Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పదునెక్కిన ప్రశ్నలు!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష అంటేనే సునిశిత పరిశీలనకు మారుపేరు. ఆ పరీక్ష ఏటా పదునెక్కుతోందనే విషయం ఈ సంవత్సరం కూడా రుజువైంది. నిర్దిష్ట అధ్యయనాలతోపాటు విస్తృతమైన ప్రిపరేషన్‌ సాగించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. సివిల్స్‌ యజ్ఞాన్ని డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టాలని సూచిస్తోంది. జీవితంలోని అనేక కోణాలను అనుసంధానం చేసుకొని, తాత్విక చింతనను తప్పనిసరిగా జోడించి చదవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.

సివిల్స్‌ మెయిన్స్‌లో అత్యధిక మార్కులుండే జనరల్‌ ఎస్సే (250), జనరల్‌ స్టడీస్‌ (1000)లను బాగా రాయాలంటే విషయ పరిజ్ఞానం, లోతైన విశ్లేషణ సామర్థ్యం తప్పనిసరి అని మెయిన్స్‌ ప్రశ్నపత్రం మరోసారి రుజువు చేసింది.
జనరల్‌ ఎస్సేలో సెక్షన్‌-ఎలో 4 ప్రశ్నలూ, సెక్షన్‌-బీలో 4 ప్రశ్నలూ ఇచ్చారు. సాధారణంగా ఒక సెక్షన్లోని టాపిక్స్‌ వర్తమాన అంశాలపై ఉంటాయి. కానీ ఈ ఏడాది రెండు టాపిక్స్‌ మాత్రమే కరంట్‌ అఫైర్స్‌తో సంబంధమున్నవి వచ్చాయి. మిగిలినవన్నీ నైరూప్య (ఆబ్‌స్ట్రాక్ట్‌ ) అంశాలు. కొన్ని తత్వవేత్తల కొటేషన్లు, మరికొన్ని నివేదికలనుంచి తీసుకున్న వాక్యాలు.

రెండు సెక్షన్‌లలోని టాపిక్స్‌, వాటి మూల వనరులు ఎక్కడివో చూద్దాం.
1. Alternative technologies for a climate change resilient India: Paper on “India’s progress in combating climate change, Ministry of Environment and Forests and Climate Change 2014”
2. A good life is one inspired by love and guided by knowledge: Quotation by Bertrand Russell
3. Poverty anywhere is a threat to prosperity everywhere: ILO declaration of Philadelphia, 1944
4. Management of Indian border disputes – a complex task: Paper on India’s border management. Institute of defence studies document 2010
5. Customary morality cannot be a guide to modern life: Views of Nicholas Machiavelli in ''The Prince''.
6. “The past’ is a permanent dimension of human consciousness and values: Oxford Journal: The Social Function of the Past: Some Questions
7. A people that values its privileges above its principles loses both: Quote by Dwight D. Eisenhower, former President of the United States
8. Reality does not conform to the ideal, but confirms it.: Quote by Gustav Flaubert, French novelist

