Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మెరుగైన మార్కులకు మూడు కోణాలు!

* సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌- 2018

ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌- 2018 పరీక్షలు మొదలవటానికి ఇంకా పట్టుమని పదిరోజుల సమయం కూడా లేదు. ఇప్పటి వరకూ సన్నద్ధమైంది ఒకెత్తయితే, ఈ కొద్దికాలంలో దృష్టిపెట్టే చిన్న విషయాలే అద్భుత విజయానికి దారి తీయొచ్చు. అందుకే ఈ వ్యవధిని ఫలవంతంగా ఉపయోగించుకోవటం ముఖ్యం. ప్రతి సబ్జెక్టులోనూ సమకాలీన అంశాలను జోడిస్తూ జవాబులు రాయగలగాలి! విహంగ వీక్షణ తరహాలో వేగంగా పునశ్చరణ సాగించాలి!

ప్రధాన పరీక్షలోని జనరల్‌ ఎస్సే, జనరల్‌ స్టడీస్‌, ఆప్షనల్‌ సబ్జెక్టులు అన్నింటితో కలిపి పదుల సంఖ్యలో ప్రశ్నలకు వ్యాసరూప విధానంలో జవాబులు రాయాలని తెలిసిందే. వీటిని ఎంత ప్రభావవంతంగా రాయగలిగామన్నదానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఇందుకు కావాల్సిన నైపుణ్యాల్లో కొన్నింటిని ఇప్పటికే ఆర్జించి ఉంటారు. విషయ పరిజ్ఞానం (సబ్జెక్టు), వ్యక్తీకరణ విధానం (ప్రజెంటేషన్‌), సమయ నిర్వహణ.. ఈ మూడు కోణాల్లో దేన్నీ విస్మరించకూడదు. ఆ విధంగా అప్రమత్తతతో జవాబులు రాస్తే అత్యధిక మార్కులకు ఆస్కారం ఉంటుంది.
నేరుగా పరీక్ష కేంద్రంలో వీటిని పాటించడం అసాధ్యం. అందుకు పునాదిగా ఈ పది రోజులనూ సమర్థంగా వినియోగించుకోవాలి.
ఈ సాధన మరీ కఠినమేమీ కాదు. రోజుకు మూడు ప్రశ్నలను ఎంచుకుని, చూడకుండా సమాధానాలు రాయాలి. నిర్దేశిత సమయంలో పదపరిమితికి కట్టుబడి జవాబులు రాసి సీనియర్‌ అభ్యర్థితో దిద్దించుకోవాలి. ఆ అభ్యర్థి జవాబులను మీరు దిద్దండి. ఈ విధానం ఇద్దరికీ ఉపయోగకరమే. దీనివల్ల జవాబులు రాయడానికి మీ మానసిక సంసిద్ధత పెరుగుతుంది. ఆపై యూపీఎస్‌సీ పరీక్షపత్రాన్ని పోలినట్లు మాక్‌ పరీక్షలను పరీక్షహాలు వాతావరణం, సమయం ప్రకారం రాయండి. దీనిని మెయిన్స్‌ టైంటేబుల్‌ ప్రకారం కొనసాగించాలి.
మొదటి రోజు- జనరల్‌ ఎస్సే,
రెండో, మూడో రోజు- జనరల్‌ స్టడీస్‌ 4 పేపర్లు,
నాలుగో రోజు- భాషా పేపర్లు,
అయిదో రోజు- ఆప్షనల్‌ పేపర్లు.. ఇలా రాయాలి.
వీటిని ఉదయం, సాయంత్రం మూడు గంటల కాలవ్యవధి ప్రకారం రాయాలి. ఈ అయిదు రోజుల మాక్‌ టెస్ట్‌ విధానం అభ్యర్థిలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. మొదటిరోజు కంటే తర్వాతి రోజుల్లో జవాబులు రాసే వేగం పెరుగుతుంది. చదివింది తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోగల సామర్థ్యం క్రమేపీ మెరుగవుతుంది. సమయ నిర్వహణలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. అదే సమయంలో గత సన్నద్ధతలో లోపాలు బయటపడతాయి. అక్కడక్కడా విషయపరంగా పునరుత్పత్తిలో లింకులు లేకపోవడం గుర్తిస్తారు. దానిని ఇప్పుడు దిద్దుకోవాలి!

