Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సివిల్స్‌లో ప్రధానం

సివిల్స్‌ మెయిన్స్‌-2017 పరీక్షల తేదీలు దగ్గరపడ్డాయి. ‘ప్రిలిమినరీ పరీక్షకు ఇది పూర్తి భిన్నమైనది. ప్రిలిమినరీలో జ్ఞాపకశక్తి, తార్కిక చింతనలను పరీక్షిస్తే, మెయిన్స్‌లో అభ్యర్థి అవగాహన, విశ్లేషణ సామర్థ్యం, రాత నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ మేరకు అభ్యర్థి మానసికంగా సంసిద్ధంగా ఉండాలి’ అంటూ అభ్యర్థులకు మెలకువలను సూచిస్తున్నారు... 2016 ఆలిండియా టాపర్‌ రోణంకి గోపాలకృష్ణ

ప్రధాన పరీక్ష (మెయిన్స్‌)లో ఎక్కువ మార్కులు సాధించగలిగితే తదుపరి మౌఖిక పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ర్యాంకు సాధించవచ్చు. మొత్తం మెయిన్స్‌ 1750 మార్కుల్లో మంచి స్కోరింగ్‌ రావడానికి అవకాశం ఉన్నవి- జనరల్‌ ఎస్సే, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-4 (ఎథిక్స్‌ అండ్‌ ఇంటిగ్రిటి), ఆప్షనల్‌ రెండు పేపర్లు. వీటిలో ప్రతిభ చూపగలిగితే 60 నుంచి 65 శాతం మార్కులు సాధించవచ్చు. ముఖ్యంగా ఈ మూడు పేపర్లలో మంచి స్కోరు సాధించడానికి ప్రణాళికలు వేసుకోవాలి.

ఒక అంశంపై అభ్యర్థికి ఏ మేరకు లోతైన అవగాహన ఉంది. ఏయే కోణాల్లో ఆ అంశాన్ని విశ్లేషించగలుగుతున్నారు, ఆ సమస్యకు లేదా సంఘటనకు ఏ ఆచరŒణాత్మక పరిష్కారం చూపగలుగుతున్నారు.. అనేవి ఎగ్జామినర్‌ పరీక్షిస్తారు. మెయిన్స్‌లో తేదీలు, సంఖ్యలు, డేటాలకు అంత ప్రాధాన్యం ఉండదనే చెప్పాలి. ఈ పరీక్షలో ముఖ్యమైన అంశం- అభ్యర్థి ప్రశ్నను అర్థం చేసుకొనే విధానం. ప్రశ్నలో ఏ అంశాలు అడిగారు, మనం ఏం సమాధానం రాయాలనేది అత్యంత ముఖ్యం. జనరల్‌ స్టడీస్‌ పేపర్స్‌ ప్రశ్నల్లో చాలావరకు ఒకే ప్రశ్నలో రెండు మూడు ఉప ప్రశ్నలు అడగటం జరుగుతోంది. అలాంటప్పుడు ప్రశ్నను రెండు, మూడు భాగాలుగా విభజించి, ఒక్కోదానికి రెండు పాయింట్లు రాయగలిగితే సరిపోతుంది.

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1,2,3లలో ఎక్కువగా వర్తమాన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి గత పది నెలల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న ఆర్థిక, రాజకీయ, సామాజిన, న్యాయపరమైన అంశాలతో అభ్యర్థికి విభిన్నమైన కోణాల్లో అవగాహన ఉండాలి. అందుకు వార్తా పత్రికల సంపాదకీయ వ్యాసాలు, రాజ్యసభ టీవీ వారి బిగ్‌ టీవీ కార్యక్రమాలలోని డిబేట్‌, ఆలిండియా రేడియోలోని స్పాట్‌ లైట్‌ కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి. నేనైతే స్పాట్‌ లైట్‌ ప్రోగ్రామ్స్‌ను రోజూ 15 నిమిషాలు విని, ముఖ్యమైన పాయింట్లు ప్రత్యేకంగా నోట్సు రాసుకొనేవాడిని. అది నాకు చాలా ఉపయోగపడింది. యోజన మ్యాగజీన్లోని ప్రముఖుల వ్యాసాల్లో కూడా చాలా విశ్లేషణ ఉంటుంది. వాటిపై కూడా దృష్టి సారిస్తే.. ఒక అంశంపై విభిన్న కోణాల్లో మంచి పట్టు వస్తుంది.

