 కుపైగా పదాలను రాయాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక నిర్ణీత సమయంపాటు రాయడాన్ని అలవాటు చేసుకోకపోతే పరీక్ష కేంద్రంలో చిక్కులు ఎదురవుతాయి. అభ్యర్థుల రాతలు సివిల్‌ సర్వెంట్‌ పరిణతిని సూచించేలా ఉండాలి. వ్యాకరణ దోషాలు, అక్షరక్రమ (స్పెలింగ్‌) లోపాలు లేకుండా జాగ్రత్తపడాలి. పదాడంబరం, సందర్భ శుద్ధిలేని గణాంకాలను ఏకరువు పెట్టడం తగదు. ప్రముఖుల కొటేషన్లనూ, జాతీయాలనూ వాడేటప్పుడు వాటిని ఇష్టం వచ్చినట్టు మార్చకుండా యథాతథంగా ఇవ్వాలి. అడిగిన ప్రశ్నకు నిర్దిష్టంగా జవాబు రాయటం, రాసే విషయాన్ని అవసరమైన పేరాగ్రాఫులుగా విడగొట్టటం, పాయింట్లు కనపడేలా అమర్చటం.. ఇవన్నీ అభ్యర్థి ఆలోచనా క్రమంలోని స్పష్టతను సూచిస్తాయి.

Posted on 14-8-2017

Back..