వీటన్నిటినీ పరిశీలిస్తే.. టెక్నాలజీ, ఎథిక్స్‌, పావర్టీ, సెక్యూరిటీ అని 4 కేటగిరీలుగా ఈ ప్రశ్నలు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు.
పరీక్షలో ఏ టాపిక్‌లు వస్తాయో ఎవరూ ఊహించలేరు. కానీ కరంట్‌ అఫైర్స్‌పై అవగాహన పెంచుకుంటే పరీక్షకు అవసరమైన సమాచారం లభిస్తుంది. ఉదాహరణకు... పావర్టీ (పేదరికం)పై వార్తాపత్రికల్లో గత ఏడాది కాలంలో ఎన్నో వార్తాకథనాలు వచ్చివుంటాయి. డోక్లాం గురించి పత్రికల్లో చదివితే సరిహద్దు సమస్యలపై ఎన్నో కథనాలు ప్రచురితమవటం గమనించవచ్చు.
ఇలాంటివాటిని సమర్థంగా వ్యాసరూపంలో రాయాలంటే సాహిత్య, సామాజిక అంశాల పరిజ్ఞానం పెంచుకోవాలి. వివిధ నివేదికలపై అవగాహన కూడా అవసరమే.
* పూర్వపు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఎథిక్స్‌పై చాలా టాపిక్స్‌ వచ్చాయి. యూపీఎస్‌సీ మారిన దృక్కోణాన్ని ఇక్కడ గమనించవచ్చు.
* అభ్యర్థుల నుంచి ఎక్కువ ఆశించటం వల్లే జీవితానికి సంబంధించిన బహుళ కోణాల అవగాహనను తెలిపే అంశాలను ఇస్తున్నట్టు గ్రహించాలి.
* సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైనవాటికే పరిమితం కాకుండా నైతికత, ఆత్మసాక్షి మొదలైన కోణాలకు కూడా స్థానం కల్పిస్తున్నారు.
* తాత్విక ఛాయలున్న ఈ అంశాలను మెరుగ్గా రాయాలంటే వాటిపై లోతైన అధ్యయనం అవసరమవుతుంది. మొత్తమ్మీద జనరల్‌ ఎస్సే బాగా రాయాలంటే... నాన్‌ ఫిక్షన్‌ జనరల్‌ రీడింగ్‌ పెంచుకోవాలి. దీంతోపాటు వర్తమాన అంశాల విశ్లేషణ కూడా అవసరం.

జనరల్‌ స్టడీస్‌ సంగతి?
జనరల్‌ స్టడీస్‌లోని నాలుగు పేపర్లలో ఒక్కో పేపర్‌కు 250 మార్కులు కేటాయించిన సంగతి తెలిసిందే. సిలబస్‌లో కొన్ని అంశాలకు ప్రాధాన్యం లభించింది.
పేపర్‌-1: దీని సిలబస్‌లో హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ ఉన్నాయి. జాగ్రఫీ ప్రశ్నలు కొద్దిగా తక్కువ (85 మార్కులు) వచ్చాయి. సొసైటీ అంశంలో ప్రశ్నలు పెరిగాయి (90 మార్కులు).
పేపర్‌-2: ఇండియన్‌ పాలిటీ, కాన్‌స్టిట్యూషన్‌, గవర్నెన్స్‌, సోషల్‌ జస్టిస్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ సిలబస్‌లో ఉన్నాయి. ఇండియన్‌ పాలిటీ, గవర్నెన్స్‌లో ఎక్కువ ప్రశ్నలు (160 మార్కులు) వచ్చాయి.
పేపర్‌-3: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ అంశాలు సిలబస్‌లో భాగం. బయోడైవర్సిటీపై చాలా ఎక్కువ ప్రశ్నలు (90 మార్కులు) రావటం విశేషం.
పేపర్‌-4: ఎథిక్స్‌, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్‌ సిలబస్‌లో ఉన్నాయి. దాదాపు పూర్వపు సంవత్సరాల్లోలాగే ఈ పేపర్‌ ఉంది. థియరీ ఆధారిత ప్రశ్నలను 140 మార్కులకూ, కేస్‌ స్టడీస్‌ను 110 మార్కులకూ అడిగారు.

