Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సివిల్స్‌కు నింగే హద్దు.. ఆందోళన వద్దు

* విజేతల అనుభవాలు.. అభ్యర్థులకు పాఠాలు
* నిరంతర శ్రమ, పట్టుదలే విజయ సోపానాలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: విజయమే లక్ష్యంగా సాగేవారికి ప్రతికూలతలనేవి పూచికపుల్లతో సమానం. సివిల్స్‌కు సిద్ధమయ్యేవారికి మొదటగా గుర్తొచ్చేది భాష, వివిధ ఇబ్బందులు, రిజర్వేషన్‌, శిక్షణ తీసుకునే సామర్థ్యం తమకు లేదని ఇలా ఇంకెన్నో అపోహలు ఉంటాయి. 10 లక్షల మంది హాజరయ్యే యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో 13వేలమంది మెయిన్స్‌కు ఎంపికవుతారు. ఇందులోంచి దాదాపు 3వేల మంది మౌఖిక పరీక్ష(ఇంటర్వ్యూ) దాకా వెళ్తారు. చివరికి ఉద్యోగాలు వచ్చేది 900 మందికి. ఈ లెక్కలు చూసి కొంతమంది మన వల్ల అవుతుందా? ఇది సాధ్యమా? అనే సందేహాలు కలుగుతాయి. అటువంటి నిరాశాపూరిత ఆలోచనలు మానుకోవాలి. జూన్‌ 3న ప్రిలిమ్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న వారికి ఇటీవల వాటి ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విజేతలు అనుదీప్‌, ఆదర్శ్‌ సురభి, నిహారికా సింగ్‌, కృష్ణకాంత్‌ పటేల్‌, మాధురి, జమీల్‌ ఫాతిమా జీబా, సాయితేజ, పృథ్విరాజ్‌ ఇమ్మడి, కోయా శ్రీహర్ష ఇస్తున్న సూచనలు సలహాలివి...
సందేహాలు అనేకం.. అందుకే వెనుకడుగు
సివిల్స్‌పై ఉన్న అపోహలతో ఈ పరీక్షల సన్నద్ధతలో ఉత్తరాదికంటే దక్షిణాది వెనుకబడిందనే చెప్పాలి. సరైన అవగాహన, దిశానిర్దేశం లేక పరీక్ష రాయాలనుకున్నా తేలికగా తీసుకునేవారు అధికంగా ఉంటారు. ఎలా చదవాలి? ఏం చదవాలి? ఎంత సేపు కేటాయిస్తే ఈ పరీక్షలో విజయం సాధించవచ్చు అనే సందేహాలు తలెత్తుతాయి. ప్రిలిమ్స్‌లో ఎన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి? గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం కదా ఇది సాధ్యమా? ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేదు కాబట్టి సాధించలేమేమో అనే అభిప్రాయం ఉంటుంది. ఐచ్ఛికం(ఆప్షనల్‌) ఎంపికలో తికమక పడుతుంటారు? ఈ తరహా ప్రశ్నలకు విజేతలు సమాధానాలిచ్చారు.
ఇంటర్వ్యూలో సమాధానాలు ఎలా చెప్పాలి? - సాయితేజ, 43వ ర్యాంకర్‌
జ: కోచింగ్‌ తీసుకుంటే సరిపోతుంది అనుకోవడం సరికాదు. ఆ తర్వాత చేయాల్సింది చాలా ఉంది. అక్కడ సిలబస్‌లోని అంశాలపైనే అవగాహన కల్పిస్తారు. అంతా మనమే సొంతంగా నేర్చుకోవాలి. అప్పుడే సాధించగలం. తరగతులకే సగం సమయం సరిపోతుంది. క్రికెట్‌, సినిమాలను విశ్లేషిస్తాం. మన బలాలు, బలహీనతలను తరచి చూసుకోవాలి. సిలబస్‌ చదవాలి. పాత ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. విజేతల ఇంటర్వ్యూలు చదవాలి. మౌఖిక పరీక్ష అనేది జ్ఞానాన్ని పరీక్షించేది కాదు. వ్యక్తిని పరీక్షిస్తారు. ఎవరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో తెలుసుకుంటారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేదు. నువ్వు ఎక్కడినుంచి వచ్చావంటే హైదరాబాద్‌ అన్నాను. దీంతో హైదరాబాద్‌, తెలంగాణ ఏర్పాటుపై ప్రశ్నలు ఉంటాయనుకున్నాను. జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ ఏర్పాటు గురించి అడిగారు. దీంతో నాకు తెలియదు.. కానీ తెలుసుకుంటానని ఒప్పుకొన్నాను.
