Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ప్రిలిమ్స్‌ నేర్పే పాఠాలేమిటి?

* సివిల్‌ సర్వీసెస్‌ -2019

ఈ ఏడాది జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ కీలక అంశాలు- బహుళ సమాధానాలుఉన్న ప్రశ్నల సంఖ్య పెరగటం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి ప్రాధాన్యం.వడపోత పరీక్షే కదా, సులువుగానే నెగ్గేయొచ్చ’ని తేలిగ్గా తీసుకుంటే కష్టమని మరోసారి రుజువయింది. వచ్చే ఏడాది పరీక్ష రాయబోయేవారు సివిల్స్‌ ప్రశ్నల మౌలిక స్వభావంపై అవగాహన కోసం ఈ పరీక్షను విశ్లేషించుకోవాలి. ప్రశ్నపత్రం ఎలా ఇచ్చినా మెరుగ్గా రాసేలా సన్నద్ధం కావాలి!

ఈ ఏడాది సివిల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఇటీవల కాలంలో వచ్చిన కఠినమైన పేపర్లలో ఒకటి. అన్ని ఏరియాల నుంచీ ప్రశ్నలు వచ్చినప్పటికీ అవి జవాబు గుర్తించటానికి వీల్లేని విధంగా ఉన్నాయి. అభ్యర్థులు గమనించాల్సింది ఏమిటంటే... ప్రిలిమ్స్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్‌కు దరఖాస్తు చేసినవారిలో 45 శాతం మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, విజయవాడ పరీక్షా కేంద్రాలకు 79, 697 మంది దరఖాస్తు చేయగా, వీరిలో 40, 732 మంది (51.11 శాతం) పరీక్షకు హాజరయ్యారు. సివిల్స్‌పై పెరిగిన అవగాహన, ఆసక్తిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
జనరల్‌స్టడీస్‌లోని వివిధ అంశాల నుంచి ఇచ్చే ప్రశ్నల సంఖ్యలో గత ఏడాదితో పోలిస్తే పెద్దగా తేడా లేదు. అయితే ప్రశ్నల తీరులో మార్పు కనిపించింది.
* సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి ఎక్కువభాగం క్లిష్టమైనవే వచ్చాయి. అధిక ప్రశ్నలు బయోటెక్‌ నుంచీ, ఐటీ, కమ్యూనికేషన్‌ టెక్నాలజీల నుంచీ అడిగారు. ముఖ్యంగా ఇవన్నీ కరెంట్‌ అఫైర్స్‌తో సంబంధమున్నవే.
* పేపర్‌-1లో నేరుగా జవాబులుండే ప్రశ్నల కంటే బహుళ సమాధానాలున్న ప్రశ్నల సంఖ్య పెరిగింది. డైరెక్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నల్లో సమాధానం తెలియకపోయినా సంబంధిత పరిజ్ఞానంతో జవాబును ఊహించవచ్చు. ఇక మల్టిపుల్‌ ఆన్సర్స్‌ ప్రశ్నల్లో ఊహించి రాస్తే జవాబు తప్పయినప్పుడు పెనాల్టీ మార్కుల ప్రమాదం ఉంటుంది. ఈ మైనస్‌ మార్కులే చాలా సందర్భాల్లో విజయానికీ, వైఫల్యానికీ కారణమవుతాయి. ఈ ఏడాది డైరెక్ట్‌ చాయిస్‌ ప్రశ్నలు 48 ఉండగా, మల్టిపుల్‌ చాయిస్‌లున్న ప్రశ్నలు 52 వచ్చాయి. అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను నిర్లక్ష్యం చేయకూడదు. అవి పరీక్షకు అవసరమైన చక్కని పునాదిని ఏర్పరుస్తాయి. కోర్‌ అర్థం కాకుండా వర్తమాన అంశాలనేమీ సరిగా అవగాహన చేసుకోలేమని మర్చిపోకూడదు. అలాగే మోడల్‌ పేపర్లకు జవాబులు రాయటం వల్ల రాసేవిధానం మెరుగుపడుతుంది. క్రమశిక్షణ అలవాటవుతుంది.

ఇప్పుడేం చేయాలి?
ప్రిలిమినరీ బాగా రాసినవారు ఫలితం వచ్చేవరకూ వేచిచూడకుండా మెయిన్‌ సన్నద్ధతను మొదలుపెట్టాలి. ప్రిలిమ్స్‌ ఫలితం వచ్చేలోపే ఆప్షనల్‌, ఎథిక్స్‌ ముగించేలా చదవాలి. ్స కటాఫ్‌ ర్యాంకు కంటే తక్కువ మార్కులు వచ్చేలా ఉండి, ఈ ఏడాది నెగ్గలేమనిపిస్తే... నిరాశపడకూడదు. తొలి ప్రయత్నంలో ఎక్కువమందికి ఇలాగే జరుగుతుంది. మీ ప్రిపరేషన్‌ కొనసాగించండి. అర్హత ఉన్న ఇతర పోటీ పరీక్షలన్నిటినీ రాయండి. ముఖ్యంగా గ్రూప్స్‌ పరీక్షలపై దృష్టిపెట్టాలి. ఇవి రాయటం ఎంతో విలువైన అనుభవాన్నిస్తుంది. పోటీ పరీక్షల పరంగా సరైన దిశలో ఉన్నదీ లేనిదీ అర్థమవుతుంది. ఎక్కడ పొరపాట్లు చేశారో గుర్తించి సవరించే చర్యలు తీసుకోండి. ఇంకా ఏడాది వ్యవధి ఉంది కదా అని, ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించటమో, వేరే వ్యాపకంలో పడిపోవటమో చేయవద్దు. ఇలాంటిది ఏదైనా మీ లక్ష్యం నుంచి దూరం చేస్తుంది.

కటాఫ్‌ మార్కులెన్ని?
సివిల్స్‌ రాసినవారికి ఉత్తీర్ణతకు కావాల్సిన కటాఫ్‌ మార్కుల గురించి ఆసక్తి ఉంటుంది. ఈ కటాఫ్‌ అనేది ప్రధానంగా ప్రశ్నపత్రం కఠినత్వం, పోటీ స్థాయి అనేవాటిపై ఆధారపడివుంటుంది. పైగా ఇది ఈడబ్ల్యుఎస్‌ కేటగిరీ రిజర్వేషన్‌ ప్రవేశపెట్టిన తొలి ఏడాది కూడా. ఒక అంచనా ప్రకారం...కటాఫ్‌ మార్కులు ఇలా ఉండొచ్చు-
జనరల్‌: 97-103, ఈడబ్ల్యూఎస్‌: 95-100
ఓబీసీ: 96-101, ఎస్‌సీ: 80-85, ఎస్‌టీ: 78-85

- వి. గోపాలకృష్ణBack..

Posted on 08-07-2019