Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రిలిమ్స్‌ పరీక్షకు కౌంట్‌డౌన్‌ మొదలు

దాదాపు ఆరునెలల సమయం. ఆలోచిస్తే చాలా టైమ్‌ ఉన్నట్లనిపిస్తుంది. కానీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌లాంటి పరీక్ష ప్రిపరేషన్‌కు అది తక్కువే. అయితే అలా అనుకుంటూ నిరాశపడాల్సిన పనిలేదు. అనువైన అధ్యయన వ్యూహాన్ని అనుసరిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. కలెక్టర్‌ కావాలనే మీ కలను సాకారం చేసుకోవచ్చు.

ప్రతిష్ఠాత్మకమైన సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) కొత్త సంవత్సరంలో జూన్‌ 3న జరగబోతోంది. ఇంకా ఆరు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే ఎంతోకొంత అధ్యయనం సాగించిన అభ్యర్థులు ఇప్పుడు తమ సన్నద్ధత తీరును లక్ష్య దిశగా వేగవంతం చేసుకోవాలి.
సివిల్స్‌ ప్రశ్నపత్రాన్ని తయారు చేసేవారికి యూపీఎస్‌సీ ముందస్తుగానే పరీక్షకు సంబంధించి రెండు లక్ష్యాలను సూచించింది. ఎ) ఎల్లప్పుడూ పరిజ్ఞానాన్నీ, నైపుణ్యాలనూ పెంపొందించుకునే అభ్యర్థులను ఎంపిక చేయాలి. బి) నియమితులు కాబోయే సర్వీసుకు ప్రేరణపరంగా తగినవారై భావోద్వేగ బంధం ఏర్పరచుకోగల అభ్యర్థులను కనుగొనాలి.
అందుకే సివిల్స్‌లో ప్రాథమికాంశాలపై అభ్యర్థికి పట్టునూ, వాటిని వర్తమాన విషయాలకు జోడించగల సామర్థ్యాన్నీ చూస్తారు. అంటే నిరంతర జ్ఞాన సముపార్జన చేయగల సత్తా అన్నమాట. ప్రగతిపై అనురక్తినీ, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలూ, ప్రజల సమస్యలూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అభ్యర్థి ఆసక్తినీ పరీక్షిస్తారు. వీటితో పాటు ప్రభుత్వ దార్శనికతపై అవగాహన, దాన్ని అందుకోవడంలో తీసుకుంటున్న చర్యల పట్ల అభ్యర్థికి ఎంత అవగాహన ఉందో పరీక్షిస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. అవి: జనరల్‌స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌స్టడీస్‌ పేపర్‌-2. ప్రతీ పేపర్‌కు 200 మార్కులు. పేపర్‌-1లో 100 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు. పేపర్‌-2లో 80 ప్రశ్నలూ, ప్రతి సరైన సమాధానానికి 2 1/2 మార్కులు ఉంటాయి. రుణాత్మక మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33% కోత ఉంటుంది.
సిలబస్‌పై అవగాహన
సిలబస్‌ను పరిశీలించి, తాజా ధోరణులను అవగాహన చేసుకుంటే తగిన వ్యూహం రూపొందించుకోవటం సాధ్యమవుతుంది. పేపర్‌-1 సిలబస్‌ను గమనిస్తే...
1. కరంట్‌ అఫైర్స్‌: జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు
2. హిస్టరీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌: భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం.
3. జాగ్రఫీ: భౌతిక, సాంఘిక, ఆర్థికపరంగా భారతదేశ భౌగోళిక వ్యవస్థ, ప్రపంచ భౌగోళిక వ్యవస్థ.
4. ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌: రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీ రాజ్‌, పబ్లిక్‌ పాలసీ, హక్కుల అంశాలు.
5. ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌: నిలకడైన ప్రగతి, పేదరికం, ఇన్‌క్లూజన్‌, డెమోగ్రాఫిక్స్‌, సోషల్‌ సెక్టార్‌ ఇనిషియేటివ్స్‌.
6. ఎన్విరాన్‌మెంటల్‌ ఎకాలజీ: జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు.
7. జనరల్‌ సైన్స్‌: విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఆచరణాత్మక అంశాలు.