జవాబులు కంఠస్థం చేయటమా?
మెయిన్స్‌ పరీక్షకి చాలామంది అభ్యర్థులు సమాధానాలు కంఠస్థం చేస్తుంటారు. కానీ, అలా చేసి సమర్థంగా రాయలేమని గుర్తుంచుకోవాలి. విషయాన్ని కూలంకషంగా అవగాహన చేసుకొని అడిగే విధానాన్ని బట్టి రాయాలి. మెయిన్స్‌లో అభ్యర్థి ఇదమిత్థంగా ‘ఇదే సమాధానం రాయాలి’ అని ఉండదు. అడిగిన ప్రశ్నకు అనుగుణంగా ఏ విధంగానైనా రాయవచ్చు. కానీ, రాసినదానిలో స్పష్టత ఉండాలి. మరో ముఖ్యమైన అంశం రాత నైపుణ్యం. ఎంత చదివాము అన్నదానికంటే పరీక్ష గదిలో ఇచ్చిన సమయంలో ఎంత చక్కగా ప్రజెంటేషన్‌ చేశామన్నది ముఖ్యం. దీనికి నమూనా ప్రశ్నలను సాధన చేయాలి. చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా, క్లుప్తంగా చెప్పడం రాతసాధన ద్వారా మాత్రమే వస్తుంది. తక్కువ పదాలతో ఎక్కువ విషయాన్ని వ్యక్తపరిచే విధానాన్ని అలవర్చుకోవాలి. ప్రశ్నను బట్టి అక్కడక్కడా ఫ్లో్లచార్ట్స్‌, టేబుల్‌, వెన్‌ డయాగ్రమ్‌ తదితర టెక్నిక్స్‌ ద్వారా ఎక్కువ విషయాన్ని తక్కువ సమయంలో సమాధానపత్రంపై పెట్టవచ్చు.

పునశ్చరణ (రివిజన్‌) కూడా చాలా ప్రధానం. మరుపు అనేది మానవ సహజం. అందుకే వీలైనన్నిసార్లు రివిజన్‌ చేసుకోవాలి. నా వరకు నేను 10 నుంచి 12 సార్లు పునశ్చరణ చేశాను. పరీక్ష ముందు రోజు సమయాన్ని మొత్తం సబ్జెక్టు రివిజన్‌ అయ్యేలా రెండుమూడు రోజుల్లో రాసుకొని చదువుకున్నాను. ఇక ప్రశ్నపత్రం క్వశ్చన్‌ కమ్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌ మాదిరిగా ఉంటుంది. ప్రతి ప్రశ్న కింద సమాధానానికి ఖాళీ ఉంటుంది. పద పరిమితిని గుర్తుపెట్టుకొని సమాధానం రాయాల్సి ఉంటుంది. నేను ఎక్కడా స్కెచ్‌పెన్స్‌, సైడ్‌ హెడ్డింగ్స్‌, అండర్‌లైన్స్‌ లాంటివి ఉపయోగించలేదు. కొన్ని ప్రశ్నలకు పేరాల రూపంలో, మరికొన్నింటికి పాయింట్ల రూపంలో రాశాను. చెప్పవలసిన విషయాన్ని సూటిగా అయిదారు పాయింట్లలో చెప్పాను. ప్రతి పేపర్‌లో తెలియనివి ఒకటి రెండు ప్రశ్నలను ఖాళీగా విడిచిపెట్టాను. ప్రతి ప్రశ్నకూ ఉపోద్ఘాతం, కంటెంట్‌, ముగింపు అనే విధానాన్ని అనుసరించలేదు. మన శైలిలో కొత్తగా ఎలా సమాధానం రాశాము అనేదానిపై మన ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ఎగ్జామినర్‌ చదివి అర్థం చేసుకోవడానికి అనువుగా మన దస్తూరి ఉంటే సరిపోతుంది.