అనుసంధానం చేసుకోవాలి
* ప్రిలిమ్స్‌లోనూ, మెయిన్‌లోనూ ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించాలి. వాటిని అనుసంధానం చేసుకుంటూ సన్నద్ధమవ్వాలి.
* నిర్దిష్ట అంశంపై రాసే జవాబులను మెరుగుపర్చుకోవాలంటే... నిపుణులు గానీ సీనియర్లు గానీ రాసిన జవాబులను మొదటే చూడకూడదు. మొదట సొంత మాటల్లో సమాధానం రాయాలి. దాన్ని నిపుణుల మోడల్‌ జవాబుతో పోల్చాలి. ఈ కసరత్తు ప్రిలిమ్స్‌కు కూడా పనికొస్తుంది. ఎందుకంటే...ఈ సందర్భంగా తెలియని విషయాలెన్నో తెలుస్తాయి.
* ఆప్షనల్‌లో రాసిన సమాధానాలను ఆ సబ్జెక్టు పరిజ్ఞానమున్నవారితో దిద్దించుకోవటం మంచిది. ఆప్షనల్‌ స్పెషలైజ్డ్‌ సబ్జెక్టు కాబట్టి దానిలో ఇలాంటివారి సలహాలు చాలా ఉపయోగపడతాయి.
* వివిధ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు తాజాగా నిర్వహించిన పరీక్షల్లోని టాపిక్స్‌ను గమనించాలి. వాటిలో ముఖ్యమైనవాటికి సంబంధించిన పాయింట్లు రాసుకోవాలి. ఆ టాపిక్‌లను ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ దృక్కోణంలో చదువుకోవాలి.
* ఎథిక్స్‌లో థియరీ ప్రశ్నలూ, కేస్‌ స్టడీస్‌ను రాయటం సాధన చేయాలి. థియరీ ప్రశ్నలు విసుగు తెప్పిస్తాయి కాబట్టి అభ్యర్థులు వాటిని వదిలేసే ప్రమాదముంటుంది. కానీ ఈ ఏడాది ఇచ్చిన థియరీ ఆధారిత ప్రశ్నల్లో స్కోరింగ్‌ స్వభావం ఉందని అర్థమవుతుంది.

ఆన్‌లైన్‌లో ప్రిలిమ్స్‌ ఎప్పుడు?
* సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలోకి మారబోతోంది. అయితే ఈ మార్పు 2019లో జరక్కపోవచ్చు. సమీప భవిష్యత్తులో ఉంటుంది.
* 2019 నుంచీ ప్రిలిమినరీ దరఖాస్తును ఒక ప్రయత్నం (అటెమ్ట్‌)గా లెక్కిస్తారు. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దిష్ట తేదీలోపు ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది.
* ఈ ఏడాది మెయిన్స్‌ ఫలితాలు డిసెంబరు చివరివారంలో గానీ జనవరి మొదటివారంలో గానీ వెలువడతాయని అంచనా. దాదాపు 2000 మందిని ఇంటర్వ్యూకోసం ఎంపిక చేస్తారని భావిస్తున్నారు.

రేపటి అభ్యర్థులు ఏం చేయాలి?
* డిగ్రీ పూర్తవగానే కేవలం ఒక సంవత్సరం సిద్ధమై సివిల్స్‌ను సాధించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచీ తగిన పునాది వేసుకోవాల్సిందే.
* సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకుంటే జనరల్‌ రీడింగ్‌ చాలా ముఖ్యమని గ్రహించాలి. కళాశాలలో చేరిన తొలిరోజుల నుంచే దీన్ని అలవర్చుకోవటం మేలు. కోర్‌ సబ్జెక్టులు సైన్స్‌ అయినప్పటికీ జనరల్‌ నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలు చదవటం తప్పనిసరి. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సివిల్స్‌ సన్నద్ధత ఆరంభించటం సరైన చర్య.
* మనదేశం గురించి స్థూల అవగాహన పెంచుకోవాలి. మీరా కందార్‌ రాసిన ‘India’s 21st Century what everyone needs to know’ తో ప్రారంభిస్తే సులువుగా ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఆసక్తిగా చదివినవారు వార్తాంశాలు, టీవీ- సోషల్‌ మీడియా చర్చలపై కూడా దృష్టిపెట్టగలుగుతారు.
* సోషల్‌మీడియాలో నిత్యం ఎన్నో అంశాలు కనిపిస్తుంటాయి. వాటిలో కనీసం ఒకటి రెండయినా సామాజిక సంబంధమైన సమస్యలైవుంటాయి. వాటి వాస్తవాలను ధ్రువీకరించుకుని, మ్యాగజీన్లలో ఆ అంశాలపై వచ్చిన వ్యాసాలను శ్రద్ధగా చదవాలి.

Back..

Posted on 11-10-2018