మెయిన్స్‌లో జవాబులు ఎలా రాయాలి?- నిహారికా సింగ్‌, 48వ ర్యాంకు
జ: మనం రాసే సమాధానాలు మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. పుస్తకాల్లో చదివింది ఉన్నది ఉన్నట్లుగా రాస్తే ఉపయోగం తక్కువ. దానికి మీ సొంత విశ్లేషణను జోడించాలి. అడిగిన అంశానికి సంబంధించి మిమ్మల్ని కదిలించిన, ఆలోచింపజేసిన సంఘటనలు రాయాలి. అదే లైన్‌తో మొదలు పెట్టి.. అదే లైన్‌తో ముగించకూడదు. సమాధానం వినూత్నంగా ఆవిష్కరించాలి. తాజాగా ఉండాలి. వార్తాపత్రికల్లో వచ్చే అంశాలను మూస విధానంలో రాయకుండా ఉదాహరణలతో వివరించాలి.
సన్నద్ధతలో ఎలాంటి వ్యూహం అవసరం? - ఆదర్శ్‌ సురభి, 393 ర్యాంకు
జ: ఈ పరీక్షలు రాయాలంటే పట్టుదల ఉండాలి. అందుకు నేనే ఉదాహరణ. పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు నా వెన్నెముకకు గాయమైంది. పరీక్షలు రాయొద్దని వైద్యులు చెప్పారు. రెండేళ్ల సన్నద్ధతను వదిలిపెట్టాలంటే నా వల్ల కాలేదు. చికిత్స తీసుకుంటూనే ప్రిలిమ్స్‌ రాశాను. ఆ తర్వాత చిన్న శస్త్ర చికిత్స జరిగింది. అయినా మెయిన్స్‌కు సన్నద్ధమయ్యాను. క్రమశిక్షణతో సిద్ధమవ్వాలి. స్టాప్‌వాచ్‌ పెట్టుకుని చదివేవాడిని. దీని వల్ల ఎంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అనే విషయం తెలిసేది. రోజూ వార్తాపత్రికలు చదివి సారాంశాన్ని నోట్స్‌ రూపంలో సిద్ధం చేసుకున్నాను. సిలబస్‌లో ఉన్న అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మౌఖిక పరీక్షలో హైదరాబాద్‌ నుంచి వచ్చామని చెబితే హైదరాబాద్‌కు ఆ పేరు ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఒక విషయానికి సంబంధించిన అన్ని అంశాలను ఒక దగ్గర రాసుకోవాలి. ఉదాహరణకు మహిళలకు సంబంధించిన అంశాల్లో వారి అక్షరాస్యత, దేశంలో వారికి ఉన్న ఉద్యోగావకాశాలు, పార్లమెంట్‌లో వారి ప్రాతినిధ్యం ఎంత? వారి అభివృద్ధికి అడ్డుపడుతున్న సామాజిక, ఆర్థిక అంశాలను ఒక దగ్గర రాసుకోవాలి. నేను రాజ్యసభ టీవీ చూసేవాడిని..అలానే ఆల్‌ఇండియా రేడియో వినేవాడిని.
కచ్చితంగా దిల్లీ వెళ్లాల్సిందేనా? - జమీల్‌ ఫాతిమా జీబా, 62వ ర్యాంకు
జ: సివిల్స్‌ సాధించాలంటే ఒక్క రోజులో, నెలలో అయ్యేది కాదు. సంవత్సరమంతా చదవాలి. మొదటి రోజు ఉన్న ఉత్సాహమే చివరివరకు ఉండాలి. ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమే. చదివే ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. చేసిన తప్పులను సమీక్షించుకోవాలి. హైదరాబాద్‌లో ఉండి సిద్ధమవ్వచ్చు. పాఠశాల పుస్తకాలు, వర్తమాన అంశాలపై దృష్టిపెట్టాలి. ఇప్పుడు మహానగరాల్లో లభించే శిక్షణ ఆన్‌లైన్‌లోనూ లభిస్తోంది. ఇలాంటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి.
