Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తొలి దశకు తుది మెరుగులు!

* సివిల్‌ సర్వీసెస్‌-2018 ప్రిలిమినరీ
సివిల్‌ సర్వీసెస్‌ ప్రక్రియలో మొదటిదైన ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్ష జూన్‌ 3న జరగబోతోంది. గత పదేళ్ళలో అతితక్కువ ఖాళీలూ (సుమారు 782), పెరిగిన పోటీ (5 లక్షలమంది) మధ్య నిర్వహించే ఈ పరీక్షలో నెగ్గి మెయిన్స్‌కు అర్హత సాధించే 10,000 మందిలో నిలవటం అభ్యర్థుల లక్ష్యం. దీనికోసం ఇప్పటివరకూ సాగించిన సన్నద్ధతకు పునశ్చరణ, ప్రాక్టీస్‌ టెస్టులతో తుది మెరుగులు దిద్దుకోవాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!

సివిల్‌ సర్వీసెస్‌ ప్రక్రియలో మొదటిదైన ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్ష జూన్‌ 3న జరగబోతోంది. గత పదేళ్ళలో అతితక్కువ ఖాళీలూ (సుమారు 782), పెరిగిన పోటీ (5 లక్షలమంది) మధ్య నిర్వహించే ఈ పరీక్షలో నెగ్గి మెయిన్స్‌కు అర్హత సాధించే 10,000 మందిలో నిలవటం అభ్యర్థుల లక్ష్యం. దీనికోసం ఇప్పటివరకూ సాగించిన సన్నద్ధతకు పునశ్చరణ, ప్రాక్టీస్‌ టెస్టులతో తుది మెరుగులు దిద్దుకోవాలి. అందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!
ప్రిలిమ్స్‌ సిలబస్‌ లోతుగా ఉండదు. సాధారణ స్థాయిలోనే (జనరల్‌) ఉంటుంది. కానీ సిలబస్‌ ఎంత విస్తృతంగా ఉంటుందంటే.. ఏ అంశంమీదనైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అందుకని గత కొద్ది సంవత్సరాల్లో ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో విశ్లేషించుకుంటే దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాలో స్థూలంగా స్పష్టత వస్తుంది.
ప్రిలిమినరీలోని రెండు పేపర్లలో (జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2) ప్రతి పేపరుకూ 200 మార్కుల చొప్పున ఉంటాయి. పేపర్‌-1లో 100 ప్రశ్నలు. ప్రతి సరైన జవాబుకూ రెండు మార్కులు. పేపర్‌-2లో 80 ప్రశ్నలు. సరైన సమాధానానికి రెండున్నర మార్కులు. ప్రతి తప్పు జవాబుకూ 0.33 మార్కును తగ్గిస్తారు. పేపర్‌-2 క్వాలిఫైయింగ్‌ స్వభావమున్న పేపర్‌. దీనిలో అర్హత (67 మార్కులు) సాధిస్తేనే పేపర్‌-1ను మూల్యాంకనం చేస్తారు.
గత ఏడాది మాదిరే ప్రశ్నపత్రం ఉంటుందా అని చాలామంది అభ్యర్థులు అడుగుతుంటారు. ప్రతి సంవత్సరమూ ఒకే రకమైన ప్రశ్నల తీరూ, మార్కుల విభజనా ఎప్పటికీ ఉండదు. సివిల్స్‌ ప్రశ్నపత్రం చలనశీలమైనది, తప్పకుండా మార్పులుంటాయని గ్రహించాలి.
ఇటీవలి కాలంలో ప్రభుత్వ పథకాలకు ప్రశ్నపత్రంలో అధిక ప్రాధాన్యం లభింస్తోంది. ఈసారి కూడా ఆ అవకాశాలు ఎక్కువే. ఎందుకంటే... తమ కార్యక్రమాలూ, విధాన నిర్ణయాలను దేశవ్యాప్తంగా ఉన్న యువత తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంతో సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి పోటీపరీక్షల్లో వాటికి ప్రాధాన్యం తగినంతగా లభిస్తోంది.
పరీక్ష రాయాలా? వద్దా?
* కొన్ని మోడల్‌ పేపర్లు రాసి చూసుకున్నపుడు నా స్కోర్లు చాలా తక్కువగా వచ్చాయి. ఇప్పుడు పరీక్ష రాస్తే ఒక అటెమ్ట్‌ను వృథా చేసుకున్నట్టవుతుందని అనిపిస్తోంది. ఏం చేయాలి?