ఈ సిలబస్‌ మరీ జనరల్‌ స్వభావంతో ఉంది. ఒక నిర్దిష్ట అంశం పరిధిలో ఏముంటాయో గ్రహించటం కష్టం. మరెలా? గత కొద్ది సంవత్సరాల్లో ఒక్కో అంశం నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో పరిశీలించి విశ్లేషించటం మాత్రమే సరైన మార్గం.
పునాది ఏర్పరుచుకోవాలి
* సిలబస్‌లో ఉన్న ప్రతీ సబ్జెక్టులోని మౌలిక అంశాలపై అవగాహన అవసరం.
* ఈ సబ్జెక్టుల్లో చాలావరకూ విద్యార్థులకు కొత్త అంశాలే. పదో తరగతి తర్వాత ఎక్కువమంది సైన్స్‌నో, కామర్స్‌నో ఎంచుకోవటం వల్ల ఈ సబ్జెక్టుల పరిచయం తక్కువ. అందుకే వీటిలో ప్రాథమిక అంశాల్లో పునాదిని ఏర్పరచుకోవటం అవసరం.
* మౌలిక అంశాలు నేర్చుకున్నాక, ఆ సబ్జెక్టుల్లో గత సంవత్సరాల్లో ఏయే ప్రశ్నలు అడిగారో గమనించాలి.
* ప్రశ్నల శైలి ఏటా మారుతుంటుంది కాబట్టి ఏ ప్రశ్న అయినా సూచనాత్మకమే.
* ఆ తర్వాత ఆయా సబ్జెక్టుల్లోని తాజా/వర్తమాన అంశాలపై దృష్టి పెట్టాలి.
టైమ్‌ టేబుల్స్‌
వివిధ సమయ వ్యవధులతో టైమ్‌ టేబుల్స్‌ వేసుకుని, అధ్యయనం సాగించాలి. మొదటి టైమ్‌ టేబుల్‌ వారం రోజులకు (వీక్లీ) వేసుకోవాలి. రెండోది 15 రోజులకు. మూడోది 30 రోజులకు. నాలుగోది ఐదు నెలలకు. వీక్లీ టైమ్‌ టేబుళ్లు మంత్లీ టైమ్‌ టేబుళ్లతో అనుసంధానమైవుండేలా రూపొందించుకుని చదవాలి.

75% వస్తోందా?
ఒక్కో సబ్జెక్టును అధ్యయనం చేసి, దానిలో పరీక్ష రాయాలి. స్కోరు చూసుకోవాలి. 75 శాతం స్కోరు వస్తే సరైన దిశలోనే వెళ్తున్నట్టు. కొద్దిరోజుల తర్వాత మరో పరీక్ష రాసి, స్కోరు ఎలా ఉందో పరిశీలించుకోవాలి. 75 శాతం మార్కులు నిలకడగా ఉంటే మరో సబ్జెక్టు అధ్యయనం ఆరంభించవచ్చు. ఇందాకటి మాదిరి మార్కుల స్వయం మూల్యాంకనం చేసుకోవాలి. అవసరమైనచోట తగిన మార్పులూ, మెరుగుదల చర్యలూ తీసుకుంటూ సన్నద్ధత సాగించాలి. ఇలా అన్ని సబ్జెక్టులూ పూర్తయ్యాక, అన్ని సబ్జెక్టులూ కలిసివుండే కాంప్రహెన్సివ్‌ పేపర్లు (గ్రాండ్‌ టెస్టులు) రాయాలి. వీటిలో నెగిటివ్‌ మార్కులు తీసేశాక కనీసం 65 శాతం మార్కులు రావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. 65 శాతం తక్కువ కదా అనిపించవచ్చు కానీ నిలకడగా అన్ని మార్కులు సాధిస్తుంటే అభ్యర్థులు విజయపథంలోనే ముందుకు సాగుతున్నట్టు అర్థం. ఎందుకంటే... ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కుల సగటు దాదాపు 55 శాతమని గుర్తుంచుకోవాలి!

ప్రశ్నల స్థాయి పెరుగుతోంది!
ప్రాథమిక పరీక్షలో అర్హత పరీక్షగా ఉన్న పేపర్‌-2ను తక్కువ అంచనా వేయకూడదు. దీనికెంతో ప్రాముఖ్యం ఉంది. ఇందులో కనీస మార్కులు 33%. అంటే, 200 మార్కులకుగానూ కనీసం 67 సాధించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అభ్యర్థి పేపర్‌-1ను దిద్దుతారు.
పేపర్‌-2లో ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, రీజనింగ్‌ ఉంటాయి. గత కొద్ది సంవత్సరాల్లో ఈ పేపర్‌ కష్టతరంగా మారుతోంది. దీన్ని వడపోతగా ఉపయోగించాలని యూపీఎస్‌సీ భావించటమే దీనికి కారణం. ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నల స్థాయి పెరుగుతూ వస్తోంది. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నల సంఖ్యతో పాటు క్లిష్టత కూడా పెరుగుతోంది. ఒక కాంప్రహెన్షన్‌ పాసేజ్‌కి ఒక ప్రశ్న ఉంటుంది. దీంతో పేపర్‌ నిడివి బాగా ఎక్కువగా ఉంటోంది. పదో తరగతి తర్వాత ఆర్ట్స్‌లో చేరినవారు ఈ పేపర్‌పై అదనపు జాగ్రత్తలు తీసుకుని చదవాల్సివుంటుంది.
ప్రకటన ఫిబ్రవరిలోనే!
దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను విశేషంగా ఆకర్షించే పరీక్ష.. సివిల్‌సర్వీసెస్‌! మిగతా పోటీ పరీక్షలకంటే ఇది విభిన్నం. ఈ పరీక్ష ముఖ్య వివరాలు...
* సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌: 7.2.2018
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 6.3.2018
* ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 3.6.2018
* మెయిన్స్‌ పరీక్ష తేదీ: 1.10.2018 నుంచి
* తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం

- వి. గోపాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్, బ్రెయిన్ ట్రీ

Back..

Posted on 12-12-2017