శిక్షణ తీసుకోవాలా వద్దా? - కృష్ణకాంత్‌ పటేల్‌, 607వ ర్యాంకు
జ: శిక్షణ తీసుకోవాలా వద్దా అనేది మీ సన్నద్ధతపై ఆధారపడి ఉంటుంది. అది తీసుకుంటేనే సాధించగలం అనేది అపోహ మాత్రమే. అటువంటిదేమీ లేకుండా విజయం సాధించవచ్చు. మనలో ఉన్న బలహీనతలను మనమే వెతుక్కుంటాం. దీంతో ముందుకు వెళ్లలేక తంటాలు పడుతుంటాం. నేను 2012 ప్రిలిమ్స్‌లో నెగ్గలేదు. ఎందుకు ఇలా జరిగిందో విశ్లేషణ చేశాను. ఆ తర్వాత ప్రయత్నంలో మెయిన్స్‌ రాశాను. కానీ ఇంటర్వ్యూ జాబితాలో నా పేరు లేదు. 2016లో సివిల్స్‌ కటాఫ్‌ మార్కులు పొందలేకపోయాను. ఈసారి మరింత గట్టిగా సన్నద్ధమయ్యా. 607వ ర్యాంకు పొందాను. ప్రిలిమ్స్‌లో 120 నుంచి 130 మార్కులు వస్తేనే మెయిన్స్‌కు ఎంపికయ్యే వీలుంటుంది. ప్రిలిమ్స్‌లో 80 నుంచి 90 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఓ ప్రశ్నకు మీకు రెండు సమాధానాల్లో ఏదో ఒకటి సరైందనిపిస్తే దానికి సమాధానం రాయడం ఉత్తమం. ఎథిక్స్‌ పేపర్‌లో నిజజీవిత అనుభవాలను ఉదాహరణగా రాయాలి. గైడెన్స్‌ తీసుకుని, సొంతంగా విశ్లేషణ చేసుకుంటూ సివిల్స్‌ సాధించవచ్చు.
వైఫల్యాలను అనుకూలంగా మలచుకోవ‌డం ఎలా ?- అనుదీప్‌, మొదటి ర్యాంకర్‌
జ: నేను సివిల్స్‌ సాధన క్రమంలో నాలుగుసార్లు విఫలమయ్యాను. బాధ, నిరాశ ఉంటుంది. మన సామర్థ్యాలపై నమ్మకం పోతుంది. మొదటి వైఫల్యం తర్వాత రెండో ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌ వచ్చింది. ఎక్కడ విఫలం చెందానో చూసుకోలేదు. తప్పు నాలో లేదని ఇతర అంశాలపై నెట్టేసేవాడిని. నాలుగో వైఫల్యం తర్వాత నన్ను నేను విశ్లేషించుకున్నాను. లోపం నాలోనే ఉందని గ్రహించాను. వైఫల్యాల మీద ఎంత సాధన చేస్తామో అనేదానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ రేపు వచ్చే ర్యాంకు, ఫలితంపై దృషి పెట్టకూడదు. అలా చేస్తే ఈ క్షణం చేయాల్సిన పనిలో నాణ్యత తగ్గిపోతుంది. ఆందోళన దరిచేరుతుంది. పరీక్షల్లో తప్పడం కాదు..వాటి నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం తప్పు.
ఐచ్ఛికం ఎంచుకోవడం ఎలా ?- కోయా శ్రీహర్ష, 6వ ర్యాంకు
జ: ఐచ్ఛికం(ఆప్షనల్‌) సబ్జెక్టు ఎంపికలోనే సగం విజయం ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎక్కువగా మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఆసక్తిని బట్టి ఎంచుకోవాలి. సిద్ధమయ్యే ముందు జాగ్రఫీ తీసుకుందామని ఓ పదిరోజులు చదివాను. ఆ తర్వాత చదవలేక పోయాను. చరిత్ర చదివాను కానీ నా వల్ల కాలేదు. చివరికి ఆంత్రోపాలజీ ఎంచుకున్నాను. ఐచ్ఛికం ఎంచుకునేటపుడు దానికి మార్గదర్శకత్వం, పుస్తకాల లభ్యత, ఆ అంశానికి ఇస్తున్న మార్కులను తెలుసుకోవాలి. స్నేహితులు చెప్పారని తీసుకోవద్దు. యూపీఎస్సీ సిలబస్‌ చదివేటప్పుడు ఆ విషయంలో మాస్టర్స్‌ చేసేలా చదవాల్సిన పనిలేదు. సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై అవగాహన, విశ్లేషణ చేయగలిగితే చాలు. బోర్డు అదే చూస్తుంది. రాసే సమాధానాలు ప్రామాణికంగా ఉండేలా చూసుకోవాలి.
గ్రామీణ నేపథ్యం ఉన్నవారు సాధించలేరా? - పృథ్వీరాజ్‌ ఇమ్మడి, 24వ ర్యాంకు
జ: మాది పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. గ్రామీణ విద్యార్థులు ఎవరికన్నా తక్కువేమీ కాదు. ఆత్మవిశ్వాసం ఉండాలి. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాయడం ఇబ్బందేం కాదు. ఏడాదికి లక్షల్లో జీతం వదులుకుని వచ్చాను. జ్ఞానం పెంచుకోవడానికి చదవాలి. పరీక్షలను దృష్టిపెట్టుకుని చదివితే ప్రయోజనం ఉండదు. ఒక విషయాన్ని చదివితే దాని గురించి లోతుగా ఆలోచించాలి. సమస్య ఏమిటనేది ఆలోచించాలి. అన్ని కోణాల్లో సమస్యను విశ్లేషించాలి.

Back..

Posted on 24-05-2018