మరీ తక్కువ మార్కులు వస్తే తప్ప పరీక్షకు హాజరవటమే మంచిది. పరీక్షపై గౌరవం ఉంచి, శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో కష్టపడి సిద్ధమైతే పరీక్ష రాయటమే సమంజసం. సివిల్స్‌ లాంటి పోటీపరీక్షలు ఈత నేర్చుకోవటం లాంటివి. కొలనులోకి దిగనంతవరకూ ఈత నేర్చుకోవటం సాధ్యమే కాదు!
* ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి ప్రశ్నలు రావట కదా? మరి అవి చదవటం వృథాయేనా?
ఇలాంటి అపోహలతో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను నిర్లక్ష్యం చేయటం ఎప్పుడూ సరికాదు. అవి వివిధ సబ్జెక్టుల్లో అభ్యర్థులకు పునాదిని ఏర్పరుస్తాయి. ‘కోర్‌’ను అవగాహన చేసుకుంటేనే వర్తమాన అంశాలు బోధపడతాయి. అయితే సివిల్స్‌ ప్రిలిమినరీ దగ్గరపడిన ఈ తుది ఘట్టంలో కరంట్‌ అఫైర్స్‌ మీద దృష్టి చాలా అవసరం.
* వివిధ విభాగాల ప్రాధాన్యం విషయంలో పూర్వపు పరీక్షల నుంచి ఏం నేర్చుకోవాలి?
ఈ ప్రాధాన్యం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఉదాహరణకు... వర్తమాన అంశాల నుంచి 2015లో 15 ప్రశ్నలే వచ్చాయి. ఇక 2012, 13లలో అయితే చాలా తక్కువ ప్రశ్నలే అడిగారు. కానీ 2016లో వాటి సంఖ్య అనూహ్యంగా 42కు పెరిగింది. ఇక 2017లో వర్తమాన అంశాలపై ప్రశ్నలు 32కు తగ్గాయి. దీన్నిబట్టి చూస్తే... భవిష్యత్తులోనూ కరంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుందని నిశ్చయంగా చెప్పవచ్చు.
ప్రామాణిక సమాచారం
ఒకే సమాధానం, ఒక్కటే అన్వయం ఉండే ప్రశ్నలను మాత్రమే ప్రిలిమ్స్‌లో అడుగుతారు. ఆబ్జెక్టివ్‌ పేపర్‌ కాబట్టి వాస్తవ ఆధారితమైన ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఆ వాస్తవాంశాలను అధికారిక, ప్రామాణిక పుస్తకాల నుంచే గ్రహిస్తారు. అందుకే అభ్యర్థులు మార్కెట్లో దొరికే ప్రైవేటు ప్రచురణల కంటే ప్రభుత్వం ప్రచురించే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలకూ, ప్రభుత్వ వెబ్‌సైట్లకూ ప్రాధాన్యం ఇవ్వాల్సివుంటుంది.
ప్రతి సబ్జెక్టులోనూ వర్తమాన అంశాలపై శ్రద్ధ పెట్టాలి. వీటి నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తాయి కాబట్టి వాటిపై శ్రద్ధ వహించటం అవసరం. ఆ వర్తమాన అంశాల్లో కూడా ప్రభుత్వ పథకాలూ, కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి.
ప్రిలిమినరీలో అభ్యర్థిని ఎంపిక చేయటం కంటే అనర్హులను తొలగించటమే ఎగ్జామినర్ల ఉద్దేశం. అందుకే ఒక అంశానికి సంబంధించి లోతుగా పరిశీలన చేసి, అందులోని వివిధ కోణాలను అర్థం చేసుకోవాలి. అందుకోసం వివిధ సబ్జెక్టుల్లోని విషయాలకు తాజా వర్తమాన అంశాలతో అనుసంధానం చేయాలి. ఈ రకంగా ఒక అంశానికి సంబంధించిన వివిధ పార్శ్వాలపై అవగాహన లభిస్తుంది. అది ప్రిలిమ్స్‌కే కాకుండా, మెయిన్స్‌కు కూడా ఉపయోగం.
పరిజ్ఞానం తాజాగా ఉండాలి - దురిశెట్టి అనుదీప్‌ (సివిల్స్‌-2017 ఆలిండియా ప్రథమ ర్యాంకర్‌)
సివిల్స్‌లో విజయం సాధించాలంటే.. తాజా సంఘటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, ఇటీవలి చర్చనీయాంశాలపై లోతైన పరిజ్ఞానం పెంచుకోవడం అవసరం. వీటితోపాటు నిరంతర సాధన చాలా ముఖ్యం. అధ్యయనం కూడా ప్రధానమే. దానికంటే మించి పునశ్చరణకు ప్రాముఖ్యం ఉంది. కొత్తవాటి జోలికి పోకుండా ఇప్పటికే చదివిన అంశాలపై మరింత దృష్టిసారించాలి. పట్టు పెంచుకోవాలి.