ఇదీ నేను పాటించింది ...
జనరల్‌ ఎస్సే: సాధారణంగా యూపీఎస్‌సీ జనరల్‌ ఎస్సే పేపర్‌ ప్రశ్న ఒక ఫ్రేజ్‌ లేదా ఒక వాక్యంలో ఉంటుంది. ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అనే దాన్నిబట్టి రాసే ఎస్సే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రశ్నలో ఉన్న కీలక పదాలను పట్టుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎస్సేలో ఏమి రాయాలో మెదడుకు స్ఫురిస్తుంది. ముఖ్యంగా యూపీఎస్‌సీ వారు లిటరరీ ఎస్సేలు, వర్తమాన సంఘటనలకు సంబంధించిన ఎస్సేలు అడుగుతుంటారు. లిటరరీ ఎస్సేలు రాయడానికి నిర్ణయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సందర్భం వదిలిపెట్టకుండా రాయాలి. అందుకే నా అభిప్రాయం ప్రకారం వర్తమాన అంశాల ఎంపికే మంచిది.

ప్రతి వ్యాసాన్నీ 7 నుంచి 8 పేజీలు రాశాను. సైడ్‌ హెడ్డింగ్స్‌ ఎక్కడా పెట్టలేదు. పాయింట్ల రూపంలో రాయలేదు. ప్రతి పేజీకీ మూడు పేరాలు వచ్చేలా రాశాను. ముందు రఫ్‌ వర్క్‌ పేజీలో ఎస్సే బ్లూప్రింట్‌ రాశాను. దీనివల్ల సమాచారం ఇవ్వడంలో ధార కొనసాగుతుంది. సందర్భానుసారంగా ఉదాహరణలతో వర్తమాన అంశాలను జోడిస్తే వ్యాసం ఆసక్తికరంగా ఉంటుంది. మరీ సాంకేతిక పదాలనూ, కష్టమైన మాటలనూ ఉపయోగించకూడదు. జనరల్‌ ఎస్సే ఎప్పుడూ సాధారణంగానే ఉండాలి. ఒక నిరక్షరాస్యుడి ముందు చదివి వినిపించినా అర్థమయ్యే రీతిలో ఉండాలి. కొద్ది సంవత్సరాలుగా తెలుగులో వ్యాసం రాసినవారికి మంచి మార్కులు వస్తున్నాయి.

ఎస్సేను ఒక సమస్య కోణంలో ఇస్తే తదుపరి ఆ సమస్యను విభిన్న కోణాల్లో వివరించాలి. ఒక స్టేట్‌మెంట్‌గా ఇస్తే అందులో అంతర్గత అంశాలను వెలికితీయాలి. ఇలా ఇచ్చిన అంశాల్లోని అనుకూల, ప్రతికూలాలు- రెండింటినీ చర్చిస్తూ వీటిపై ప్రభుత్వ చర్యలను వివరించాలి. తదుపరి ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందో వివరించాలి. సానుకూల దృక్పథంలో ముగించాలి. ముగింపు పేరా క్లుప్తంగా నాలుగైదు వాక్యాలకు మించకూడదు.పై క్రమం లిటరరీ ఎస్సేలకి వర్తించకపోవచ్చు. ఎస్సే చదివిన తర్వాత ఎగ్జామినర్‌ ఒక నూతనత్వాన్ని చూడగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.

జిఎస్‌ పేపర్‌-1,2,3: ఈ మూడు జీఎస్‌ పేపర్లకూ యూపీఎస్‌సీ వారు గత రెండు మూడు సంవత్సరాల నుంచీ 20 ప్రశ్నలు చొప్పున అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకి ఎటువంటి ఛాయిస్‌ లేదు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తప్పనిసరిగా రాయాల్సిందే. పేపర్‌-1లో కొంతవరకు సబ్జెక్టు ఉన్నప్పటికీ జీఎస్‌ పేపర్‌ 2,3ల్లో పూర్తిగా వర్తమాన అంశాలపై ఆధారపడి అడిగే ప్రశ్నలుంటాయి. సిలబస్‌కి అనుగుణంగా సిద్ధమైతే ఈ పేపర్లలో కూడా 90 నుంచి 100 మార్కులు స్కోరు చేయవచ్చు. అన్ని ప్రశ్నలూ తెలిసినవి రాకపోవచ్చు. అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. మిగిలిన ప్రశ్నలను చక్కగా రాస్తే సరిపోతుంది. ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాత సమాధానం రాయడం మంచిది.

Back..

Posted on 31-10-2017