శరవేగంగా పునశ్చరణ
పునశ్చరణను గతంలో సన్నద్ధత పూర్తయిన తరువాత చేసుంటారు. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉండాలి. అప్పుడు వ్యవధి ఉన్నందున పునశ్చరణ తాపీగా చేసుంటారు. కానీ ఇప్పటి పునశ్చరణ వేగంగా, సమయపు ఆదా కోణంలో జరగాలి.
* సబ్జెక్టు లోతులకు వెళ్లకూడదు. విహంగ వీక్షణం చేయాలి.
* ఈ దశలో అడ్డంగా లైన్లవారీగా చదవకూడదు. నిలువునా పేజీ పై నుంచి కిందకు కళ్లు వేగంగా పరుగెత్తాలి.
* పేజీ నుంచి మరో పేజీకి వేగంగా కదలాలి. గతంలో హైలైట్‌ చేసుకున్న పాయింట్లను వేగంగా చూసుకోవాలి.
* కొత్త పాయింట్లు గుర్తించడం, కొత్త పుస్తకాలు వెతకడం వంటివి ఈ దశలో చేయకూడదు.
ఈ రకంగా వేగవంతమైన పునశ్చరణ కొనసాగిస్తూనే కనీసం గంటన్నరసేపు వర్తమానాంశాలను పరిశీలించాలి. జనరల్‌ ఎస్సే, జనరల్‌స్టడీస్‌తో కలుపుకుని దాదాపు 1250 మార్కులతో మీ స్కోరును పెంచుకోవడానికి తోడ్పాటునందించే వర్తమాన పరిణామాలను అనుసరించడం వదలొద్దు.
జనరల్‌స్టడీస్‌లోని దాదాపు ప్రతి సబ్జెక్టులోనూ మీ సమకాలీన అంశాల స్పర్శ మీ జవాబు పత్రాన్ని మిగతా వారికంటే వేరుచేసి మార్కుల పంట పండించొచ్చు. కాబట్టి పరీక్ష ముందురోజు వరకూ సమకాలీన విషయాలను వదలొద్దు.

ఒక పేపర్‌ ప్రభావం మరోదానిపై పడకుండా
జనరల్‌స్టడీస్‌ నాలుగు పేపర్లలో మొదటిది పూర్తిగా సమాచారం (ఫాక్చువల్‌ ఇన్ఫర్మేషన్‌) ఆధారంగా ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలియక వదిలేయాల్సిన పరిస్థితి ఎదురవొచ్చు. అలాగే జనరల్‌స్టడీస్‌లోని మిగతా పేపర్లలో కొన్ని తేలికగా, మరికొన్ని కఠినంగా ఉండొచ్చు. జీఎస్‌ ఒక పేపర్‌ రాయగానే బాగా రాయలేదని వెలితిగా ఉండొచ్చు. కానీ దానికి కారణాలు, విశ్లేషణలు తీరిగ్గా పరీక్షలన్నీ పూర్తయ్యాక చేసుకోవచ్చు.
దాని వైఫల్య భావన మరో పేపర్‌పై పడనీయకూడదు. లేదంటే మరో పేపర్‌లో మీరు బాగా స్కోరు చేయగలిగే అవకాశాన్ని కోల్పోతారు. నాలుగో పేపర్‌ దగ్గరికి వచ్చేసరికి ఈ ఒత్తిడి ఎక్కువైపోతుంది. అందుకే ఒక పేపర్‌ అయిపోయిన తరువాత దానిలో మీ ప్రతిభలో లోపాలను పక్కనపెట్టి స్థితప్రజ్ఞతతో ముందుకెళ్లాలి. తరువాత బాగా రాయగలనన్న పూర్తి సానుకూల దృక్పథంతో కదలాలి.
జీఎస్‌ పేపర్‌-4 ఎథిక్స్‌ పేపర్‌ రాసేటపుడు గత ప్రశ్నపత్రాల జవాబుల ఛాయలు రానీయకూడదు. ఈ పేపర్‌ను అధ్యయనం తక్కువ, ఎక్కువ ఆలోచనతో జవాబులు రాయాలి. అందుకే అరువు తెచ్చుకున్న భావాలు, దృక్పథం ప్రదర్శించకూడదు.
రాబోయే కొద్దిరోజుల్లో గమ్యానికి చేరే ప్రయాణంలో మీరొక్కరే ఉంటారు. ఏకాంతంగా.. ఏకాకిగా మీ ప్రయాణం సాగుతుంది. కానీ పుస్తకాలు, స్టడీమెటీరియల్‌, గత ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్ట్‌ జవాబు పత్రాలు మీ నేస్తాలుగా నిలుస్తాయి. ఇవే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి!