వార్తాపత్రికలు చదవటం, మాక్‌ టెస్టులకు హాజరవటం తప్పనిసరి. సివిల్స్‌కు ఉపయోగపడే సమాచారంతో ఎన్నో వెబ్‌సైట్లున్నాయి. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టుల్లో జవాబులు కూడా ఉంటాయి కాబట్టి అవి అభ్యర్థులకెంతో ఉపయోగం. ఒత్తిడికి గురి కాకుండా సహనం, ఏకాగ్రతలతో అధ్యయనం చేస్తే అనుకూల ఫలితం తప్పకుండా వస్తుంది.
ఈ మూడూ ఎంతో ముఖ్యం - కె. శ్రీహర్ష (సివిల్స్‌-2017 విజేత)
సివిల్స్‌లో కష్టతరమైన దశ ప్రిలిమ్సే. దీనిలో నెగ్గటానికి దృష్టిపెట్టాల్సినవి- వర్తమాన అంశాలు, సబ్జెక్టు పుస్తకాలు, పరీక్షల సాధన. గత కొద్ది సంవత్సరాల్లో కరంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం పెరిగింది కాబట్టి వార్తాపత్రికలూ, సంబంధిత మ్యాగజీన్లూ చదవటం ముఖ్యం. అవగాహన చేసుకున్న సబ్జెక్టులను ఈ దశలో సమగ్రంగా పునశ్చరణ చేసుకోవాలి. అభ్యర్థులందరూ దాదాపు ఒకే రకమైన పుస్తకాలు చదివినా కొందరే ముందుండటానికి కారణం... ప్రాక్టీస్‌ టెస్టుల మూలంగా లభించే మొగ్గు. దీన్ని విస్మరించకూడదు.
ఇప్పుడు మిగిలిన రెండు వారాల్లో పాలిటీ, మోడర్న్‌ హిస్టరీ, ప్రభుత్వ పథకాలపై దృష్టి కేంద్రీకరించాలి. నవంబరు 2017 నుంచి ఇప్పటివరకూ వర్తమాన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. కొత్త పుస్తకాలేమీ చదవకూడదు.
రోజులో సుదీర్ఘకాలం అంటే 16 గంటల చొప్పున చదవాలని ప్రయత్నించకూడదు. అది ఆరోగ్యానికి నష్టం. ప్రతిరోజూ అరగంటసేపు నడవటం కానీ, బ్యాడ్మింటన్‌ లాంటి ఆటలు కాసేపు ఆడటం గానీ చేయటం మంచిది. తగినంత నిద్రపోవటం చాలా అవసరం. ఫలితాల గురించి అనవసరంగా ఆందోళన పడటం వల్ల మన సామర్థ్యం తగ్గుతుంది. ఆశావహంగా పరీక్షకు సిద్ధమైతే అనుకూల ఫలితం వచ్చే అవకాశాలే ఎక్కువ!
ధీమాగా రాయండి.. - ఆర్‌.సి. రెడ్డి, డైరెక్టర్‌, ఆర్‌సీరెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌
సివిల్స్‌ లాంటి పోటీపరీక్షలు సాపేక్ష (రెలెటివ్‌) ప్రతిభను పరీక్షిస్తాయి. పేపర్‌ కష్టంగా ఉంటే అర్హత మార్కులు తగ్గిపోతాయి. సులభంగా ఉంటే ఆ మార్కులు పెరుగుతాయి. అందుకే సరిగా రాయలేదనుకున్న సందర్భాల్లోనూ పాసవుతుంటారు. ‘పేపర్‌ సులువుగా ఉంది, బాగా రాశాం’ అనుకున్నపుడూ ఫెయిలవుతున్న సందర్భాలున్నాయి.
అర్హత కోసం నిర్దేశించిన రెండో పేపర్‌ను విజయవంతంగా రాయటానికి నమ్మకం అవసరం. అనవసరంగా డీలాపడకూడదు. సోషల్‌సైన్స్‌, ఆర్ట్స్‌ నేపథ్యమున్నవారు ఈ పేపర్‌ను కష్టంగా భావిస్తుంటారు. వీరు కాంప్రహెన్షన్‌ను మొదట పూర్తిచేయాలి. ప్రశ్నలను చదివాకే ప్యాసేజ్‌ను చదవటం వల్ల జవాబులు గుర్తించటానికి సమయం ఆదా అవుతుంది. తర్వాత గణిత సంబంధమున్న ప్రశ్నల సంగతి చూడటం మేలు.
జనరల్‌స్టడీస్‌ను నూరుశాతం ఎవరూ పూర్తిగా రాయలేరు. ఆబ్జెక్టివ్‌ టెస్టు కాబట్టి తెలిసిన ప్రశ్నలకు తొలి రౌండులో జవాబులు గుర్తించాలి. తర్వాత రౌండులో ఇంటెలిజెంట్‌ గెస్‌ చేయవచ్చు. నెగిటివ్‌ మార్కులున్నాయని గుర్తుంచుకుని, జాగ్రత్త వహించాలి. ప్రిలిమినరీ ప్రధానంగా పరిజ్ఞానాన్నీ, సమాచారాన్నీ పరీక్షిస్తుంది. ప్రాక్టీస్‌ టెస్టుల వల్ల స్పష్టత వస్తుంది. ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షకు వెళ్ళటం ముఖ్యం.

 


Back..

Posted on 22-05-2018