స్కోరును తగ్గించేదేమిటి?
ప్రతి ఏడాది సివిల్స్‌లో కొత్త, పాత అభ్యర్థులు ఎదుర్కొనే ఏకైక సవాలు- ప్రశ్నపత్రంలోని అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయగలగడంపైనే! సహజంగా ముందు మొదలుపెట్టిన ప్రశ్నలు బాగా తెలిసినవి అయ్యుంటాయి. కాబట్టి వాటికి అడిగిన పదపరిమితికి మించి పుంఖానుపుంఖాలుగా రాయడంతో మిగతావాటికి సమయం చాలదు. పైగా ఆ ప్రశ్నలు అంతగా తెలిసినవి అయ్యుండవు. దీంతో జవాబులు రాసేందుకు సమయం ఎక్కువ పట్టి అనివార్యంగా కొన్ని ప్రశ్నలను వదిలేస్తారు. ఇదే స్కోరును బాగా తగ్గించి వేస్తుంది.
అందుకే ముందు నుంచీ అప్రమత్తంగా ఉండి పదపరిమితికి లోబడి జవాబులు రాయగలిగే నిగ్రహం ప్రదర్శిస్తే అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయగలుగుతారు. ఉదా: 10 మార్కుల ప్రశ్నకు ఒకటీ ముప్పావు పేజీ, 15 మార్కుల ప్రశ్నకు రెండున్నర పేజీలు.
ఈ పరిమితితో ప్రశ్నలకు జవాబు రాయగలగడానికి సాధన అవసరం. ఒకవేళ తెలియని ప్రశ్న వస్తే దానిలో తెలిసిన భాగం వరకూ క్లుప్తంగా రాయాలి. కొన్ని మార్కులైనా పడతాయి. అయితే కొందరు తెలివిగా తెలియని ప్రశ్నలకు ఎగ్జామినర్‌ను గందరగోళపరచడానికి ఎక్కువ పేజీలు రాస్తారు. కానీ అందులో కీ పాయింట్లు ఉండవు. ఈ చిట్కా ఫలిస్తుందనుకుంటే ఆశాభంగం తప్పదు!

అధిక స్కోరుకు సూత్రాలు
పరీక్షహాల్లో జవాబుల రూపంలో రాసే అక్షరాలే ఇన్నేళ్ల నిర్విరామకృషికి ఫలితాన్ని అందిస్తాయి. అందుకే జవాబులు ప్రశ్నకు తగ్గట్టుగా ఉండాలి.
అడిగిందేంటి?: ప్రశ్నలో అడిగిందేమిటో గుర్తించి, జవాబు రాయాలి. అంతేకానీ మీకు తెలిసింది రాయడం వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. ప్రశ్నలో అడిగిన దానికే జవాబు రాయగలిగితే సగం విజయం ఇక్కడే లభిస్తుంది.
అదే పదజాలం: ప్రశ్నలో ఉపయోగించిన పదజాలాన్నే తిరిగి జవాబులో వాడాలి. దీంతో ప్రశ్నను మీరు సరిగా అర్థం చేసుకుని, దానికి తగ్గ జవాబు రాయడంలోనే నిమగ్నమయ్యారని జవాబు పత్రాలు దిద్దేవారికి అర్థమవుతుంది.
పేరాలుగా: జవాబును కొన్ని పేరాలుగా విడగొట్టాలి. ప్రతి పేరాలో ఒక అంశాన్ని చర్చించాలి. ఈ భాగాలన్నింటి మధ్య అనుసంధానం ఉండేలా చూసుకోవాలి. విడిపూలను దారంలో గుచ్చితే చక్కని మాల అయినట్టు విడివిడి పేరాలన్నింటినీ ఎక్కడికక్కడ కలుపుకుంటూ వెళ్లాలి.
పరిష్కారాలు: ఆచరణయోగ్యమైన సూచనలూ, పరిష్కారాలూ ఇవ్వాలి. జనరల్‌స్టడీస్‌ పేపర్లు 2, 3ల్లో ఎక్కడైనా అవకాశం వస్తే మాత్రం జవాబుల్లో సూచనలు, సమస్యా పరిష్కారాలను పొందుపరచాలి. పాలనావ్యవస్థలోకి సమస్యా పరిష్కారకర్తలే కావాలన్న విషయాన్ని మరవొద్దు. అయితే పరిష్కారాలు సూచించేటపుడు నేలవిడిచి సాము చేయకూడదు. వాస్తవిక దృక్పథంతో ఆచరణాత్మకమైనవే సూచించాలి.
క్లుప్తంగా, సూటిగా: జవాబుల్లో భాష, భావం సంక్లిష్టంగా, గందరగోళంగా ఉండకూడదు. క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా మీ జవాబులు ఉండేలా సాధన అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే పదోతరగతి విద్యార్థి మీ జవాబు పత్రం చదివినా చక్కగా అర్థమయ్యేలా ఉండాలి.
యూపీఎస్‌సీ టాపర్ల జవాబు పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఈ విషయాలే అవగతమవుతాయి.

ముఖ్యమైన ఎస్సేల జాబితా;
Social Media & Its Evils, Tourism in India, Women Empowerment, Socio-Cultural diversity in India లను ఎస్సేలుగా మలిచేందుకు ఉపయోగపడే Pointers కోసం క్లిక్ చేయండి http://tinyurl.com/y72xodk9

Back..

Posted on 18-09-2018